తాడేపల్లి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జస్టిస్ శివశంకరరావు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా.. ప్రజా సేవకుడిగా ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా విధులు నిర్వహిస్తానని జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బులుసు శివశంకరరావు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పారదర్శకంగా, మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం దోహదం చేస్తుందన్నారు. శనివారం సచివాలయంలో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జిగా జస్టిస్ శివశంకరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు ఇటువంటి పారదర్శకమైన చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం, దానికి తనను తొలి జడ్జిగా నియమించి రాష్ట్రానికి సేవలందించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.
ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పారదర్శకంగా మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళుతూ పర్యావరణాన్ని కాపాడుతూ సకాలంలో పూర్తయ్యేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరు రాజ్యాంగంలోని 51ఏ నిబంధన కల్పించిన హక్కులు గురించి మాట్లాడతారని, హక్కుల గురించి మాట్లాడే వారు వారి బాధ్యతల గురించి కూడా తెలుసుకుని వాటిని సక్రమంగా నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జస్టిస్ శివశంకరరావు తాడేపల్లి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment