ఫేమ్‌–2 పథకాన్ని నోటిఫై చేసిన కేంద్రం | Electric Cars upto Rs 15 lakh to get cheaper by 1.5 lakh | Sakshi
Sakshi News home page

ఫేమ్‌–2 పథకాన్ని నోటిఫై చేసిన కేంద్రం

Published Sat, Mar 9 2019 12:14 AM | Last Updated on Sat, Mar 9 2019 12:14 AM

Electric Cars upto Rs 15 lakh to get cheaper by 1.5 lakh - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ఫేమ్‌–2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు ధరపై వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం కింద రూ.10,000 కోట్లను కేంద్రం కేటాయించింది. ‘‘దేశంలో ఎలక్ట్రిక్‌ రవాణాను వేగంగా అమల్లోకి తీసుకురావడంతోపాటు, తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం, 2019 ఏప్రిల్‌ 1 నుంచి మూడేళ్ల కాలానికి ఈ పథకం అమలును ప్రతిపాదించడం జరిగింది’’అని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. ఈ పథకం రెండో దశ కింద 10 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా ఒక్కో వాహనానికి ఎక్స్‌ ఫ్యాక్టరీ ధరపై రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. అలాగే, 5 లక్షల ఈ రిక్షాలకు ఎక్స్‌ ఫ్యాక్టరీ ధర రూ.5 లక్షలపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది.

ఇక 35,000 ఎలక్ట్రిక్‌ నాలుగు చక్రాల వాహనాలకు (ఎక్స్‌ ఫ్యాక్టరీ ధర రూ.15 లక్షల వరకు), ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ.35,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, 7,090 ఈ బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరంలో రూ.1,500 కోట్లు, 2020–21లో రూ.5,000 కోట్లు, 2021–22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు.  బస్సులకు వాటి ధరలో గరిష్టంగా 40 శాతం, ఇతర వాహనాలకు 20 శాతంగా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు. ఈ ప్రోత్సాహకాలను వార్షికంగా లేదా ధరల మార్పులు, ఉపకరణాల మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ముందే సవరించొచ్చని నోటిఫికేషన్‌ తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement