సాక్షి, విజయవాడ: జిల్లాలో విద్యుత్ శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాల్సిన ఆ శాఖ సిబ్బంది.. తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా వినియోగదారులు విద్యుత్ సరఫరా లేదని ఫోన్ చేస్తే సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.
దురుసుగా మాట్లాడుతూ.. ఇప్పుడు రాలేం.. కుదిరినప్పుడు వస్తాం అంటూ సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం సిబ్బంది కొరతేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ (విజయవాడ సర్కిల్) విద్యుత్ సంస్థ అధికారులు సేవలను గాలికి వదిలేశారు. కేవలం బిల్లుల వసూళ్లకే పరిమితమవుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గితే సేవలందించటానికి కంటికి కనపడటం లేదని ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు.
బిల్లులు, సర్‌చార్జీలు, ఓవర్‌లోడ్ చార్జీల వసూళ్లకు మాత్రం వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరెంటు పోయింది చూడమంటే కిందిస్థాయిలో పోలెక్కడానికి సిబ్బంది లేరని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో మొత్తం అన్ని కేటగిరీలు కలిపి 17లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే దీనిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే సేవలు సక్రమంగా అందుతున్నట్లు ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులే చెబుతుండటం గమనార్హం. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది.
మెరుగైన సేవలు మేడిపండే..
మెరుగైన విద్యత్ సరఫరా చేస్తామని ఏపీఎస్పీడీసీఎల్ ఇంటింటికి చేస్తున్న ప్రచారం ఆచరణలో అమలవటం లేదని ప్రజానీకం విమర్శిస్తున్నారు. దీనికి విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పట్టణాలు, గ్రామాల్లో 40శాతం వినియోగదారులకు అధికారులు, సిబ్బంది లేరని విద్యుత్ సంస్థ లెక్కలు చెబుతున్నాయి.
సిబ్బంది కొరత చాలా ప్రాంతాల్లో ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. దీంతో ఇన్‌చార్జిలుగా ఉన్న వారు పూర్తిస్థాయిలో సేవలు అందించడంలో విఫలమవుతున్నారు. ఎవరైనా వినియోగదారుడు సమస్యపై ఫిర్యాదు చేస్తే.. సిబ్బంది కొరత ఉంది అత్యవసరంగా సేవలందించలేమని అధికారులు తెగేసి చెబుతున్నారు.
ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో ఏఈలు లేరు..
జిల్లా మొత్తం మీద అత్యంత ప్రాధన్యం ఉన్న 18 విద్యుత్ సబ్‌స్టేషన్లకు ఏఈలు లేరు. ఆయా సబ్–స్టేషన్లలో అసిస్టెంట్ సబ్–ఇంజినీర్‌లే ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు.
విజయవాడ గవర్నర్‌పేట, రింగ్‌రోడ్డు, కానూరు, గంగూరు, జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో డి1, డి2, తిరువూరు టౌన్, నూజివీడు, రూరల్, చిల్లకల్లు, చందర్లపాడు, గుడివాడ టౌన్, అవనిగడ్డ, ఘంటశాల, మోపిదేవి తదితర పలు ముఖ్యమైన విభాగాల్లో సబ్–స్టేషన్లలో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వీటిలో కొన్ని సబ్–స్టేషన్లలో ఏడాది నుంచి, మరికొన్నింటిలో ఆరు నెలల నుంచి పోస్టులు భర్తీకావటం లేదు.
470 జూనియర్ లైన్‌మన్‌లు ఖాళీ
ఇదిలా ఉండగా కిందిస్థాయిలో పోలెక్కి విద్యుత్ అంతరాయాలు, ఇతర సమస్యలు పరిష్కరించే జూనియర్ లైన్‌మెన్‌పోస్టులు నాలుగున్నరేళ్లుగా భర్తీకావటం లేదు. జిల్లా మెత్తం మీద ఐదేళ్ల కిందట ఉన్న విద్యుత్ వినియోగదారులు 13లక్షల మందికి గాను 1200ల మంది జూనియర్ లైన్‌మెన్‌లు ఉన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో పెరిగిన విద్యుత్ వినియోగదారులకు తగ్గట్టు లైన్‌మెన్‌లు పెరగకపోగా.. రిటైర్‌మెంట్లు తదితర కారణాలతో 470 జూనియర్ లైన్‌మెన్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏఈ లేక ఇబ్బందులు
తిరువూరు మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీకి అధికారులు జాప్యం చేస్తున్నారు. తిరువూరులో ఏఈ లేకపోవడం, గ్రామాల్లో లైన్‌మెన్ల కొరత కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినా త్వరగా మార్పు చేయట్లేదు. కొత్త కనెక్షన్ల జారీకి నెలల తరబడి తిప్పుతున్నారు.
–ఎస్‌కే రామారావు, వినియోగదారుడు, వామకుంట్ల, తిరువూరు
లైన్‌మెన్‌లు లేరంటున్నారు
కరెంటు పోయిందంటే మరమ్మతులకు ఎవరు రావటం లేదు. ఫోన్ చేస్తే లైన్‌మెన్‌లు లేరని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో కరెంటు పోతే ఇక జాగరమే. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులైనా కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదు.
– కె. కోటేశ్వరరావు, వినియోగదారుడు, గోశాల, పెనమలూరు
Comments
Please login to add a commentAdd a comment