Current problem Transformer
-
విజయవాడలో కరెంటు పోయిందా.. కటకటే!
సాక్షి, విజయవాడ: జిల్లాలో విద్యుత్ శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాల్సిన ఆ శాఖ సిబ్బంది.. తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా వినియోగదారులు విద్యుత్ సరఫరా లేదని ఫోన్ చేస్తే సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దురుసుగా మాట్లాడుతూ.. ఇప్పుడు రాలేం.. కుదిరినప్పుడు వస్తాం అంటూ సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం సిబ్బంది కొరతేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ (విజయవాడ సర్కిల్) విద్యుత్ సంస్థ అధికారులు సేవలను గాలికి వదిలేశారు. కేవలం బిల్లుల వసూళ్లకే పరిమితమవుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గితే సేవలందించటానికి కంటికి కనపడటం లేదని ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. బిల్లులు, సర్‌చార్జీలు, ఓవర్‌లోడ్ చార్జీల వసూళ్లకు మాత్రం వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరెంటు పోయింది చూడమంటే కిందిస్థాయిలో పోలెక్కడానికి సిబ్బంది లేరని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో మొత్తం అన్ని కేటగిరీలు కలిపి 17లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే దీనిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే సేవలు సక్రమంగా అందుతున్నట్లు ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులే చెబుతుండటం గమనార్హం. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది. మెరుగైన సేవలు మేడిపండే.. మెరుగైన విద్యత్ సరఫరా చేస్తామని ఏపీఎస్పీడీసీఎల్ ఇంటింటికి చేస్తున్న ప్రచారం ఆచరణలో అమలవటం లేదని ప్రజానీకం విమర్శిస్తున్నారు. దీనికి విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పట్టణాలు, గ్రామాల్లో 40శాతం వినియోగదారులకు అధికారులు, సిబ్బంది లేరని విద్యుత్ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. సిబ్బంది కొరత చాలా ప్రాంతాల్లో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. దీంతో ఇన్చార్జిలుగా ఉన్న వారు పూర్తిస్థాయిలో సేవలు అందించడంలో విఫలమవుతున్నారు. ఎవరైనా వినియోగదారుడు సమస్యపై ఫిర్యాదు చేస్తే.. సిబ్బంది కొరత ఉంది అత్యవసరంగా సేవలందించలేమని అధికారులు తెగేసి చెబుతున్నారు. ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో ఏఈలు లేరు.. జిల్లా మొత్తం మీద అత్యంత ప్రాధన్యం ఉన్న 18 విద్యుత్ సబ్స్టేషన్లకు ఏఈలు లేరు. ఆయా సబ్–స్టేషన్లలో అసిస్టెంట్ సబ్–ఇంజినీర్లే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ గవర్నర్‌పేట, రింగ్‌రోడ్డు, కానూరు, గంగూరు, జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో డి1, డి2, తిరువూరు టౌన్, నూజివీడు, రూరల్, చిల్లకల్లు, చందర్లపాడు, గుడివాడ టౌన్, అవనిగడ్డ, ఘంటశాల, మోపిదేవి తదితర పలు ముఖ్యమైన విభాగాల్లో సబ్–స్టేషన్లలో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వీటిలో కొన్ని సబ్–స్టేషన్లలో ఏడాది నుంచి, మరికొన్నింటిలో ఆరు నెలల నుంచి పోస్టులు భర్తీకావటం లేదు. 470 జూనియర్ లైన్మన్లు ఖాళీ ఇదిలా ఉండగా కిందిస్థాయిలో పోలెక్కి విద్యుత్ అంతరాయాలు, ఇతర సమస్యలు పరిష్కరించే జూనియర్ లైన్మెన్పోస్టులు నాలుగున్నరేళ్లుగా భర్తీకావటం లేదు. జిల్లా మెత్తం మీద ఐదేళ్ల కిందట ఉన్న విద్యుత్ వినియోగదారులు 13లక్షల మందికి గాను 1200ల మంది జూనియర్ లైన్మెన్లు ఉన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో పెరిగిన విద్యుత్ వినియోగదారులకు తగ్గట్టు లైన్మెన్లు పెరగకపోగా.. రిటైర్మెంట్లు తదితర కారణాలతో 470 జూనియర్ లైన్మెన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఈ లేక ఇబ్బందులు తిరువూరు మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీకి అధికారులు జాప్యం చేస్తున్నారు. తిరువూరులో ఏఈ లేకపోవడం, గ్రామాల్లో లైన్మెన్ల కొరత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా త్వరగా మార్పు చేయట్లేదు. కొత్త కనెక్షన్ల జారీకి నెలల తరబడి తిప్పుతున్నారు. –ఎస్కే రామారావు, వినియోగదారుడు, వామకుంట్ల, తిరువూరు లైన్మెన్లు లేరంటున్నారు కరెంటు పోయిందంటే మరమ్మతులకు ఎవరు రావటం లేదు. ఫోన్ చేస్తే లైన్మెన్లు లేరని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో కరెంటు పోతే ఇక జాగరమే. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులైనా కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కె. కోటేశ్వరరావు, వినియోగదారుడు, గోశాల, పెనమలూరు -
అడుగడుగునా సమస్యలే..
ఖమ్మంఅర్బన్ : నగరంలోని మమత వైద్యశాల రోడ్డులోని కాలనీల ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ‘పైన పఠారం, లోన లొటారం’ అన్న చందంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల పదుల సంఖ్యలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. వారంతా క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు లోఓల్టేజీ సమస్యను తీర్చాలనే అభిప్రాయంతో ఏడాదిన్నర కిందట సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం రూ.కోటి నిధులు కేటాయించి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ స్థలం కోర్టు వివాదంతో పనులు నిలిచి పోవడంతో సమస్య తీరలేదు. పరిసరాల కాలనీల పరిధిలో లోఓల్టేజీ సమస్యతోపాటు తరచూ అంతరాయం జరుగుతూ ఇబ్బంది పడుతున్న నివాసులు వాపోతున్నారు. కాలనీలో అందమైన భవనాలు ఉన్నాయి. కొన్ని రహదారులకు డ్రెయిన్లు ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా శుభ్రం చేయక పోవడం వల్ల కంపచెట్లు అల్లుకుని ఆనవాళ్లు లేకుండా పోయాయి. కచ్చా డ్రెయిన్లు ఉన్న వీధుల్లో మురుగునీరు పోయే విధంగా లేక పోవడంతో ఎక్కడి మురుగు అక్కడ నిలిచి కంపు కొడుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. మురుగునీరు నిలవడంతో దోమలు, పశువులు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. రోడ్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని, ఖాళీ స్థలాల్లో కూడా పెద్ద పెద్ద కంపచెట్లు పెరిగి చిన్న పాటి అడవిని తలపిస్తున్నాయి. రాఘవయ్యనగర్, వరదయ్యనగర్, ఒయాసిస్రోడ్డు తదితర 22వ డివిజన్, 10వ డివిజన్, 11వ డివిజన్ పరిధిలోని నివాసులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఈ కాలనీల పరిధిలో నుంచి లకారం చెరువుకు నీరు అందించే మేజర్ కాలువ లైనింగ్ లేకపోవడంతోపాటు ఇళ్లు ఆనుకొని ఉండటం వల్ల నీరు కలుషితం కావడంతోపాటు నీరు నిలిపివేసి తర్వాత సమీపంలోని నివాసాల వాడకం నీరు చేరి మురుగు కంపు కొడుతోందని గృహ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేదు.. డ్రెయిన్లు లేవు... తమ కాలనీలో రోడ్డు లేదు. డ్రెయిన్లు లేకపోవడం వల్ల మురుగుకంపు వస్తోంది. ఖాళీ స్థలాల్లో కంపచెట్లు పెరిగి భయంకరంగా మారాయి. పారిశుద్ధ్య కార్మికులు రాక పోవడం వల్ల డ్రెయిన్లు అధ్వానంగా మారుతున్నాయి. పన్నులు మాత్రం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. కానీ, కార్పొరేషన్ నుంచి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. -మందడపు వెంకటేశ్వరరావు, కాలనీవాసి సబ్‌స్టేషన్ పూర్తయితే విద్యుత్ సమస్య ఉండదు మమత వైద్యశాల రోడ్డులో సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో విద్యుత్ సమస్యలు దాదాపు ఉండక పోవచ్చు. ప్రస్తుతం రోటరీనగర్ సబ్ స్టేషన్ నుంచి ఇవ్వాల్సి వస్తోంది. దీంతో అధికలోడు కారణంగా అప్పుడప్పుడు సమస్య ఎదురవుతోంది. తాత్కాలికంగా సమస్యల నుంచి గట్టెక్కడానికి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 160 కేవీగా మార్చేందుకు 3 ట్రాన్స్ఫార్మర్ల కోసం ప్రతిపాదనలు పంపాం. కొత్తగా మరో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 10 మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరైతే సమస్య చాలా వరకు తగ్గుతుంది. -జె.శ్రీధర్‌రెడ్డి, విద్యుత్ ఏఈ -
దగాపడ్డ రైతన్న
► విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు రూ.50 వేల లంచం ► సొమ్ము తీసుకొని అమర్చని వైనం ► వేమనపల్లి ఏఈ, ఎంపీపీపై రైతుల ఆరోపణ ► ఎండుతున్న 60 ఎకరాలు ► ట్రాన్స్‌కో ఎస్ఈ దృష్టికి వ్యవహారం సాక్షి, మంచిర్యాల : క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటు న్న కరెంట్ సమస్య విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులపై కాసుల వర్షం కురిపిస్తోంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారిని నిలువు దోపిడీ చేస్తున్న సంఘటన లూ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. జిల్లా విశాలంగా ఉండడం.. మారుమూల ప్రాంతంలో జరిగే ఇలాంటి సం ఘటనలు అధికారుల దృష్టికి రాకపోవడంతో పలుచోట్ల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కలిసి రైతులను మోసం చేస్తున్నారు. తాజాగా.. వేమనపల్లి మండలం మంగెనపల్లి లో 20 మంది రైతులు విద్యుత్ ఏఈ, ఎంపీపీ మాయమాటలు విని మోసపోయామని బాధిత రైతులు ‘సాక్షి’తో వా పోయారు. సోమవారం మంచిర్యాల ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి గోడు వెల్లబోసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఉ చితంగా వచ్చిన ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.50 వేలు పు చ్చుకున్న ఆ ఇద్దరు 45 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ట్రాన్స్ఫార్మర్ బిగించలేదని ఆరోపించారు. ఫలితంగా మంగెనపల్లిలో 60 ఎకరాల వరి ఎండిపోయే పరిస్థితి నెల కొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయిన తీ రును బాధిత రైతులు తలండి సురేశ్, ఎనగంటి చిన్నన్న వివరించారు. ‘మా గ్రామంలో మొత్తం 34 రైతు కుటుం బాలున్నాయి. 120 ఎకరాల్లో పంట సాగవుతోంది. ప్ర స్తుతం అందరికీ బోర్లు ఉన్నాయి. గ్రామంలో 100 కె.వి ట్రాన్స్ఫార్మర్ ఒక్కటే ఉంది. ఓవర్‌లోడ్‌తో మోటర్లు పాడవుతున్నాయి. చేనుకు నీరందక.. పంటలు ఎండిపోతున్నా యి. దీంతో ఊర్లో ఇంకో ట్రాన్స్ఫార్మర్ కోసం విద్యుత్ ఏఈను కోరాం. దీంతో ఆయన రూ.50 వేల నగదును ఎంపీపీకి ఇవ్వమన్నారు. అవసరం ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్ పెడ్తాం అన్నరు. మేమందరం డబ్బులు పోగు చేసి ఆత్రం వెంకటస్వామి, తొర్రెం పోచం, సూరం మొండయ్యతో కలిసి మేమూ ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆయనకు రూ. 50 వేలు ఇచ్చినం. సొంత రవాణా ఖర్చులు పెట్టుకుని ట్రాన్స్ఫార్మర్ను గ్రామానికి తీసుకొచ్చినం. నేటికి 45 రో జులు దాటింది. ఇంత వరకు ట్రాన్స్ఫార్మర్ బిగించలేదు. ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా వచ్చినా.. మా నుంచి రూ.50 వేలు తీసుకున్నరు. ఎన్నిసార్లు అడిగి నా స్పందిస్త లేరు. ఇటేమో.. చేనుకు నీరందక 60 ఎకరా ల్లో మా పంటలు ఎండిపోతున్నయ్. ఇంకొన్ని రోజులు ఇ లానే ఉంటే మేం ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే...’ అని చెప్పారు. ఈ విషయం ట్రాన్స్ కో ఎస్ఈ జయవంతరావు చౌహాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన బాధితులతో మాట్లాడా రు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై వేమనపల్లి ఎంపీపీ కుర్రు వెంకటేశ ం వివరణ ఇ స్తూ..‘రైతులు ఇచ్చిన డబ్బులు ట్రాన్స్ఫార్మర్ కోసం వా రితోనే ఖర్చు చేయించా. నేను ఎవరినీ మోసం చేయలే దు. మిగతా విషయాలు ఏఈ వెంకటేశ్వర్లుతో మాట్లాడి తె లుసుకోండి’ అన్నారు. ఏఈ వెంకటేశ్వర్లును సంప్రదించాలని ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.