నేతా.. కక్కిస్తా మేత! | Govt Launches Vigilance And Enforcement To Expose Corruption In Neeru-Chettu Scheme | Sakshi
Sakshi News home page

నేతా.. కక్కిస్తా మేత!

Published Fri, Jul 26 2019 9:18 AM | Last Updated on Fri, Jul 26 2019 10:20 AM

Govt Launches Vigilance And Enforcement To Expose Corruption In Neeru-Chettu Scheme - Sakshi

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు–చెట్టు పథకం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కొందరు టీడీపీ నేతలు ఈ పథకాన్ని తమ జేబు సంస్థగా మార్చేశారు. చేసిన చోటే చేస్తూ.. తవ్విన చోటే తవ్వుతూ పథకాన్ని నీరుగార్చేశారు. లక్ష్యం ఎలా ఉన్నా ఇష్టారాజ్యం గా నిధులు భోంచేశారు. ప్రజాధనానికి తూట్లు పొడిచారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. మెక్కిన నిధులు కక్కించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో చర్చించారు. దోచుకున్న నిధులను ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద రికవరీ చేస్తామని స్పష్టం చేయడంతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కొందరు టీడీపీ నేతలు వణికిపోతున్నారు

సాక్షి, తిరుపతి: అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో 2015 నుంచి 2018 వరకు జరిగిన నీరు–చెట్టు పనులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రంగంలోకి దింపింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అవినీతిపరుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎవరి నుంచి ఎంత మొత్తం నిధులు రికవరీ చేస్తారోనని భయపడిపోతున్నారు.

నిగ్గుతేల్చుతాం
అసెంబ్లీలో గురువారం ప్రధానంగా నీరు–చెట్టు అవినీతి అంశంపైనే చర్చ సాగింది. టీడీపీ నేతలు మెక్కిన నిధులు కక్కిస్తామని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులను విచారణకు ఆదేశిస్తామన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నేతల నుంచి నిధులు రికవరీ చేస్తామని చెప్పారు.
గుండెల్లో రైళ్లు
నీరు–చెట్టు పనుల్లో చోటు చేసుకున్న అవినీతిపై సమగ్ర నివేదికకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అవినీతిపరులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి నుంచి నిధులు రికవరీ చేస్తారోనని భయపడిపోతున్నారు.  

చేసిన పనులే చేయడం.. వచ్చిన నిధులు మెక్కడం
నీరు–చెట్టు పథకం ద్వారా 2015 నుంచి 2018 వరకు రూ.748 కోట్ల అంచనాలతో 7,937 పనులు చేపట్టారు. అందులో 5,490 పనులు పూర్తి చేశారు. 2,447 పనులు వివిధ దశల్లో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. నీరు–చెట్టు కింద చేపట్టే పనులకు  ఎలాంటి టెండర్లు లేవు. నామినేషన్‌ పద్ధతిన టీడీపీ బినామీ నేతలు దక్కిం చుకున్నారు. టెండర్లు పిలవాల్సిన ఒక్కో పనిని రెండు, మూడుగా విభజించి తమ అనుచరులకు కట్టబెట్టారు. పనులు దక్కించుకున్న నేతలు పనులు చేయకనే బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన చెరువు పనులనే చూపెట్టి బిల్లులు చేసుకున్నవి కోకొల్లలు. అవసరం లేని ప్రదేశాల్లో కూడా చెక్‌డ్యామ్‌లు, సప్లైచానళ్లు నిర్మించారు. ఆ నిర్మాణాలు నాసిరకంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. మామూళ్లకు ఆశపడిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ నీరు–చెట్టు పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. చేపట్టిన పనుల్లో అధికశాతం చేసిన పనులనే చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
 
అగ్రిమెంట్ల నుంచే అవినీతి ఆరంభం
నీరు–చెట్టు పనుల్లో అగ్రిమెంట్ల నుంచే అవినీతికి ఆజ్యం పోశారు. టీడీపీ నేతల ఒత్తిడి ఓ వైపు, కమీషన్ల కోసం కొందరు అధికారుల అత్యాశ వెరసి అవినీతి అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. పనుల కేటాయింపు విషయంలో జిల్లా స్థాయి అధికారి ఒకరు ఒకే రోజు సుమారు రూ.200 కోట్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతకాల నుంచి ప్రారంభమైన అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్మేస్తాయి. 

అవినీతిలో హైలెట్‌
ప్రధానంగా శ్రీరంగరాజపురం మండలంలో జరిగిన అక్రమాలు జిల్లాలోనే హైలెట్‌గా నిలిచాయి. మండలంలో మొత్తం 312 పనులను గుర్తించారు. అందులో చెక్‌డ్యాంలు, చెరువు పూడికతీత పనులు చేపట్టేందుకు రూ.32 కోట్లు కేటాయించారు. పద్మాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు రుద్రప్పనాయుడు రూ.2.12 కోట్లతో ఐదు చెక్‌డ్యాం పనులు చేపట్టారు. ఈ చెక్‌ డ్యాంలు కేవలం 30 మీటర్లకు ఒకటి చొప్పున నిర్మించారు. నిబంధనల ప్రకారం అయితే ఒక్కో చెక్‌ డ్యాంక్‌కు కనీసం 500 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఆ నిబంధన తుంగలో తొక్కారు. ఆ పనుల్లోనూ నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఒండ్రు మట్టితో కలిసిన ఇసుక, కాలం చెల్లిన సిమెంటుతో చెక్‌ డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. అదేవిధంగా పీలేరు నియోజకవర్గ పరిధిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ నేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరులు వాటర్‌షెడ్ల పేరుతో భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారు. పనులే చేపట్టకుండా కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. చెరువు మరమ్మత్తులు, చెక్‌డ్యాంల పేరుతో రూ.13.5 కోట్లు స్వాహా చేశారు.

వరదయ్యపాళెం మండలం బత్తలవల్లం చెరువు కలుజు పనులు కూడా నాసిరకంగా చేపట్టారు. పాతగోడకు పైపైన మెరుగులు అద్ది కొత్తగా కలుజు నిర్మించినట్లు రికార్డులు సృష్టించారు. అదేవిధంగా ఏర్పేడు మండలంలోని పల్లం, పంగూరు, జంగాలపల్లి, వికృతమాల, గోవిందవరం తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేపట్టిన పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. రూ.లక్ష పనికి రూ.5 లక్షల వరకు బిల్లులు పెట్టుకున్నారు. శ్రీకాళహస్తి పరిధిలోని ఎంపేడు, ఇలగనూరు, ముచ్చివోలు, కమ్మకండ్రిగ పరిధి లో జరిగిన పనులు నాసిరకంగా ఉన్నా యి. కుప్పం నియోజకవర్గ పరిధిలో మొత్తం 574 చెరువులు ఉంటే.. 2016లో ఓ సారి చెరువుల సంరక్షణ పథకం కింద, మరో సారి జాతీయ ఉపాధిహామీ పథకం కింద, చివరి సారిగా నీరు–చెట్టు పథకంలో మొత్తం 555 చెరువు పనులు చేసినట్లు రికార్డులు సృష్టించారు. భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మదనపల్లి పరిధిలోని రామసముద్రం మండలంలో చేసిన పనులే మళ్లీ మళ్లీ చేసినట్లు రికార్డులు తయారుచేసి సుమారు రూ.10 కోట్ల వరకు కొల్ల్లగొట్టారు. నగరి పరిధిలో 15 చెరువుల కింద 40 చెక్‌డ్యాంలు నిర్మించారు. అందులో 20కిపైగా నాసిరకంగా నిర్మించి నిధులు స్వాహా చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మూడేళ్లలో 808 పనులకు రూ.54.28 కోట్ల నిధులను మంజూరు చేసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం పనులు చెయ్యకనే నిధులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు పథకం పేరుతో చెరువులు, కాలువల మరమ్మతు లు, పూడికతీత, చెక్‌డ్యాం నిర్మాణాల పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement