సిరిసిల్లలో అపెరల్‌ సూపర్‌ హబ్‌! | Apperal Super Hub at Sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో అపెరల్‌ సూపర్‌ హబ్‌!

Published Wed, Mar 14 2018 2:58 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

Apperal Super Hub at Sircilla - Sakshi

సచివాలయంలో కే వెంచర్స్‌తో ఒప్పందం చేసుకుంటున్న కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్ల వస్త్ర పారిశ్రామికవాడలో ఆధునిక యంత్ర పరికరాలతో అపెరల్‌ సూపర్‌ హబ్‌ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రముఖ వస్త్ర ఉత్పత్తి సంస్థ ‘కే వెంచర్స్‌’ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖతో కే వెంచర్స్‌ సంస్థ మంగళవారం సచివాలయంలో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని 60 ఎకరాల్లో వస్త్ర పారిశ్రామికవాడను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా, అందులోని 20 ఎకరాల్లో 5,000 కుట్టు యంత్రాల యూనిట్లు సహా ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్, వాషింగ్‌ తదితర యంత్ర పరికరాలతో హబ్‌ ఏర్పాటు కానుంది. 3 విడతలుగా మూడేళ్లలో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి లభించనుందని.. అందులో 90% మహిళలే ఉంటారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

సిరిసిల్ల పట్టణ జనాభా 75 వేలని, ఈ పరిశ్రమ ద్వారా 30 వేల మందికి జీవనోపాధి లభిస్తుం దని చెప్పారు. హబ్‌ ఏర్పాటుకు కే వెంచర్స్‌ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, ప్రాజె క్టుకు మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న చేనేత, పవర్‌లూం రంగ కుటీర పరిశ్రమలన్నింటినీ సమీకరించి వర్క్‌ ఆర్డర్లు ఇప్పించడం ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు అపెరల్‌ సూపర్‌ హబ్‌ కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టులో భాగంగా వచ్చే నెలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తారని, మరో ఏడాదిలోపు తొలి దశ ప్రాజెక్టు కింద వస్త్ర ఉత్పత్తులు ప్రారంభమవుతాయని చెప్పారు. పరిశ్రమ ద్వారా ఏటా 25 లక్షల వస్త్రాలు ఉత్పత్తి అవుతాయన్నారు. సూపర్‌ హబ్‌ నుంచి అరవింద్, శ్యాం లాంటి ప్రముఖ బ్రాండ్‌ల వస్త్ర ఉత్పత్తులు జరిపేందుకు ఆయా కంపెనీలతో కే వెంచర్స్‌ చర్చలు జరుపుతోందని మంత్రి చెప్పారు.  

గుండ్ల పోచంపల్లిలో ఫ్యాషన్‌ సిటీ  
కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కులో కొరియాకు చెందిన యాంగ్వాన్‌ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుందని, దీని ద్వారా 8 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి వెల్లడించారు. నిరుపయోగంగా ఉన్న గుండ్ల పోచంపల్లి వస్త్ర పారిశ్రామికవాడను ఉపయోగంలోకి తీసుకొస్తామని, దీని ద్వారా 25 వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నిఫ్ట్‌ డైరెక్టర్‌గా పని చేసిన డాక్టర్‌ రాజారాంను ఈ పారిశ్రామికవాడకు సీఈఓగా నియమించామన్నారు. మార్కెట్లోకి వస్తున్న ఫ్యాషన్‌ కొత్త పోకడలను అనుసరిస్తేనే వస్త్ర వ్యాపారం వృద్ధి చెందుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గుండ్ల పోచంపల్లిలో 10 ఎకరాల్లో ఫ్యాషన్‌ సిటీ ఏర్పాటు చేసేందుకు యాంగ్వాన్‌ కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు. వస్త్ర పరిశ్రమ రంగంలో కోయంబత్తూరు, కరూరు, తిరుచూరులతో తెలంగాణ పోటీపడాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, చేనేత శాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్, కే వెంచర్స్‌ సీఈఓ ఎస్‌.సుసింద్రన్, సిరిసిల్ల మునిసిపల్‌ చైర్మన్‌ పావని తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement