ఇంకా అంధకారమే.. | until no electric services to visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇంకా అంధకారమే..

Published Tue, Oct 14 2014 1:44 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

ఇంకా అంధకారమే.. - Sakshi

ఇంకా అంధకారమే..

సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రలో విద్యుత్ పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించడం లేదు. మరికొన్ని గంటలు అంధకారం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.  ఇప్పటికిప్పుడు పునరుద్ధరణ సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా మొత్తం వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఇందులో రూ.700 కోట్లు డిస్కమ్‌లు, రూ.300 కోట్లు ట్రాన్స్‌మిషన్ సంస్థలు నష్టపోయాయని తెలిపారు. తొలుత విశాఖ నగరానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అదీ అత్యవసర సర్వీసుల కోసం మాత్రమే. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో సరఫరా పునరద్ధరణకు మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్షణ ఏర్పాట్ల కోసం విద్యుత్ సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నా ఇంతవరకు మెరుగైన పరిస్థితి కనిపించలేదు. హుదూద్ తుపాను మునుపెన్నడూ లేనంతగా ఉత్తరాంధ్రను కుదిపేసింది. ఈ  నష్టం విద్యుత్ శాఖపై భారీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రోజూ 135 మిలియన్ యూనిట్లు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. తుపాను కారణంగా ఇది 108 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఉత్తరాంధ్రలో ఒక్క యూనిట్ కూడా సరఫరా చేయలేని పరిస్థితే ఇందుకు ప్రధాన కారణం. ఈ మూడు జిల్లాల్లో విద్యుత డిమాండ్ 24 మిలియన్ యూనిట్లు ఉంటుంది.

అంధకారంలో జనం: మూడు జిల్లాలూ ప్రస్తుతం అంధకారంలోనే ఉన్నాయి. ఇక్కడ సాధారణ జనజీవనం కారుచీకట్లో బిక్కుబిక్కుమంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 7,410 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర వైద్యసేవలు ఆగిపోయి రోగులు హైరానా పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఆస్పత్రుల్లో ప్రాణాప్రాయ సేవలకూ ఆటంకం కలుగుతోంది. కొద్దిగంటలు జనరేటర్ల మీద నడిచినా, ఇప్పుడు ఆ వెసులుబాటూ లేదు. రవాణ వ్యవస్థ లేకపోవడం, డీజిల్ బంకులు మూతబడటంతో ఎమర్జెన్సీ సేవలకు ఆటకం ఏర్పడింది. తాగునీరు లేదు.

విద్యుత్ లేకపోవడంతో ఓవర్ హెడ్ ట్యాంకులను నింపే మోటార్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సెల్‌ఫోన్ టవర్లు ఒక్కటీ పనిచేయడం లేదు. చిన్నాచితక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. చీకట్లోనే భయపడుతూ కాలం గడుపుతున్నారు. నెట్‌వర్క్ పూర్తిగా దెబ్బతినడంతో, పాలన వ్యవస్థల మధ్య సమన్వయం లేకుండాపోయింది.
 
కూలిన స్తంభాలు.. కొట్టుకుపోయిన ట్రాన్స్ ఫార్మర్లు
విద్యుత్ సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ట్రాన్స్‌ఫార్మర్లు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 75 ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయినట్టు అంచనా. 1,100 స్తంభాలు పూర్తిగా వంగిపోయాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ విరిగిపడ్డ స్తంభాల సంఖ్య 20 వేలకు పైమాటే. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ప్రత్యామ్నాయ సరఫరాకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. యథాతథ పరిస్థితి నెలకొనడానికి కనీసం వారం రోజులైనా పట్టొచ్చని అధికారులే చెబుతున్నారు.

రెండుచోట్ల 400 కె.వి. సబ్‌స్టేషన్లు కుప్పకూలాయి. 225 కె.వి. సబ్‌స్టేషన్లు 10 వరకు పనికిరాకుండా పోయాయి. 132 కె.వి. సబ్ స్టేషన్లు 25 వరకు నేలమట్టమయ్యాయి. గాజువాకలోని సింహాద్రి ఎన్టీపీసీ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పోలాకి, సంతబొమ్మాళి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. 100కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడం, నీట మునగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలోని పెందుర్తి ఉప కేంద్రం వద్ద సాంకేతిక లోపం ఏర్పడంతో జిల్లాలో సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ అధికారులు చెప్పారు.

దీంతో పెందుర్తి నుంచి గరివిడికి సరఫరా నిలిచిపోయింది. పెందుర్తి సాంకేతిక లోపం సరిదిద్దతేగానీ జిల్లాకు సరఫరా రావడం కష్టం. విశాఖ జిల్లాలో 33 కె.వి. విద్యుత్ స్తంభాలు 22, 11 కె.వి. విద్యుత్ స్తంభాలు 3,339, ఎల్‌టీ విద్యుత్ స్తంభాలు 533, ట్రాన్స్‌ఫార్మర్లు 75 కూలిపోయాయని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా పరిస్థితిపై అధికారులకూ స్పష్టమైన అవగాహన లేదు. ఫోన్లు పనిచేయకపోవడంతో ఉన్నతాధికారులకు ఎలాంటి నివేదికలూ రాలేదు. 80 ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగినట్లు తెలుస్తోంది. 7,657 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను పునరుద్ధరించాల్సి ఉంది.
 
పునరుద్ధరణకు చర్యలు : తాజా పరిస్థితి నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ నగరానికి విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సిబ్బంది ఉత్తరాంధ్రకు రప్పించారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నుంచి స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, వైర్లు తరలించారు. తాజా పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్, జెన్‌కో సీఎండీ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. విజయానంద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే మకాం వేశారు. సింహాద్రి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను దారికి తెచ్చేందుకు కొంత వరకు ప్రయత్నాలు జరిగాయి. ఇది పనిచేయడానికి అవసరమైన విద్యుత్‌ను వేమగిరి ప్లాంట్ నుంచి పంపాలని నిర్ణయించారు.

సింహాద్రి ఉత్పత్తి ప్రారంభిస్తే విశాఖ సిటీకి కొంతవరకు ప్రయోజనం ఉంటుంది.  దీంతో పాటు మరో నాలుగు మార్గాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నారు. తునిలోని 132 కె.వి. సబ్‌స్టేషన్ ద్వారా కొరుప్రోలు, పరవాడ, గాజువాక ద్వారా విద్యుత్ అందించాలని భావిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలోని 132 కె.వి. సబ్‌స్టేషన్ ద్వారా గాజువాకకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.గాజువాక నుంచి 80 మెగావాట్లు అందించే వీలుందని తెలుస్తోంది. మొత్తం మీద విశాఖ నగరానికి మంగళవారం సాయంత్రానికి ఒక స్థాయిలో విద్యుత్ అందించే వీలుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
భారీగా సిబ్బంది : ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విద్యుత్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడ నుంచి  రెండువేలమంది సిబ్బందిని పంపినట్టు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సెలవుల్లో ఉన్నవాళ్లను కూడా రప్పిస్తున్నారు.
 
తెలంగాణ సాయం : ఉత్తరాంధ్రలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యుత్ సంస్థలు సాయం చేసేందుకు ముదుకొచ్చాయి. తెలంగాణ జెఎండీ కార్తికేయమిశ్ర సోమవారం ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌తో మాట్లాడారు. రూ.13 కోట్ల విద్యుత్ ఉపకరణాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు ఉత్తరాంధ్రకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాయానికి ముందుకొచ్చాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement