గత ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం.. అధికారుల చేతివాటం.. బినామీ కాంట్రాక్టర్ల అత్యాశ నగర మణిహారానికి శాపంలా పరిణమించాయి. అర్హత లేని వ్యక్తికి కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం మొదలు నిర్మాణ పనుల వరకు అన్నీ అక్రమాలే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్భాటంగా.. హడావుడిగా నుడా ఆధ్వర్యంలో చేపట్టిన నెక్లెస్ రోడ్డు పనులు అవినీతిలో కూరుకుపోయాయి. నెల్లూరు నగరీకరణలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన అమృత్ పథకం నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా రివర్స్ టెండరింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు స్వర్ణాల చెరువుపై నెక్లెస్ రోడ్డు నిర్మాణం కోసం అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అమృత్ పథకంలో దీన్ని చేరుస్తూ కేంద్రం రూ.25,84,90,268 నిధులు మంజూరు చేసింది. వీటితో చెరువుకట్టను రెండు కిలోమీటర్ల వరకు వెడల్పు చేసి వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, ఫుడ్ కోర్టులు, ఐస్‌క్రీం పార్కులు, చిన్న పార్కులతో పాటు, ఆర్చీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులను ప్రారంభించారు. అయితే అర్హత లేని ఆరెమ్మెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను కట్టబెట్టారు.
వాస్తవానికి సదరు కంపెనీ హైదరాబాద్‌లోని హెచ్‌ఆర్‌డీసీసీలో రూ.44.23 కోట్లతో పనులు చేస్తోంది. దీన్ని అమృత పథకం టెండర్లలో చూపించకుండా సదరు కాంట్రాక్ట్ పొందిన సంస్థ మోసం చేసింది. ఈ టెండర్లలో హైదరాబాద్‌లో జరిగే ప్రాజెక్ట్‌ను చూపించి ఉంటే బిడ్ సామర్థ్యం లేక అనర్హతకు గురయ్యేది. అయితే తప్పుడు సమాచారమిచ్చి మోసం చేసి టెండర్ దక్కించుకుంది. దీంతో పాటు నెల్లూరు చెరువుకట్ట అభివృద్ధి కోసం గతేడాది నీరు – చెట్టు పథకం ద్వారా రూ.1.7 కోట్లు మంజూరయ్యాయి. ఆర్కేఎన్ సంస్థ పనులను దక్కించుకొని పూర్తిచేసింది. ఆ పనికి సంబంధించిన రికార్డులను పూర్తి చేసి బిల్లుల కోసం ఇరిగేషన్ శాఖకు పంపించారు. ఇదే పనిని మళ్లీ అమృత్ పథక నిధులతో చేపట్టే నెక్లెస్‌రోడ్డు నిర్మాణంలోనూ చూపారని సమాచారం.
టెండర్‌లో అక్రమాలపై హైకోర్టులో రిట్
నెల్లూరు చెరువు నెక్లెస్ రోడ్ టెండర్లలో అక్రమాలపై కార్తీక్ నవీన్ అనే కాంట్రాక్టర్ హైకోర్టులో 47611 / 2018 నంబర్‌తో కేసు దాఖలు చేశారు. రిట్ స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించింది. టెండర్లలో జరిగిన అక్రమాలు, ఒకే పనికి రెండు బిల్లుల చేస్తున్నారనే ఆరోపణలతో సెంట్రల్, స్టేట్ విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ నిర్వహించారు.
అక్రమాలపై గళమెత్తిన ఎమ్మెల్యేలు
నెల్లూరు నెక్లెస్ రోడ్డు నిర్మాణంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చెరువునీరు పారుదల కోసం ఏర్పాటు చేసిన తూముతో పాటు కాలువలను కూడా పూడ్చేయడంతో పారుదల లేకుండా పోయిందని, భవిష్యత్తులో చెరువు నిండితే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుకట్ట తెగితే నెల్లూరు సగభాగం మునిగిపోయే అవకాశం ఉందని వారు చెప్పారు. ప్రజాప్రతినిధులు డిమాండ్ మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
రివర్స్ టెండరింగ్‌కు కసరత్తు
నుడా ఆధ్వర్యంలో జరిగిన నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఆరెమ్మెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 4.67 శాతం ఎక్సెస్‌తో పనులు దక్కించుకున్న సంస్థ నెల్లూరుకు చెందిన టీడీపీ పెద్దల అస్మదీయుడిగా ఉన్న రమేష్‌నాయుడికి సబ్ కాంట్రాక్ట్‌ను అప్పగించి ముందే కమీషన్లు పుచ్చుకుంది. పనులను అత్యంత నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిర్మాణాలు పూర్తి కాకముందే పగుళ్లు రావడం, చెరువు మట్టినే కట్టకు వాడడంతో కట్టకు పగుళ్లు ఏర్పడ్డాయి. టీడీపీ హయాంలో దాదాపు రూ.ఏడు కోట్ల మేర పనులు జరిపినట్లు రికార్డ్ చేశారు. అయితే నుడా ఇంజినీరింగ్ అధికారులు పనులను పరిశీలిస్తే దాదాపు రూ.5.5 కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు నిర్ధారించారు. ఆ బిల్లులు సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించి మిగిలిన పనులకు రివర్స్ టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment