Hudood Cyclone
-
హుద్‌హుద్ సాయం రూ.2350 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో హుద్‌హుద్ తుపాను పునర్నిర్మాణ పనుల కోసం వరల్డ్ బ్యాంకు రూ.2,350 కోట్ల ఆర్థిక సహాయం చేయనుందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ధనుంజయరెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ర్టం పంపిన ప్రతిపాదనలను కేంద్రం వరల్డ్ బ్యాంకుకు పంపిందన్నారు. -
వైజాగ్‌లో జగన్ వెంట ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్ : వైఎస్సార్ ప్రజా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మంగళవారం వైజాగ్‌లో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితో కలిసి పర్యటించారు. శారదాపీఠం వార్షికోత్సవంలో టీటీడీ మాజీ సభ్యుడి హోదాలో చెవిరెడ్డి పాల్గొన్నారు. సింహాచలం నరసింహస్వామిని దర్శించుకున్నారు. హుదూద్ తుపాన్‌తో దెబ్బతిన్న వైజాగ్ బీచ్‌ను వారు పరిశీలించారు. వైజాగ్ పునఃనిర్మాణంలో వైఎస్సార్ సేవాదళ్ వలంటీర్లు బాగా కృషి చేస్తున్నారని చెవిరెడ్డి అభినందించారు. -
పొంతనలేని నివేదికలతో సాయంలో కోత
హుద్‌హుద్ సాయం తెచ్చుకోవడంలో ఏపీ సర్కార్ వైఫల్యం సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను నష్టానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 1,000 కోట్లను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ నష్టంపై రాష్ట్ర యంత్రాంగం పొంతనలేని నివేదికలు పంపడమే దీనికి కారణం. నివేదికలు వాస్తవానికి దగ్గరగా లేవని కేంద్రం కూడా వా టిని విశ్వసించడంలేదు. తొలుత రూ. 14వేల కోట్ల నషమనీ, ఆ తరువాత రూ. 21,908 కోట్లు నష్టమైందనీ రాష్ట్రం నివేదికలు పంపింది. అందులో తక్షణ సాయంగా రూ. 9,500 కోట్లు ఇవ్వాలని కోరింది. వీటిని పరిశీలించిన కేంద్ర ఆర్థిక, హోంశాఖ అధికారులు.. నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచి చూపిందనే అభిప్రాయానికి వచ్చారు. మొత్తం రూ.680 కోట్లు సాయంగా ఇస్తే సరిపోతుందని ఆ శాఖలు అంచనాకు వచ్చాయి. కాగా, హుద్‌హుద్ తుపానులో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకే నష్టం వాటిల్లినట్లు గతంలోనే వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల సాయంలో తొలి విడతగా కేవలం రూ. 400 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. దీంతో రాష్ట్ర అధికారులు షాక్ తిన్నారు. ఆందోళనతో ఢిల్లీ బయల్దేరుతున్నారు. ఈ నెల 15న రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ సుకుమార ఢిల్లీ వెళ్లి హుద్‌హుద్ నష్టంపై కేంద్ర అధికారులతో చర్చించనున్నారు. -
నేటి నుంచి కేంద్రం బృందం పర్యటన
విశాఖపట్నం: విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని హుద్‌హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నుంచి నాలుగురోజులపాటు కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కె.కె.పాఠక్, కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.పి.సింగ్, కేంద్ర రూరల్ వాటర్ అండ్ శానిటేషన్ కన్సల్టెంట్ బ్రిజేష్ శ్రీవాత్సవ, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ డివిజన్ డెరైక్టర్ రాజిబ్ కుమార్‌సేన్, రూరల్ డెవలెప్మెంట్ అండర్ సెక్రటరీ రామవర్మ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ డెరైక్టర్ వివేక్ గోయల్, కృష్ణాగోదావరి బేసిన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.రమేష్‌కుమార్‌లతో పాటు రాష్ర్ట వ్యవసాయశాఖ డీవోడీ డెరైక్టర్ ఎస్.ఎం.కోలాట్కర్ ఈబృందంలో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ నుంచి విమానంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖ చేరుకోనున్న ఈ బృందం సభ్యులు తొలుత ఎయిర్‌పోర్టులో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తుంది. తుపాను నష్టంపై కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. బుధవారం విశాఖపట్నం నగరంతో పాటు జిల్లాలోని అనంతగిరి, అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి, కశింకోట మండలాల్లో పర్యటిస్తారు. గురువారం తూర్పు గోదావరి జిల్లాలోని తుని, యు.కొత్తపల్లి మండలాల్లో పర్యటించి విశాఖకు చేరుకుంటారు. విశాఖలో అధికారులతో సమీక్ష అనంతరం అదేరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. -
తుపానుపై సీఎం నిధికి రూ.100 కోట్లు
ఈ సొమ్మంతా ఇళ్ల నిర్మాణాలకే వెచ్చించాలని సీఎం నిర్ణయం ఆ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి ఇప్పటి వరకు ఏకంగా రూ.100 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. సహాయ నిధికి వచ్చిన నిధులతో.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఒక్కో ఇంటికి రూ.2 లక్షల చొప్పున వెచ్చించి పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సహాయ నిధికి వచ్చిన నిధులన్నింటినీ ఇళ్ల నిర్మాణాలకే వెచ్చించాలని నిర్ణయించారు. రూ.100 కోట్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గృహ నిర్మాణ పథకాలను కూడా చేర్చి కనీసం 4000 పక్కా గృహాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిధులిచ్చిన పెద్ద కంపెనీల ప్రతినిధులతో చర్చించి ఏ తరహా ఇళ్లు నిర్మించాలనే దానిపై చర్చించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు.. నిధులిచ్చిన కంపెనీల ప్రతినిధులతో చర్చించడంతోపాటు నిర్మాణ ఏజెన్సీని కూడా ఎంపిక చేస్తామని ఆ ఉన్నతాధికారి తెలిపారు. ఈ బాధ్యతను ఎల్అండ్టీ లేదా టాటా ఇంజనీరింగ్ తదితర సంస్థలకు అప్పగించాలని ఆలోచిస్తున్నారు. కాగా, తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 40 వేల ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇళ్ల నిర్మాణాలకే రూ.3000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా. రూ. 98.92 కోట్లు విడుదల తుపాను వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందించడంతోపాటు తాత్కాలిక పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 98.92 కోట్లు విడుదల చేసింది. ఇందులో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం కింద రూ. 88.78 కోట్లు కేటాయించింది. తోపుడు బండ్లపై అమ్ముకునేవారు, వీధి వ్యాపారులు, రిక్షా, ఆటో కార్మికులకు సహాయం అందించేందుకు రూ. 2.30 కోట్లు, దుస్తులు, ఇతర ఇంటి సామగ్రి కోసం రూ.4.23 కోట్లు, రెవెన్యూ శాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 3.60 కోట్లు కేటాయించింది.పారదర్శకంగా పరిహారం చేరేందుకు వీలుగా బాధితుల బ్యాంకు అకౌంట్లకే డబ్బు జమ చేయాలని సూచించింది. -
పూర్తి వివరాలు అందజేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి అవినీతి, అక్రమాలపై తేరా చిన్నపరెడ్డి ఇచ్చి న ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. జానారెడ్డి అక్రమాలపై తానిచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కోరినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఏ మాత్రం స్పందిం చడం లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తేరా చిన్నపరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ నవీన్‌రావు విచారించారు. జనారెడ్డి అధికార దుర్వినియోగం, అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం సమర్పించామని చిన్నారెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను జానారెడ్డి ఏ విధంగా తుంగలో తొక్కిందీ సీబీఐకి, కేంద్ర హోంశాఖకు ఆధారాలతో వివరించామన్నారు. అయితే సీబీఐ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కేంద్ర హోంశాఖ మాత్రం జానారెడ్డిపై తామిచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించిందని, అయితే ఇప్పటి వరకు వారు ఏ విధంగానూ స్పందించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సీబీఐ తరఫు న్యాయవాదిని పిలిపించి, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను 21కి వాయిదా వేశారు. -
సొంత పనుల కోసమే టూర్!: అంబటి
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై అంబటి రాంబాబు ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లింది తన సొంత పనులు చక్కబెట్టుకోవడానికే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత మాత్రం కాదని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కొత్త రాజధాని నిర్మాణానికి ఓ వైపు చందాలడుగుతున్నారు.. మరోవైపు హుద్‌హుద్ తుపానుకు విలవిల్లాడిన విశాఖపట్టణం అభివృద్ధికి డబ్బుల కొరత ఉందంటున్నారు.. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక విమానాల్లో ఖరీదైన సింగపూర్ యాత్ర చేయాల్సిన అవసరముందా, ఇది దుబారా కాక మరేమిటి?’ అని ఆయన నిలదీశారు. ‘సౌత్ ఆసియన్ స్టడీస్’ సంస్థ వార్షికోత్సవంలో ప్రసంగించడానికి వారి ఆహ్వానం మేరకు చంద్రబాబు వెళుతున్నట్లు చెబుతున్నారని, ఈ సంస్థకు స్థానికంగా కూడా అంత ప్రాచుర్యం లేదని అన్నారు. ఈ ఖర్చుకు బదులు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికిగాని, హుద్‌హుద్ సహాయక చర్యల కోసంగాని నిధులు వెచ్చించ వచ్చు కదా అని ఆయన నిలదీశారు. చంద్రబాబుకు అక్కడే వ్యాపారాలు.. చంద్రబాబుకు, సింగపూర్‌కు అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో ఉందని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా జిల్లాల్లో తిరుగుతూ ఉంటే సింగపూర్‌లో చక్కర్లు కొట్టిన ఘనత చంద్రబాబుదని అంబటి అన్నారు. చంద్రబాబు వ్యాపారాలు చేసుకునేది, హోటళ్లు నిర్మించుకునేది సింగపూర్‌లోనే అని, ఇది తాను చెప్పేది కాదని, ‘తెహల్కా డాట్ కామ్’ వారే చెప్పారని అన్నారు. వైఎస్ కుమారుడైన జగన్ తన పత్రికను, వ్యాపారాలను ఏపీలోనే చేసుకుంటున్నారని, కానీ చంద్రబాబు కొడుకు, కోడలు, ఇతర వందిమాగధులు వ్యాపారాలు చేసేది సింగపూర్‌లోనే అని ఆయన అన్నారు. అందుకే చంద్రబాబు తన పేరును సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే మంచిదనే చర్చ మేధావుల్లో జరుగుతోందని అన్నారు. మనీల్యాండరింగ్‌కు కేంద్రంగా ..... చంద్రబాబు సింగపూర్‌లో ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో నిఘా వేయాల్సిందిగా ‘రా’ సంస్థను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి రాంబాబు విజ్ఞప్తి చేశారు. సింగపూర్‌తో పాటు, గతంలో సీఎంగా ఉన్నపుడు చంద్రబాబు దావోస్‌కు కూడా వెళ్లే వారని, ఆయన బంధువులు, స్నేహితులు మనీల్యాండరింగ్, వ్యాపారాలకు సింగపూర్‌ను ఒక కేంద్రంగా పెట్టుకున్నారని అన్నారు. -
ఈ నెల 30న...పన్నెండు గంటల పాటు మేము సైతం
హుదూద్ తుపాన్ బీభత్సం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సుందర నగరం విశాఖకి పూర్వ శోభను తెచ్చే ప్రయత్నంలో ‘మేము సైతం’ అంటూ తెలుగు చిత్రపరిశ్రమ నడుం బిగించింది. సినిమా స్టార్లందరూ ఒకే వేదికపైకి వచ్చి, 12 గంటల పాటు నిర్విరామంగా సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పరిశ్రమలోని వివిధ శాఖల ప్రతినిధులు ఈ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ -‘‘గత నెల 12న జరిగిన ప్రకృతి వైపరీత్యం అందరికీ తెలిసిందే. హుదూద్ తుపాన్ ధాటికి ఉత్తరాంధ్ర తీవ్రంగా దెబ్బతిన్నది. ఇలాంటి విపత్తు పరిణమించిన ప్రతిసారీ... బాధితుల్ని ఆదుకోవడానికి ‘మేము సైతం’ అంటూ సినీ పరిశ్రమ ముందుకొస్తూనే ఉంది. ఆ సంప్రదాయానికి కొనసాగింపుగా ఈ నెల 30న హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. ‘‘ఈ నెల 30ని సినీపరిశ్రమకు సెలవు దినంగా, వచ్చే నెల రెండో ఆదివారం పనిదినంగా ప్రకటించాం. మంచి దృక్పథంతో 12 గంటల పాటు నిర్విరామంగా జరిగే ఈ కార్యక్రమం.. అంద రికీ కావల్సినంత వినోదాన్ని పంచుతుంది’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ -‘‘ఈ కార్యక్రమానికి పరిశ్రమ వారు మాత్రమే ఆహ్వానితులు. బయటవారికీ టికెట్లు అమ్ముతాం. అయితే, టికెట్ కొన్నంత మాత్రాన లోపలికి అనుమతించం. లక్కీ డీప్ ద్వారా కొందరిని ఎంపిక చేసి, వారినే అనుమతిస్తాం. టికెట్ ధర రూ. 500. పరిశ్రమనే కమిటీగా భావించి సమష్టిగా చేస్తున్న కార్యక్రమం ఇది. ‘మేము సైతం డాట్ కామ్’ ద్వారా కార్యక్రమ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బు సేకరించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తాం. సినీ పరిశ్రమకు చెందిన స్టార్లందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అన్నారు. ఇంకా ఏపీ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎ.శ్యామ్‌ప్రసాదరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, జెమినీ కిరణ్, మధుర శ్రీధర్, కెవీరావు తదితరులు మాట్లాడారు. -
గూడు చెదిరి... నీడ కరువై..
కూలిన ఇళ్లలో కాలం వెళ్ల దీస్తున్న బాధితులు పట్టించుకోని అధికారులు అష్టకష్టాలు పడుతున్న నిరాశ్రయులు సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘వేలాది ఇళ్లకు నష్టం జరిగిందంటున్నారు. వారంతా నిరాశ్రయులై ఉంటారు. తాత్కాలిక పునరావాసమేదైనా కల్పించారా..?’ ఇటీవల తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అధికారులకు అడిగిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు ఇప్పటికీ అధికారులు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. తుపాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారిలో చాలా మందికి నేటికీ నిలువ నీడ లేదు. వారెలా ఉంటున్నారో? ఎక్కడ తలదాచుకుంటున్నారో ఆరా తీసిననాథుడే కనిపించడం లేదు. దీనికి తోడుకూలిపోయిన ఇళ్ల ఎన్యుమరేషన్ కూడా సరిగా చేయడం లేదు. ఇప్పుడనేక మంది కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. హుదూద్ తుపాను బీభత్సంతో మొత్తం15,303 ఇళ్లకు నష్టం జరిగినట్టు అధికారికంగా గుర్తించారు. అధికారుల దృష్టికి రాని, రాజకీయఒత్తిళ్లతో ఎన్యుమరేషన్ చేయనివి ఇంకెన్ని ఉన్నాయో విస్మరించిన వారికే తెలియాలి. గుర్తించిన వివరాలిలా ఉన్నాయి. 15 పక్కా ఇళ్లు, 301 కచ్చా ఇళ్లు పూర్తిగా కూలిపోగా,91పక్కా ఇళ్లు, 713 కచ్చా ఇళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇక 296పక్కా ఇళ్లు, 6611 కచ్చా ఇళ్లు, 7276 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటినే ప్రభుత్వానికి నివేదించారు. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి, తీవ్రంగాఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రత్యామ్నాయ ఏరచేయాలి. ముఖ్యంగా ఎక్కడో ఒక చోట దలదాచుకునే విధంగా పునరావాసం కల్పించాలి. కానీ జిల్లాలో అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆదేశాలు కూడా అమలు కాలేదు. దీంతో ఇళ్లు దెబ్బతిన్న నిరాశ్రయుల్లో కొంతమంది ఆర బయటే గడుపుతుండగా, మరికొంతమంది పరార పంచాన తలదాచుకుంటున్నారు. ఇంకొ కొంతమంది కూలిన ఇళ్లల్లోనే గోడలమాటున కాలంవెళ్లదీస్తున్నారు. ఉన్న గోడలుకూడా అనుకోకుండా కూలిపోత నివాసితుల ప్రాణాలకు ప్రమాదంవాటిల్లే అవకాశంఉం.సాధారణంగా ఇళ్లల్లో ఉన్న వారిని అప్రమత్తం చేసి, వేరొక చోటకి తరలించే ప్రయత్నంచేయాలి. కానీ ఆ దిశగా అధికారలు ఆలోచనే చేయడంలేదు. ఒక్క రోజు... వారి జీవితాలు తల్లకిందులైపోయాయి. ఒకే ఒక్క రోజు వారి బతుకులు నిట్టనిలువునా కూలిపోయాయి. హుదూద్ సృష్టించిన విలయానికి వారంతా గూడు చెదిరిన పక్షుల్లా మారారు. మంచి తిండి తినక, మంచి బట్ట కట్టుకోక కాసిన్ని డబ్బులు మిగిల్చి కట్టుకున్న ఇళ్లు గాలివానకు నేలకూలడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. తుపాను వెళ్లిపోయి ఇన్ని రోజులవుతున్నా వారి కన్నీటి ధారలు ఆగడం లేదు. పునరావాసం కల్పిస్తామని చెప్పిన అధికారులు పత్తా లేకుండా పోతున్నారు. అధికార పార్టీ నేతలు స్వోత్కర్షకు, ఓదార్పులకే పరిమితమవుతున్నారు. -
విశాఖ కోసం హీరోల క్రికెట్ మ్యాచ్
హుదూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా హీరోలు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 7న విజయవాడలో వారు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. శ్రీమిత్రా గ్రూప్, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ వివరాలను సోమవారం సాయంత్రం హైదరబాద్‌లో హీరో శ్రీకాంత్ తెలియజేస్తూ -‘‘షూటింగులు రద్దు చేసుకొని మరీ మన హీరోలు ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నారు. మా ప్రయత్నానికి అన్ని శాఖల సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద మొత్తంలో చెక్ అందిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు తరుణ్, అల్లరి నరేశ్, నిఖిల్, రఘు, నవీన్‌చంద్ర, ప్రిన్స్, తనీష్, ఖయ్యూమ్, టీమ్ మేనేజర్ వంకా ప్రతాప్, ‘శ్రీమిత్ర’ చౌదరి, అఖిల్ కార్తీక్, శశాంక్, భూపాల్, సమీర్, అశ్విన్, గిరి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ కోసం హీరోల క్రికెట్ మ్యాచ్
-
రైతన్న గుండెమంట!
నందిగాం:ప్రకృతి విసిరిన పంజాతో అన్నదాత వెన్ను విరిగింది. ఆరుగాలం శ్రమించి.. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతన్న గండె మండిపోయింది. హుదూద్ తుపాను తరువాత వరిపై తెగుళ్లు దాడి చేయడంతో ఎండిపోరుునట్టు మారిన చేనును చూసి.. కన్నీరు కార్చే ఓపిక లేక ఆవేదనతో కుప్పకూలిపోతున్నాడు. చి‘వరి’కి చేసేది లేక తన చేతితోనే పంట చేనుకు నిప్పుపెట్టి గుండె మంటను చల్లార్చుకుంటున్నాడు. నిన్న సంతబొమ్మాళి, నేడు నందిగాం మండలంలో వరి చేనుకు రైతులు నిప్పంటించి తన కడుపు కోతను తీర్చుకున్నారు. దీన్ని చూసిన వారు ఆయ్యో రైతుకి ఏమిటీ పరిస్థితి అంటూ సానుభూతిని చూపుతున్నాడు. ఇది ప్రస్తుతం సిక్కోలు జిల్లాలోని రైతు పరిస్థితి. ఏటా పంట చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో బతుకుతెరువు కోసం చాలా కుటుంబాలు పట్టణాలకు వలసలు పోతున్నారు. కొంతమంది రైతులు దిక్కుతోచని స్థితిలో గ్రామంలో ఉంటూ పంటలు పండిస్తుంటే అప్పులు పాలవుతున్నారు. మరి ప్రభుత్వాలు మారుతున్నా రైతు గుండె మంటలు ఆర్పే నాథుడే కరువయ్యూడు. ఇదీ పరిస్థితి నందిగాం మండలం సైలాడ పంచాయతీ దొడ్డరామచంద్రాపురం గ్రామంలో 300 ఎకరాలకుగాను 220 ఎకరాల్లో వరిపంట పూర్తిగా నాశనమైంది. గ్రామానికి చెందిన అట్టాడ వెంకటరావు తనకున్న ఆరు ఎకరాల్లో నాలుగు ఎకరాలు పూర్తిగా పాడైంది. రూ. 80 వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నాడు. లండ ఎండయ్య ఐదెకరాల్లో రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాడు. రెండెకరాలు పూర్తిగా పాడైంది. కొంచాడ రామారావు 5 ఎకరాల్లో ఉభాలు చేయగా 3 ఎకరాలు పూర్తిగా పాడైంది. అలాగే బర్ల కృష్ణమ్మ 15 ఎకరాల్లో నాట్లు వేయగా 10 ఎకరాలు నాశనమైంది. పూడి గణపతిరావుకు చెందిన 25 ఎకరాల్లో 15 ఎకరాలు పాడైంది. ఇలా రైతులంతా పంటను నష్టపోయూరు. కానీ వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అలాగే దేవాడ, భరణిగాం, సైలాడ, వల్లభరాయపాడు, రౌతుపురం, శివరాంపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు పూర్తిగా నాశనమైంది. దీంతో చేసేది లేక తెగుళ్ల బారిన పడిన చేనుకు నిప్పుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతున్న మొరపెట్టుకుంటున్నాడు. వలసలే శరణ్యం నాకు సొంతంగా ఆరు ఎకరాలు ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఈ ఏడాది స్వర్ణ, సాంబమసూరి వేశాను. అయితే ప్రస్తుతం ఏడు ఎకరాలు పురుగుపోటు, దోమపోటుతో నాశనమయ్యాయి. సుమారు రూ. 80 వేలు ధాన్యం వ్యాపారి వద్ద అప్పుచేసి పెట్టుబడి పెట్టాను. వచ్చే ఏడాది పొలాన్ని కౌలుకి ఇచ్చేసి కుటుంబంతో వలస వెళ్లిపోతాను. - అట్టాడ వెంకటేశం, రైతు, దొడ్లరామచంద్రాపురం ప్రభుత్వ నిర్ణయాలే రైతులను ముంచాయి ప్రభుత్వ నిర్ణయూలే రైతులను ముంచారుు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతు రుణమాఫీ అన్నారు. తీరా ఇప్పుడు దాన్ని మరిచిపోయూరు. సెప్టెంబర్ 30లోపు రుణాలు రీ షెడ్యూలు చేయకపోవడం, ప్రస్తుతం బీమా కూడా అవకాశం లేకపోవడం, ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే కారణం. రైతులను నట్టేట ముంచింది టీడీపీ ప్రభుత్వమే. - లండ ఎర్రయ్య, రైతు, భరణిగాం రైతులను విస్మరించిన చంద్రబాబు చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగ అన్నా డు. ప్రస్తుతం ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు అన్ని విధాలా నష్టాలు చవిచూస్తున్నారు. రుణమాఫీ జరగక, పంటల బీమా వర్తించక, పై-లీన్, హుదూద్ తుపాను సాయం రైతులకు అందక అప్పులపాలవుతున్నారు. - కొంచాడ తాతయ్య, రైతు, దొడ్లరామచంద్రాపురం -
‘సుడి’ చుట్టేసింది!
పాలకొండ : రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఏడాది వరి పంటపై పూర్తిగా ఆశలు వదులుకునేలా ప్రకృతి శాసించింది. కనీసం ఎకరమైనా పంట పండుతుందన్న ఆశ రైతుకు మిగల్లేదు. హుదూద్ తుపాను ప్రభావంతో సగం పంట నష్టపోతే..ఆ తరువాత విజృంభించిన సుడి దోమతో ఉన్నది పోరుుంది. దీంతో అన్నదాత నిర్వేదానికి గురయ్యూడు. ఖరీఫ్ ప్రారంభం నుంచీ కష్టాలే.. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచీ రైతులు కష్టాలు కొనసాగుతూనే వచ్చాయి. కార్తెల సమయంలో వర్షాలు లేకపోవడంతో ఆగస్టులో ఉభాలు పూర్తి చేశారు. అనంతరం వర్షాలు అనుకూలించడంతో జిల్లా మొత్తం 1.97 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డారుు. ఆ తరువాత కూడా వరుణుడు కరుణించడంతో చేను ఏపుగా పెరగడంతో పంటపై రైతన్నలో ఆశలు మొలకెత్తారుు. ఈ ఏడాది ఘననీయమైన దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖాధికారులు సైతం అంచనాలు తయారు చేశారు. ఇలాంటి సమయంలో వచ్చిన హుదూద్ తుపాను రైతుల కలలపై నీళ్లు చల్లింది. దాదాపు 90 వేల హెక్టార్లలో పంటలు పూర్తిగా దెబ్బతినగా ఉన్న పంటలోనే సగం పొల్లు గింజలుగా తయారయ్యాయి. ఈ పరిస్థితులో రైతులు కనీసం కుటుంబ పోషణకైనా ధాన్యం వస్తాయని ఆశించారు. కానీ వారి ఆశలపై సుడిదోమ దాడి చేసింది. గంటల వ్యవధిలో ఎకరాలకు ఎకరాలు పంట పొలం బూడిదరంగులో మారిపోతుంది. ఇప్పటికే ఎన్ను వదిలినవి కుళ్ల్లిపోగా, పొట్టదశలో ఉన్నవి కాల్చివేసిన చేనులా కనిపిస్తుంది. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. మరో వైపు పంట నష్టాలు అంచనాలో అధికారులు వ్యవహరించిన తీరు రైతులకు తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. గంటల వ్యవధిలో నాశనం అవుతుంది సుడిదోమ వ్యాపించిన గంటల వ్యవధిలో ఆ ప్రాంతం మొత్తం వ్యాపిస్తుంది. ఉదయం చూసిన పంట పొలం పచ్చగా కనిపిస్తే సాయంత్రానికి బూడద రంగుగా మారిపోతుంది. దీనిపై ఎవరి నుంచి సూచనలు, సలహాలు లేవు. కేవలం మోనో క్రోటోపాస్ ఎకరాకు లీటర్ చొప్పున 20 ట్యాంక్‌ల నీటిలో కలిపి చల్లుతున్నాం. దీనితో తెగులు వ్యాపించే తీవ్రత తగ్గుతుంది. - కండాపు ప్రసాదరావు, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు -
పరిశ్రమకు హుదూద్ దెబ్బ !
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :హుదూద్ తుపాను ప్రభావం పారిశ్రామిక రంగంపై పెను ప్రభావం చూపింది. జిల్లాలోని పరిశ్రమలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూశాయి. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి హామీ లభించకపోవడంతో వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 12న సంభవించిన తుపాను ధాటికి రణస్థలం, ఎచ్చెర్ల, పైడిభీమవరం, పలాస ప్రాంతాలకు చెందిన చిన్న, భారీ పరిశ్రమలు అతలాకుతలమైపోయాయి. ఆయా పరిశ్రమలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో నష్టాల దిశగా పయణిస్తున్నాయి. కొన్ని సంస్థలకు కేవలం విద్యుత్ దీపాల వరకే సరఫరా ఇస్తుండగా, చిన్న పరిశ్రమలకు పాక్షికంగా సరఫరా ఇవ్వడంతో దాని ప్రభావం ఉత్పత్తిపై పడింది. మరికొన్ని సంస్థలు జనరేటర్ల సహాయంతో నడుస్తున్నాయి. దీంతో వ్యాపారులంతా సమావేశమై జిల్లాలోని పరిశ్రమల శాఖ అధికారుల సహకారంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాయి. వచ్చేఏడాదితో ప్రారంభమయ్యే నూతన పారిశ్రామిక విధానంలోనైనా తుపాన్ల వంటి విపత్తుల సమయంలో పరిశ్రమల్ని గట్టెక్కించే విధంగా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమలు నడవకపోయినా జీతాలు, నిర్వహణ ఖర్చుల ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. ఇదీ కథ జిల్లా పరిశ్రమల శాఖలో 6,156 చిన్న పరిశ్రమలు, 35 భారీ పరిశ్రమలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఆయా పరిశ్రమల్లో తుపాను కారణంగా బాయిలర్లు ధ్వంసం కావడం, షెడ్లు కూలిపోవడం, రేకులు ఎగిరిపోవడం, ఎలివేటర్ గొట్టాలు విరిగిపోవడం, గ్రీన్‌బెల్ట్ కనుమరుగైపోవడం జరిగింది. మరికొన్ని పరిశ్రమలు భారీ మరమ్మతులకు గురయ్యాయి. ఆయా సంస్థలకు ఎల్టీ కనెక్షన్లకు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది. హెచ్‌టీ లైన్లు ఎప్పటికి పునరుద్ధరణ జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. తమకు వాటిల్లిన నష్టాలపై పారిశ్రామిక వేత్తలు గత నెల 18న పరిశ్రమల శాఖ అధికారులకు వివరించారు. అప్పటివరకు తమకు విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రూ.85 కోట్లు నష్టం వాటిల్లినట్టు తేల్చారు. ఈ వివరాలతో 19న ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. జిల్లాలో అధికశాతం రైస్ మిల్లులే ఉన్నాయి. వర్షం, గాలుల కారణంగా మిల్లుల్లో నిల్వ చేసిన బియ్యం తడిచిపోవడంతో కనీసం రూ.3 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా. పలాస కేంద్రంగా జీడిపప్పు పరిశ్రమకు తుపాను గాయంతో మరో రూ.2 కోట్లు నష్టం వాటిల్లింది. జీడిపప్పుకు చెమ్మ వచ్చి రంగుమారి రెండో రకంగా తయారై ధర పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. ఫార్మా కంపెనీల్లో కూలింగ్ టవర్స్ పడిపోయి భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా కారణంగా ట్రైమెక్స్ సంస్థలో ఇప్పటి వరకు సుమారు రూ.35 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. నాగార్జున ఆగ్రికెమ్ సంస్థ(ఎన్ఏసీఎల్) తన విదేశీ ఖాతాదారుల్ని సంతృప్తి పరిచేందుకు నిత్యం రూ.11 లక్షల ఖర్చుతో డీజిల్ అయిల్‌తో నడిచే జనరేటర్‌ను ఉపయోగించుకుంటోంది. ధీమా ఇవ్వని బీమా ! పరిశ్రమల్లో ఏటా బీమా రెన్యూవల్ చేయించుకున్నవారికి ధీమా ఉంటుంది. అయితే తుపానుకు సంబంధించి బీమా నిబంధనలు పరిశ్రమల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చోరీ, అగ్నిప్రమాదం సంఘటనలకు లభించే బీమా తుపానుకు లేదంటూ అధికారులు చెబుతుంటే..రెన్యూవల్స్ సమయంలో భారీ ప్రీమియం చెల్లించాల్సి ఉండగా వ్యాపారులు వెనకడుగు వేశారని సిబ్బంది చెబుతున్నారు. బీమా ఉన్న సంస్థలకు ఇన్సూరెన్స్ కంపెనీలు సవాలక్ష షరతులు విధిస్తాయని, మొత్తంగా చూస్తే కోతలు పోనూ 10 నుంచి 20 శాతం లోపే వచ్చే అవకాశం ఉంటుందని, అది కూడా నెలల తరబడి సమయం పడుతోందని పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాల పరిశ్రమల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలంటున్నారు. టాక్స్ మినహాయించాలి 20 రోజుల వరకూ విద్యుత్ సరఫరా లేకపోవడంతో పరిశ్రమల్లో జనరేటర్ల వాడకం పెరగింది. ఫలితంగా లక్షలాది లీటర్ల డీజిల్ వాడుతున్నారు. ఈ మేరకు బంకుల్లో ఇంధనం కొనుగోలు సమయంలో ప్రభుత్వానికి 22.5 శాతం పన్ను చెల్లిస్తున్నారు. కనీసం ఈ పన్ను చెల్లింపునైనా తమను విముక్తి చేయాలని వ్యాపారులు ప్రభుతాన్ని కోరుతున్నారు. అలాగే బకాయి పడిన విద్యుత్ బిల్లుల చెల్లింపునకు కనీసం ఆరునెలల గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తాము ‘ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ’ (ఐపీసీ) దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. -
మళ్లీ జన్మభూమి
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ తుపాను సందర్భంగా నిలిచిపోయిన జన్మభూమి గ్రామసభలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రకటించిన షెడ్యూల్ గ్రామాలు, వార్డులలో శనివారం నిర్వహించిన గ్రామసభల్లో మళ్లీ జన్మభూమిపింఛను దారులు, డ్వాక్రా మ హిళలు నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలను నిలదీశారు. ఎన్నికల సందర్భంగా మాయ మాటలు చెప్పి చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి వృద్ధులకు, విక లాంగులకు అందుతున్న పింఛన్లను ఎందుకు ఆపేస్తున్నారని నిలదీశారు. ప్రజల ఆవేదన ఆగ్రహంగా మారడంతో జన్మభూమి గ్రామసభల్లో పాల్గొన్న నాయకులు తెల్లమొహం వేశారు. ఎస్.కోటలోని సీతారాంపురం, గోపాలపల్లి గ్రామాల్లో డ్వాక్రా రుణాలు, పింఛన్ల కోసం ప్రజలు నిలదీశారు. ఐకేపీ ఏపీఎం ప్రగతి నివేదిక చదువుతుండగా మాకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. మాఫీ చేయకపోయినా రుణాలు చెల్లించాలంటూ ఎందుకు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. రైతుల రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారని ఇప్పుడు కనిపించడం లేదని సంగంపూడి రమణ తదితరులు అసహనం వెలిబుచ్చారు. సీతారాంపురంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రసంగిస్తుండగా కరక గంగునాయుడు అనే వికలాంగుడు లేచి మాలాంటి వారికి కూడా పింఛన్లు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. సదరం ధ్రువపత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయడంతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఏదో సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. బొబ్బిలి మండలంలోని ఎం బూర్జి వలసలో చుక్క జగన్మోహనరావు అనే యువజన సంఘం నాయకుడు సమీపంలోని గ్రోత్ సెంటర్ వల్ల గ్రామం, పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని, దీనికి పరిష్కార మార్గాలు ఎందుకు చూపడం లేదని అధికారులను నిలదీశాడు. విజయనగరంలో.. గీతకు చుక్కెదురు మండలంలోని గుంకలాంలో జరిగిన గ్రామసభలో ఎంఎల్ఏ మీసాల గీతకు చుక్కెదురైంది. ఈ గ్రామంలో 64 మంది అర్హులకు పింఛన్లు రాజకీయంగా తొలగించడంతో జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. పింఛన్లు కొనసాగిస్తామని స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేకుంటే సభను జరగనీయమని గ్రామస్తులు భీష్మించారు. ఈ రసాభాసను చూసిన అధికారులు ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ సీఈఓ మోహనరావుకు ఫోన్లో సమాచారమందించడంతో వారు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు వినిపించుకోకపోవడంతో ఎంఎల్ఏ ఆగ్రహిస్తూ పింఛన్లు పోయిన వారే మాట్లాడాలని లేనివారు నోరెత్తొద్దని అనడంతో ప్రజలంతా మండిపడ్డారు. పండు ముదుసలి, వికలాంగులకు పింఛన్లు రద్దు చేస్తే మాట్లాడొద్దా? అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభ మొత్తం గందరగోళమైంది. తెలుగు దేశం పార్టీకి ఓట్లేయలేదనే కారణంతోనే జెడ్పీటీసీ సభ్యుడు అర్హుల పేర్లు తొలగించారని అధికారులు, ఎమ్మెల్యేను నిలదీశారు. అనంతరం ఎంఎల్ఏ ప్రభుత్వం ప్రగతి గురించి మాట్లాడుతుండగా మా పింఛన్ల సంగతి లేకుండా ఆ సోదంతా మాకెందుకంటూ గుసగుసలాడారు. అలాగే జిల్లాలోని నెల్లిమర్ల, ఎస్‌కోట, చీపురుపల్లి, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జరిగిన పలు గ్రామసభలు ప్రజల నిరసనలు, నిలదీతలతోనే సాగాయి. -
ఏపీ, ఒడిశాలకు అమెరికా 61 లక్షల సాయం
న్యూఢిల్లీ: హుదూద్ తుపానుతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లోని బాధితులకు సహాయం కోసం అమెరికా లక్ష డాలర్ల(రూ.61 లక్షలు) ఆర్థిక సా యాన్ని ప్రకటించింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఎయిడ్) ద్వారా ప్లాన్ ఇండియా ఎన్జీవోకు ఈ నిధులను అందజేయనున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
సాయం కొందరికే..
పంపిణీలో ‘పచ్చ’ముద్ర కొరవడిన నిఘా.. లోపించిన పర్యవేక్షణ రేషను జోలికిపోని మధ్యతరగతి విశాఖపట్నం: హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునే లక్ష్యంతో పంపిణీ చేస్తున్న నిత్యావసరాలు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుకోని రీతిలో అంది వచ్చి న అవకాశాన్ని కొందరు సొమ్ముచేసు కుంటున్నారు. క్షేత్ర స్థాయిలో కొరవడిన నిఘా..పర్యవేక్షణాలోపాలే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. నగరంలో 4 లక్షల 80 వేల కుటుం టబాలున్నాయి. 3లక్షల93వేల తెల్లకార్డులుంటే, లక్షా76వేల గులాబీ కార్డులున్నాయి. మరో లక్ష కుటుంబాలకు ఎలాంటికార్డుల్లేవని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంటే ఆరులక్షల కుటుంబాలున్నట్టు అంచనా. వీరిలో ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలు ఐదు లక్షల మంది వరకు ఉంటే..మధ్య తరగతి ప్రజలు కనీసం ఏడులక్షల మంది వరకు ఉంటారని అంచనా. మిగిలిన 13 లక్షల మంది అల్పాదాయవర్గాలకు చెందిన వారే. మామూలురోజుల్లో క్రమం తప్ప కుండా రేషన్ తీసుకునేది అల్పాదాయవర్గాల వారే. విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూసేది కూడా వీరే. విద్య, వైద్యం కోసం తెల్లకార్డులు తీసుకున్న మధ్యతరగతి ప్రజల్లో కూడా రేషన్ షాపులకెళ్లేది 10 శాతం లోపే ఉంటారు. ఎగువమధ్యతరగతి, సంపన్న వర్గాల వారైతే ఏనాడు రేషన్ షాపుల తలుపుతట్టేదే ఉండదు. హుదూద్ బాధితులకు కార్డులతో ప్రమేయం లేకుండా ప్రతీ కుటుంబానికి ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సిఫార్సు లేఖలతో సరకుల పక్కదారి : ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో టన్నుల కొద్దీ సరకులు పక్కదారి పట్టిస్తున్న తెలుగు తమ్ముళ్లు కొంత మంది డీలర్ల సాయంతో గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరొకపక్క బియ్యం కుటుంబానికి 25కేజీలు పంపిణీ చేయాల్సి ఉండగా..కొన్నిచోట్ల కేజీ నుంచి ఐదు కేజీల వరకు తక్కువగా పంపిణీ జరిగింది. ఇలా టన్నుకు 100 నుంచి 200 కేజీల వరకు పక్కదారి పట్టిస్తున్నట్టు చెబుతున్నారు. గుం టూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐదులక్షల గుడ్లు, 17 టన్నుల ఉల్లిపాయలు నగరానికి తరలించారు. ఈ లారీలన్నీ వచ్చిన రెండు గంటల్లోనే ఎలా మాయమై పోయాయో అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. నెక్ మరో 3లక్షల గుడ్లు బాధితుల కోసం తరలించింది. ఇవి కూడా ఏమైయైపోయాయో తెలియదు. ఇప్పటి వరకు ఇలా పక్కదారి పట్టిన సరుకుల విలువ రూ.20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాయానికి దూరంగా లక్ష కుటుంబాలు ఈ సాయం అందుకునేందుకు క్యూ కడుతున్న వారు ఎక్కువగా అల్పాదాయ వర్గీయులే. మధ్యతరగతిలో చాలామటుకు రేషన్‌షాపుల జోలికి వెళ్లని పరిస్థితి కనిపించింది. ఏడులక్షలకుపైగా ఉన్న మధ్య తరగతి వాసుల్లో సరుకులు తీసుకున్నదీ నాలుగులక్షల్లోపే ఉంటారు. అపార్టుమెంట్లలో నివసించే వారిలో 50 శాతం మందికికూడా సరుకులు తీసుకోలేదు. అంటే 8లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిత్యావసరాలు తీసుకునేందుకు దూరంగా ఉన్నట్టే. ఇలా సాయం అందుకోని కుటుంబాలు రెండు లక్షల వరకు ఉంటాయి. పోనీ అంతకాకున్నా కనీసం లక్ష కుటుంబాలైనా ఈసాయం అందుకోని వారి జాబితాలో ఉంటాయనడంలో సందేహమేలేదు. మంగళవారం వరకు ఐదులక్షల కుటుంబాలకు పైగా సాయం అందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన నిత్యావసరాలు పూర్తిగా పక్కదారి పట్టినట్టే అంచనా వేయొచ్చు. ఈ విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే తీసుకున్న వారే చాలా మంది మరలా మరలా తీసుకున్నారని చెబుతున్నారు. -
తుపాన్ క్లెయిమ్స్ కోసం..
హుదూద్ తుపాన్ వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించడానికి బీమా కంపెనీలు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి. బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ హుదూద్ తుపాన్ బాధితుల కోసం 1800 209 7072 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను బజాజ్ అలయంజ్ ఏర్పాటు చేసింది. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు, క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఐసీఐసీఐ లాంబార్డ్ జరిగిన నష్టం వివరాలకు సంబంధించి తక్కువ కాగితాలను సమర్పించడం ద్వారా క్లెయిమ్‌ను వేగవంతంగా పరిష్కరించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు, సర్వేయర్ అంచనా, కేవైసీ నిబంధనలు ఇస్తే సరిపోతుంది. అలాగే వాహనానికి సంబంధించి ఆర్సీతో పాటు మరమ్మత్తులకు సంబంధించి మెకానిక్ ఇన్వాయిస్ బిల్ ఇస్తే సరిపోతుంది. హెచ్‌డీఎఫ్‌సీలైఫ్ జీవిత బీమా క్లెయిమ్‌లకు సంబంధించి హెచ్డీఎఫ్సీ లైఫ్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల వాళ్లు 9885097340 అనే నెంబర్లో మహేశ్‌ని, విశాఖపట్నంలో 9848283713 అనే నంబర్లో రామ్.కే, ఒరిస్సా బరంపురంలో శ్రీధర్ పాండాని 9853257626 అనే నంబర్లలో సంప్రదించవచ్చు. ఇది కాకుండా 18602679999 అనే టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సేవలు పొందవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కేవలం మూడు డాక్యుమెంట్లతో జీవిత బీమా క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ కోరుతూ రాత పూర్వక సమాచారంతో పాటు నామినీ ఫోటో గుర్తింపు కార్డు, పాలసీదారుని మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. 24 గంటలు సేవలు అందించడానికి 18602667766 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
విశాఖ జిల్లాలో గ్రామస్తుల ఆందోళన
విశాఖపట్నం: జిల్లాలోని కాకానినగర్లో మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హుదూద్ తుపాను కారణంగా విశాఖ జిల్లాలో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం అందకారమైంది. 10 రోజలు గడిచినా విద్యుత్ ఇవ్వటలేదంటూ వారు వాపోతున్నారు. విద్యుత్ లేక తాము చీకట్లో అవస్థలు పడుతుంటే అధికారులు మౌనం వహించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా అక్కడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పచ్చపాతం
తుపాను బాధితులను ఆదుకోవడంలోనూ అధికార పార్టీ నేతలు పక్షపాతం చూపిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు విడుదల చేసిన సాయం పంపిణీలోనూ బు(వ)రద రాజకీయం చేస్తున్నారు. ప్రకృతి విలయానికి విలవిల్లాడిపోతున్న బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలోనూ మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారు. బాధితుల కోసం విడుదల చేసిన సరకులనూ తమకు అనుకూలమైన వారికే పంపిణీ చేస్తూ విమర్శలకు తావిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో హుదూద్ తుపాను ప్రళయం సృష్టిం చింది. దాని ధాటికి తీర ప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లగా.. చాలా వరకు ప్రజలు గూడు కోల్పోయి.. రెక్కలు తెగిన పక్షుల్లా మారారు. జిల్లాలో విజయనగరం డివిజన్లో తుపాను కారణంగా నష్టపోయినవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారికి తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిత్యావసరాలు సరఫరా చేశారు. వాటిని క్షేత్ర స్థాయిలో పంపిణీ చేయటంలో అధికార పార్టీ నాయకులు బు(వ)రద రాజకీయానికి పాల్పడ్డారు. భారీగా వచ్చిన సరకులు తుపాను తక్షణ సాయం కింద జిల్లాకు 2,01,984 ఆహార పొట్లాలు, 10 లక్షల 12 వేల 680 మంచి నీటి ప్యాకెట్లు, 2,01,612 పాల ప్యాకెట్లు, 507.65 టన్నుల బియ్యం, 75.05 కిలో లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో సరకులు జిల్లాకు వచ్చినా పూర్తిస్థాయిలో బాధితులకు అందలేదన్నది ప్రధాన వాదన. వచ్చిన సరకులన్నీ అధికార పార్టీకి చెందిన నేతల చేతుల్లో పెట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వారు తమ వెంట తిరిగిన నాయకులు చే తుల మీదుగా వీటిని పంపిణీ చేయటం తీవ్ర ఆరోపణలకు తావిస్తోంది. వాస్తవానికి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు అందించాల్సి ఉండగా.. మిగిలిన రాజకీయ పార్టీల గుర్తు, మద్దతుతో గెలిచినవారికి ఈ అవకాశం కల్పించలేదు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలే వాటిని పంచిపెట్టారు. ఉదాహరణకు పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పోరాం, కొత్తూరు, కిలుగుపేట, మద్దూరు గ్రామాల్లో ఇప్పటివరకు కనీసం మంచినీటి ప్యాకెట్ కూడా పంపిణీ చేయలేదంటూ ఆ ప్రాంత వాసి రాసుపల్లి ఎర్రమ్మ.. తుపాను బాధిత ప్రాంతాలవారిని పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయింది. వైఎస్ఆర్సీపీ మద్దతుతో గెలిచిన భోగాపురం మండలం రెడ్డికంచేరులోనూ పరిస్థితి ఇదే తరహాలో ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో చంటి పిల్లలకు పాలందక, వృద్ధులకు టీ కూడా కాచి ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ గెలిచిన స్థానాల్లోనూ... విజయనగరం పట్టణంలోని తమ పార్టీకి దక్కని కౌన్సిల్ స్థానాల్లోనూ టీడీపీ నాయకులే తక్షణ సాయాన్ని పంచిపెట్టడం గమనార్హం. అందులోనూ తమకు ఓట్లు వేసినవారికే పంపిణీ చేసి మిగిలిన సరకులను నాయకుల ఇళ్లలో వినియోగించుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు సైతం ఆ పార్టీ నాయకులు, కౌన్సిలర్లపై అసంతృప్తి వ్య క్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాకు మంచి నీటి ప్యాకెట్లతో వచ్చిన కంటైనర్‌ను గాజులరేగ వద్ద నిలిపి అధికార పార్టీ నాయకులు వారి ఇళ్లకు, బంధువుల ఇళ్లకు పంపిణీ చేసుకున్నారన్న పుకార్లు పట్టణంలో షికార్లు చేస్తున్నాయి. దీంతో అనేకమంది బాధితులు ఇప్పటికీ ఇబ్బందుల నడుమే కాలం వెళ్లదీస్తున్నారు. మండిపడుతున్న బాధితులు తుపాను కారణంగా సర్వం కోల్పోయినవారికి తక్షణ సాయం అందించటంలో ప్రజాప్రతినిధులు రాజకీయ చేయగా.. అధికార యంత్రాంగం తమకేమీపట్టనట్టు వ్యవహరించటంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి రాజకీయాలను ముడిపెట్టడమంత దుర్మార్గం మరొకటి లేదని మండిపడుతున్నారు. తుపాను బీభత్సం సృష్టించి 12 రోజులు గడుస్తున్నా సాయం అందకపోవటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడటం సమంజసం కాదని పేర్కొంటున్నారు. -
ఉదారంగా ఆదుకోండి
కేంద్ర మంత్రులు జైట్లీ, రాధామోహన్సింగ్లకు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వినతి న్యూఢిల్లీ: హుదూద్ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. వెయ్యికోట్ల సాయం సరిపోదని, కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి బాధితులకు మరింత సాయం అందించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. రైతులను ఆదుకోవాలని పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. తొలుత ఉదయం 11 గంటల సమయంలో నార్త్‌బ్లాక్‌లో ఆయన అరుణ్‌జైట్లీని కలిశారు. ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల రైతు సంఘాల నేతల ప్రతినిధి బృందంతో కలిసి కృషి భవన్లో వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని, అవసరమైన సాయం అందేలా చూస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. నాలుగు జిల్లాల్లో పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా అందేలా చూడాలని కోరగా వ్యవసాయశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. పొగాకు సాగుపై నియంత్రణ వద్దు పొగాకు సాగులో సమస్యలను రాష్ట్రానికి చెందిన రైతు ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర వ్యవసాయ మంత్రికి వివరించినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ‘పొగాకు సాగు తగ్గించి ప్రత్యామ్నాయంగా శనగ పండించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన లమేరకు ఆ పంట వేసిన ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల శనగ రైతులు గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయారు. ప్రత్యామ్నాయం చూపే వరకు పొగాకు సాగుపై నియంత్రణ విధించవద్దని రైతుల తరఫున మరోమారు విజ్ఞప్తి చేశాం’ అని ఎంపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రాధామోహన్‌సింగ్ హామీ ఇచ్చారన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు నెలకొల్పాలి ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేలా రాష్ట్రంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు స్థాపించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ, పారిశ్రామిక స్టాండింగ్ కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కోరారు. కేసీ త్యాగి అధ్యక్షతన సోమవారం పార్లమెంట్లో నిర్వహించిన పారిశ్రామిక స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.గ్రామీణ యువతలో వృత్తి నైపుణ్యం పెంచాలన్న ప్రధాని న రేంద్రమోదీ ఆలోచన మేరకు నిరుద్యోగులకు ఉపయోగపడేలా వీటిని ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. -
హుదూద్ పోర్టల్ సిద్ధం: పరకాల
విశాఖపట్నం:సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా హుదూద్ తుపానును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. తుపాను నష్టాలను ఆన్లైన్లో పరిశీలించేందుకు హుదూద్ పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. www.hudhud.ap.gov.in వెబ్సైట్ ద్వారా తుపానుకు సంబంధించి ప్రజలు తమ సలహా లు, ఫిర్యాదులతో పాటు జరిగిన నష్టాన్ని ఫొటో తీసి పొందుపర్చవచ్చని, తద్వారా పరిహారాన్ని పొందవచ్చని సూచించారు. నష్టం అంచనాలు వేసే బృందాలకు ప్రభుత్వం ట్యాబ్‌లను అందించినట్లు తెలిపారు. విశాఖలో 300, విజయనగరంలో 100, శ్రీకాకుళానికి 100 ట్యాబ్‌లను ఇచ్చామన్నారు. వీటిలో నష్టం వివరాలను నమోదు చేస్తే పోర్టల్ ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవచ్చన్నారు. సైట్ ద్వారా వివిధ పనుల మరమ్మతు సేవలను కూడా ఉచితంగా పొందవచ్చన్నారు. నిత్యావసరాలను కొంత మంది డీలర్లు ఇవ్వడం లేదన్న వార్తలు వస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. -
నిలిచిన సేవలు..!
శ్రీకాకుళం పాతబస్టాండ్ :విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపు, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, కంప్యూటర్ అడంగల్ జారీ తదితర 180 సేవలకు ఆధారమైన మీ సేవా కేంద్రాలు తొమ్మిది రోజులుగా మూతపడ్డాయి. హుదూద్ తుపాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, ఇప్పుడు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా నెట్వర్క్ వ్యవస్థ పనిచేయక పోవడంతో సేవలు అందని పరిస్థితి. తుపాను ప్రభావంతో ఈ నెల 11 నుంచి విద్యుత్‌ను నిలుపుదల చేశారు. అనంతరం ఆరోజు అర్ధరాత్రి నుంచి వీచిన పెనుగాలులకు జిల్లా అతలాకుతలమైంది. జిల్లా అంతటా విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్లు, కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యూరుు. కొంత ఆలస్యం అయినా జిల్లాలో శని, ఆదివారాల్లో విద్యుత్‌ను అరకొరగా పునరుద్ధరించారు. పట్టణాలు, మండల కేంద్రాలకు కొన్నింటికి విద్యుత్ సరఫరా అవుతోంది. అయినా మీ సేవలు మాత్రం అందుబాటులోకి రాలేదు. జిల్లాలోని మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు ఎక్కువగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌నే వినియోగిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రైవేటు నెట్‌వర్క్‌లపై ఆధార పడుతున్నారు. ప్రధాన నెట్వర్క్ అయిన బీఎస్ఎన్ఎల్ కేబుళ్లు పాడవ్వడం, సిగ్నల్స్ అందకపోవడం సమస్యగా మారింది. ప్రైవేటు నెట్వర్క్లదీ అదే పరిస్థితి. తప్పని ఇక్కట్లు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, పురపాలక, దేవాదాయ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, సర్వే రికార్డులు, ఖజానాశాఖకు సంబంధించిన ధ్రువపత్రాలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు సంబంధించిన సేవలు మీ సేవ ద్వారా ప్రజలకు అందజేస్తోంది. మీ సేవ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఏడాదిన్నరగా పలు కార్యాలయాల నుంచి నేరుగా మాన్యువల్‌గా ధ్రువపత్రాలు అందజేసే విధానాన్ని నిలిపివేశారు. ఇప్పుడు మీ సేవా కేంద్రాలు పనిచేయకపోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రధానంగా కుల,ఆదాయ ధ్రువపత్రాలు, జనన, మరణ ధ్రువపత్రాలు, రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, అడంగల్స్, సబ్‌రిజిస్టర్ కార్యాలయం నుంచి పొందే ఈసీ(అన్కాంబ్రేషన్ సర్టిఫికేట్స్)లు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నకళ్లు, పత్రాలు, భూముల విలువలు వంటి ధ్రువపత్రాలు పొందేందుకు నానా యూతన పడుతున్నారు. మీ సేవా కేంద్రాల చుట్టే ప్రదక్షణలు చేస్తున్నారు. ఆదాయూనికి గండి జిల్లాలో 293 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇతర మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాలు, పెద్దపెద్ద గ్రామాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక మీ సేవా కేంద్రం నుంచి 100 నుంచి 500 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో అరుుతే వంద సేవలు అందజేస్తారు. దీనిని బట్టి రోజుకు సుమారు 30 వేల రకాల సేవలు నిలిచిపోతున్నాయి. సగటున ఈ తొమ్మిది రోజులు సుమారు మూడు లక్షల వరకు మీ సేవలు నిలిచిపోయాయి. మీ సేవ ఆపరేటర్లు కూడా నష్టాల బారిన పడుతున్నారు. ఇప్పటికే అరకొర కమిషన్‌తో నడుపుతున్న మీ సేవలు ఇటువంటి సమస్యలతో మరింత సమస్యల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. సేవలను పునరుద్ధరిస్తాం తుపాను ప్రభావంతో మీ సేవలకు అంతరాయం కలిగిందని, క్రమంగా సేవలు పునరుద్ధరిస్తామని ఈడీఎం ఇంద్రసేనారావు తెలిపారు. విద్యుత్, నెట్‌వర్క్‌ల అంతరాయాలు రెండు మూడురోజుల్లో పరిష్కారమవుతాయని చెప్పారు. అంతవరకు వినియోగదారులకు ఇబ్బందులు తప్పవన్నారు. -
హుదూద్ దెబ్బకు పరిశ్రమలు కుదేలు !
పీఎన్‌కాలనీ: హుదూద్ తుపాను జిల్లాలోని పారిశ్రామిక రంగాన్ని సైతం కుదేలు చేసింది. ఆ రంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. గుండు సూది మొదలుకొని బడాకంపెనీలు సైతం నష్టాల అంచనా వేసే పనిలో పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో రూ. 86 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చాయి. శనివారం ఈ మేరకు శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో వివిధ పరిశ్రమల ఉన్నతస్థాయి సిబ్బందితో నష్టాల అంచనాపై జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి.గోపాలరావు నే తృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటితంగా తుపాను నష్ట భారాన్ని అధిగమించేందుకు కలసి రావాలన్నారు. ఈ నష్టాలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడంతో పాటు జిల్లాలో అన్ని పరిశ్రమలకు సంబంధించి సహాయసహాకారాలు పొందేందుకు నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. అంతకుముందు పలు కంపెనీల ప్రతినిధులు తాము చవిచూసిన నష్టాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పలు కంపెనీల్లో నష్టాలు ఇలా.... జిల్లాలో పలు పరిశ్రమలకు సుమారు రూ. 86 కోట్లు నష్టాలు వచ్చినట్టు ఆయూన సంస్థల ప్రతినిధులు సమావేశంలో వివరించారు. వేలాదిమందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమలపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో కోట్లాది రూపాయలు నష్టపోయూమని వాపోయూరు. ఇప్పటికే విద్యుత్ లేమితో పరిశ్రమలు మూతపడ్డాయని, కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తుపాను కారణంగా ట్రైమేక్స్ రూ. 25 కోట్లు, శాంపిస్టన్ రూ. 15.30 కోట్లు, సుప్రాన్ కాయిర్స్ రూ. 3 కోట్లు నష్టపోరుునట్టు ఆయూ సంస్థల ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ అసిస్టెం ట్ డెరైక్టర్ ఎస్.ప్రసాదరావు, ఐపీవో డి.రవికుమార్ పాల్గొన్నారు. వైభవంగా ఆదిత్యుని క్షీరాభిషేకం అరసవల్లి: అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామికి వైభవంగా క్షీరాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు స్వామివారి ఆభరణాలు తొలగించి, అనంతరం భక్తులను అభిషేక సేవకు అనుమతించారు. సుగంధద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. పాల్గొన్న భక్తులకు స్వామివారి ఆశీర్వచనం, ప్రత్యేక కోవా ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. తులా సంక్రమణం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. -
పండుటాకుల పడిగాపులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుదూద్ తుపా ను బీభత్సం సృష్టించింది. వ్యవస్థలు కుప్పుకూలిపోయాయి. ఉపాధి రంగాలన్నీ దాదాపు మూ సుకుపోయాయి. కార్మికులకు ఉపాధిలేక, కూలీ లకు పనులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్ల గడవడం కష్టంగా తయారైంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒకరిపై ఆధారపడి బతికే వారందరికీ కాసింత భరోసా ఇచ్చే పింఛను కాస్త ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జన్మభూమితో లింకు పెట్టి నిలిపేసింది. ఉపాధి లేక ఇంటి పెద్ద దిక్కు, పింఛను రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నరకయాతన అనుభవిస్తున్నారు. పూటగడవక, కనీసం మం దులు కొనుక్కునేందుకు సొమ్ములేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఈ వయసులో తమకెందుకీ ఇబ్బందులని గగ్గోలు పెడుతున్నారు. కొన్నాళ్లు పింఛన్ల సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది. మరికొన్ని రోజులుజన్మభూమిలో పంపిణీ చేద్దామని మెలిక పెట్టింది. ఇంతలోనే అనర్హుల పేరుతో 35 వేల మంది పింఛన్లు తీసేసింది. మరో 26,500మందికి సంబంధించి ఆధార్ సీడింగ్ జరగలేదని గాలిలో ఉంచింది. దీంతో 2 లక్షల 17 వేల 500మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. జన్మభూమిలో పంపిణీ చేస్తామని ఆర్భాటం చేసింది. మొత్తానికి ఈ నెల 11వ తేదీ వరకు 64 వేల మందికి జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఇంతలో హుదూద్ తుపాను ముంచెత్తి జిల్లాను కకావికలం చేసింది. జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మిగతా 1,47,500 మందికి నేటికీ పింఛన్లు అందలేదు. ఇప్పుడు వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జన్మభూమిలో నేతల చేతుల మీదుగా ఇచ్చి మెప్పు పొందాలని ప్రయత్నించి, చివరికీ తమను అవస్థలకు గురిచేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎప్పుడూ పంపిణీ చేసినట్టు ఐదు తేదీలోగా ఇచ్చేసి ఉంటే తుపాను కష్టకాలంలో కాసింత ఉపశమనం కలిగేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి నిర్వహించేదెప్పుడు, తమకు పింఛను ఇచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులన్నీ సద్దుమణిగితే తప్ప తమకు పింఛను వచ్చేటట్టు లేదని ఆందోళన చెందుతున్నారు. జాబితా నుంచి తొలగింపునకు గురైన పింఛనుదారులు, ఆధార్ సీడింగ్ లేదని గాలిలో పెట్టిన లబ్ధిదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కక్షతో అన్యాయంగా తీసేసిన తాము అభ్యంతరాలు పెట్టుకున్నా ఇంతవరకు అతీగతి లేదని, వాటిని పరిశీలించి పరిష్కరించేదెప్పుడు? తమకు న్యాయం జరిగేదెప్పుడని ఆవేదన చెందుతున్నారు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారి పరిస్థితీ అంతే. ఇప్పుడు ఆధార్ కేంద్రాలు తెరిచే అవకాశం లేదని, తమకు సీడింగ్ అయ్యేదెప్పుడని, అంతా పూర్తయి పింఛను వచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం నిర్వాకంతో తమ ఇబ్బందులొచ్చాయని వారు మండిపడుతున్నారు. -
బ్యాంకింగ్ రంగానికి విఘాతం
సాక్షి, విశాఖపట్నం : హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్రలో బ్యాంకింగ్ రంగం కుదేలైంది. కొన్ని చోట్ల చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలుబ్యాంకులు, ఏటీఎంలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కోర్ బ్యాంకిం గ్ వ్యవస్థ పనిచేయకపోఉడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏటీఎంలపై ఉండే యాంటినాలు పెనుగాలులకు కొట్టుకుపోవడంతో 85శాతానికి పైగా ఏటీఎంలు మూడురోజుల పాటు పనిచేయలేదు. విద్యుత్ సరఫరా లేక బ్యాంకులు సైతం మూతపడడంతో లావాదేవీలు స్తంభించిపోయాయి. సోమ,మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో రూ.1200కోట్ల మేర లావాదేవీలకు బ్రేకులుపడ్డాయి. ఉత్తరాంధ్రలో 62 సహకార, జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులకు సంబంధించి 1200 శాఖల వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా విశాఖలో 250 శాఖలుండగా, జిల్లా పరిధిలోనే 750కు పైగా శాఖలున్నాయి. ఉత్తరాంధ్ర పరిధిలోని మూడు జిల్లాల్లో అన్ని బ్యాంకులద్వారా క్లియరింగ్ చెక్స్, ఇంటర్ బ్యాంక్ పేమెంట్స్, రెమిడెన్స్ వంటి సేవల ద్వారా ప్రతీరోజు రూ.500 నుంచి రూ.600 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంటుంది. తుఫాన్దెబ్బకు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలకమైన యాంటినాలు ఎగిరిపోవడంతో సోమ,మంగళవారాల్లో బ్యాంకులు, ఏటీఎంలు పూర్తిగా మూత పడ్డాయి. బుధవారం జనరేటర్ల సాయంతో ప్రధాన బ్యాంకులు తెరిచిన ప్పటికీ సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయిలో లావాదేవిలు ప్రారంభం కాలేదు. మరొకపక్క సాధ్యమైంతత్వరగా ఏటీఎంలను పనిచే సేలా చూడాలని అవుట్సోర్సింగ్ సంస్థలయిన టాటా, ప్రిజమ్స్, బింక్స్ ఆరియా, సీఎంఎస్ సంస్థలకు ఆయా బ్యాం కులు ఉన్నతాధికారులు ఆదేశించ డంతో యుద్ద ప్రాతిపదికన పునర్ని ర్మాణ చర్యలు చేపట్టారు. బుధవారం ఏటీఎంలు పాక్షికంగా పనిచేసినప్పటికీ కోర్‌బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడంతో చాలా చోట్ల ఏటీఎంల వద్ద నాట్ వర్కింగ్ బోర్డులే దర్శనమిచ్చాయి. విద్యుత్ లేమి సమస్య ఉన్నప్పటికీ జనరేటర్లసాయంతో గురువారం నుంచి పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు మొదలయ్యాయి. 80శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి. కోర్ బ్యాంకింగ్ సమస్య వల్ల సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. హుదూద్ దెబ్బకు ఈమూడు జిల్లాల్లో ఆస్తుల ధ్వంసం వల్ల బ్యాంకింగ్ రంగానికి రూ.5కోట్ల వరకు నష్టంవాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కాఫీ పంటకు ఎకరాకు రూ.లక్ష చెల్లించాలి
పాడేరు: హుదూద్ తుఫాన్ కారణంగా ఏజెన్సీలో జరిగిన నష్టంపై సమ గ్ర సర్వే జరిపి బాధిత గిరిజన కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలని సీఎం చంద్రబాబునాయుడును పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. ఏజెన్సీలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజనుల ప్రధాన జీవనాధారమైన కాఫీ, మిరియాల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నందున ఎకరాకు కనీసం రూ.లక్ష పరిహారంగా చెల్లిం చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాఫీ కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. వరి, ఇతర వాణిజ్య పంటలకు కూడా నష్టపరిహారం పెద్దమొత్తంలో చెల్లించాలన్నారు. ఇళ్లు కూలిన బాధిత గిరిజనులకు పక్కా గృహాలు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలోని పలు సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళుతూ ఐటీడీఏ సేవలు విస్తృతం చేయాలని, ఉన్నత విద్యా సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని, అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యార్థులకు సినిమాలు చూపించండి ఏజెన్సీలోని గిరిజన విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు రావాలం టే పాడేరులో ఓ థియేటర్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చి సినిమాలు చూపించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే నెలలో కనీసం మూడు రోజులు విశాఖ నగరంలో తిప్పాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థులను పలు కుశలు ప్రశ్నలు వేశారు. సినిమాలు చూస్తారా, విశాఖ వెళ్తుంటారా వంటి ప్రశ్నలకు వారు సరియైన సమాధానం చెప్పక పోవడంతో సినిమాలు చూపించాలని ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్‌ను ఆదేశించారు. పాడేరులో అధునాతన సదుపాయాలతో ఓ థియేటర్ నిర్మించాలని సూచించారు. ల్యాప్‌టాప్, ఐపాడ్, కంప్యూటర్ వినియోగంపై సమాధానాలు చెప్పక పోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులందరితోను మాట్లాడి వారి ఆశయాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు ఆర్థికంగా ఆసరా ఇచ్చే కాఫీ సాగు చేపట్టేలా ఒత్తిడి చేయాలని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు ఏజెన్సీలోని విద్యా కార్యక్రమాలపై గిరిజన సంక్షేమ క మిషనర్, ఐటీడీఏ పీఓ, గిరిజన సంక్షేమ డీడీలతో ముఖ్యమంత్రి సమీక్షించారు. సీఎం వెంట పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, గిరిజన సంక్షేమ కమిషనర్ ఉదయలక్ష్మి, ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, గిరిజన సంక్షేమ డీడీ మల్లికార్జునరెడ్డి ఉన్నారు. -
35కు చేరిన హుదూద్ తుపాను మృతులు!
విశాఖపట్నం: హుదూద్ పెను తుపాను వల్ల చనిపోయినవారు 35కు చేరారు. విశాఖపట్నం జిల్లాలో 25 మంది, విజయనగరం జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఈ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలో భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. వందల కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. లక్షల ఎకరాలలో పంటలకు నష్టం జరిగింది. ** -
విశాఖ ఉక్కుకు రూ.5వేల కోట్ల నష్టం!
హుదూద్ తుపాను ప్రభావంపై అధికారుల ప్రాథమిక అంచనా.. స్తంభించిన విద్యుత్తు ఉత్పత్తితో నిలిచిన ప్లాంట్ నిర్వహణ కృష్ణా ఫర్నేస్‌కు తీవ్ర నష్టం! కోక్ ఓవెన్ పరిస్థితిపైనా ఆందోళన ఉక్కునగరం, విశాఖపట్నం: చరిత్రలోనే తొలిసారిగా భారీ తుపాను విధ్వంసానికి గురైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అపారనష్టం వాటిల్లింది. హుదూద్ పెను తుపాను స్టీల్‌ప్లాంట్ ప్రస్తుత నిర్వహణనే కాకుండా భవిష్యత్తు విస్తరణ పనులపైనా ప్రతికూల ప్రభావం చూపించింది. చరిత్ర లో తొలిసారి 12 విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్ అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యు త్తు ప్లాంట్ షట్‌డౌన్ అయ్యింది. ప్రాథమిక అంచనా ప్రకారం హుదూద్ తుపాను వల్ల స్టీల్‌ప్లాంట్‌కు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. స్టీల్‌ప్లాంట్ నిర్వహణకు ఆయువుపట్టు వంటి విద్యుత్తు ప్లాంట్ షట్‌డౌన్ కావడం ప్లాంట్‌కు అశనిపాతంగా మారింది. దాంతో ప్లాంట్‌లో ఉత్పత్తి పునఃప్రారంభించాలంటే విద్యుత్తు అవసరాల కోసం పూర్తిగా ట్రాన్స్కోపై ఆధారపడాల్సిన అనివార్యత ఏర్పడింది. స్టీల్‌ప్లాంట్ విస్తరణ ప్రణాళికపైనా హుదూద్ తుపాను ప్రతికూల ప్రభావం చూపింది. ప్లాంట్‌లోని కృష్ణా బ్లాస్ట్ ఫర్నీస్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ప్లాంట్ యాజమాన్యం గోప్యత పాటిస్తోంది. ఆ ఫర్నేస్ ఆధునీకరణ పనులను జనవరిలో ప్రారంభించాలని భావిం చారు. కానీ ప్రస్తుతం తుపాను ప్రభావంతో ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో జనవరి విస్తరణ పనుల కోసం ఫర్నేస్‌ను ఇప్పటి నుంచే షట్‌డౌన్ చేయాల్సి వస్తుందని ఉక్కువర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా కోక్ ఒవెన్‌కు చెందిన నాలుగు బ్యాటరీలు ఏ స్థితిలో ఉన్నాయన్న దానిపై ఉక్కువర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరిగితేగానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాంతో ట్రాన్స్‌కో నుంచి విద్యుత్తు సరఫరా కోసం ప్లాంట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. స్టీల్ మెల్ట్ షాపు ఐదులో మెటల్ ఉండిపోవడంతో పునరుద్ధరణ క్లిష్టం కానున్నాయి. ఇవి కాకుండా అన్ని విశాఖకు చెందిన రూఫ్‌షీట్లు గాలికి కొట్టుకుపోవడంతో వాటి నిర్మాణానికి కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం ట్రాన్స్‌కో నుంచి విద్యుత్తు సరఫరా అత్యంత కీలకంగా మారింది. ట్రాన్స్ కోనుంచి విద్యుత్తు సరఫరా మొదలైన 8 గంటల తరువాతే ప్లాంట్‌లో విద్యుత్తు సరఫరా ప్రారంభమవుతుంది. కానీ ఇంతవరకు ట్రాన్స్‌కో నుంచి ఆశించినరీతిలో సానుకూల స్పందన లభించలేదు. దాంతో స్లీట్‌ప్లాంట్ అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి ఒకసారి తీసుకువెళ్లామని... మరోసారి ఈ విషయంపై ఆయనతో చర్చిస్తామని ప్లాంట్ అధికారులు చెబుతున్నారు. -
శాంతి.. అశాంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్, సంతకవిటి, పాలకొండ:శ్రీకాకుళం వద్ద శాంతించిన నాగావళి.. సంతకవిటి, పాలకొండ తదితర మండలాల్లో మాత్రం ఇప్పటికీ ఉగ్రరూపంతోనే విరుచుకుపడుతోంది. వరద ఉద్ధృతికి కాలువలకు గండ్లు పడటంతో సుమారు 16 గ్రామాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోమవారం ఉదయం నుంచి వరదతో పోటెత్తిన నాగావళి శ్రీకాకుళం, పట్టణంతోపాటు 11 మండలాల్లోని 107 తీరగ్రామాలను వణికించింది. సోమవారం రాత్రి శ్రీకాకుళం పాతబ్రిడ్జి వద్ద సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల స్థాయిలో ఉన్న వరద ప్రవాహం.. ఒకదశలో 2 లక్షల క్యూసెక్కులకు పెరగవచ్చని.. శ్రీకాకుళం పట్టణానికి వరద ముప్పు ఉండవచ్చని అధికారులు సైతం ఆందోళన చెందిన పట్టణంలో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మంగళవారం ఉదయం నుంచి ప్రవాహం కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పాతబ్రిడ్జి వద్ద 1,32,400 క్యూసెక్కుల నీరు ఉంది. వరద ముప్పు తప్పడంతో పట్టణంతోపాటు పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎత్తివేశారు. అయితే నాగావ ళి వరద కారణంగా ఇప్పటికే శ్రీకాకుళం, పొందూరు, సంతకవిటి, పాలకొండ, ఆమదాలవలస, బూర్జ మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సుమారు 13 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నారాయణపురం వద్ద ఉద్ధృతంగానే.. అయితే నారాయణపురం ఆనకట్ట పరిసర మండలాల్లో వరద ఇంకా ఉద్ధృతంగానే ఉంది. దీనివల్ల సంతకవిటి మండలంలో నారాయణపురం కాలువకు వాసుదేవపట్నం, కేఆర్‌పురం గ్రామాల వద్ద గండ్లు పడటంతో సుమారు 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సోమవారం రాత్రి వాసుదేవపట్నం వద్ద కాలువకు గండి పడటంతో గోళ్ళవలస, చిన్నయ్యపేట, మందరాడ, కాకరాపల్లి, మేడమర్తి, హొంజరాం, బూరాడపేట తదితర గ్రామాలు జలమయమయ్యాయి. మొత్తం ఐదువేల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. మరోవైపు కేఆర్‌పురం వద్ద గండి పడటంతో జావాం, కొత్తూరు, రామచంద్రపురం, రంగారాయపురం, పోతులుజగ్గుపేట, తమరాం, బూరాడపేట, తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాలకొండ మండలంలో అన్నవరం, అంపిలి గ్రామాలు వరద నీటితో సోమవారం రాత్రి జలమయమయ్యాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరదనీరు ఇళ్లలోకి చేరడంతో డాబాలపైకి చేరుకొని కాలం గడిపారు. -
మరో 48 గంటలు చీకట్లే!
ఉత్తరాంధ్రలో కుప్పకూలిన విద్యుత్ సరఫరా వ్యవస్థ కూలిన టవర్లు.. విరిగిన స్తంభాలు.. తెగిన తీగలు రోడ్లపై చెట్లతో గ్రామాలకు సామాగ్రి సరఫరాలో సమస్యలు విశాఖ నగరానికి మాత్రం పాక్షిక విద్యుత్ నేడు పరిస్థితి మెరుగుపడే అవకాశం హైదరాబాద్: ఉత్తరాంధ్రలో మరో 48 గంటలు చీకట్లు తప్పవని అధికారులు అంటున్నారు. హుదూద్ తుపాన్‌తో విద్యుత్ వ్యవస్థ కకావికలమైందని తెలిపారు. 60 ఏళ్ళుగా సమకూర్చిన అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ‘దీని నుంచి కోలుకోవడానికి ఎన్ని గంటలు కాదు... ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేం’ అని ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ ‘సాక్షి’తో అన్నారు. తాజా పరిస్థితుల్లో దశలవారీగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అతి కష్టం మీద మంగళవారం విశాఖ నగరానికి పాక్షికంగా విద్యుత్ ఇవ్వగలిగారు. గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌ను కొంతవరకు పునరుద్ధరించారు. దీనిద్వారా పరిసర ప్రాంతాలకు అతి తక్కువ విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. దీనికీ క్షణానికో సాంకేతిక అవాంతరం ఎదురవుతోంది. బుధవారం పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక విజయగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్ సరఫరాపై అధికారులు ఇతమిద్దంగా హామీ ఇవ్వలేకపోతున్నారు. పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు కుప్పకూలాయి. స్తంభాలు విరిగిపోయాయి. తీగలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల్లో రెండురోజుల వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమని, జిల్లా కేంద్రాలకు మాత్రం సరఫరా సాధ్యం కావచ్చునని అంటున్నారు. సింహాద్రి గాడిలో పడాల్సిందే.. విశాఖను గాడిలో పెట్టేందుకు సోమవారం నుంచే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఈ ప్రయత్నాలు ఫలించలేదు. మాంచ్‌ఖండ్ నుంచి లైన్ క్లియర్ కాలేదు. అన్నీ బ్రేక్ డౌన్లే ఉన్నాయి. వేమగిరి ప్లాంట్ అనుసంధానం కుదరలేదు. మార్గంలో అనేక టవర్లు కూలిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం లేకుండాపోయింది. విశాఖలో ప్రధాన ఆసుపత్రి కింగ్జార్జ్కు అతి కష్టం మీద కొన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారు. వేమగిరి ప్లాంట్ నుంచి గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌కు లింక్ చేసినా, ఇది విశాఖ అవసరాలు తీర్చే స్థాయిలో లేదు. జాతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు చెందిన సింహాద్రి యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. విపరీతమైన గాలికి ఊహించని విధంగా సింహాద్రి యూనిట్లలో నష్టం జరిగింది. యూనిట్ల రక్షణకు అమర్చిన రేకులు, గ్లాసులు పగిలిపోయాయి. దీంతో టర్బైన్లలోకి నీళ్లు వచ్చాయి. యథాతథ స్థితికి మరో 5 రోజులైనా పడుతుందని అధికారులు తెలిపారు. అప్పర్ సీలేరులోనూ ఇదే పరిస్థితి. మంగళవారం రాత్రి వరకు ఒక్క యూనిట్ ఉత్పత్తి జరలేదు. ముమ్మరంగా మరమ్మతులు: అజయ్ జైన్ విశాఖ నగరంలో బుధవారం విద్యుత్ సరఫరా మెరుగయ్యే అవకాశం ఉందని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే గాజువాక 220 కేవీని పునరుద్ధరించామని, మిగతా సబ్ స్టేషన్లను బాగు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా, మంగళవారం రాత్రి విశాఖ శివార్లలో విద్యుత్‌ను పునరుద్దరించారు. కొత్త గాజువాక/గోపాలపట్నం సబ్ స్టేషన్ల నుంచి పద్మనాభపురం, నరవ, మింది గ్రామాల్లో వున్న జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి విద్యుత్ సరఫరా చేశారు. -
ఆ‘పాత’ కష్టాలు!
దీపం బుడ్డీల గుడ్డి వెలుగులో పనులు..ఇళ్లలో రుబ్బురోళ్ల చప్పుళ్లు..బావులు, బోర్ల వద్ద నీటి కోసం మహిళల పాట్లు.. రేడియోలతో కాలక్షేపం..సైకిళ్లపై ప్రయాణాలు.. ఎప్పుడో నాలుగైదు దశాబ్దాల నాటి కబర్లు చెబుతున్నారేటీ!.. అని విస్తపోకండి..ఇవన్నీ ఇప్పుడు కళ్లెదురుగానే కనిపిస్తున్నాయి మరి.. జనం అవస్థలను కళ్లకు కడుతున్నాయి. పాతకాలంలోకి వెళ్లిపోయామన్న భావన కలిగిస్తున్నాయి.ఈ ఆధునిక కాలంలో ఎందుకీ దుస్థితి ఏర్పడిదంటే?..హుదూద్ తుపాను సృష్టించిన విధ్వంసం.. తత్ఫలితంగా తలెత్తిన కరెంటు కష్టాలు.. జనాన్ని మళ్లీ పాత కాలంలోకి తీసుకెళ్లాయి.ఫ్యాన్లు, ఏసీలు, మిక్సీలు, గ్రైండర్లు, బైకులతో కూడిన ఆధునిక జీవన సరళికి అలవాటు పడిన ప్రజలు గత మూడు నాలుగు రోజులుగా రెక్కలు ముక్కలు చేసుకొని నరకయాతన అనుభవిస్తున్నారు. శ్రీకాకుళం సిటీ:హుదూద్ తుపాను ఎంత ప్రచండ వేగంతో విరుచుకుపడిందో.. అంతే వేగంతో వెళ్లిపోయింది. కానీ అది సృష్టించిన పెను విధ్వంసం.. తీవ్ర కష్టాలు ప్రజలను ఇప్పట్లో వీడేలా లేవు. ముఖ్యంగా ప్రచండ వేగంతో వీచిన గాలుల దాటికి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడం.. శనివారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత కాలంలో ప్రతి దానికీ విద్యుత్ అవసరం కావడం.. ప్రస్తుతం అదే లేకపోవడంతో వేరే మార్గాంతరం లేక ప్రజలు పాతకాలం పద్ధతులను గుర్తుకు తెచ్చుకొని మరీ ఆచరిస్తున్నారు. పెట్రోల్, గ్యాస్ కొరత సైకిళ్లు, కట్టెపొయ్యిలను తెరపైకి తెస్తే.. కరెంటు సమస్య విసనకర్రలు, రుబ్బురోళ్లు, బావు లు, బోర్లకు పని కల్పించింది. ఇక ఎల్ఈడీ వెలుగులకు అలవాటు పడిన ప్రజలు ఇప్పుడు మూలన పడిన దీపపు బుడ్డీల మసి తుడిచారు. కొందరు కొవ్వొత్తులను వినియోగిస్తున్నారు. ఇక ఫ్యాన్లు, ఏసీల స్థానంలో విసనకర్రలు ప్రజల చేతిలో కనిపిస్తున్నాయి. అంతా పాత పద్ధతుల్లోనే ఈనెల 11, 12 తేదీల్లో విరుచుకుపడిన పెను తుపాను కారణంగా జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు వేల సంఖ్యలో కూలిపోయి, విద్యుత్ వైర్లు తె గిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు, సెల్ టవర్లు కూడా నాశనమయ్యాయి. ఫలితంగా ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి సుమారు 78 గంటలుగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్లు కూడా చాలావరకు స్తంభించిపోయాయి. మరో రెండు రోజులకు గానీ ఇవి పునరుద్ధరణకు నోచుకునే పరిస్థితి లేదు. దీంతో జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనజీవనమంతా గత కాలాన్ని గుర్తుకు తెస్తోంది. విద్యుత్ సరఫరా సౌకర్యం లేని రోజుల్ని తలపిస్తోంది. ఇంట్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో టీవీలు, కంప్యూటర్లు మూగబోయాయి. విద్యుత్ ఉపకరణాలు తాత్కాలికంగా మూలన పడ్డాయి. వాటి స్థానంలో రుబ్బురోళ్లు, తిరగళ్లు తెరపైకి వచ్చాయి. కాసింత గాలి కోసం విసనకర్రలతో కుస్తీ పడుతున్నారు. మోటార్లతో ట్యాంకులు నింపుకొని నిరంతర నీటి సౌకర్యానికి అలవాటు పడిన ప్రజలు ఇప్పుడు వీధి మలుపుల్లో ఉన్న బోర్లు, బావులను ఆశ్రయిస్తున్నారు. ఇక సమాచారం కోసం బ్యాటరీ రేడియోల దుమ్ము దులిపారు. ఇంతవరకు క్రెడిట్, డెబిట్ కార్డులతో నిమిషాల్లో నగదు లావాదేవీలు చక్కబెట్టినవారు.. ఇప్పుడు పాస్‌పుస్తకాలు పట్టుకొని బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. అయితే జనరేటర్ సౌకర్యం ఉన్న కొన్ని బ్యాంకుల్లోనే లావాదేవీలు జరుగుతుండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. అన్ని ప్రాంతాలు.. వర్గాలదీ ఒకటే కష్టం పేద- ధనిక, పట్టణం- గ్రామం అన్న తేడాల్లేకండా అన్ని వర్గాలు సమానంగా ఈ కష్టాలను అనుభవిస్తున్నారు. అన్ని స్థాయి వర్గాలవారికీ విద్యుత్ షాకిచ్చింది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న కొంతమంది మాత్రం జనరేటర్లు వంటి వాటితో ఈ కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. అపార్ట్మెంటు జీవనానికి అలవాటుపడిన ఎగువ మధ్య తరగతి ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఇన్వెర్టర్లు వినియోగిస్తున్న చోట్ల కూడా బ్యాటరీలు డౌన్ కావడంతో మరో మార్గం లేక పాత పద్ధతులు అనుసరిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే.. ఇంకో రెండుమూడు రోజులు ఈ అవస్థలు తప్పవేమో! -
తుపాను బాధితులకు చేయూత
ఒంగోలు టౌన్ : హుదూద్ తుపాను కారణంగా పూర్తిగా దెబ్బతిన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రకాశం జిల్లా నుంచి 100 టన్నుల కూరగాయలు పంపుతున్నట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. కందుకూరు నుంచి రెండు, ఒంగోలు నుంచి మూడు, మార్టూరు నుంచి ఐదు లోడ్ల కూరగాయలు పంపించేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. మరో 150 టన్నులు పంపించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కూరగాయలు పండించే రైతులు ఎక్కువ మంది ఉన్నారని, ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కూరగాయలు పండించే రైతులు మూడు జిల్లాల్లో తుపాను బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడివారిని ఆదుకునేందుకు మానవతా దృ క్పథంతో ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ‘నో లాస్.. నో ప్రాఫిట్’ కింద రైతులు తాము పండించిన కూరగాయలను ఒంగోలు, మార్టూరు, కందుకూరు మార్కెట్ యార్డులకు తీసుకురావాలన్నారు. లాభం కోసం ఆశించకుండా తుపాను బాధితులను ఆదుకోవాలన్నారు. తుపాను తాకిడికి దెబ్బతిన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వం సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నప్పటికీ, కొన్ని కుటుంబాలు అక్కడకు వెళ్లలేని పరిస్థితులున్నాయని, అలాంటి వారిని కూడా ఆదుకునేందుకు ఇక్కడ నుంచి కూరగాయలు పంపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. జిల్లా నుంచి వెళ్లిన అధికారులు, సిబ్బంది బృందాలు... హుదూద్ తుపానుకు దెబ్బతిన్న విజయనగరం జిల్లాలో సహాయక చర్యలతోపాటు నష్టం అంచనా వేసేందుకు జిల్లా నుంచి అధికారులు, సిబ్బంది బృందాలు వెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు. 450 మందితో కూడిన 50 బృందాలు మంగళవారం ఉదయానికి విజయనగరం జిల్లా చేరుకున్నాయని, బుధ, గురువారాలు అక్కడే ఉంటాయని, అవసరమైతే శుక్రవారం కూడా ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతి బస్సులో నిత్యావసర వస్తువులతో పాటు కుక్, అసిస్టెంట్ కుక్‌లను కూడా పంపించామన్నారు. ఆ 42 వేల మంది పింఛన్లు రద్దు కాలేదు... జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు సంబంధించి 79 వేల పింఛన్లు పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వాటిలో 37 వేల మందిని అనర్హులుగా గుర్తించామని, మిగిలిన 42 వేలమంది పింఛన్లు రద్దు కాలేదని స్పష్టం చేశారు. వారిని విచారించిన తరువాత అర్హులని తేలితే పింఛన్‌దారుల జాబితాలో చేరుస్తామన్నారు. గ్రామస్థాయిలో పింఛన్లు పొందుతున్నవారి పేర్లు జాబితాలో లేకుంటే సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి విన్నవించుకోవాలని సూచించారు. మండల స్థాయిలో పింఛన్లకు సంబంధించి సమస్యలు తలెత్తితే జిల్లాస్థాయి కమిటీ వాటిని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్, సీపీఓ పీబీకే మూర్తి, డీఆర్డీఏ పీడీ పద్మజ, డ్వామా పీడీ పోలప్ప, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మూర్తి, డీఎంహెచ్ఓ చంద్రయ్య పాల్గొన్నారు. -
ఐఏఎస్‌లు, మంత్రుల హంగామా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తుపాను సహాయ పనుల పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వం జిల్లాకు పంపిన సీనియర్ ఐఏఎస్ అధికారుల వల్ల అనవసర హడావుడితోపాటు పనులకు అంతరాయం కలుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయ, పునరావాస పనుల పర్యవేక్షణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాకు 11 మంది ఐఏఎస్, ఇతర సీనియర్ అధికారులు వచ్చారు. దీంతో జిల్లాకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది వీరికి సహాయ పడటం, ప్రొటోకాల్ విధుల పేరుతో వీరి వెంట పర్యటిస్తున్నారు. ఒక్కో ఐఏఎస్ ఆధికారి వద్ద లైజనింగ్ అధికారిగా ఒక జిల్లా స్థాయి ఆధికారి వ్యవహరిస్తుండగా మరో ఇద్దరు కింది స్థాయి సిబ్బంది వారి సేవల్లోనే ఉంటున్నారు. ఇలా 11 మంది అధికారుల వెంట 33 మంది వరకు వివిధ శాఖల సిబ్బంది ఉండాల్సి వస్తోంది. దీనికితోడు ఈ అధికారులు బస చేసిన హోటళ్లు, వసతిగృహాల వద్ద మరికొంతమంది రెవెన్యూ ఆధికారులు ప్రొటోకాల్ విధులు నిర్వహిస్తున్నారు, వీరంతా ఈ సమయంలో తుపాను సహాయ, పునరావస పనుల్లో నిమగ్నం కావల్సినవారే.. తమతమ కార్యాలయాల్లో కీలక బాధ్యతలు నిర్విహ స్తున్నవారే,, అటువంటి వారిని సీనియర్ అధికారుల వెంట పంపడంతో ఆయా మండలాల్లో తుపాను పనులపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. కాగా అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన ఈ కీలక సమయంలో ఉన్నతాధికారుల తనిఖీలు, తరచూ జరిగే సెట్ కాన్ఫరెన్సులు, సమీక్ష సమావేశాల వల్ల దిగువస్థాయి యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది చాలదన్నట్లు ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ విప్ పర్యటనలు, సమీక్షలు జరుపుతుండటంతో వీటితోనే సమయం సరిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
పూసపాటిరేగ : తుపాను బాధితులకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని తిప్పలవలస, చింతపల్లి గ్రామాల్లో పర్యటించారు. తిప్పలవలసలో కోట్లాది రూపాయల విలువైన బోట్లు, వలలు గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బాధితులకు ప్రభుత్వపరంగా సహకారం అందేలా చూస్తామన్నారు. సముద్రానికి దూరంలో ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మత్స్యకార నాయకుడు వాసుపల్లి కన్నయ్య తాత విన్నవించారు. ఎన్నడూ లేనివిధంగా ఈసారి తీవ్ర నష్టాన్ని చూశామని పలువురు ఆయన వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేవీ సూర్యనారాయణ రాజు, విజయనగరం ఏఎంసీ చైర్మన్ అంబల్ల శ్రీరాములనాయుడు, మండల నాయకులు పతివాడ అప్పలనాయుడు, డీసీసీబీ డెరైక్టర్ బర్రి చిన్నప్పన్న, మహంతి లక్ష్మణరావు, మలుకుర్తి శ్రీనివాసరావు, సీహెచ్ సత్యనారాయణరాజు, అప్పడు దొర, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి చీపురుపల్లి : హుదూద్ తుపానుకు రైతులు తీవ్రంగా నష్టపోయూరని, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా గుర్తిం చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగ ళవారం ఆయన మండలంలోని పేరిపి, ఇటకర్లపల్లి గ్రామాల్లో తుపానుకు పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో ఎన్నడూ ఇంతటి విపత్తు జరగలేదన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ముఖ్యం గా చీపురుపల్లి మండలంలో వేలాది ఎకరాల్లో అరటి, చెరుకు, బొప్పాయి, వరి, పత్తి పంటలు పాడయ్యూయని చెప్పారు. ఎకరా బొ ప్పాయి నుంచి నెలకు రూ. 2 లక్షలు, ఎకరా అరటి ద్వారా రూ. లక్ష చొప్పున రైతులు ఆదాయం పొందుతున్నారని, అకాలంగా వ చ్చిన తుపాను రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు పంటల బీమా కూడా రెన్యువల్ చే యలేదని, దీంతో పంటల బీమా వర్తించే అవకాశం కూడా లేకుండాపోయిందన్నారు. ఒకవైపు రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ విపత్తు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామన్నారు. అనంతరం ఆయన పంటల న ష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ మండల అధ్యక్షు డు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇటకర్లపల్లి సర్పంచ్ మీసాల రమణ, ఇప్పిలి తిరుమల, సూరిబాబు ఉన్నారు. -
జగన్ రాక రేపు
విజయనగరం మున్సిపాలిటీ: హుదూద్ మిగిల్చిన నష్టాలను పరిశీలించి, బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుదూద్ పెను తుపాను వల్ల ఏర్పడిన నష్టం ఎవరూ పూడ్చలేనిదన్నారు. బాధిత ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయనగరం, 11 గంటలకు గంట్యాడ మండలాల్లో పర్యటిస్తారని తెలిపారు. అనంతరం తీర ప్రాంత మండలమైన పూసపాటిరేగలో బాధిత కుటుం బాలను పరామర్శించిన తర్వాత సమయం చూసుకుని భోగాపురం మండలంలో కూడా పర్యటిస్తారని చెప్పారు. అధికార యంత్రాంగం చేపడుతున్న సహాయక చర్యల్లో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన మేర నిధులు తెప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సామాజిక దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. పార్టీ నాయకులు అంబళ్ల శ్రీరాములునాయుడు, మా మిడి అప్పలనాయుడు, జమ్ము శ్రీనివాసరావు, ఎస్వీవీ రాజేష్, ఆశపు వేణు పాల్గొన్నారు. -
నరక యాతన
తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఉండడానికి గూడు లేదు. కనీసం చంటిపిల్లల కడుపునింపేందుకు పాలకు కూడా కొరత ఏర్పడింది. రవాణా సౌకర్యానిదీ అదే పరిస్థితి.. ఇలా భీతావహ పరిస్థితుల్లో జిల్లా గొల్లుమంటోంది. హుదూద్ చేసిన పెనుగాయం నుంచి ఇంకా ప్రజలు తేరుకోలేదు. జిల్లాలో తుపాను విలయతాండవం చేసి మూడు రోజులు గడిచినా పరిస్థితి అలాగే ఉంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో జన జీవనం అస్తవ్యస్తమైపోయింది. రోగులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. గాలి లేక పసిపాపలకు ఊపిరాడడం లేదు. ఉన్నవాళ్లు జనరేటర్లపై ఆధారపడుతుండగా...పేదలు అంధకారంలో మగ్గిపోతున్నారు. జీవనోపాధి ఛిద్రమైన బడుగులు వీధిన పడ్డారు. కనీసం సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి కూడా వీల్లేకపోవడంతో దూర ప్రాంతంలో ఉన్న ఆప్తులకు తమ క్షేమ సమాచారం చెప్పలేక, వారి వివరాలు తెలుసుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.ఇదే అదనుగా వ్యాపారులు కూడా భారీగా రేట్లు పెంచి దొరికినంత లాగేస్తున్నారు. ఇక నిత్యావసరాల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి ధరలకు రెక్కలొచ్చాయి. తీరప్రాంతంలోనైతే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రాకాసి అలల తాకిడికి గూళ్లన్నీ కొట్టుకుపోవ డంతో రెక్కలు తెగిన పక్షుల్లాగా విలవిలలాడిపోతున్నారు. మూడు రోజులుగా వారు నరకం చూస్తున్నారు. సర్వం కోల్పోయిన మత్స్యకారులు వేరే దిక్కులేక బిక్కుబిక్కు మంటూ ఇంకా పునరావాస కేంద్రాల్లో కాలంవెళ్లదీస్తున్నారు. సహాయక, పునరుద్ధరణ చర్యలు అంతంమాత్రంగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుదూద్ తుపాను తీవ్ర నష్టంతో పాటు కష్టాన్ని మిగిల్చింది. ప్రచండ గాలులకు, భారీ వర్షానికి జరిగిన విపత్తు నుంచి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఆ రెండు రోజుల పాటు విరుచుకుపడి గాలి రాకాసి సృష్టించినవిధ్వంసం జిల్లావాసులను వెంటాడుతోంది. యథాతథ పరిస్థితులు ఎప్పటికి వస్తాయో అని ఎదురుచూస్తున్నారు. భారీ నష్టాన్ని ఎలాగూ పూడ్చలేం, కనీసం కష్టాలనైనా అధిగమించి ముందుకు వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా.. పరిస్థితులు అనుకూలించడం లేదు. తాగ డానికి నీరు దొరకడం లేదు. తినడానికి సరైన తిండిలేదు. దొరికినా వాటి ధరలు కూడా గూబగుయ్‌మనేలా ఉన్నాయి. ఇక విద్యుత్ సరఫరా లేక పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అష్టకష్టాలు పడుతున్నారు. అంధకారంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఓ వైపు బురదనీరు, మరోవైపు దోమల బెడద వెరసి అన్నివర్గాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అంచనాలకు అందని నష్టం హుదూద్ తుపాను నష్టం అంతా, ఇంతా కాదు. అంచనా వేయడానికి వీల్లేనంతగా ఉంది. అధికారులు కచ్చితమైన నివేదిక ఇవ్వ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరోజు ఇచ్చిన నివేదికకు, తర్వాత రోజు ఇచ్చిన నివేదికకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. రోజు రోజుకూ వెలుగులోకి వస్తున్న నష్టాల వివరాలు చూస్తుంటే ఇంత విపత్తు జరిగిందా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊహకందని నష్టాన్ని చూసి వివిధ జిల్లాల్లో పనిచేసి ఇక్కడకు వచ్చిన అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ రెండురోజులు ఎలా ఉన్నారో అని తోటి అధికారుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇప్పటివరకూ అధికారుల దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం హుదూద్ మిగి ల్చిన నష్టం రూ.వెయ్యి కోట్లుపైబడే. అధికారులు సైతం అవునంటున్నారు. కాకపోతే అధికారికంగా ప్రకటిస్తే ఇబ్బం దులొస్తాయని ఆలోచిస్తున్నారు. 11 మండలాలకు కోలుకోలేని దెబ్బ జిల్లాలో ప్రధానంగా భోగాపురం, పూసపాటిరేగ, విజయనగరం, లక్కవరపుకోట, గంట్యాడ, జామి, ఎస్.కోట, డెంకాడ, బొ ండ పల్లి, మెంటాడ, కొత్తవలస మండలాల్లో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. జిల్లా వ్యాప్తంగా 385 గ్రామాల్లో తీవ్ర నష్టం వా టిల్లింది. ఈదురుగాలులకు, భారీవర్షాలకు జిల్లా వ్యాప్తంగా 14 వేల ఇళ్లు కూలిపోయాయి. దాదాపు అన్ని మండలాల్లో ఇళ్లు దెబ్బ తిన్నాయి. అత్యధికంగా పూసపాటిరేగలో 4,559, భోగాపురంలో 3,479, విజయనగరంలో వెయ్యి, కొత్తవలసలో 869 ఇళ్లు కూలి పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యవసాయ న ష్టం అంచనా వేయలేని విధంగా ఉంది. దాదాపు 80 వేల హెక్టార్లలో వరి, చెరకు, మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. వీటి విలువ రూ.350 కోట్లు పైబడి ఉండవచ్చని అధికారిక వర్గాలు అంచనా వే స్తున్నాయి. ఉద్యానపంటలు కూడా అదేస్థాయిలో ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం కొబ్బరి, అరటి, కూరగాయలు తదితర పంటలు దాదాపు రూ. 25 కోట్లు మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పట్టు పరిశ్రమకు సుమారు రూ3కోట్ల పైబడి నష్టం వాటిల్లింది. మత్స్యకారులకు సంభవించిన నష్టం కూడా అంతకంతకు ఎక్కువవుతోంది. 363 బోట్లు, 1270 వలలు కొట్టుకుపోగా, పెద్ద ఎత్తున ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 1600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెరుగుతున్న మరణాల సంఖ్య మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.ఇప్పటివరకు ఎనిమిది మంది వృతి చెందినట్టు అధికారుల దృష్టికి రాగా, పలువురు అదృశ్యమయ్యారు. చనిపోయిన వారి జాబితాలో తాజాగా నెల్లిమర్ల మండలం దన్నానపేటకు చెందిన పంతగడ ప్రతాప్, పాచి పెంట మండలం తంగలాంకు చెందిన జమ్మి చిన్నయ్య చేరారు. పశు, పక్ష్యాదులు కూడా పెద్ద ఎత్తున మృత్యువాతపడ్డాయి. 1100 వరకూ గేదెలు, 2600 మేకలు, 4200 కోళ్లు మృతిచెందాయి. వీటికారణంగా ఇతర పశువులకు వ్యాధులు సోకేప్రమాదం ఉంది. తక్షణమే వ్యాక్సినేషన్ చేయకపోతే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ శాఖకు జరిగిన నష్టం లెక్కలేనంగా ఉంది. ఇప్పటి వరకు 10వేల విద్యుత్ స్తంభాలు, 520 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరిం చేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. సిబ్బంది కొరత, సరిపడా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో లేకపోవడంతో పునరుద్ధరణ చర్యల్లో జాప్యం నెలకొంది. వేరే జిల్లాల నుంచి వస్తే తప్ప పునరుద్ధరణ జరిగే పరిస్థితి కన్పించడం లేదు. ముఖ్యంగా నేలకూలిన చెట్లు ఆటంకంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 20వేల చెట్లు కూలడంతో పునరుద్ధరణచర్యలకు అడుగుడుగనా ఆ టంకాలుఎదురవుతున్నాయి. సాగునీటి వ్యవస్థకు భారీ నష్టం జిల్లాలో సుమారు 1000 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. అలాగే 550 చెరువులకు గండ్లు పడ్డాయి. 484 కిలోమీటర్ల ఆర్ అండ్‌బీ రోడ్లు, 325 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, మున్సిపాల్టీల పరిధి లో 36 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, మున్సిపాల్టీల పరిధిలో మరో 150 ఆస్తులకు నష్టం సంభవించింది. తేరుకోని విజయనగరం పట్టణం విధ్వంసం నుంచి విజయనగరం పట్టణం తేరుకోలేకపోతోంది. దారిపొడవునా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడంతో అటు ప్రభుత్వ కార్యాలయాలు, ఇటు జనావాసాలకు వెళ్లేందుకు దారీ తెన్నూలేకుండా పోయింది. దీంతో కార్యకలాపాలు నత్తనడకగా సాగుతు న్నాయి. సినిమా థియేటర్ల ప్రదర్శనలు నేటికీ పున ప్రారంభం కాలేదు. బ్యాంకులు తెరుచుకోవడం లేదు. కొన్ని పెట్రోల్ బంకులే పనిచేస్తున్నాయి. మిగతావన్నీ పునరుద్ధరణ దిశగా ఉన్నాయి. తాగునీటికి, నిత్యావసర వస్తువులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మంచినీరు తెచ్చుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపు 175 తాగునీటి పథకాలైతే ఇప్పట్లో పనిచేసే పరిస్థితులు లేకపోగా, మిగతా మంచినీటి పథకాలకు విద్యుత్ లేక నీరందించలేకపోతున్నాయి. తాగునీటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దిగ్బంధంలో గ్రామాలు కూలిన చెట్లు, కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో అనేక గ్రామాలు దిగ్బంధనంలో ఉన్నాయి. విజయనగరం, పూసపాటి రేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, ఎస్‌కోట, జామి తదితర మండలాల్లో అనేక గ్రామాలు ఇప్పటికీ దారీతెన్నూ లేక ఇబ్బందులు పడుతున్నాయి. -
పెనుగాయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రకృతి ప్రకోపానికి జన జీవనం కకావికలమైంది. జిల్లాలో హుదూద్ తుపాను పెను బీభత్సం సృష్టించింది. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వీచిన భీకర గాలులకు జిల్లాలోని రైతులు, మత్స్యకారు లు, ఇతర రంగాల వారు తేరుకోలేని విధం గా నష్టపోయారు. ఆహారం, నీరు అందక ఎన్నో కుటుంబాలు అలమటించాయి. రెండు రోజుల పాటు ప్రజలు ఇళ్లనుంచి ఎక్కడ చూసినా పవన విధ్వంసమే....ఎవరిని కదిపినా తుపాను విలాపమే... కూలిన ఇళ్లు, ధ్వంసమైన దుకాణాలు, కూకటివేళ్లతో రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాలు, వైర్లతో పాటు చెల్లాచెదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఎగిరిపడిన హోర్డింగ్‌లు, పల్టీకొట్టిన వాహనాలు, దెబ్బతిన్న బంకులు, గోడలు కూలిన కార్యాలయాలతో జిల్లా మరు భూమిని తలపిస్తోంది. రోడ్లు ఛిద్రమయ్యాయి...చెరువులు కట్టలు తెగి ప్రవహిస్తున్నాయి...నదులు పొంగిపొర్లుతున్నాయి....పంటలు కంటతడి పెట్టిస్తున్నాయి... ఇలా జిల్లా అంతటా భీతావహ వాతావరణం నెలకొంది... హుదూద్ పెనుగాయమే చేసింది... బడుగుల బతుకులను అతలాకుతలం చేసింది... మత్స్యకారులను విషాదసాగరంలో ముంచింది. చిరు వ్యాపారులు, చిన్నచిన్న ఇళ్లలో తలదాచుకుంటున్నవారిని కోలుకోలేని దెబ్బతీసింది... ఆరుగురిని పొట్టన పెట్టుకుంది....జాలిలేని గాలి రాకాసి విధ్వంసానికి జిల్లా భారీ మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. దాదాపు రూ.వేయికోట్ల మేర నష్టం వాటిల్లింది. విశాఖపట్నానికి సమీపంలో ఉన్న విజయనగరం పట్టణం అంత స్థాయిలో కాకపోయినా అందమైన, ఆహ్లాదాన్ని పంచే నగరంగా త్వరలో రూపుదాలుస్తుందనుకున్న జిల్లా వాసుల ఆశలను ఆదిలోనే చిదిమేసింది. పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. కళా విహీనంగా దర్శనమిస్తోంది. పట్టణవాసులకు ఆహ్లాదాన్ని పంచిన చెట్లు ఇప్పుడు ఇళ్లు,కార్యాలయాలు, దుకాణాల మీద పడి పెను విషాదాన్ని సృష్టించాయి. హుదూద్ చేసిన గాయాల బాధలు బాధితుల హృదయాలను కలిచివేస్తున్నాయి... బయటకు రాలేకపోయారు. విద్యుత్‌సరఫరా నిలిచిపోవడంతో జిల్లా అంతా అంధకారం రాజ్యమేలింది. అలాగే దారిపొడవునా చెట్లు, స్తంభాలు పడిపోవడంతో పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల, బొండపల్లి, తదితర మండలాల్లోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 70 వేల హెక్టార్లలో పంట నష్టం పొట్ట దశలో ఉన్న వేలాది ఎకరాల్లో వరిపంట నీటమునిగి రైతన్న కుదేలయ్యాడు. ఇప్పటికే రుణాల్లేక, తీవ్ర ఇబ్బందుల్లో వరి సాగు చేసిన రైతులకు ఈ తుపాను మరింత కుంగదీసింది. 70వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి, చెరుకు, మొక్కజొన్న, తదితర పంటలు నీటమునిగిన ట్టు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. దాదాపుగా రూ.300కోట్లు నష్టం ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఉ ద్యానవన పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. కొబ్బరి, అరటి తోటలతో పాటు వివిధ కూరగాయల పంటలు నే లమట్టమయ్యాయి. వీటివిలువ సుమారు రూ.75 కోట్లు ఉండొచ్చని అంచనా. జిల్లా వ్యాప్తంగా 13 వేలకు పైగా టేకు తదితర చెట్లు నేలకూలాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామాలకు గ్రా మాలు దిగ్బంధంలో చిక్కుకున్నాయి.జిల్లాలో 3100కు పైగా విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు 250 ట్రాన్స్ఫార్మర్లు 250పాడయ్యాయి. దీంతో విద్యుత్ శా ఖకు సుమారు రూ.20కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అం చనా. 1000కి పైగా చిన్నతరహా నీటి వనరులు దెబ్బతిన్నాయి. 40 చెరువులకు గండ్లు పడ్డాయి. 50కి పైగా కల్వర్టులు పాడయ్యాయి. 105 మంచి నీటి పథకాలు దెబ్బతిన్నాయి. దీంతో తాగునీరు కలుషితమయింది. కోతకు గురైన రహదారులు జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీకి సంబంధించి 800 రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో ఆ గ్రామాల్లో రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. అత్యధికం గా విజయనగరం, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని రోడ్లకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 170 వరకూ రోడ్లు దెబ్బతిన్నాయి . మత్స్యకారులకు తీవ్ర నష్టం మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భీకర గాలులకు తీరంలో ఉన్న ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఇళ్లపైకి ఒడ్డున ఉన్న బోట్లు వచ్చి పడిపోవడంతో ధ్వంసమయ్యాయి. సముద్రం ఇసుక ఇళ్లలో మేటలువేసింది. 140 బోట్లు, 250 వలలు కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లింది. ముక్కాం, చేపలకంచేరు, పతివాడ బర్రిపేట, తిప్పలవలస, చింతపల్లి తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. అలాగే రెండు వేల వరకూ కోళ్లు, 250 వరకూ పశువులు, వెయ్యి వరకూ మేకలు, గొర్రెలు చనిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఆరుగురి మృతి భీకర గాలులకు భారీ వర్షాలు తోడవడంతో జిల్లాలో ఆరుగురు మృతిచెందారు.జామికి చెందిన కర్రి రమేష్, ద్వారపూడికి చెందిన శిలగం శెట్టి సత్తిబాబు, డెంకాడ మండలం బంటుపల్లికి చెందిన ఎండ సీతప్పడు, గొల్లపేటకు చెందిన బమ్మిడి సూరిబాబు, భోగాపురం మం డలం పోలిపల్లికి చెందిన కర్రోతు బంగారమ్మ భీకర గాలులకు భయాందోళనకు గురై గుండెపోటుతో మృతిచెందగా, ముక్కాం గ్రామానికి చెందిన కారి బండమ్మ చల్లనిగాలులకు తట్టుకోలేక మృతి చెందింది. నేటి నుంచి ఎన్యుమరేషన్జిల్లాలో పంట నష్టం అంచనా వేసేందుకు 50 బృందా లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. ఆరుగురు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ల పర్యవేక్షణలో అంచనా వేయనున్నారు. అలాగే 8,600 మంది బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, ఒక కిలో పంచదార అందజేయనున్నట్టు చెప్పారు. -
‘హుదూద్’ ఎఫెక్ట్ నలుగురిని బలిగొన్న చెట్లు
కుమరాం, జాగరం (జామి): హుదూద్ తుఫాన్ బీభత్సంతో చెట్లు కూలిపోయి వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా గ్రామాల్లో పెను విషాదం నెలకొంది. తుపాను సందర్భంగా జరిగిన విషాదంపై స్థానికులు, పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జామి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన కర్రి రమేష్ (23) అనే యువకుడు ఆదివారం పశువుల పాకలోకి వెళ్తున్న సమయంలో గ్రామం సమీపంలోని తాటి చెట్టు మీద పడి అక్కడి కక్కడే మృతిచెందాడు. మృతుడు గ్రామానికి చెందిన రాము,లక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు. మృతు డి సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. రమేష్ ఇంటర్మీడియెట్ పూర్తిచేసి కుటుంబఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ వేటలో ఉన్నాడు. తండ్రి గీత కార్మికుడు కావడంతో అతనికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అప్పటివరకు తన దగ్గరే ఉండి ఇంటికి వెళ్లివస్తాను నాన్నా.. అని చెప్పి బయల్దేరిన కుమారుడు కొద్దినిమషాల్లోనే మృతి చెందాడన్న వార్త తెలియగానే ఆ తల్లిదండ్రుల రోదన ఎవరికీ ఆపతరం కాలేదు. తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, ఎస్సై ఎం.ప్రశాంత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. పడిపోయిన చెట్టును ఢీకొని.. జామి మండలంలోని జాగరం గ్రామానికి చెందిన శింగిడి రమేష్ (30) అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున బైక్‌పై జామి వైపు వస్తున్న సమయం లో లక్ష్మీపురం జంక్షన్ సమీపంలో తుఫాన్ వల్ల రహదారికి అడ్డంగా పడిఉన్న చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ఉదయ్, కుమార్తె లిఖిత ఉన్నారు. జామి ఎస్సై ప్రశాంత్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృతితో భార్యాపిల్లలు దిక్కులేని వారయ్యారు. చెట్టుకింద తలదాచుకుని.. విజయనగరం క్రైం : పట్టణంలోని కెఎల్.పురం సమీపంలో ఈదురుగాలులకు చెట్టు కూలి మీద పడిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ద్వారపూడి గ్రామానికి చెందిన ఎస్.సత్తిబాబు (35) జేఎన్టీయూ సమీపంలో ఉన్న ఎఫ్‌సీఐ గొడౌన్లో కలాసీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు సైకిల్‌పై వెళ్లాడు. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చెట్టు కింద తల దాచుకునేందుకు సైకిల్‌ను ఆపాడు. ఆ సమయంలో అదే చెట్టు సత్తిబాబుపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం ఆ మార్గంలో వెళ్తున్న గ్రామానికి చెందిన వ్యక్తులు చూసి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అం దించారు. మృతునికి భార్య శ్యామల, కుమార్తె జయంతి, కుమారులు రామచరణ్, చిట్టిబాబు, సోదరుడు చిన్న ఉన్నారు. కోమాలోకి వెళ్లిపోయి.. డెంకాడ మండలంలోని బంటుపల్లి పంచాయతీకి చెం దిన బమ్మిడి సూరిబాబు ఆదివారం ఉదయం పొలానికి వెళ్తుండగా రోడ్డు పక్కనున్న చెట్టు అతనిపై పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
హమ్మయ్య..
ఏలూరు : వరుణుడు కరుణించాడు. అల్పపీడన ప్రభావం నుంచి జిల్లా రైతులను రక్షించాడు. హుదూద్ తుపాన్ తొలుత అల్పపీడనంగా, ఆ తరువాత వాయుగుండంగా మారుతుందని.. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం నుంచి సమాచారం అందటంతో జిల్లాలోని అన్నదాతలు ఆందోళనకు గురయ్యూరు. తుపాను ముప్పు తప్పినా.. వర్షాల వల్ల పంటలు పాడైపోతాయని భయపడ్డారు. వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు, పంటలు నీటమునిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో అధికార యంత్రాంగం సోమవారం కూడా అప్రమత్తంగా వ్యవహరించింది. అరుుతే, వాతావరణం సాధారణంగా ఉండటంతో తీర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారంతా ఇళ్లకు వెళ్లిపోయూరు. దీంతో ఆ కేంద్రాలన్నీ ఖాళీ అయ్యూరుు. నష్టాలు నిల్ ఉత్తరాంధ్రలో పెను విధ్వంసం సృష్టించిన హుదూద్ తుపాను వల్ల జిల్లాలో ఎక్కడా, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల పరంగా ఎలాంటి నష్టాలు నమోదు కాలేదు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆ శాఖకు కొంతమేర నష్టం వాటిల్లింది. నేలనంటిన వరి ఆదివారం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దీనివల్ల పంట లకు పెద్దగా నష్టం లేదని చెబుతోంది. పెరవలి, ఉండ్రాజవరం, అత్తిలి, చాగల్లు, భీమవరం, కొవ్వూరు, తాళ్లపూడి, ఉండి, తాడేపల్లిగూడెం, భీమడోలు, వీరవాసరం, పెనుగొండ, కొయ్యలగూడెం, నల్లజర్ల, దేవరపల్లి తదితర మండలాల్లో పలుచోట్ల వరి చేలు నేలకొరిగారుు. వరి దుబ్బులను నిలబెట్టి కట్టలు కట్టించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యూరు. మెట్ట గ్రామాల్లో వరి కోతలు పూర్తి కావడంతో వర్షాలకు తడిసిన ధాన్నాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ఉత్తరాంధ్రకు 1,500 మంది హుదూద్ తుపాను తాకిడితో ఛిద్రమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 1,500 మంది అధికారులు, సిబ్బంది తరలివెళ్లారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీపీవో ఎ.నాగరాజువర్మ, ఇతర శాఖల ముఖ్య అధికారులు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి పునరావాస చర్యలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యూరు. పునరావాస కేంద్రాలు ఎత్తివేత జిల్లాలోని ఐదు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సోమవారం ఉదయం ఉపసంహరించారు. నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం, కాళ్ల మండలాల్లో హుదూద్ తుపానును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. వీటిలో దాదాపు 8 వేల మందికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. తుపాను, అల్పపీడనం ముప్పు తప్పడంతో వీటిని ఎత్తివేశారు. ఇదిలావుండగా మంగళవారం నుంచి పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. -
21కి చేరిన ‘హుదూద్’ మృతులు
నేలకూలిన ఇళ్లు 6,695.. 1,798 పశువుల మృత్యువాత.. 44 మండలాల్లో తీవ్ర నష్టం సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపానువల్ల మరణించిన వారి సంఖ్య అధికారిక గణాంకాల ప్రకారమే 21కి పెరిగింది. ఆదివారం సాయంత్రానికి ముగ్గురు మాత్రమే చనిపోయారని ప్రకటించిన ప్రభుత్వం.. సోమవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో మృతుల సంఖ్య 21కి చేరినట్లు పేర్కొంది. ఒక్క విశాఖ జిల్లాలోనే 15 మంది మృత్యువాత పడగా విజయనగరం జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చనిపోయారు. ప్రభుత్వ ప్రకటన మేరకు నష్టం వివరాలిలా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మొత్తం 6,695 ఇళ్లు కూలిపోయాయి 109 చోట్ల రైల్వే లైన్లు, రహదారులు దెబ్బతిన్నాయి. 5,727 విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విజయనగరం జిల్లాలో 19 చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ నాలుగు జిల్లాల్లో 181 బోట్లు గల్లంతయ్యాయి. 1,798 పశువులు చనిపోయాయి. 73 తాగునీటి పథకాలు పాడయ్యాయి. 44 మండలాల్లో తుపానువల్ల నష్టం వాటిల్లింది. 320 గ్రామాల్లోని 2,48,004 మందిపై తుపాను ప్రభావం పడింది. 223 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,35,262 మంది బాధితులను తరలించారు. 223 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 4,06,163 మందికి ఆహార పొట్లాలు అందించారు. 24 జాతీయ విపత్తు సహాయ దళాలు తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. నాలుగు ఆర్మీ, నేవీ దళాలు కూడా సేవల్లో ఉన్నాయి. 691 మంది ఈతగాళ్లు, 56 బోట్లు సహాయ కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉన్నాయి. మృతుల వివరాలు.. శ్రీకాకుళం జిల్లా: గంటా యోగానందం (45).. సంతబొమ్మాళి మండలం గండపేట. విజయనగరం జిల్లా.. 1.కర్రి రమేష్ (22) జామీ మండలం కొమరం, 2.సలగంశెట్టి సత్తిబాబు(32) విజయనగరం మండలం ద్వారపూడి, 3, యండాడ సీతప్పడు (68). 4. దమ్మడి సూరిబాబు (68) డెంకాడ మండలం బంటుపల్లి, 5.కర్రోతు బంగారమ్మ (65), భోగాపురం మండలం పోలిపల్లి. విశాఖపట్నం జిల్లా.. 1.జి.పంచువతి (58), అనకాపల్లి మండలం కొండారం. 2. మంగారి ఎర్రయ్య (58), పద్మనాభం మండలం పాలవలస. 3.పి. నాగమనోజ్ (1), 4.రాములమ్మ (45). 5. సుబ్రమణ్యం (65), 6. బి. సింహాచలం (65), 7. నెల్లి దేవీ కుమారి (26), 8. కె. రామయ్య (57), 9. బి. రాములమ్మ (50), 10, నెల్లి సత్యనారాయణ (34), విశాఖ నగరం. 11. గోకుల అప్పారావు (52), 12. అడవి అప్పారావు(50), 13, గోరంట్ల ఎరకయ్య (62), 14, గుర్తు తెలియని వ్యక్తి, 15, పేరు గుర్తించని వ్యక్తి (58), విశాఖ రూరల్. -
ఇంకా అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రలో విద్యుత్ పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించడం లేదు. మరికొన్ని గంటలు అంధకారం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పునరుద్ధరణ సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా మొత్తం వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఇందులో రూ.700 కోట్లు డిస్కమ్‌లు, రూ.300 కోట్లు ట్రాన్స్మిషన్ సంస్థలు నష్టపోయాయని తెలిపారు. తొలుత విశాఖ నగరానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదీ అత్యవసర సర్వీసుల కోసం మాత్రమే. ఆ తర్వాత విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో సరఫరా పునరద్ధరణకు మార్గాలను అన్వేషిస్తున్నారు. తక్షణ ఏర్పాట్ల కోసం విద్యుత్ సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నా ఇంతవరకు మెరుగైన పరిస్థితి కనిపించలేదు. హుదూద్ తుపాను మునుపెన్నడూ లేనంతగా ఉత్తరాంధ్రను కుదిపేసింది. ఈ నష్టం విద్యుత్ శాఖపై భారీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రోజూ 135 మిలియన్ యూనిట్లు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. తుపాను కారణంగా ఇది 108 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. ఉత్తరాంధ్రలో ఒక్క యూనిట్ కూడా సరఫరా చేయలేని పరిస్థితే ఇందుకు ప్రధాన కారణం. ఈ మూడు జిల్లాల్లో విద్యుత డిమాండ్ 24 మిలియన్ యూనిట్లు ఉంటుంది. అంధకారంలో జనం: మూడు జిల్లాలూ ప్రస్తుతం అంధకారంలోనే ఉన్నాయి. ఇక్కడ సాధారణ జనజీవనం కారుచీకట్లో బిక్కుబిక్కుమంటోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 7,410 గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అత్యవసర వైద్యసేవలు ఆగిపోయి రోగులు హైరానా పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో ఆస్పత్రుల్లో ప్రాణాప్రాయ సేవలకూ ఆటంకం కలుగుతోంది. కొద్దిగంటలు జనరేటర్ల మీద నడిచినా, ఇప్పుడు ఆ వెసులుబాటూ లేదు. రవాణ వ్యవస్థ లేకపోవడం, డీజిల్ బంకులు మూతబడటంతో ఎమర్జెన్సీ సేవలకు ఆటకం ఏర్పడింది. తాగునీరు లేదు. విద్యుత్ లేకపోవడంతో ఓవర్ హెడ్ ట్యాంకులను నింపే మోటార్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సెల్‌ఫోన్ టవర్లు ఒక్కటీ పనిచేయడం లేదు. చిన్నాచితక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. చీకట్లోనే భయపడుతూ కాలం గడుపుతున్నారు. నెట్వర్క్ పూర్తిగా దెబ్బతినడంతో, పాలన వ్యవస్థల మధ్య సమన్వయం లేకుండాపోయింది. కూలిన స్తంభాలు.. కొట్టుకుపోయిన ట్రాన్స్ ఫార్మర్లు విద్యుత్ సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ట్రాన్స్ఫార్మర్లు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 75 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినట్టు అంచనా. 1,100 స్తంభాలు పూర్తిగా వంగిపోయాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ విరిగిపడ్డ స్తంభాల సంఖ్య 20 వేలకు పైమాటే. ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ప్రత్యామ్నాయ సరఫరాకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. యథాతథ పరిస్థితి నెలకొనడానికి కనీసం వారం రోజులైనా పట్టొచ్చని అధికారులే చెబుతున్నారు. రెండుచోట్ల 400 కె.వి. సబ్స్టేషన్లు కుప్పకూలాయి. 225 కె.వి. సబ్స్టేషన్లు 10 వరకు పనికిరాకుండా పోయాయి. 132 కె.వి. సబ్ స్టేషన్లు 25 వరకు నేలమట్టమయ్యాయి. గాజువాకలోని సింహాద్రి ఎన్టీపీసీ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పోలాకి, సంతబొమ్మాళి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. 100కు పైగా ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడం, నీట మునగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలోని పెందుర్తి ఉప కేంద్రం వద్ద సాంకేతిక లోపం ఏర్పడంతో జిల్లాలో సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ అధికారులు చెప్పారు. దీంతో పెందుర్తి నుంచి గరివిడికి సరఫరా నిలిచిపోయింది. పెందుర్తి సాంకేతిక లోపం సరిదిద్దతేగానీ జిల్లాకు సరఫరా రావడం కష్టం. విశాఖ జిల్లాలో 33 కె.వి. విద్యుత్ స్తంభాలు 22, 11 కె.వి. విద్యుత్ స్తంభాలు 3,339, ఎల్టీ విద్యుత్ స్తంభాలు 533, ట్రాన్స్ఫార్మర్లు 75 కూలిపోయాయని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా పరిస్థితిపై అధికారులకూ స్పష్టమైన అవగాహన లేదు. ఫోన్లు పనిచేయకపోవడంతో ఉన్నతాధికారులకు ఎలాంటి నివేదికలూ రాలేదు. 80 ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగినట్లు తెలుస్తోంది. 7,657 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను పునరుద్ధరించాల్సి ఉంది. పునరుద్ధరణకు చర్యలు : తాజా పరిస్థితి నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ నగరానికి విద్యుత్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో సిబ్బంది ఉత్తరాంధ్రకు రప్పించారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నుంచి స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు, వైర్లు తరలించారు. తాజా పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్, జెన్కో సీఎండీ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. విజయానంద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే మకాం వేశారు. సింహాద్రి ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను దారికి తెచ్చేందుకు కొంత వరకు ప్రయత్నాలు జరిగాయి. ఇది పనిచేయడానికి అవసరమైన విద్యుత్‌ను వేమగిరి ప్లాంట్ నుంచి పంపాలని నిర్ణయించారు. సింహాద్రి ఉత్పత్తి ప్రారంభిస్తే విశాఖ సిటీకి కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు మరో నాలుగు మార్గాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయత్నాలు చేస్తున్నారు. తునిలోని 132 కె.వి. సబ్‌స్టేషన్ ద్వారా కొరుప్రోలు, పరవాడ, గాజువాక ద్వారా విద్యుత్ అందించాలని భావిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలోని 132 కె.వి. సబ్‌స్టేషన్ ద్వారా గాజువాకకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.గాజువాక నుంచి 80 మెగావాట్లు అందించే వీలుందని తెలుస్తోంది. మొత్తం మీద విశాఖ నగరానికి మంగళవారం సాయంత్రానికి ఒక స్థాయిలో విద్యుత్ అందించే వీలుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీగా సిబ్బంది : ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విద్యుత్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు కడప, అనంతపురం, తిరుపతి, విజయవాడ నుంచి రెండువేలమంది సిబ్బందిని పంపినట్టు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సెలవుల్లో ఉన్నవాళ్లను కూడా రప్పిస్తున్నారు. తెలంగాణ సాయం : ఉత్తరాంధ్రలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యుత్ సంస్థలు సాయం చేసేందుకు ముదుకొచ్చాయి. తెలంగాణ జెఎండీ కార్తికేయమిశ్ర సోమవారం ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌తో మాట్లాడారు. రూ.13 కోట్ల విద్యుత్ ఉపకరణాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ వైర్లు, స్తంభాలు ఉత్తరాంధ్రకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాయానికి ముందుకొచ్చాయి. -
కన్నుమూసిన వారినీ కనికరించలేదు
పిఠాపురం: పచ్చటి బతుకులను కకావికలం చేసిన హుదూద్ తుపాను చివరికి కంకాళాల్నీ విడిచి పెట్టలేదు. రెచ్చిపోయిన ఆబోతులా.. నేలను పెళ్లగించి సమాధుల్లోని అస్థిపంజరాల్నీ పెకలించింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేటలో ు ప్రత్యేకంగా శ్మశానం లేకపోవడంతో సముద్రతీరానికి సమీపంలోనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. తుపాను ప్రభావంతో కడలి విరుచుకుపడడంతో పలు సమాధులు కొట్టుకుపోయి కంకాళాలు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం భీతావహంగా ఉంది. అయినవారి అవశేషాలు ఇలా దిక్కులేనివిగా చెల్లాచెదురు కావడాన్ని చూసి గ్రామస్తులు వేదనకు గురవుతున్నారు. -
పచ్చదనం చచ్చిపోయింది!
విశాఖ అందాలను మింగిన హుదూద్ జూ పార్కులో విరిగిపడ్డ చెట్లు వన్యప్రాణులకు ఆహారం అందించే దారులు బంద్ విశాఖపట్నం: విలయ తాండవం చేసిన హుదూద్ తుపాన్ విశాఖ నగరాన్ని ఇరవై ఏళ్ల వెనక్కు మళ్లించింది. విశాఖకు వన్నె తెచ్చిన పచ్చటి స్నేహితులు నేలకూలటంతో నగరం బోసిపోయింది. బెంగళూరు తరువాత ఆ స్థాయిలో విస్తరించిన పచ్చదనం నిర్జీవమైంది. దాదాపుగా చెట్లు అన్నీ కూలి పోయాయి. నగరం మధ్యలో అతిపెద్ద పార్కుగా అభివృద్ధి చేయాలని తీర్చిదిద్దుతున్న పాతజైలు స్థలంలో ఉన్న భారీ వృక్షాలు దెబ్బతిన్నాయి. ద్వారకానగర్ ప్రాంతంలో రహదారి విస్తరణ లోపోగా మిగిలిన కొద్దిపాటి చెట్లు నేలకూలాయి. విశాఖ నుంచి విజయనగరం దిశగా కొండలు బోసిపోయి కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో నూరేళ్ల పైబడిన వృక్షం కొమ్మలన్నీ నేలకొరిగి మొదలు మాత్రమే మిగిలింది.పర్యాటక ఆకర్షణగా నిలిచే పార్కులను పెను తుపాన్ మింగేసింది. గతంలో ఈస్ట్ పాయింట్ కాలనీ బీచ్ రోడ్డు నుంచి సముద్రం కనిపించేది. అనంతరం ఇక్కడ వుడా పార్కును అభివృద్ధి చేయడంతో సముద్రం కనిపించేది కాదు. ప్రచండ గాలులకు పార్కులోని చెట్లు కూకటి వేళ్లతో కూలిపోవడంతో రోడ్డు మీద నుంచి సముద్రం కనిపిస్తోంది. పార్కులే కాకుండా నగరంలో పచ్చని చెట్లు లేకుండా తుడిచిపెట్టుకు పోయాయి. మహావృక్షాలు నేలకొరిగాయి. సందర్శకులను ఆకర్శించే వుడా పార్కు, శివాజీపార్కు, లుంబిని పార్కులు హుదూద్ విధ్వంసానికి సాక్షాలుగా మిగిలాయి. పర్యాటక ప్రాంతాలు కంబాల కొండ, ఇందిరాగాంధీ జూ పార్కుల పరిస్థితి దయనీయంగా ఉంది. విరిగిపడ్డ చెట్లతో జూలో రోడ్లన్నీ మూసుకుపోవటంతో వన్యప్రాణులకు కనీసం ఆహారం అందించలేని పరిస్థితి నెలకొంది. చెట్లు విరిగిపడటంతో కనుజులు మృత్యువాత పడినట్లు గుర్తించారు. గతేడాది ఆధునికంగా నిర్మించిన జూ ప్రధాన ద్వారం ధ్వంసమైంది. కైలాసగిరిపై ఒరిగిన వృక్షాలు పెనుగాలుల ధాటికి బీచ్ రోడ్డులోని వుడా పార్కు అస్తవ్యస్థమైంది. పార్కు అవతల ఉన్న సముద్రం రోడ్డు మీద నుంచి కనిపిస్తోంది.అక్కడ స్కేటింగ్ మైదానం నాశనమైంది. పిల్లలు ఆడుకునే క్రీడా వస్తువులు కూలి పోయాయి. శివాజీ పార్కులో వాకింగ్ ట్రాక్‌లకు ఇరువైపుల అందంగా కనిపించే మొక్కలు నేలమట్టమయ్యాయి. లుంబిని పార్కులో చోట్లు ఒరిగిపోయాయి. పర్యాటకులను ఆకర్శించి నగరానికి వన్నె తెచ్చిన పార్కులు శిథిలమయ్యాయి. కైలాసగిరిపై చెట్లు ఒరిగిపోయి రాళ్లు పైకి తేలాయి. ఆకుపచ్చని కొండలా కనిపించే కైలాసగిరి రాళ్లతో దర్శనమిస్తోంది. -
పోర్టులో కరిగిన యూరియా!
40 వేల టన్నుల యూరియా, పొటాషియం నీటి పాలు నిల్వలు బూస్టర్ డోస్‌కి సరిపోతాయి రబీకి గడ్డు కాలం.. సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను ప్రభావం ఎరువుల కంపెనీలనూ తాకింది. తుపానుతో కురిసిన భారీ వర్షాలు, పెనుగాలులకు విశాఖ హార్బర్లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దయ్యాయి. ఏయే కంపెనీకి ఎంత నష్టం వాటిల్లో ఇంకా స్పష్టం కానప్పటికీ ప్రధాన ఎరువుల కంపెనీలన్నీ తుపాను నష్టాన్ని చవిచూశాయి. నష్టం అంచనాకు ఆయా కంపెనీల అధికారులు ఆందోళనతో విశాఖపట్నం వైపు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్), కోరమాండల్ ఇంటర్నేషనల్, ఇఫ్కో, క్రిబ్కో, నాగార్జున వంటి ప్రముఖ ఎరువుల కంపెనీలన్నీ ప్రధాన ఓడరేవుల ద్వారా ఎరువుల్ని దిగుమతి చేస్తుంటాయి. వచ్చిన సరుకును ఆయా కేంద్రాలకు పంపే వరకు నిల్వ చేసుకునేలా ఓడరేవుల్లో ఎరువుల కంపెనీలకు గిడ్డంగులు కూడా ఉంటాయి. ఎగసిపడిన అలలకు విశాఖ హార్బర్ గోడలు కూలడంతో ఎరువుల కంపెనీలకు ఇచ్చిన గిడ్డంగులూ ధ్వంసమైయ్యాయి. ఫలితంగా వాటిల్లో నిల్వ ఉంచిన డిఎపీ, పొటాషియం, యూరియా వంటి ఎరువులు పాడై పోగా ఓడల నుంచి కంటైనర్ల నుంచి దించని ఎరువులు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. పాడైన ఎరువుల విలువ సుమారు సుమారు రూ.30 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. నష్టం విషయం తెలుసుకున్న ఎరువుల కంపెనీల ప్రతినిధులు హుటాహుటిన విశాఖ బయల్దేరారు. కాకినాడ నుంచి ఇఫ్కో కంపెనీ అధికారులు ఇప్పటికే విశాఖ పట్నం చేరుకుని తమ గిడ్డంగిలో నిల్వ ఉంచిన సూక్ష్మపోషకాల ఎరువులకు కలిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. తమ వద్ద యూరియా నిల్వలు లేవని తేల్చినట్టు ప్రాథమిక సమాచారం. ఐపీఎల్ కంపెనీకి విశాఖ హార్బర్లో మూడు గిడ్డంగులున్నాయి. వాటిల్లో ఏయే సరకు నిల్వ ఉన్నది ఇంకా తేలలేదు. గుజరాత్ నుంచి ప్రతినిధులు రానున్నారు. నీటిపాలైన క్రిబ్కో యూరియా.. ఈ తుపానులో క్రిబ్కో కంపెనీ ఎక్కువగా నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే ఒమన్‌లోని తన కర్మాగారం నుంచి 32 వేల టన్నుల యూరియాను తెప్పించింది. ఓడ నుంచి సరకును దించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్న దశలో తుపాను వచ్చింది. దీంతో ఏ ఒక్క బస్తా బయటకు వెళ్లలేదు. నీటిలో నాని కొంత మొత్తం కరిగిపోగా, మరికొంత గడ్డకట్టుకుపోయింది. దీనివల్ల ఈ కంపెనీకి రూ.17 కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. ఇదేమాదిరిగా మిగతా కంపెనీల గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన 8 వేల టన్నుల పొటాషియం, డీఏపీ తదితర ఎరువులకు నష్టం వాటిల్లింది. దీని విలువ సుమారు రూ.12 నుంచి 13 కోట్ల రూపాయలకుపైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రబీ సీజన్లో యూరియా కొరత తప్పదా? తుపాను పీడిత ప్రాంతాల్లో వరి, ఇతర ఉద్యానవన పంటలకు బూస్టర్ డోస్ కింద యూరియా, పొటాష్‌ను వాడతారు. ఎకరాకు 20 కిలోల యూరియా, పది కిలోల పొటాష్ అవసరం. అనుకోని ఈ విపత్తుకు ప్రస్తుత నిల్వల నుంచి ఈ ఎరువుల్ని వినియోగించమని వ్యవసాయ శాఖ ఆదేశించింది. ఇంతవరకు సజావుగానే ఉన్నా అక్టోబర్ నుంచి మొదలయిన రబీ సీజన్ పంటలకు యూరియా కొరత తప్పేలా లేదు. ప్రస్తుత అవసరాల కోసం తెప్పించిన యూరియా తడిసిపోవడంతో ఇప్పటికిప్పుడు తిరిగి తయారుచేయడం కష్టం. దీని ప్రభావం రబీ పంటలపై పడుతుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
వర్సిటీకి తీరని నష్టం
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో దశాబ్ధాలుగా ఉన్న భారీ వృక్షాలు హుదూద్ దెబ్బకు నేలకొరిగాయి. పరిపాలనా భవనం, ఆర్ట్స్ కళాశాల, స్టేట్‌బ్యాంక్, రిజిస్ట్రార్ నివాసం, బోటనీ విభాగం, ఎకనామిక్స్ భవనం తదితర ప్రాంతాల్లోని పెద్ద వృక్షాలు కొన్ని పెకలించుకుపోయాయి. విద్య పరిశోధకుల వసతిగృహంలో ఉన్న భారీ మామిడి చెట్టు కూలిపోయింది. విద్యుత్ స్తంభాలు, దీపాలు నేలరాలాయి. భవనాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు దెబ్బతిన్నాయి. వర్సిటీకి రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు. హుదూద్ తీవ్రతకు దెబ్బతిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖ ఎంపీ హరిబాబు సోమవారం పరిశీలించారు. ఏయూకు రెండు వారాలు సెలవులు ఆంధ్రా యూనివర్సిటీకి రెండు వారాలు సెలవులిస్తున్నట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించారు. వర్సిటీ ఆవరణలో కూలిన చెట్లను తొలగించి, పరిస్థితి చక్కదిద్దేందుకు రెండు వారాలు పట్టే అవకాశం ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి జరగాల్సిన మిడ్ టర్మ్ పరీక్షలను వాయిదా వేశారు. తుపాను కారణంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం జరగాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ రీజనల్ డెరైక్టర్ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తారు. -
నేడు విశాఖకు పాక్షిక విద్యుత్
రేపు నగరం మొత్తం.. ఉత్తరాంధ్రకు మరో 2 రెండు రోజులు సాక్షి, హైదరాబాద్: అంధకారంలో ఉన్న విశాఖ పట్టణానికి మరో 24 గంటల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ‘సాక్షి’కి తెలిపారు. సింహాద్రి ఎన్టీపీసీ ఉత్పత్తికి వీలుగా వేమగిరి నుంచి స్టార్టప్ విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఫలితంగా పీజీసీఎల్ నుంచి 80 నుంచి 90 మెగావాట్ల విద్యుత్‌ను విశాఖ నగరానికి అందించడానికి వీలుందని తెలిపారు. అయితే ఇది పూర్తిగా అత్యవసర సర్వీసులకే పరిమితమని చెప్పారు. తర్వాత మరో 24 గంటల్లో నగరం మొత్తం విద్యుత్ సరఫరా జరిగే వీలుందన్నారు. విజయనగరం, శ్రీకాకుళంతో పాటు విశాఖ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టవచ్చన్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం 14 టవర్లు కుప్పకూలాయని, 20 వేల స్తంభాలు వంగిపోయాయని అధికారులు చెప్పారు. మూడు జిల్లాల్లోనూ రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల స్తంభాలు, ఇతర సామగ్రి తరలింపు ఇబ్బందిగా ఉంది. జిల్లా కేంద్రాలకు మరో 24 గంటల్లో అవసరమైన సామగ్రి చేరుతుందని విద్యుత్ శాఖ చెబుతోంది. ఏదేమైనప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు కనీసం వారం రోజులు పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
తుపాను బాధితులకు జగన్ పరామర్శ
నేటినుంచి పర్యటన విశాఖపట్నం సిటీ : హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి మూడురోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం... వైఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకుంటారు. అనంతరం నక్కపల్లి చేరుకుని అక్కడి తుపాను వల్ల నీటమునిగిన పంటపొలాలను పరిశీలిస్తారు. నక్కపల్లి మండలంలో తుపాను బాధితులను పరామర్శించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టం జరిగిన తీరును తెలుసుకుంటారు. అనంతరం ఎలమంచిలి, అనకాపల్లిలో హుదూద్ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం హుదూద్ తీరం దాటిన పూడిమడక ప్రాంతాన్ని సందర్శించనున్నారు. మంగళవారం రాత్రికి గాజువాక చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధ, గురువారాల్లో విశాఖలో పర్యటిస్తారు. నగరంలోని పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని వివరించారు. -
శ్రీకాకుళం హైవేపై 2 అడుగుల మేర నీరు
విజయనగరం : విజయనగరం జిల్లాలో హుదూద్ తుఫాను పెను ప్రభావం చూపింది. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. వేలాది ఎకరాల్లో వరి, చెరకు, అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో సమాచార వ్యవస్థ కుప్పకూలింది.దాంతో విద్యుత్, సమాచార వ్యవస్థ స్తంభించింది. రవాణా వ్యవస్థ నిలిచిపోవటంతో నిత్యావసర వస్తువులు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. విజయనగరంలో ...శ్రీకాకుళం హైవేపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరింది. జిల్లాలోని చాలా గ్రామాల్లో పూరిళ్లు గాలి ఉధృతికి కొట్టుకుపోయాయి. రామభద్రాపురం, బొబ్బిలి, జామి మండలాల్లో కురగాయల పంటలు నీట మునిగాయి. పూసపాటిరేగ మండలం తిప్పలవలస, చింతపల్లిలో వందల సంఖ్యలో పడవలు, వలలు కొట్టుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న తొమ్మిది గ్రామాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇతర ప్రాంతాలకు సరైన సహాయం అందటం లేదు. మరోవైపు తాటిపూడి రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. కాగా జిల్లావ్యాప్తంగా సోమవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
‘హుదూద్’పై జిల్లా యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, ఖమ్మం: జిల్లాపై హుదూద్ ప్రభావం పొంచి ఉంది. ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాతీరాన్ని ఈ తుపాను అతలాకుతలం చేస్తే.. జిల్లాలో మాత్రం వాతావరణ ఒక్కసారిగా చల్లడింది. కొద్దిపాటి గాలులు వీస్తున్నాయి. ఏజెన్సీలో అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల వైపు ఈ తుపాను వెళ్లనుందని వాతావరణశాఖ సూచిస్తోంది. ఇదే జరిగితే జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీకి తుపాను తాకిడి తగలనుంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. హుదూద్ జిల్లా ప్రజలు, అధికారులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో తుపాను ప్రభావం ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వాయువ్య దిశ వైపు పయనిస్తున్న హుదూద్ భద్రాచలం డివిజన్‌పై ప్రభావం చూపనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అతివేగంగా వచ్చిన తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖను అతలాకుతలం చేయడంతో జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారుల్లో టెన్షన్ నెలకొంది. చిన్నపాటి వర్షాలకే భద్రాచలం డివిజన్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో ఇప్పుడు వర్షపాతం ఎక్కువ నమోదైతే ఏజెన్సీ జలయమం కానుంది. తుపానుపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నంబర్ 08742-224204, భద్రాచలంలో 08743-232444, 232426 నంబర్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం ఏజెన్సీ మండలాల తహశీల్దార్లు తుపాను కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ మండలాలపై ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఆగస్టులో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాజేడు మండలం పేరూరులో అత్యధికంగా 54 సెం.మీ వర్షం పడింది. ఇది రాష్ట్రంలో అప్పట్లో అత్యధికంగాా కురిసిన వర్షం. అయితే తుపానుతో భారీ వర్షం పడితే ఎలా.. గత పరిస్థితులను అధికారులు అంచనా వేస్తున్నారు. శబరికి వరద తాకిడి.. తుపాను ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తుండటంతో శబరినది పోటెత్తే అవకాశం ఉంది. ఒడిశాలోని మాచ్‌ఖండ్, బలిమెల, సీలేరు డొంకరాయి రిజర్వాయర్లు నిండితే వరద నీరు కిందకు వదలనున్నారు. ఇదంతా శబరిలో కలవనుంది. శబరి గోదావరిలో కలవనుండంతో వరద ఉధృతితో చింతూరు, కూనవరం మండలాల్లోని పలు గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఈ రిజర్వాయర్లలో నీరు ఎంత ఉంది..? వరద వస్తే ఎంత నీరు శబరిలోకి వస్తుందోనని అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి నది వరదతో తాలిపేరు ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. తాలిపేరు అన్ని గేట్లు ఎత్తితే చర్ల పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించనున్నాయి. తుపాను ప్రభావం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్న రాష్ట్రాల్లో లేకపోవడంతో గోదావరి వరద పెరిగినా ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఏజెన్సీ రైతుల ఆందోళన.. విశాఖలో తుపాను తీవ్రతను చూసి ఏజెన్సీ రైతుల్లో ఆందోళన నెలకొంది. భధ్రాచలం డివిజన్లో పత్తి ఇప్పుడే పూత, పిందెకు వచ్చింది. గాలివాన వస్తే పిందె, పూత రాలడంతో పాటు పత్తి నేలవాలనుంది. తుపాను ప్రభావం మూడు రోజులు ఉండనుండడంతో మిర్చి పూర్తిగా నీట మునిగి కుళ్లిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అప్రమత్తమైన యంత్రాంగం
ఆర్డీఓలతో మాట్లాడిన డీఆర్వో సురేంద్రకరణ్ అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశం హన్మకొండ అర్బన్ : హుదూద్ తుపాన్ ప్రభావం జిల్లాపై సోమవారం ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి సమాచారం అందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని స్థారుుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్డీఓలు, తహసీల్దార్లకు డీఆర్వో సురేంద్రకరణ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు ఇతర సిబ్బంది స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ తుపాన్‌పై అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో తుపాన్ సమాచారం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు శనివారం నుంచి 24 గంటలు పనిచేస్తాయని.. అవసరాన్ని బట్టి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని... ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని ఆదేశించారు. ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. నగరంలో రెండో రోజు 40,299 దరఖాస్తులు వరంగల్ అర్బన్: వరంగల్ ట్రైసిటీ పరిధిలో వివిధ సంక్షేమ పథకాల కోసం అదివారం 42,292 దరఖాస్తులు వచ్చాయని బల్దియా అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్ తెలిపారు. రెండో రోజు పింఛన్ల కోసం 11,199. ఆహార భద్రత కార్డులకు 23,279, సర్టిఫికెట్ల కోసం 5,814 దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. సెలవులు రద్దు చేశాం తుపాన్ కారణంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు జిల్లాలో అన్ని స్థాయిల ఉద్యోగులకు సెలవులు రద్దుచేశాం. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించాం. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే ఎవరైనా సరే.. చేసినా కఠిన చర్యలు తప్పవు. ఉద్యోగులు తప్పనిసపరి వెళ్లాల్సి వస్తే... ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. - సురేంద్రకరణ్, డీఆర్వో -
62 రైళ్లు రద్దు.. 51 రైళ్ల దారిమళ్లింపు
* హుదూద్ తుపాను ప్రభావంతో రైల్వేశాఖ ముందస్తు చర్యలు * విశాఖపట్నం, భువనేశ్వర్‌వైపు లైన్ బ్లాక్ * ముఖ్యమైన రైళ్లు బలార్షా మీదుగా మళ్లింపు * పమాదకర వంతెనలు, చెరువు సమీప లైన్ల వద్ద వాచ్మెన్ ఏర్పాటు * నిరంతర నిఘాకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: హుదూద్ తుపాను భీకరంగా విరుచుకుపడుతుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పకడ్బందీగా వ్యవహరించింది. గతంలో ఇలాంటి హెచ్చరికలు వెలువడ్డా... రైళ్లను నడిపేది. తీరా తుపాను విరుచుకుడ్డాక రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులు నరకయాతనపడేవారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఎదురుకావద్దన్న ఉద్దేశంతో తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఒక్కరైలునూ నడపకుండా పూర్తిగా నిలిపివేసింది. ముఖ్యమైన రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో దారిమళ్లించి వాటిల్లో ప్రయాణించేవారికి ఇబ్బందిలేకుండా వ్యవహరించింది. తుపాను భీకరంగా ఉండబోతుందం టూ నాసా హెచ్చరించిన నేపథ్యంలో చిన్న ప్రమాదం కూడా లేకుండా చూడాలని, రెలైక్కినందుకు ప్రయాణికులు ఇబ్బందిపడే పరిస్థితి రానీయొద్దని రైల్వే ఆదేశించటంతో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. విజయవాడ-విశాఖపట్నం దారిలో రాజమండ్రి-విశాఖపట్నం మధ్య ఆదివారం తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుపాను తీరం దాటినా విశాఖపట్నం, భువనేశ్వర్‌లకు వెళ్లే రైళ్లను ముందుజాగ్రత్తగా సోమవారం సాయంత్రం వరకు రద్దు చేశారు. హౌరావైపు వెళ్లాల్సిన ముఖ్యమైన రైళ్లను విజయవాడ, బలార్షాల మీదుగా మళ్లించారు. ఫలితంగా 62 రైళ్లు పూర్తిగా రద్దు కాగా, ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 51 రైళ్లను దారిమళ్లించి నడిపారు. మరోవైపు రైలు మార్గాల పరిస్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు రైల్ నిలయంలో అత్యవసర కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ బాధ్యతను అదనపు జీఎం అగర్వాల్, చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ ఝాలకు అప్పగించారు. అలాగే విజయవాడలో మరో అత్యవసర కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అక్కడి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీటితోపాటు అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ, రాజమండ్రి, నిడదవోలు, నూజి వీడు, భీమవరం, మచిలీపట్నం, నర్సాపూర్, గుడివాడ, ఏలూరు, గుంటూరు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. -
పట్టణంపై తుపాను పంజా
శ్రీకాకుళం/అర్బన్/కల్చరల్/రిమ్స్ క్యాంపస్: హుదూద్ తుపాను శ్రీకాకుళం పట్టణంపై తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావం శని, ఆదివారాలలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పట్టణంలో చాలా వరకూ నష్టం జరిగింది. శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు జలమయమయ్యాయి. హోరు గాలి తీవ్రతకు చాలా వరకూ దుకాణాల హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపోయాయి. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పట్టణంలోని ఆదివారంపేట, బలగ, హడ్కోకాలనీలు పూర్తిగా నీటమునిగాయి. డే అండ్ నైట్ కూడలి, ఇలిసిపురం, రైతుబజార్, సాయిబులతోట, సరస్వతీమహల్కు సమీపంలోని గొంటివీధి, విశాఖ-ఏ, బీ కాలనీలు, మహలక్ష్మీనగర్ కాలనీ, కిన్నెర కూడలి తదితర లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జలమయమయ్యాయి. పట్టణంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న అటవీశాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు కూలి రోడ్డుపై పడింది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తంభం కూడా నేలకొరిగింది. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆ చెట్లును తొలగించారు. కలెక్టరేట్‌కు సమీపంలోని రెవెన్యూ అతిథిగృహంకు దగ్గరగా ఉన్న పెద్ద చెట్టు విరిగి నేలకొరిగింది. అయితే ఈ చెట్టు ఖాళీప్రదేశంలో పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పాతబస్టాండ్‌కు సమీపంలోని పోలీస్ క్వార్టర్స్‌కు ఆనుకుని ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ డూం విరిగిపోయింది. కృష్ణాపార్కు సమీపంలో డివైడర్‌లో ఉన్న మొక్కలు విరిగిపోయాయి. డే అండ్ నైట్ కూడలి సమీపంలో పెద్దరెల్లివీధి వద్ద రోడ్డుకు ఆనుకుని ఉన్న దుస్తుల దుకాణం మొత్తం కూలిపోయింది. పట్టణంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద, పట్టణ ముఖద్వారం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ షెల్టర్లు పడిపోయాయి. పలు దుకాణాలకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకులు గాలికి ఎగిసిపడ్డాయి. వైఎస్ఆర్ కూడలి వద్ద సెంటర్ లైటింగ్ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అలాగే డేఅండ్‌నైట్ కూడలి, కొత్తబ్రిడ్జి రోడ్డు, ఇలిసిపురం రోడ్డులో, అరసవల్లి, గూనపాలెం తదితర ప్రాంతాలో ్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచే పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భోజనాలకు గిరాకీ పీఎన్ కాలనీ: శ్రీకాకుళం పట్టణంలో తుపాను కారణంగా చాలామంది భోజనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోటళ్లు తెరుచుకోక, తీసిన హోటళ్లలో ప్రజలకు సరిపడినంత భోజనం అందించలేక జనాలు భోజనం కోసం పాట్లు పడ్డారు. ఏమిచేయాలో తెలియక హోటల్ వద్ద గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి నెలకొంది. డే అండ్ ైనె ట్ కూడలిలో ఉన్న ఒక్క హోటల్ వద్దే భోజనం దొరికింది. పెట్రోల్ దొరక్క ఇబ్బందులు పట్టణంలో ఉన్న పెట్రోలు బంకులన్నీ ఒక్కసారిగా మూతపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బంకులన్నీ మూతపడ్డాయి. అలాగే పెట్రోలు తీసుకురావాల్సిన వాహనాలు రాకపోవడంతో పెట్రోల్, డీజిల్ లభించలేదు. పునరావాస కేంద్రాల్లో పాట్లు గార: మండలంలో తుపాను పెను విధ్వంసం సృష్టించింది. భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, నెలకొరిగాయి. పలుచోట్ల వరి నేలవాలింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. 20 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. బందరువానిపేట, నగరాలపేట, ట్రైమెక్స్ స్కూల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి సుమారు 2000 మందిని తరలించారు. అయితే బందరువానిపేట పునరావాస కేంద్రంలో జనరేటర్ పనిచేయలేదు. వైద్య సిబ్బంది కూడా పత్తా లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇన్చార్జి ఆర్డీవో సీతారామారావు, తహశీల్దార్ సింహాచలం, ఏవో బి.వి.త్రినాథరావు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. బందరువానిపేట చుట్టుముట్టిన సముద్రుడు - 120 నుంచి 150 అడుగుల ముందుకొచ్చిన సముద్రం - బిక్కుబిక్కుమంటున్న జనం శ్రీకాకుళం సిటీ: హుదూద్ తుపాను బీభత్సానికి బందరువానిపేట భీతిల్లింది. తుపాన్లంటే పెద్దగా ఆందోళనచెందని ఈ గ్రామస్తులు సైతం హుదూద్ ధాటికి తట్టుకోలేకపోయారు. గార మండల పరిధిలోని సుమారు ఐదువేల మంది నివాసముంటున్న ఈ గ్రామం స్వరూపమే మారిపోయింది. ఒకవైపంతా సముద్రం ఉగ్రరూపంలో ఉంటే, మరోవైపంతా వంశధార నీరు పొంగి పొర్లడంతో ఈ గ్రామం నీటి మధ్య ఉంది. ఈ గ్రామానికి ప్రధాన రోడ్డు మార్గం కూడా మరమ్మతులకు గురికావడంతో ఇక్కడి జనానికి ఆందోళన నెలకొంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సముద్రం తీవ్ర ఉధృతి అలలతో సుమారు 120 నుంచి 150 అడుగుల ముందుకు రావడంతో పాటు చూడ్డానికే భయంకరంగా కనపడడంతో నిత్యం సముద్రంలోకి వెళ్లిన వారిని సైతం భయభ్రాంతులకు గురిచేసినట్లైంది. హుదూద్ ప్రభావంతో పెద్ద పెద్ద చెట్లు నేలకొరగగా, రోడ్లు కోతకు గురయ్యాయి. ఇక విద్యుత్‌స్తంభాలు ఎక్కడికక్కడ కూలిపోవడంతో తీవ్ర సమస్యగా మారింది. బందరువానిపేటతో సహా, మొగదాలపాడు, కె.మత్స్యలేశం, కళింగపట్నం తదితర గ్రామలన్నీ విలవిల్లాడాయి. -
రూ.500 కోట్ల నష్టం!
తుపాను దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం పంట నష్టం రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత అత్యధికంగా విద్యుత్ శాఖకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. హుదూద్ తుపానుకు విశాఖ నగరం దారుణంగా దెబ్బతినగా.. ఆ తర్వాత ఆ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా నష్టపోయింది. జిల్లాలో 300 గ్రామాల నుంచి సుమారు లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను కారణంగా ఈనెల 13, 14 తేదీల్లో కూడా జన్మభూమి కార్యక్రమం రద్దు చేసినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి విశాఖ నుంచే సీఎం అధికారిక కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. -
స్తంభించిన వ్యవస్థ
పాలకొండ/రూరల్: హుదూద్ తుపాను పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో పెనుబీభత్సం సృష్టించింది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు తోడు పెను గాలులు భయంకరమైన శబ్ధాలతో రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. పాలకొండలోని ఏలాం కూడలిలో భారీ వృక్షం నివాస గృహాలపై కూలింది. సబ్‌కోర్టు భవనాలపై ఓ వృక్షం కూలిపోయింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సర్వీసులు నిలిపివేయడంతో ఒక్క ప్రయాణికుడు కూడా లేక వెలవెలబోయింది. 1300 ఎకరాల్లో అరటి, కాలిఫ్లవర్‌కు నష్టం వీరఘట్టం: హుదూద్ తుపాను ధాటికి వీరఘట్టం నుంచి పాలకొండ రోడ్డులోని సీఎస్పీ ప్రధాన రోడ్డులో 10 భారీ వృక్షాలు నేలకొరిగాయి. తూడి, వెంకమ్మపేట, రేగులపాడు, వండువ జంక్షన్ల వద్ద ఒక్కొక్క భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. అలాగే వరి వేల ఎకరాల్లో నేలవాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే సుమారు 600 ఎకరాల్లో అరటి పంట, సుమారు 700 సాగవుతున్న కాలిఫ్లవర్ పంట కూడా నాశనం కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అలాగే పాలకొండ, పార్వతీపురం డిపోల నుంచి నడుపుతున్న అన్ని ఆర్టీసీ సర్వీసులను రద్దు చేయడంతో ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురయ్యాయి. మండల కేంద్రంలోని ముచ్చర్లవీధిలోని అలజంగి నారాయణరావుకు చెందిన పూరిళ్లు నేలమట్టమైంది. ఆటోలు ఇతర వాహనాలు తిరగకపోవడంతో జనజీవనం స్తంభించింది. రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. తుపాను సమాచారాన్ని అధికారులు ఏప్పటికప్పడు తెలుసుకుంటూ అప్రమత్తమయ్యారు. నదీతీర ప్రాంతాల్లో తహశీల్దార్ ఎం.వి.రమణ, ఎంపీడీవో బాణం వెంకటరమణ, ఎస్సై ఆర్.శ్రీనువాసరావు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. నిలకడగా వంశధార భామిని: తుపాను ధాటికి మండలం అతలాకుతలమైంది. అరటి తోటలు నేలమట్టమయ్యాయి. పత్తినీటమునిగింది. చెట్లు కూలిపోయాయి. ఈదురు గాలులకు విదు ్యత్ లైన్లు దెబ్బతిని కరెంట్ సరఫరా నిలిచి పోయింది. బస్సులతో పాటు ఇతర వాహనాలు తిరగలేదు. తహశీ ల్దార్ జలారి చలమయ్య, ఎంపీడీవో విజయలక్ష్మి, బత్తిలి ఎస్ఐ సీహెచ్ రామారావు, ఏఎస్ఐ బాలుడు, ఆర్ఐ కూ ర్మారావు తదితరులు పరిస్థితిని పర్యవేక్షించి ఏర్పాట్లు చేశారు. గెడ్డలను పరిశీలించిన అధికారులు సీతంపేట: పాలకొండ-హడ్డుబంగి రోడ్డు మధ్యలో పొంగి పొర్లుతున్న గెడ్డలను మండల ప్రత్యేకాధికారి సుదర్శనదొర, తహశీల్దార్ జి.మంగు, ఎంపీడీవో గార రవణమ్మ పరిశీలించారు. చంద్రమ్మగాటి గెడ్డ, వాబగెడ్డను పరిశీలించారు. రోడ్డుపై పడిపోయిన చెట్లను పరిశీలించి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేశారు. ఆరుచోట్ల కూలిన భారీ వృక్షాలు పాతపట్నం(ఎల్.ఎన్.పేట): పాతపట్నం మండలంలోని నీలమణిదుర్గ అమ్మవారి గుడి సమీపంలో, అచ్చుతాపురంతో పాటు మరో ఆరుచోట్ల భారీ వృక్షాలు నేలకూలిపోయాయి. పాతపట్నం మేజర్ పంచాయతీతో పాటు పలు గ్రామాల్లో ఏడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోయాయి. వీటిని పునరుద్ధరించే పనులు ఏఈ ధర్మారావు ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ప్రజలకు సహాయపడే పనులు చేపట్టడంలో పోలీసులు ముందుగా ఉండాలని ఎస్సై బి.సురేష్‌బాబు సిబ్బందికి పిలుపునిచ్చారు. నేలవాలిన వరి ఎల్.ఎన్.పేట: మండలంలోని లక్ష్మీనర్సుపేట, వాడవలస, దబ్బపాడు, బసవరాజుపేట, మిరియాప్పల్లి, మోదుగువలస, స్కాట్‌పేట గ్రామాల్లో వరికి తీరని నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కోతదశలో ఉన్న వరిపంట నేలకొరిగిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జంబాడ, కొత్తబాలేరు, మురగడలోవ, కొత్తవలస, గోలుకుప్ప, జోగివలస, రోలుగుడ్డి, మెట్టుగూడ, కొత్తజోగివలస, కారిగూడతో పాటు పలు గ్రామాల్లో గిరిజనులు పండిస్తున్న పోడు పంటలకు అపార నష్టం జరిగింది. అరటి, బొప్పాయి, కంది పసపు పంటలకు తీరని నష్టం జరిగిందని గిరిజనులు చెప్పారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫోన్లు పనిచేయలేదు. ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. నాలుగు పూరిళ్లు నేలమట్టం హిరమండలం: మండలంలోని పాతహిరమండ లంలో నాలుగు, గొండిగోడలో నాలుగు పూరిళ్లు నేలమట్టమయ్యాయని తహశీల్దార్ డి.చంద్రశేఖర్ తెలిపారు. అలికాం-బత్తిలి, హిరమండలం-పాతపట్నం రోడ్లపై అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. అధికారులు వాటిని తొలగించి రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించారు. అత్తరాపల్లి, అంబావిల్లి గ్రామాల్లో ఐదు స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తహశీల్దార్ డి.చంద్రశేఖర్, ఇతర అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చెట్టు విరిగి ఇద్దరికి గాయాలు మెళియాపుట్టి: మండలంలో పెద్దలక్ష్మీపురంలో చెట్టుకొమ్మలు విరిగిపడి మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. గంగరాజుపురంలో డాబా ఇళ్లపై మర్రిచెట్టు విరిగిపడింది. అయితే ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. గోపీనాథపురం వద్ద టాటాఏసీ వాహనంపై చెట్టు విరిగిపడింది. ఎంసీపీ కొత్తూరులో మునగచెట్టు విరిగిపడి ఇంట్లో ఉన్న సవర భారతి, సవర నవీన్‌కుమార్ గాయాలకు గురయ్యారు. వీరిని వైద్యం నిమిత్తం 108 సహాయంతో పర్లాకిమిడి ఆస్పత్రికి తరలించారు. కొసమాల గ్రామంలో చెట్టు విరిగిపడడంతో ఒక గేదె మృతి చెందగా, మరో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. మెళియాపుట్టి, ముకుందపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 500 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 20 ఎకరాల్లో చెరుకు పంట నేలకొరిగింది. పలాస-మందస, టెక్కలి-పర్లాకిమిడి రోడ్లపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. గెడ్డలకు గండ్లు కొత్తూరు: మండలంలోని హడ్డుబంగిగెడ్డ, కారిగెడ్డ, కురుడుబట్టి, బలిజవాని గెడ్డతో పాటు పలు గెడ్డలు పొంగిపొర్లాయి. పలు గెడ్డలకు గండ్లు పడ్డాయి. కొత్తూరు వద్ద హడ్డుబంగి గెడ్డకు గండి పడింది. కుద్దిగాం గ్రామంలో కొబ్బరి చెట్టు కూలింది. ఇదే గ్రామంలో తవిటినాయుడు ఇంటిమీదను చెట్టుకూలింది. ఈ ప్రమాదంలో కరిమి కాంతమ్మకు గాయాలు తగిలాయి. వైఆర్‌పేట-నీలకంఠాపురం గ్రామాల మధ్య భారీ వృక్షం కూలింది. కుద్దిగాం వద్ద మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి, పత్తి, అరటి పంటలు వందలాది ఎకరాల్లో నేలకొరిగాయి. వంశధార నదిలో ఆదివా రం నాటికి స్వల్పంగా వరద నీరు చేరింది. దీంతో వసప కాలనీ, కుంటిభద్ర, మాతల, పెనుగోటి వాడ తది తర గ్రామాలు వద్ద వరి నీట ము నింది. ఐటీడీఏ పీవో సత్యనారాయణ, మండల ప్రత్యే క అధికారి లక్ష్మణరావు నేతృత్వంలో స్థానిక తహశీల్దార్ శ్యామ్‌సుందరావు, ఎంపీడీవో రావడ వెంకట్రామన్, ఎస్ఐ వి.రమేష్ తహశీల్దార్ కార్యాలయంలో బసచేసి తుపాను వివరాలు సేకరించారు. అలాగే కుద్దిగాం, మాకవరం తదితర గ్రామాల్లో కాంగ్రెస్ ఓబీసీ జిల్లా శాఖ అధ్యక్షుడు పాలవలస కరుణాకర్ పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలను కోరారు. బాధితులను ఆదుకోవాలి ఎల్.ఎన్.పేట: హుదూద్ తుపాను కారణంగా పంట, ఇళ్లు కోల్పోయిన, గాయాలపాలైన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు. హిరమండలం మండలంలోని పలుగ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇళ్లు కూలిపోయిన బాధితులకు తక్షణ సహాయంగా బియ్యం, కిరోసిన్ వంటి సరుకులు సరఫరా చేయాలని జిల్లా అధికారులను కోరారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు జి.జగన్మోహనరావు, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. -
‘పశ్చిమ’కు తప్పిన తుపాను గండం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాకు హుదూద్ పెనుతుపాను గండం తప్పింది. అయితే తుపాను తీరం దాటిన అనంతరం అల్పపీడనంగా మారటంతో జిల్లాకు భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. తుపాను తీరం దాటే సమయంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్తగా మొగల్తూరు, నరసాపురం మండలాల్లో తీర గ్రామాల నుంచి 8,179 మందిని 23 పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్పపీడనం కొనసాగుతుండటంతో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ ఆదివారం తీర గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. కాగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘తూర్పు’పై కడలి కన్నెర్ర
సముద్రంలో కలసిన 50 ఇళ్లు, మరో 25 గృహాలు ధ్వంసం సామర్లకోటలో చెట్టు మీదపడి ఒకరి మృతి సాక్షి ప్రతినిధి, కాకినాడ: హుదూద్ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతం లోని మత్స్యకార గ్రామాలపై మాత్రం కడలి కన్నెర్ర చేసింది. తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్ సహా 16 మండలాల్లోని 78 గ్రామాల్లో ఈ తాకిడి కనిపించింది. ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేటలో శనివారం రాత్రి నుంచే ఉవ్వెత్తున ఎగసిపడ్డ కెరటాలు కారణంగా దాదాపు 50 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. మరో 25 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిలో పక్కా ఇళ్లు, పూరిళ్లు కూడా ఉన్నాయి. 150 కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. మత్స్యకారుల చేపల షెడ్లు, బోట్లు, వలలు కొట్టుకుపోయాయి. ఈ ఒక్క గ్రామంలో జరిగిన నష్టం రూ. కోటి పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. కాగా, ఉప్పాడ బీచ్‌రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట గ్రామాల్లోకి సముద్రపు నీరు వచ్చింది. ఆ గ్రామాల నుంచి సుమారు 5,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తొండంగి మండలంలో సముద్రం 30 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చింది. పాత చోడిపల్లిపేట, కోదాడ, ఎ.కొత్తపల్లి, పెరుమాళ్లపురం తదితర ప్రాంతాల్లో రెండు మీటర్ల మేర తీరం కోతకు గురైంది. పలు చోట్ల భారీ వక్షాలు నేలకూలాయి. సామర్లకోట పట్టణంలో నేరేడు చెట్టు మీదపడి నేమాని వెంకట్రావు(60) మృతి చెందాడు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరి, అరటి పంటలకు తీవ్రం నష్టం వాటిల్లింది. జిల్లా మొత్తమ్మీద 31,804 మందిని 67 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి వీస్తున్న బలమైన ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లాలో పజలు అవస్థలు పడాల్సి వచ్చింది. రైళ్లు, అంతర్ జిల్లాల బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేయడంతో ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ వైపు రోడ్లు బోసిపోయాయి. జిల్లా అంతటా ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాకినాడ పోర్టులో మూడో రోజు ఆదివారం కూడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప, కలెక్టర్ నీతూ ప్రసాద్ కలెక్టరేట్ నుంచి జిల్లాలో పరిస్థితిని సమీక్షించారు. -
తుఫాన్ ధాటికి విలవిల
బొబ్బిలి: పట్టణంలో హుదూద్ ధాటికి పలు భారీ వృక్షాలు నేలకూలాయి. టీటీడీ కళ్యాణ మండపం, ఆర్అండ్ బీ అతిథిగృహం, పెట్రోల్ బంకు వద్ద, మార్కెట్‌యార్డు వృక్షాలు కూలిపోయాయి. వీటిని తక్షణమే తొలగించినట్లు ఆర్అండ్బీ జేఈ తిరుపతిరావు తెలిపారు. కాగా పట్టణంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌కో డీఈ మసీలామణి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు 100 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు ప్రాథమిక సమాచారం. 6 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. పెందుర్తిలో విద్యుత్ సరఫరా కేంద్రం మరమ్మత్తులకు గురికావడంతో 2,3రోజుల వరకు బొబ్బిలిలో విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. రామభద్రపురం: మండలంలోని ఆదివారం తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరా లేక పలు గ్రామాలు అం ధకారంలో ఉన్నాయి. భారీ వర్షంతో పలువురు ఇబ్బం దులు పడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో మండలంలోని ఎడతెరపి లేని వర్షం కురిసింది. 38 మిల్లీ మీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారీవర్షాల కు వరి,చెరకు, పత్తి ,జొన్న పంటలు నేలమట్టమయ్యాయి. తహశీల్దార్ కార్యాలయంపై కూలిన చెట్లు బొబ్బిలిరూరల్: స్థానిక తహశీల్దార్ ఆవరణలో పెద్ద చెట్లు ఆదివారం కార్యాలయంపై కూలిపోయాయి. దీం తో కార్యాలయ సిబ్బందితో పాటు అధికారులు పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చెట్టు పైభాగం కొంతమేర తహశీల్దార్ కార్యాలయంపై పడగా, ఓ కొమ్మకొంత భాగంగా కారిడార్‌పై ఉండే పైకప్పులోకి చొచ్చుకుపోయింది. కొంతభాగం కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది. చెట్టుకూలిన సమయంలో హెల్ప్‌డెస్క్ నిర్వహిస్తున్న డీటీ కేబీ ఆచారి, ఆర్ఐ సాయికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ స్వర్ణలత, వీఆర్వోలు,సిబ్బంది ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న కార్యాలయం కూలిపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. మరో అరగంటలో మరోచెట్టు కార్యాలయం మరోవైపు కూలిపోయింది. కొన్నికొమ్మలు తొలగించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాసిరెడ్డి విగ్రహం వద్ద ఉన్న ఓ హోట్‌ల్ వద్ద చెట్టుకొమ్మ పడింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నీట మునిగిన పొలాలు మండలంలో పలు గ్రామాల్లో హుదూద్ తుఫాన్‌కు పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆదివారం కురిసిన వర్షాలకు పంటలకు పెద్దగా నష్టం లేకపోయినా సోమవారం నాటి పరిస్థితిని బట్టి నష్టం అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటికే వరి, చోడి పంటలు నేలకొరిగిపోయాయి. కోమటిపల్లి, పారాది, గొర్లెసీతారాంపురం గ్రామాల్లో పంట నీట మునిగింది. విద్యుత్ అంతరాయంతో అవస్థలు గుమ్మలక్ష్మీపురం: హుదూద్ తుఫాన్ కారణంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో విద్యుత్ సరఫరాలేని కారణంగా అంధకారం నెలకొంది. ఏజెన్సీలో బీఎస్ఎన్ఎల్ సేవలు కూడా పనిచేయలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది. విస్తారంగా వర్షాలు గరుగుబిల్లి: హుదూద్ తుఫాన్ కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఈదురుగాలులుతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు గ్రామాల్లో దండోరా వేశారు. మండలంలోని పెద్దూరు, రావుపల్లి, బివి పురం, రావివలస, నాగూరు, చినగుడబ, ఉల్లిబద్ర, లఖనాపురం గ్రామాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. అరటి, చెరుకు, మొక్కజొన్న పంటలు కూడా నేలవాలడంతో నష్టం ఏర్పడిందని పలువురు రైతులంటున్నారు. తుఫాన్ కారణంగా ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వీఆర్ఓలను అప్రమత్తం చేసినట్లు తహశీల్ధార్ కె.సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదులు రానప్పటికీ స్థానికంగా ఉండే వీఆర్ఓలను అప్రమత్తంచేసినట్లు తెలిపారు. తుఫాన్ కారణంగా ఇళ్లు కూలిపోయినా,పంటలకు నష్టం వాటిల్లినా,చెరువులకు గండ్లుపడినా తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామన్నారు. నిరాశ్రయులకు తోటపల్లిలోని జట్టు ఆశ్రమంలో పునరావాస కేంద్రంను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీడీ ఓ పార్వతి,హెచ్‌డీటీ రాధాకృష్ణ తదితరులున్నారు. ఈదురుగాలిలో కూడిన భారీవర్షం కొమరాడ: మండలంలోని ఆదివారం తెల్లవారుజాము 4గంటలనుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసిం ది. ఇళ్లలో నుంచి ఎవరూకూడా బయటకు రాలేదు. అధికారులు ముందస్తుగా దుగ్గి, గుణానపురం, కళ్లికోటలో నిర్వాసిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లే కుండా సదుపాయాలు చేశారు. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆదివారం రాత్రి నాగావళినదిలోకి నీరు అధికంగా చేరే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎస్ఐ జె. ధర్మేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కూలిన నాలుగు విద్యుత్ స్తంభాలు మండలంలోని నాగావళి నది ఆవలివైపువున్న మాదలింగి సమీపంలో నాలుగు విద్యుత్‌స్తంభాలు ఈదురుగాలులకు ఆదివారం కూలిపోయాయి. విద్యుత్ అధికారులు పనుల ను పునరుద్దరిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న చెట్టు కూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
హడలెత్తిన.. విజయనగరం, శ్రీకాకుళం
విఫలమైన సహాయక చర్యలు అరచేతిలో ప్రాణాలతో 22 గ్రామాల్లోని ప్రజలు హుదూద్‌తో చివురుటాకులా వణికిన జిల్లాలు సాక్షి ప్రతినిధులు, విజయనగరం/శ్రీకాకుళం: హుదూద్ తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా కకావికలమైంది. తుపాను విధ్వంసంతో జిల్లా యావత్తూ చివురుటాకులా వణికిపోయింది. తీర ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతాన్ని కూడా తుపాను అతలాకుతలం చేసింది. ఒకవైపు 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో కూడిన ప్రచండ గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో జిల్లా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఏకధాటిగా పెనుగాలులతో వర్షం పడడంతో జన జీవనం స్తంభించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. జిల్లా పూర్తిగా అంధకారమైంది. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. ఎక్కడేం జరుగుతుందో తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా, సహా యక బలగాలున్నా, కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఇవ్వలేకపోయాయి. జామి మండలంలో తాటిచెట్టు కూలడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని: మత్స్యకార గ్రామాల్లోకి సముద్రం చొచ్చుకు రావడంతో ఆ యా గ్రామాల్లోని వారు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడిపా రు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, ఇతర బలగాలు సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీంతో దాదాపు 22గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. విజయనగరం, ఎస్.కోట, నెల్లిమర్ల, డెం కాడ, చీపురుపల్లి, మెరకముడిదాం, గుర్ల, కొత్తవలస, గజపతినగరం, గంట్యాడ, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, బొబ్బిలి, రామభద్రపురం మండలాలు అతలాకుతలమయ్యాయి. పొంగి ప్రవహిస్తున్న నదులు, చెరువులు: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో జిల్లాలో ప్రధానమైన నాగావళి, చంపావతి, గోస్తనీ, గోముఖీ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. చివురుటాకైన శ్రీకాకుళం: ప్రచండ తుపాను హుదూద్ శ్రీకాకుళం జిల్లాను హడలెత్తించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వీస్తున్న పెనుగాలులు, కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో వరి, ఇతర ప్రధాన పంటలు నేలమట్టమయ్యాయి. విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. చెట్టుకూలి మీద పడడంతో ఒకరు మృతి చెందాడు. తుపాను తీరం దాటినా సోమవారమూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలోని 11 మండలాల పరి ధిలో విస్తరించిన తీరప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కా లం గడుపుతున్నారు. సముద్రపు అలలు 2 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సుమారు 100 అడుగుల మేరకు చొచ్చుకురావడంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు వణికి పోతున్నారు. తుపాను తీరం దాటినా సోమవారం రాత్రి వరకు ప్రజలు బయటకు రావద్దని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. -
సహాయక చర్యల్లో పాల్గొనండి: వైఎస్ జగన్
పార్టీ నేతలకు, శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు సాక్షి, హైదరాబాద్ : పెను తుపాను హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటూ బాధితులకు బాసటగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మానవతా చర్యలన్నింటిలోనూ పాల్గొనాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన కోరారు. పెను తుపాను హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం కూడా హెచ్చరికలు చేసిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో హుదూద్ సృష్టించిన విలయం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జగన్మోహన్రెడ్డి ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల పార్టీ నేతలు సుజయ్‌కృష్ణ రంగారావు, బేబి నాయన, ధర్మాన కృష్ణదాస్, రెడ్డిశాంతి, గుడివాడ అమర్నాథ్లతో ఫోన్లో మాట్లాడారు. ఆయా జిల్లాల్లో తుపాను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులను సమీకరించి సహాయక చర్యలకు ఉపక్రమించాలని వారికి ఆయన సూచించారు. -
రూ. 300 కోట్ల నష్టం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ తుపాను ప్రళయ బీభత్సం సృష్టించింది. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో విధ్వంస రచన చేసింది. ఓ వైపు 200 కిలోమీటర్ల వేగంతో వింత శబ్దాలతో విరుచుకుపడిన ప్రచండ ఈదురుగాలులు, మరోవైపు కుంభవృష్టిగా కురిసిన వర్షంతో జిల్లావాసులు భయకంపితులయ్యారు. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారం భమైన హుదూద్ విధ్వంసం ఎటువంటి విరామం లేకుండానే కొనసాగింది. ఆదివారం ఉదయం తుపాను విశాఖ తీరానికి చేరిన సమయంలో ప్రారంభమైన భీకర ఈదురుగాలులు అందరినీ ఆందోళనకు గురి చేశాయి. జిల్లా ప్రజలతో పాటు పశు, పక్షాదులు చిగురుటాకుల్లా వణికాయి. తుపాను తీరం దాటిన తరువాత కూడా ఈదురుగాలులు వెన్నులో వణుకు పుట్టించాయి. తీర ప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం, విజయనగరం మండలాల్లో పరిస్థితి మరింత భయానకంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు. రూ. 300 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులు, భారీ ఎత్తున రాకాసి అలలు తీరంలోకి ఎగిసపడడంతో మత్స్యకారులు భీతిల్లిపోయారు. భగవంతుడిపైనే భారం వేశారు. ఇళ్లు పెకిలించేలా గాలులు, భారీ శబ్దంతో భయభ్రాంతులకు గురయ్యారు. బతికితే చాల నే అభిప్రాయానికొచ్చేశారు. శనివారం రాత్రి 11గంటల నుంచి ఏకధాటిగా పెనుగాలులతో కూడిన వర్షం పడడంతో అ డుగు తీయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదుర్కొన్నారు. కొందరు తమ ఇళ్ల వద్ద బితుకుబితుకుమని గడపగా, మరికొంతమంది అధికారులు ఏర్పాటు చేసిన 18 పునరావాస కేంద్రాల్లో ఉండి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. విశేషమేమిటంటే అక్కడి పరిస్థితులను పర్యవేక్షించేందుకు వెళ్లిన అధికా రుల వద్ద నుంచి కనీసం సమాచారం అందని పరిస్థితి నెలకొంది. ఆదివారం రాత్రైన భీకర గాలులు వదల్లేదు. వర్షం ఆగలేదు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా, సహాయక బలగాలు ఉన్నా, కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినా విలయం వచ్చేసరికి ప్రయోజనంలేకుండా పోయాయి. ఆదివారం అర్థరాత్రి వరకు విజయనగరం, పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల, గుర్ల, ఎస్.కోట మండలాల్లో పెను గాలుల ప్రచండం కొనసాగింది. ఐదేళ్లలో ఇదే భారీ తుపాను ఐదేళ్లలో చూసుకుంటే 2009 సంవత్సరంలో జల్, 2010 సంవత్సరంలో లైలా, 2011 సంవత్సరంలో థేన్, 2012 సంవత్సరంలో నీలం తుపాన్లు సంభవించగా 2013 ఒక్క సంవత్సరంలో పై-లీన్, హెలిన్, లెహర్ తుఫాన్లతో పాటు తీవ్ర అల్పపీడనాలు వరుసగా అటు రైతులు, ఇటు మత్స్యకారులను కుదేలుచేశాయి. తాజాగా హుదూద్ తుపాను విధ్వంసం సృష్టించడంతో అటు తీర ప్రాంత గ్రామాలతో పాటు జిల్లాలోని 34 మండలాలకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. గతంతో పోల్చుకుంటే హుదూద్ విధ్వంసం భారీ స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చెరువులకు గండ్లు జిల్లావ్యాప్తంగా భారీ మొత్తంలో రహదారులు తుపాను దాటికి ధ్వంసం కాగా...చెరువులకు గండ్లు పడ్డాయి. విజయనగరం పట్టణంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పెద్ద చెరువుకు గండిపడటంతో దిగువ ప్రాంతానికి వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. విజయనగరంలో మరో రెండు చెరువులు గండ్లు పడ్డాయి. దీంతో తోటపాలెం, సరస్వతినగర్లలోకి వరద నీరు చేరింది. ఇక రాజీవ్ నగర్ కాలనీ, కేఎల్‌పురం, కన్యకాపరమేశ్వరి జంక్షన్, న్యూపూర్ణ జంక్షన్, గంటస్తంభం ఏరియా, వీటి అగ్రహారం బీసీ కాలనీలు ముంపునకు గురయ్యాయి. తుపానుబీభత్సంతో సుమారు 5000 వేల వరకు చెట్లు నేలకొరిగాయి. బీకర గాలలు ఇళ్లను, చెట్లును పెకిలించేసాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 ఇళ్లు నేల కూలినట్టు తెలుస్తోంది. దారిపొడవునా భారీ చెట్లు నెలకొరగడంతో మత్స్యకార గ్రామాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్. కోట తహశీల్దార్ కార్యాలయంపై భారీ వృక్షం కూలిపోయింది. బొబ్బిలి ఆశ్రమ పాఠశాలలో భారీ చెట్లు కూలిపోవడంతో అక్కడి విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. కురుపాంలో రోడ్డుపై భారీ వృక్షం కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా అటు చెట్లు, ఇటు విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ రోడ్డుపై కూలడం, బలమైన గాలులు వీస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్నిచోట్ల రోడ్లుపై ఉన్న వాహనాలు ఈదురు గాలులకు పల్టీకొట్టాయి. కొన్నిచోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. జిల్లా రైతాంగం ప్రధానంగా పండించే లక్షా 10వేల 505 హెక్టార్లలో వరి పంట సైతం నీటి పాలయ్యే పరిస్థితిలు కనిపిస్తున్నాయి.వేలాది హెక్టార్లలో మొక్కజొన్న, ప్రత్తి , చెరకు, అరటి కూరగాయలు పంటలు నీటి పాలయ్యాయి. ఈ నష్టాన్ని అంచనా వేయలేమని అధికారులు చేతులేత్తేశారు. అత్యవసర సేవలైన విద్యుత్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. సుమారు 675 విద్యుత్ స్తంభాలు, 65ట్రా న్స్ఫార్మర్లు నేలకొరిగినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఈ సంఖ్య మరింత భారీగా ఉండొచ్చని తె లుస్తోంది. దీంతో శనివారం నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఇంతవేగంగా పునరుద్ధరించే పరిస్థితి లేదు. ఫలితంగా జిల్లా అంతా గాడ అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బీఎస్ఎన్ఎల్ స్తంభాలు, కేబుళ్లు ధ్వంసమయ్యాయి. సెల్‌ఫోన్ టవర్లు నేలకూలాయి. దాదాపు సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీంతో ఫోన్లు దాదాపు మూగబో యాయి. ఇంటర్నెట్ పరిస్థితి కూడా అంతే.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయకపోవడం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోవడంతో ఎక్కడేం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి అన్ని రకాలుగా కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.300కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికార వర్గాలు ప్రాథమిక అంచనా వేశాయి. జామిలో ఒకరి మృతి భీకరగాలులకు తాటిచెట్టు పడి జామిలో కర్రి రమేష్(22) అనే యువకుడు మృతి చెందాడు.అలాగే జిల్లాలో పలుచోట్ల వందలాది పశువులు మృత్యువాత పట్టాయి. ఎక్కడికక్కడ భయానక పరిస్థితులుండటంతో చూడటానికి కూడా జనాలు వెళ్లలేకపోయారు. తమ ప్రాణాలను కాపాడుకోవడమే కష్టంగా భావించారు. ముంపునకు గురయ్యాయి. -
బాధితులకు కేర్ ఆస్పత్రి రూ.50 లక్షల విరాళం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకోసం కేర్ ఆస్పత్రి యాజమాన్యం రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. కేర్ ఆస్పత్రి అధినేత సోమరాజు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్రంలో హుదూద్ తుఫాను సృష్టించిన విలయం అంతాఇంతా కాదని, తుపాను బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రూ.50 లక్షలు ఇచ్చినట్టు సోమరాజు పేర్కొన్నారు. ప్రకృతి విలయాలు సంభవించిన సందర్భాల్లో తమ వంతు బాధ్యతగా సాయమందించేందుకు ఎప్పుడూ ముందుంటామని కేర్ ఆస్పత్రి అధినేత తెలిపారు. -
ముప్పు తప్పింది గానీ..
ఏలూరు:రెండు రోజులపాటు జిల్లా ప్రజలను వణికించిన హుదూద్ తుపాను ముప్పు తప్పింది. అయితే, తుపాను అల్పపీడనంగా మారడంతో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తుపాను తప్పినందుకు రైతులు సంతోషిస్తున్నా.. వర్షాలు కురుస్తాయనడంతో పంటలు ఏమైపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా తుపాను ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులు వీయగా, ఆదివారం సాయంత్రం నుంచి గాలుల తీవ్రత పెరిగింది. దీంతో చాలాచోట్ల వరి చేలు నేలవాలాయి. అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక గ్రామాల్లో అలలు ఎగిసిపడ్డాయి. రెండు గ్రామాల్లోనూ సముద్ర తీరం కోతకు గురికాగా, తాడిచెట్లు కొట్టుకుపోయూరుు. పెద్దగా వర్షం కురవకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొనసాగుతున్న అప్రమత్తత తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెండు రోజులపాటు రేరుుంబవళ్లు అప్రమత్తంగా పనిచేసిన అధికారులు.. విధుల్లోనే కొనసాగు తున్నారు. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించారు. ముంపు పరిస్థితులు తలెత్తితే తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలావుండగా, తీరప్రాంతాలైన నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, యలమంచిలి మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నారుు. నరసాపురం మండలానికి చెందిన 5,275 మంది, మొగల్తూరు మండలానికి చెందిన 1,250 మంది, యలమంచిలి మండలంలో 815 మంది, కాళ్లలో 485 మంది, భీమవరం మండలంలో 354 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. తీర గ్రామాలకు ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి నరసాపురం మండలం తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. నేడు, రేపు జన్మభూమి సభలు రద్దు తుపాను తప్పినా.. అల్పపీడనం జిల్లాపై ప్రభావం చూపే పరిస్థితి ఉండటంతో సోమ, మంగళవారాల్లో జరిగే జన్మభూమి గ్రామ సభలను రద్దు చేశారు. పరిస్థితులు చక్కబడిన అనంతరం తిరిగి సభలు నిర్వహించాలని నిర్ణరుుంచారు. ఇదిలావుండగా, పాఠశాలలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. -
విశాఖకు ‘పశ్చిమ’ సేనలు
ఏలూరు అర్బన్/ఏలూరు టూటౌన్ :హుదూద్ తుపాను విసిరిన జల ఖడ్గం ధాటికి కకావికలమైన విశాఖపట్నంలో పరిస్థితులను చక్కదిద్దేం దుకు జిల్లా నుంచి మునిసిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆదివారం రాత్రి పెద్దఎత్తున తరలి వెళ్లారు. అక్కడ చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో వీరంతా పాలు పంచుకుంటారు. ఏలూరు నగరపాలక సంస్థ, ఐదు మునిసిపాలిటీల నుంచి 550 మంది పారిశుధ్య సిబ్బంది, 17 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు విశాఖపట్నానికి తరలి వెళ్లారు. వీరిలో ఏలూరు నుంచి 200 మంది పారిశుధ్య కార్మికులు, 9మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, భీమవరం మునిసిపాలిటీ నుంచి 100 మంది పారిశుధ్య సిబ్బంది, ముగ్గురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, నరసాపురం నుం చి 50 మంది పారిశుధ్య కార్మికులు ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు, పాలకొల్లు నుంచి 50 మంది పారిశుధ్య కార్మికులు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, తాడేపల్లిగూడెం నుంచి 50 మంది పారిశుధ్య సిబ్బంది, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, తణుకు నుంచి 100 మంది పారిశుధ్య కార్మికులు, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వీరంతా సోమవారం విశాఖ చేరుకుని జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ జీవీఎస్ఎన్ మూర్తికి రిపోర్ట్ చేస్తారని మునిసిపల్ వర్గాలు తెలిపారుు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నలుగురు తహసిల్దార్లు, 30మంది వీఆర్వోలను తుపాను బాధిత ప్రాంతాలకు పంపిస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. వీరందరికీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. తుపాను తీరం దాటిన అనంతరం కలెక్టర్ భాస్కర్ శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. తుపాను సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు అవసరమైతే ఆధునిక యంత్రాలనుకూడా పంపిస్తామని అక్కడి కలెక్టర్లకు చెప్పారు. తరలివెళ్లిన విద్యుత్ ఉద్యోగులు విశాఖపట్నంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యల్లో పాలు పంచుకునేందుకు జిల్లా నుంచి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని అక్కడికి పంపించినట్టు ఎస్ఈ సీహెచ్.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏడుగురు డీఈలు, 20 మంది ఏడీఈలు, 37 మంది ఏఈలు, నైపుణ్యం గల 360 మంది సిబ్బందిని విశాఖపట్నం తరలించామని ఆయన వివరించారు. 100 కిలోమీటర్ల నిడివి గల కండక్టర్ వైర్, 90 ట్రాన్స్ఫార్మర్లను కూడా పంపించామన్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ మిరియూల శేషగిరిరావు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో 40 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయ్ హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు జిల్లాలో 33 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 6, 12 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 34 దెబ్బతిన్నాయని ఎస్ఈ చెప్పారు. వాటికి వెంటనే మరమ్మతులు చేరుుంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. యలమంచిలి మండలం కత్తవపాలెం, దొడ్డిపట్ల, నిడదవోలు మండలం ప్రక్కిలంక, రామన్నగూడెం, వీరవాసరం మండలం శృంగవృక్షం, భీమవరం, తాడువాయి, ఎ.పోలవరం తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు ఎస్ఈ వివరించారు. పెరవలిలో చెట్టుకూలి విద్యుత్ లైను పాడైందని, వెంటనే మరమ్మతులు చేయించామని చెప్పారు. ఆకివీడు, కోళ్లపర్రు గ్రామాల్లో 5 కేవీ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వాటికి కూడా తక్షణమే మరమ్మతులు చేయించామని చెప్పారు. -
‘హుదూద్’ ఏం చేసేనో..?
‘తుపాను తీవ్రత లేకుంటే జిల్లాలోని అన్ని పంటలకూ మేలు జరుగుతుంది. వర్షాభావంతో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు వడబడుతున్నాయి. సాధారణ స్థాయిలో వర్షం పడితే పంటల దిగుబడి పెరుగుతుంది. కానీ తీవ్రరూపం దాల్చితే మాత్రం పత్తి, వరి పంటలకు కొంతమేర నష్టం తప్పదు. పత్తిని చీడపీడలు ఆశిస్తాయి.’ సాక్షి, ఖమ్మం: హుదూద్ తుపాను జిల్లా రైతాంగానికి ఓవైపు ఆశలు రేకెత్తిస్తుండగా.. మరోవైపు ఆందోళన కలిగిస్తోంది. పంట చేతికి వచ్చిన రైతులు ఆందోళనకు గురవుతుండగా పంట వడలిపోతున్న రైతుల్లో ఉత్సాహం పెల్లుబికుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా తీరాన్ని వణికిస్తున్న ఈ తుపాను జిల్లాలో సాధారణంగా ఉంటే వర్షాభావంతో వడబడతున్న పంటలకు మేలు జరుగుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై దీని ప్రభావం బాగా ఉంటే ఇది జిల్లాలోని పంటలపైనా పడుతుంది. పత్తి, వరి, మిర్చి పంటలకు కొంతమేర నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే తుపానులు జిల్లాలో చివరి దశలో ఉన్న పంటలపై ప్రభావం చూపుతుంటాయి. గతంలో వర్షాలు ఆశించిన స్థాయిలో పడినా జల్, నీలం తుపానుల ప్రభావంతో జిల్లాలో చేతికి వచ్చిన పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతం మీదుగా వచ్చే తుపానులు తెలంగాణలో ఎక్కువగా జిల్లాపైనే ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఓ మోస్తారు వర్షం పడితే జిల్లాలో సాగు చేసిన పంటలకు ఉపయోగపడుతుంది. తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడక్కడ చేతికి వచ్చిన పత్తి, బోరుబావుల కింద సాగు చేసిన కంకి దశలో ఉన్న వరి దెబ్బతింటాయి. జిల్లాలో వరి 1.12 లక్షల హెక్టార్లు, పత్తి 1.68 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 18 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఎండుతున్న పంటలు.. ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాల మందగమనంతో జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 205.4 మి.మీ వర్షపాతం తక్కువగా నమోదైంది. గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాభావం ఏర్పడటంతో వర్షధారంగా సాగు చేసిన పత్తి వడబడిపోతోంది. ముదిగొండ, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, వైరా, కామేపల్లి, కారేపల్లి, బోనకల్, చింతకాని, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, బూర్గంపాడు, కొత్తగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి, పాల్వంచ, కొత్తగూడెం, మధిర ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోయేదశకు చేరుకుంది. కరెంటు కోతలతో బోరుబావుల కింద తిరుమలాయపాలెం, బయ్యారం, బూర్గంపాడు, కొత్తగూడెం, ఏన్కూరు ప్రాంతాల్లో సాగు చేసిన వరి పంట నెర్రెలు వారింది. ఈ నేపథ్యంలో తుపానుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. తీవ్రత లేకుంటే మేలు.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా వచ్చే హుదూద్ తుపాను జిల్లాలోని భద్రాచలం డివిజన్, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లోకి ప్రవేశించనుంది. సాధారణస్థాయిలో వర్షం పడితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు మేలు జరుగుతుంది. కొంత తీవ్రతవుంటే మాత్రం సత్తుపల్లి, దమ్మపేట, పెనుబల్లి, భద్రాచలం డివిజన్లోని తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని వరికి నష్టం కలగనుంది. ఇక్కడ కంకి దశకు చేరుకున్న వరి తుపాను తీవ్రతతో నేలవాలనుంది. సాగు చేసిన మిర్చి పంటలో నీరు నిలిచి కుళ్లిపోనుంది. ఇక జిల్లా అంతటా కాయ పగులుతున్న పత్తికి కొంతమేరకు నష్టం వాటిల్లనుంది. తీవ్రత అంతగా లేకుంటే అన్ని పంటలకు మేలు జరుగుతుందని అంటున్నారు. యంత్రాంగం అలర్ట్.. హుదూద్ తీవ్రత లేకున్నా జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమైంది. కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఆదేశాలతో కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోపై తుపాను ప్రభావం ఎలా ఉండనుంది..? ఇది జిల్లాపై ఎలా ప్రభావం చూపుతుందోనని అధికారులు అంచనా వేస్తున్నారు. 13న జిల్లాలోకి తుపాను వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేయడంతో ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. చినుకుపడితేనే పంటదక్కేది.. కొత్త వెంకట్‌రెడ్డి, నాగినేనిప్రోలు, బూర్గంపాడు కరెంట్ మోటార్లను నమ్ముకుని వేసిన వరిపంట కోతలతో దెబ్బతింటోంది. పట్టుమని రెండుగంటలు కూడా కరెంట్ ఉండటం లేదు. ఇప్పటికే చాలా వరకు పంట ఎండిపోతోంది. గట్టి వానపడితే పంట కొంతైనా చేతికివస్తుంది. లేకపోతే అంతా ఎండిపోతుంది. వానకోసం ఎదురుచూస్తున్నాం.. పేరం పుల్లారెడ్డి, సంజీవరెడ్డిపాలెం, బూర్గంపాడు సరిగా వానలు లేకపోవటంతో పత్తిపంట గిడ సబారింది. పగటిపూట ఎండకు చేలు కిందకు వాలుతున్నాయి. పూత,కాత టైమ్‌లో చినుకులు పడితే తప్ప పత్తిచేతికి రాదు. బెట్టకు ఇప్పటికే పూత,పిందె రాలిపోతున్నాయి. తుపాను ఎక్కువ రాకుండా ఓ మోస్తరుగా రెండు, మూడు రోజులు పడాలి. -
హుదూద్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
నేటి నుంచి 16 వరకు మోస్తరు నుంచి భారీవర్షాలు హైదరాబాద్: హుదూద్ తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ఇన్చార్జి డెరైక్టర్ సీతారాం చెప్పారు. హుదూద్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తుండడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో వలె ఇక్కడ ఈదురుగాలులు ఉండబోవని, కాబట్టి చెట్లు కొమ్మలు విరిగిపడడం, కరెంటు స్తంభాలు కూలడం వంటివి జరగవన్నారు. ఆదివారం వేకువ జామున ఖమ్మం జిల్లాలో వర్షాలు ప్రారంభమవుతాయన్నారు. అక్కడి నుంచి వరుసగా వరంగల్, కరీంనగర్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయన్నారు. అయితే హుదూద్ తీరం దాటాకనే పూర్తి సమాచారం వెల్లడవుతుందని పేర్కొన్నారు. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ చిరుజల్లులు గానీ... మోస్తరు వర్షాలు కానీ పడే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, ఒక మోస్తరు వర్షాల వల్ల కంకి దశకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలకు మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే భారీవర్షాలు కురిస్తే మాత్రం చివరి దశకు వచ్చిన పత్తి, వరికి నష్టం జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆలస్యంగా వేసిన వరి సహా కూరగాయల పంటలకు ఈ తుఫాను మేలు చేకూర్చుతుందని చెబుతున్నారు. ఖరీఫ్‌లో వర్షాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో 9 జిల్లాల్లోని 352 మండలాలు వర్షాభావంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుదూద్ ప్రభావంతో పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడితే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి రబీలో వేయబోయే పంటలకు సాగు నీటి సమస్య లేకుండా ప్రయోజనం కలుగుతుంది. -
పెను గండం
81 కేంద్రాలకు 30,395 మంది తరలింపు ఇంకా తరలించాల్సింది 59,197 మందిని పెనుగాలులకు నేలకొరిగిన చెట్లు ఎగసిపడుతున్న సముద్రపు అలలు కెరటాల ధాటికి హార్బర్లో కూలిన గోడ జిల్లాకు మరో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ నిలిచిపోయిన రవాణా వ్యవస్థ హుదూద్ గుప్పెట్లో విశాఖ విలవిల్లాడుతోంది. పెను తుఫాన్ ప్రభావంతో ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న కడలి కెరటాలు చెలియలి కట్టదాటి తీరం వెంబడి ఉన్న కట్టడాల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ముందుకు దూసుకువచ్చిన సముద్రంతో బీచ్ అల్లకల్లోలమైంది. సాగర భీకర గర్జనకు మత్స్యకార గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. బలమైన గాలులు వీస్తూ భయకంపితులను చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి గాలుల తీవ్రత హెచ్చడంతో పలుచోట్ల కరెంటు స్తంభాలుపడిపోయాయి. విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. హుదూద్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా హైవేలో దాదాపు వాహనాల రాకపోకలను నిషేధించారు. రైలు, బస్సు, విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం అనుక్షణం జిల్లా అంతటిని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఆదివారం ఉదయం గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం సమీపంలో తీరం దాటే వేళ పెనుతుఫాన్ మరింత ఉధృత రూపం దాల్చే ముప్పు ఉండడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలతో ఉన్నారు. ఈ పెనుగండం దాటేలా చూడాలని గంగమ్మను వేడుకుంటున్నారు. గరిష్ట స్థాయిలో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ రూరల్: పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ హుదూద్ విశాఖపైకి దూసుకువస్తోంది. అత్యంత శక్తివంతంగా ‘అల’జడి రేపుతూ గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉప్పెనను మోసుకొస్తోంది. ముప్పుకు ముందస్తు సంకేతంగా శనివారం పెనుగాల వర్షంతో అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోడానికి త్రివిధ దళాలతో పాటు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉంది. పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పరిశ్రమల్లో రాత్రి విధులను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. రవాణా వ్యవస్థను నిలిపివేసింది. తుపాను హెచ్చరికలతో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు, పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోటెత్తిన సముద్రం తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు రెండు మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. కెరటాల ధాటికి ఫిషింగ్ హార్బర్లో గోడ నేలకూలింది. జిల్లాలో చోలా చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రధానంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రం పోటెత్తుతోంది. ఇక్కడ సముద్రం దాదాపు 60 అడుగుల మేర ముందుకొచ్చింది. మత్స్యకారులందరూ ముందు జాగ్రత్తగా తెప్పలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. సముద్రం పోటు మీద ఉండడంతో ప్రత్యేక పోలీసు బలగాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా గ స్తీ నిర్వహిస్తున్నారు. బీచ్ రోడ్డు మూసివేత పర్యాటకులను పోలీసులు బీచ్‌లోకి అనుమతించడం లేదు. శనివారం ఉదయం నుంచే సందర్శకులను సముద్ర తీరం నుంచి వెనక్కు పంపించారు. శనివారం సాయంత్రం నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి తీర ప్రాంత రోడ్డులో రాకపోకలను పోలీసులు నిషేధించారు. సముద్ర తీవ్రతను చూసేందుకు భారీగా సందర్శకులు బీచ్‌కు వచ్చినప్పటికీ పోలీసులు వారిని అనుమతించలేదు. నేలకొరిగిన చెట్లు శుక్రవారం రాత్రి నుంచి వీచిన గాలుల ధాటికి జిల్లాలో అనేక చోట్లు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విశాఖకు మరిన్ని బలగాలు హుదూద్ తుపాను విశాఖ పరిసర ప్రాంతాల నుంచి తీరం దాటనుండడంతో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్రం నుంచి భారీగా రక్షణ దళాలు విశాఖకు చేరుకున్నాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ హెలీకాఫ్టర్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రెండు ఆర్మీ బృందాలు అచ్యుతాపురంలో ఒక పాలిటెక్నిల్ కళాశాలలో మకాం వేశాయి. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీర, తుపాను ప్రభావ మండలాలకు చేరుకున్నాయి. పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి, అనకాపల్లి, కశింకోట, మునగపాక, కె.కోటపాడు, దేవరాపల్లి, చోడవరం, మాడుగుల, చీడికాడ, బుచ్చయ్యపేట, రావికమతం, కోటవురట్ల, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట మండలాల్లో ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అధనంగా గజియాబాద్ నుంచి మరో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు రానున్నాయి. తుపాను ప్రభావం విశాఖపైనే అధికంగా ఉంటుందని నిపుణలు అంచనాల మేరకు ఒరిస్సాలో ఉన్న మరో 3 బృందాలు విశాఖకు వస్తున్నారు. మొత్తంగా 12 బృందాలను జిల్లాలో అన్ని మండలాలోను సిద్ధంగా ఉంచుతున్నారు. వీటితో పాటు 30 నేవీ టీమ్‌లు కూడా మండలాలకు చేరుకున్నాయి. మండలాలకు బోట్లు ముంపు ప్రభావిత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బోట్లను తరలించారు. పాయకరావుపేట మండలంలో గజపతినగరం, పెంటకోట గ్రామాలకు ఒక్కో బోటు, నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, పెదతీనార్లకు, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపేట, రేవుపోలవరం గ్రామాలకు, అనకాపల్లి, రాంబిల్లి మండలం దిమిలి, నారాయణపురం, మునగపాక మండలం చూచుకొండ, చోడవరం మండలం పి.ఎస్.పేట, యలమంచిలి, కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామాలకు ఒక్కో బోటను సిద్ధం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు మరో 10 బోట్లు పంపించారు. నిలిచిపోయిన రవాణా వ్యవస్థ తుపాను కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. అతి భారీ వర్షాలు, పెనుగాలులు హెచ్చరికలతో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. బస్సు సర్వీసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి బంద్ అతిభారీ వర్ష సూచనలతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు శనివారం సాయంత్రం 7 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అత్యవసర వాహనాలు, అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలింపు తీర ప్రాంత, తుపాను ప్రభావిత మండలాల్లో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్బన్‌లో 26, రూరల్‌లో 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల్లో ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించడం లేదు. దీంతో పోలీసులు వారి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారు సైతం తిరిగి కొంత మంది వెనక్కు వచ్చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. శనివారం రాత్రికి 40 వేల మందిని తరలించారు. ప్రతి పునరావాస కేంద్రానికి డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్చార్జ్గా నియమించారు. వంటలు చేసి కేంద్రాల్లో ప్రజలకు అందజే స్తున్నారు. సింహాచలం దేవస్థానం వారు 5 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల వద్ద బియ్యం, పప్పు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌లను సిద్ధంగా ఉంచారు. -
హుదూద్‌పై హై అలర్ట్
ఒంగోలు టౌన్: హుదూద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించగా, తాజాగా పలు సూచనలు చేసింది. తీర ప్రాంత మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు తుఫాన్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ఆయా మండల కేంద్రాల్లోనే ఉండాలన్నారు. మండల స్థాయిలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాన్ సమయంలో సముద్రం పొంగి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నందున మత్స్యకారుల వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. మత్స్యకార గ్రామాల్లోని పెద్దలను కలిసి తగిన సూచనలు అందించాలన్నారు. ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, రోడ్లు భవనాలశాఖ, అగ్నిమాపకశాఖ, గ్రామీణ నీటిసరఫరాశాఖ, పౌరసరఫరాలశాఖ, మత్స్యశాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి వారిని అక్కడ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించి శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వారికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. పెట్రోలు బంకుల్లో తగినంత పెట్రోల్, డీజిల్‌ను అత్యవసర సేవల నిమిత్తం నిల్వ ఉంచాలని ఆ బంకుల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ సమయంలో ఏమైనా విపత్కర పరిస్థితులు సంభవిస్తే ప్రజలు వెంటనే తమ పరిధిలోని కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని కలెక్టర్ విజయకుమార్ కోరారు. డీఎస్పీ ఆఫీసులో కంట్రోల్ రూం ఒంగోలు క్రైం: హుదూద్ తుఫాన్ సందర్భంగా ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ పి.జాషువా తెలిపారు. తుఫాన్ సందర్భంగా ఎలాంటి సమస్యలు రేకెత్తినా వెంటనే కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వన్‌టౌన్, టూటౌన్, తాలూకా, చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి, కొత్తపట్నం పోలీస్స్టేషన్ల పరిధిలో ఎలాంటి సమస్య తలెత్తినా కంట్రోల్‌రూంకు ఫోన్ చేసి సమాచారమందించాలన్నారు. ఈ కంట్రోల్ రూంలో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారని పేర్కొన్నారు. కంట్రోల్ రూం నంబర్లు 08592 232638, 73963 19191, 96186 15893 ను సంప్రదించాలని డీఎస్పీ జాషువా తెలిపారు. తీర ప్రాంత వైద్యాధికారులు విధుల్లో ఉండాలి: డీఎంహెచ్‌వో ఒంగోలు సెంట్రల్: తీర ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా విధుల్లో ఉండి అత్యవసర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే చంద్రయ్య శుక్రవారం ఆదేశించారు. ప్రతి ఆరోగ్యకేంద్రంలో వైద్య బృందాలు తక్షణ వైద్య సేవలు అందించడానికి అవసరమైన వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హుదూద్‌ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి కందుకూరు: హుదూద్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ ఎ.మల్లికార్జున సూచించారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుఫాన్ హెచ్చరికల కేంద్రం నుంచి తాజాగా అందించిన సమాచారం మేరకు తుఫాన్ ప్రభావం జిల్లాపై కూడా బలంగా ఉంటుందన్నారు. ఈమేరకు డివిజన్ పరిధిలోని తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఉలవపాడు, సింగరాయకొండ, గుడ్లూరు, జరుగుమల్లి మండాలల్లోని కొన్ని గ్రామాలపై ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో తుఫాన్ వస్తే ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించామన్నారు. అలాగే సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఏ ప్రమాదం వచ్చినా వెంటనే కంట్రోల్ రూంకి సమాచారం ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూంలో డీఏఓ 8886616055, 08598-223235 నంబర్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే తీర ప్రాంత గ్రామాల్లోని 30 నుంచి 40 మంది ఫోన్ నంబర్లు సేకరించి వారికి తుఫాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుగులో మేసేజ్‌లు పంపుతారన్నారు. -
కళింగపట్నంలో భారీ వర్షం, ఎగిసిపడుతున్న అలలు
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో హధూద్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరం వద్ద ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావంతో సముద్రం తీవ్ర ఆటుపోట్లకు గురికావడంతో అల్లకల్లోలంగా ఉంది. అలలు 2 మీటర్ల ఎత్తు ఎగసిపడుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాన్ సహాయ చర్యల్తో పాల్గొనాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సహాయక చర్యల కోసం 8 హెలికాఫ్టర్లను సిద్ధం చేశారు.