రాష్ట్రవిభజన తర్వాత(2014–2017) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ఈ విచారణ ఎలాంటి అడ్డంకికాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణకు కేంద్రం ఆదేశాలు జారీచేసే ముందు పరిశీలించిన రికార్డుల(నోట్ షీట్)ను న్యాయస్థానానికి సమర‍్పించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన స్టాండింగ్ కౌన్సిల్ కేఎల్‌ఎన్ రాఘవేంద్రారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి నోట్‌ను అందజేయాలంది. విచారణను జూన్ 9వ తేదీకి వాయిదావేసింది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ మధ్య ‘విద్యుత్’పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ తమకు విద్యుత్ చార్జీలు బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో కేంద్రం గతేడాది ఆగస్టులో కీలక ఉత్తర్వులిచి్చంది. ఏపీ వాదనతో ఏకీభవించిన కేంద్రం అసలు(రూ.3,442 కోట్లు), లేట్ పేమెంట్ సర్‌చార్జి కింద(రూ.3,315 కోట్లు) కలిపి మొత్తం రూ.6,757 కోట్లను ఏపీకి చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 30 రోజుల్లోగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీకి తక్షణమే బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది.
కేంద్రం ఆదేశాలపై సీజే ధర్మాసనం స్టే విధించడం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇటీవల మళ్లీ విచారణ చేపట్టింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్థికసాయం పొంది, విద్యుత్తును ఉత్పత్తి చేసి, తెలంగాణకు సరఫరా చేశాయన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం విభజన సందర్భంగా ఏర్పడిన వివాదాస్పద సమస్యలకు మాత్రమే వర్తిస్తుందని, ఈ విద్యుత్ బకాయిలకు దానితో సంబంధం లేదన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం బకాయిల వసూలుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి మాత్రమే ఆదేశాలు రావాలని, విద్యుత్ శాఖ కార్యదర్శికి ఆ అధికారంలేదని గతంలో తెలంగాణ వాదించింది. అయితే తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించాల్సి ఉండటంతో ధర్మాసనం విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment