Vidyuth Sowdha
-
మధ్యవర్తిత్వానికి ఈ విచారణ అడ్డంకి కాదు
రాష్ట్రవిభజన తర్వాత(2014–2017) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు ఈ విచారణ ఎలాంటి అడ్డంకికాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణకు కేంద్రం ఆదేశాలు జారీచేసే ముందు పరిశీలించిన రికార్డుల(నోట్ షీట్)ను న్యాయస్థానానికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన స్టాండింగ్ కౌన్సిల్ కేఎల్ఎన్ రాఘవేంద్రారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి నోట్‌ను అందజేయాలంది. విచారణను జూన్ 9వ తేదీకి వాయిదావేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ మధ్య ‘విద్యుత్’పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ తమకు విద్యుత్ చార్జీలు బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో కేంద్రం గతేడాది ఆగస్టులో కీలక ఉత్తర్వులిచి్చంది. ఏపీ వాదనతో ఏకీభవించిన కేంద్రం అసలు(రూ.3,442 కోట్లు), లేట్ పేమెంట్ సర్‌చార్జి కింద(రూ.3,315 కోట్లు) కలిపి మొత్తం రూ.6,757 కోట్లను ఏపీకి చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 30 రోజుల్లోగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీకి తక్షణమే బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఆదేశాలపై సీజే ధర్మాసనం స్టే విధించడం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇటీవల మళ్లీ విచారణ చేపట్టింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్థికసాయం పొంది, విద్యుత్తును ఉత్పత్తి చేసి, తెలంగాణకు సరఫరా చేశాయన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం విభజన సందర్భంగా ఏర్పడిన వివాదాస్పద సమస్యలకు మాత్రమే వర్తిస్తుందని, ఈ విద్యుత్ బకాయిలకు దానితో సంబంధం లేదన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం బకాయిల వసూలుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి మాత్రమే ఆదేశాలు రావాలని, విద్యుత్ శాఖ కార్యదర్శికి ఆ అధికారంలేదని గతంలో తెలంగాణ వాదించింది. అయితే తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించాల్సి ఉండటంతో ధర్మాసనం విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. -
ఏపీ విద్యుత్ ఉద్యోగుల అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసిన 71 మంది విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో రిపోర్టు చేయడానికి మంగళవారం విద్యుత్ సౌధకు రాగా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఏపీ ఉద్యోగులు రిపోర్టు చేయకుండానే వెనుతిరిగారు. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఏపీ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ చేర్చుకోవడానికి వీల్లేదని తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ కేఎం ధర్మాధికా రి కమిటీ తుది నివేదికకు అనుబంధంగా జారీ చేసిన మరో నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని తప్పుబట్టాయి. ధర్మాధికారి కమిటీ విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నాయి. తెలంగాణ స్టేట్ పవర్ ఎం ప్లాయీస్ యూనియన్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎం ప్లాయీస్ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధలో వేర్వేరుగా నిరసన దీక్షలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకుంటే తీవ్ర ఆర్థిక భారం పడటంతో పా టు తెలంగాణ విద్యుత్ సంస్థల పనితీరుపై ప్రభావం పడనుందని జేఏసీ నేతలు శివాజీ, రత్నాకర్‌రావులు పేర్కొన్నారు. ఏపీ రిలీవ్ చేసిన 655 మంది ఉద్యోగుల్లో 71 మంది మినహా మిగిలిన 584 మంది ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలసి వినతి పత్రం అందజేశారు. -
లక్ష్మణ్ తప్పుడు ఆరోపణలు చేశారు : జెన్కో సీఎండీ
సాక్షి, హైదరాబాద్ : ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణల్ని జెన్కో సీఎండీ ప్రభాకర్ ఖండించారు. అవగాహన లోపంతోనే లక్ష్మణ్ ఆరోపణలు చేశారని అన్నారు. విద్యుత్ సౌధలో ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.యూనిట్ విద్యుత్‌ను రూ. 4.30 పైసలకు ఇస్తామని ఎన్టీపీసీ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీబీఐ విచారణకైనా సిద్ధమని అన్నారు. 3600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. కానీ, లక్ష్మణ్ పూర్తి విరుద్ధంగా మాట్లాడారని, ఒక్క మెగావాట్ ఉత్పత్తి కూడా కాలేదని ఆరోపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచింతల నుంచి 120 మెగావాట్ల విద్యుత్ వస్తోందని చెప్పారు. 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును 48 నెలల్లో ప్రారంభించామని గుర్తు చేశారు. పీపీఏలు రాత్రికి రాత్రి ఎవరూ చేసుకోరని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చత్తీస్‌గఢ్‌తో పీపీఏ చేసుకుందన్నారు. రేటింగ్ లేకుంటే ఎవరూ ముందుకు రారని, రేటింగ్ సంస్థలు ఎ ప్లస్ రేటింగ్ ఇచ్చాయని తెలిపారు. అన్ని విద్యుత్ సంస్థలు స్వతంత్రంగా ఉంటూ ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా పని చేస్తున్నాయని ఉద్ఘాటించారు. అవాస్తవాలతో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్కువ ధరకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఇస్తానన్నా తీసుకోకుండా.. చత్తీస్‌గఢ్ నుంచి అధిక ధరలకు కొనుగోలు చేశారని బీజేపీ నాయకుడు లక్ష్మణ్ గురువారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
విద్యుత్ వివాదాలు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాల పరిష్కారంలో మరో కీలక ముందడుగు పడింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విభజన వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు తాజాగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య దాదాపు 80 శాతం విద్యుత్ వివాదాలను కొలిక్కి తెచ్చారు. తెలంగాణ, ఏపీ ట్రాన్స్‌కో సంస్థల సీఎండీలు దేవులపల్లి ప్రభాకర్‌రావు, నాగుపల్లి శ్రీకాంత్ హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల విద్యు త్ సంస్థల మధ్య గత ఐదేళ్లుగా 28 అంశాల్లో వివాదాలు అపరిష్కృతంగా ఉండిపోగా తాజాగా జరిగిన చర్చల్లో ఓ నాలుగైదు మినహా మిగిలిన అన్ని రకాల వివాదాల పరిష్కారానికి సీఎండీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజన, పరస్పర విద్యుత్ పంపకాలు, ఒకరికొకొరు చెల్లించుకోవాల్సిన రూ. వేల కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలకు సంబంధించిన చిక్కులను ఈ సమావేశంలో పరిష్కరించుకున్నారు. ఉమ్మడి ఆడిట్ అనంతరం ఏపీ నుంచి తెలంగాణకు రూ. 10,160 కోట్లు, తెలంగాణ నుంచి ఏపీకి రూ. 12,650 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు ఏకభిప్రాయానికి వచ్చారు. విద్యుత్ ఉద్యోగుల విభజనతో ముడిపడి ఉన్న రూ. 4,600 కోట్ల బకాయిలపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఉద్యోగుల విభజన పరిష్కారమైన తర్వాతే ఈ బకాయిలతో పెన్షన్ల వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన మరికొన్ని ఆస్తులు, అప్పులపై కంప్ట్రోలర్ అండ్ అకౌంటెంట్ జనరల్ డీజీ అభిప్రాయం కోరుతూ ఉమ్మడిగా లేఖ రాయాలని నిర్ణయించారు. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లకు ఆడిట్ చేయించిన తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత వస్తాయో ఆ మేరకు పంపకాలు జరుపుకోవాలని నిర్ణయించారు. త్వరలో ఏపీలో మళ్లీ సమావేశం.. విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ప్రత్యేక చర్చలు జరపాలని, సాధ్యమైనంత త్వరగా మరోసారి సమావేశమై మిగిలిన అంశాలను సైతం పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ట్రాన్స్‌కో సీఎండీలు నిర్ణయించారు. త్వరలో విజయవాడలోని ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయంలో తదుపరి సమావేశాన్ని నిర్వహించనున్నారని, దీనికి తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి. 30న ధర్మాధికారి కమిటీ భేటీ.. విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ కేఎం ధర్మాధికారి ఏకసభ్య కమిటీ ఈ నెల 30న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఏపీ, తెలంగాణ జెన్కో డైరెక్టర్లు అశోక్‌కుమార్, ఆదినారాయణతో ఏర్పాటు చేసిన ఉపకమిటీ ఈ నెల 28న సమావేశమై చర్చించనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
