ప్యాకేజీలో సాగుతున్న హంద్రీ–నీవా ఉప కాలువ
గత టీడీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుంది. ముఖ్యంగా హంద్రీ–నీవా కాలువ పనుల్లో దోపిడీ ఇష్టారాజ్యంగా సాగింది. అధిక అంచనాలతో టెండర్లు నిర్వహించి దోచుకున్నారు. అధికారి అనుకూలంగా లేకపోవడంతో పనులను వేరే సర్కిల్‌కి బదిలీ చేసి తమకు అనుకూలంగా చేసుకున్నారు. ఈ దోపిడీపై వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిపుణుల కమిటీ ద్వారా విచారణ చేపట్టనుంది. తద్వారా హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ పనుల్లో గత ప్రభుత్వం సాగించిన లీలలు వెలుగులోకి రానున్నాయి.
సాక్షి, బి.కొత్తకోట : 2014లో అధికారంలోకి రాగానే హంద్రీ–నీవా రెండో దశ పనులను టీడీపీ నేతలు వారి సంస్థలకే దక్కేలా చక్రం తిప్పారు. 60సీ నిబంధనను ప్రయోగించి పాత కాంట్రాక్టుల నుంచి పనులు తొలగించారు. అతి తక్కువ విలువ కలిగిన పనులను కోట్లకు పెంచుకొని దోపిడీ సాగించారు. ఈ వ్యవహారంలో అడ్డం తిరిగిన ఓ అధికారిపై కక్షగట్టి ఆయన పరిధిలోని ప్యాకేజీలను తొలగించారు. అనుకూలమైన అధికారులతో ఆడింది ఆటలా అంచనాలు పెంచుకుని అయినవారికే పనులు కట్టబెట్టారు.
మాట వినలేదని ప్యాకేజీల మార్పు..
హంద్రీ–నీవా ప్రాజెక్టు 2వ దశకు చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లె సర్కిల్–3 పరిధిలోని 14 ప్యాకేజీలను ఒక్కసారిగా తప్పిస్తూ 2015 జూలై 29న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు చేపట్టినప్పటి నుంచి మదనపల్లె సర్కిల్ పరిధిలోని పనులను అనంతపురం జిల్లాలోని సర్కిల్‌కు మార్పు చేసింది. 2014 డిసెంబర్‌లో మదనపల్లె ఎస్‌ఈగా మురళీనాథరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అప్పటిదాక పడకేసిన పనుల్లో కదలిక తెచ్చారు. అనంతపురం జిల్లా పరిధిలోని 6, 8, 9, 10, 11, 14, 15, 16, 18, 24, 25, 26, 52, 53 ప్యాకేజీ పనులు మదనపల్లె సర్కిల్ పరిధిలో ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లోని పనులను రద్దు చేయించి, అధిక అంచనాలతో కొత్తగా టెండర్లు నిర్వహించాలని టీడీపీ ముఖ్యనేతలు ఎస్‌ఈపై ఒత్తిడి తెచ్చారు. దీనికి అంగీకరించని ఆయన, పనుల్లో పురోగతి ఉందని, రద్దువల్ల ప్రభుత్వానికి నష్టమని సలహా ఇస్తే.. వారి ఆగ్రహానికి గురయ్యారు. అప్పటీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి 14 ప్యాకేజీలను అనంతపురం జిల్లాలోని సర్కిల్–2 పరిధిలోకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు.
ఆమోదం లేకున్నా చెల్లింపులు..
2014, 2015 మధ్యలో మదనపల్లె సర్కిల్ నుంచి తొలగించిన, అనంతపురం జిల్లా పరిధిలోని రెండోదశకు చెందిన 15 ప్యాకేజీల పనుల్లో కొంత భాగం రద్దు చేశారు. ఈ ప్యాకేజీల్లో రూ.292.52 కోట్ల పనులు పెండింగ్‌లో ఉండగా, అందులో కొంత మేర పని రద్దుచేసి పనులకు కొత్తగా 2బీ, 3బీ, 4బీ, 5బీ, 6బీ, 7బీ, 10బీ, 13బీ, 14బీ, 15బీ, 17బీ, 25బీ, 26బీ, 54బీ, 57బీ ప్యాకేజీలుగా మార్చి రూ.779.61కోట్లకు అంచనాతో టెండర్లు నిర్వహించారు. పనుల తొలగింపు, రద్దు, రీటెండర్లు పద్ధతి ప్రకారం సాగలేదని గత ప్రభుత్వమే వీటికి ఆమోదం తెలపలేదు. దీన్ని పట్టించుకోని ఉన్నతాధికారుల చర్యలు ముందుకే సాగాయి. ఈ టెండర్ల నిర్వహణలో అత్యధిక ప్యాకేజీలు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకే దక్కాయి. ఈ సంస్థ 2 నుంచి 5శాతం వరకు అదనంగా టెండర్లు వేసినా.. పనులు ఆ సంస్థకే అప్పగించారు. ఎక్సెస్ కారణంగా పనుల విలువ రూ.800 కోట్లు దాటింది. అలాగే 11, 14, 56 ప్యాకేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల డిపాజిట్లు, బ్యాంకు గ్యారెంటీ సొమ్మును స్వాధీనం చేసుని పనులు రద్దు చేశారు. ఇలావుండగా గత ప్రభుత్వ ఆమోదం లేకున్నా రీటెండర్లతో జరిగిన పనులకు కోట్ల బిల్లులు చెల్లించారు. ఇంకా పనులు, పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ విషయమై అనంతపురం ఎస్‌ఈ వెంకటరమణ వివరణ కోరగా, రీటెండర్ల నిర్వహణకు గత ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం ఇచ్చిందని చెప్పారు.
చిత్తూరు రీటెండర్లకు ఆమోదం..
అనంతపురం జిల్లాలో సాగిన రీటెండర్ల వ్యవహారానికి గత ప్రభుత్వం ఆమోదించలేదని తెలుస్తుండగా, చిత్తూరు జిల్లాలో జరిగిన రీటెండర్లు, పనుల రద్దుకు గత ప్రభుత్వం 2018 జూలై 5న ఆమోదించి జీఓ నంబర్ 473 జారీ చేసింది. తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలకు చెందిన 21, 22, 27, 28, 29, 62, 63, 64 ప్యాకేజీల్లో ఆగిపోయిన పనుల్లో కొంతభాగం పనులకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. ఈ ప్యాకేజీ పనులకు రూ.760.410 కోట్లతో అనుమతి ఇవ్వగా, రూ.521.390 కోట్లతో పనులు చేసేందుకు కాంట్రాకర్లతో ఒప్పందం జరిగింది. ఇందులో రూ.504.290 కోట్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన రూ.17.100కోట్ల పనులు అసంపూర్తి కావడంతో వాటికి రూ.95.920 కోట్లకు అంచనాలు పెంచి రీటెండర్లు నిర్వహించారు. దీనిపై అప్పటి మదనపల్లె ఎస్‌ఈ మురళీనాథరెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, ప్యాకేజీ అంచనాలకు లోబడి ఉండటం, అదనపు భారం లేనందున ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే పద్ధతిని అనంతపురం ఉన్నతాధికారులు పాటించకపోవడంతోనే ఆమోదం ఇవ్వలేదని జలనవరులశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా దీనిపై అనంతపురం జిల్లా ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వం నియమించిన కమిటీకి సంబంధిత వివరాలను అందిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు కమిటీ సభ్యులను కలిసి వివరాలను అందించారని సమాచారం. ప్యాకేజీ పనుల రద్దు, వాటి అంచనాల పెంపు, ఆమోదం, దానికి సంబంధించిన చర్యలను సమర్థిచుకునేందుకు రికార్డులను కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment