అంధకారంలో ఉన్న విశాఖ పట్టణానికి మరో 24 గంటల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ‘సాక్షి’కి తెలిపారు.
రేపు నగరం మొత్తం.. ఉత్తరాంధ్రకు మరో 2 రెండు రోజులు
సాక్షి, హైదరాబాద్: అంధకారంలో ఉన్న విశాఖ పట్టణానికి మరో 24 గంటల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ‘సాక్షి’కి తెలిపారు. సింహాద్రి ఎన్టీపీసీ ఉత్పత్తికి వీలుగా వేమగిరి నుంచి స్టార్టప్ విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు.
ఫలితంగా పీజీసీఎల్ నుంచి 80 నుంచి 90 మెగావాట్ల విద్యుత్‌ను విశాఖ నగరానికి అందించడానికి వీలుందని తెలిపారు. అయితే ఇది పూర్తిగా అత్యవసర సర్వీసులకే పరిమితమని చెప్పారు. తర్వాత మరో 24 గంటల్లో నగరం మొత్తం విద్యుత్ సరఫరా జరిగే వీలుందన్నారు. విజయనగరం, శ్రీకాకుళంతో పాటు విశాఖ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టవచ్చన్నారు.
ఉత్తరాంధ్రలో మొత్తం 14 టవర్లు కుప్పకూలాయని, 20 వేల స్తంభాలు వంగిపోయాయని అధికారులు చెప్పారు. మూడు జిల్లాల్లోనూ రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల స్తంభాలు, ఇతర సామగ్రి తరలింపు ఇబ్బందిగా ఉంది. జిల్లా కేంద్రాలకు మరో 24 గంటల్లో అవసరమైన సామగ్రి చేరుతుందని విద్యుత్ శాఖ చెబుతోంది. ఏదేమైనప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు కనీసం వారం రోజులు పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.