జలసౌధ, విద్యుత్ సౌధ ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు
విభజన ప్రకటన నేపథ్యంలో రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మొన్నటికి మొన్న అబిడ్స్‌లోని బీమా భవన్లో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, మంగళవారం జలసౌధ, విద్యుత్సౌధలతో అదే దృశ్యం పునరావృతమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయింది. టీఎన్జీఓ ఉద్యోగులకు, ఏపీఎన్జీవో ఉద్యోగులకు మధ్య తోపులాట తీవ్ర వాగ్వాదానికి చోటుచేసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జరుపుకునేందుకు టీఎన్జీఓలు భోజన విరామ సమయంలో సన్నద్ధమయ్యారు. మరోవైపు అదేసమయంలో ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఎన్జీవోలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టివేసుకునేవరకు పరిస్థితి రావడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించేందుకు యత్నించారు. వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, అడీషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీలు వెంకటనర్సయ్య, వినోద్‌కుమార్, ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ప్రభాకర్ తదితరులు వచ్చి పరిస్థితిని చక్కబెట్టారు. ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మరో పది సంవత్సరాలు తమతో కలిసి ఉండాల్సిన ఉద్యోగులు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడకు పిలిపించుకొని కవ్వింపు చర్యలకు పాల్పడడం తగదని విమర్శించారు. 42రోజులు సకలజనుల సమ్మె సమయంలో కూడా ఏ ఉద్యోగికి ఎటువంటి ఇబ్బందులు కల్గించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి జరిగే సమ్మె గురించి చర్చించుకునేందుకు తాము సమావేశమైతే ‘సీమాంధ్ర గోబ్యాక్’ అంటూ టీఎన్జీవో నాయకులు రెచ్చగొట్టారని ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పయ్యావుల రాకతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విద్యుత్‌సౌధకు వచ్చి ఇక్కడి సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇంతలో అక్కడకు చేరుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఉద్యోగులను, పయ్యావుల కేశవ్‌ను చుట్టుముట్టారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చావా? మా కార్యాలయంలో నీకేం పని? అంటూ కేశవ్‌ను నిలదీశారు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాల వారిని సముదాయించి కేశవ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఉద్యోగులు కూడా ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. -
విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ జేఏసీ ఆందోళన
హైదరాబాద్: విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రుల ఉద్యమానికి నిరసనగా జేఏసీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకోవడంతో తెలంగాణవాదులు ఇక్కడ తమ ఆందోళనను ఉధృతం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జెఎసి చైర్మన్ కోదండరాం, టిఆర్ఎస్ నేత హరీష్‌రావు, బిజెపి నేత నాగం జనార్ధన రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో సమైక్యవాద నినాదాలు మిన్నంటాయి. వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ శవయాత్రలు నిర్వహిస్తే, మరి కొన్నిచోట్ల పిండప్రధానాలు, తలనీలాలను సమర్పించడం చేశారు. కొందరు రాష్ట్ర విభజనకు కారకులైన వారి చిత్రపటాలను గాడిదలపై ఊరేగించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.రోజురోజుకు సీమాంధ్రలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతున్న నేపధ్యంలో తెలంగాణలో కూడా జెఎసి ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగిస్తున్నారు.