
సాక్షి, హైదరాబాద్ : ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణల్ని జెన్‌కో సీఎండీ ప్రభాకర్ ఖండించారు. అవగాహన లోపంతోనే లక్ష్మణ్ ఆరోపణలు చేశారని అన్నారు. విద్యుత్ సౌధలో ఆయన శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.యూనిట్ విద్యుత్‌ను రూ. 4.30 పైసలకు ఇస్తామని ఎన్టీపీసీ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీబీఐ విచారణకైనా సిద్ధమని అన్నారు. 3600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. కానీ, లక్ష్మణ్ పూర్తి విరుద్ధంగా మాట్లాడారని, ఒక్క మెగావాట్ ఉత్పత్తి కూడా కాలేదని ఆరోపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచింతల నుంచి 120 మెగావాట్ల విద్యుత్ వస్తోందని చెప్పారు.
800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును 48 నెలల్లో ప్రారంభించామని గుర్తు చేశారు. పీపీఏలు రాత్రికి రాత్రి ఎవరూ చేసుకోరని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చత్తీస్‌గఢ్‌తో పీపీఏ చేసుకుందన్నారు. రేటింగ్ లేకుంటే ఎవరూ ముందుకు రారని, రేటింగ్ సంస్థలు ఎ ప్లస్ రేటింగ్ ఇచ్చాయని తెలిపారు. అన్ని విద్యుత్ సంస్థలు స్వతంత్రంగా ఉంటూ ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా పని చేస్తున్నాయని ఉద్ఘాటించారు. అవాస్తవాలతో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్కువ ధరకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఇస్తానన్నా తీసుకోకుండా.. చత్తీస్‌గఢ్ నుంచి అధిక ధరలకు కొనుగోలు చేశారని బీజేపీ నాయకుడు లక్ష్మణ్ గురువారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment