సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాల పరిష్కారంలో మరో కీలక ముందడుగు పడింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విభజన వివాదాలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు తాజాగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య దాదాపు 80 శాతం విద్యుత్ వివాదాలను కొలిక్కి తెచ్చారు. తెలంగాణ, ఏపీ ట్రాన్స్‌కో సంస్థల సీఎండీలు దేవులపల్లి ప్రభాకర్‌రావు, నాగుపల్లి శ్రీకాంత్ హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమై చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల విద్యు త్ సంస్థల మధ్య గత ఐదేళ్లుగా 28 అంశాల్లో వివాదాలు అపరిష్కృతంగా ఉండిపోగా తాజాగా జరిగిన చర్చల్లో ఓ నాలుగైదు మినహా మిగిలిన అన్ని రకాల వివాదాల పరిష్కారానికి సీఎండీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజన, పరస్పర విద్యుత్ పంపకాలు, ఒకరికొకొరు చెల్లించుకోవాల్సిన రూ. వేల కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలకు సంబంధించిన చిక్కులను ఈ సమావేశంలో పరిష్కరించుకున్నారు. ఉమ్మడి ఆడిట్ అనంతరం ఏపీ నుంచి తెలంగాణకు రూ. 10,160 కోట్లు, తెలంగాణ నుంచి ఏపీకి రూ. 12,650 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు ఏకభిప్రాయానికి వచ్చారు. విద్యుత్ ఉద్యోగుల విభజనతో ముడిపడి ఉన్న రూ. 4,600 కోట్ల బకాయిలపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఉద్యోగుల విభజన పరిష్కారమైన తర్వాతే ఈ బకాయిలతో పెన్షన్ల వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన మరికొన్ని ఆస్తులు, అప్పులపై కంప్ట్రోలర్ అండ్ అకౌంటెంట్ జనరల్ డీజీ అభిప్రాయం కోరుతూ ఉమ్మడిగా లేఖ రాయాలని నిర్ణయించారు. ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్లకు ఆడిట్ చేయించిన తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత వస్తాయో ఆ మేరకు పంపకాలు జరుపుకోవాలని నిర్ణయించారు.
త్వరలో ఏపీలో మళ్లీ సమావేశం..
విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ప్రత్యేక చర్చలు జరపాలని, సాధ్యమైనంత త్వరగా మరోసారి సమావేశమై మిగిలిన అంశాలను సైతం పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ట్రాన్స్‌కో సీఎండీలు నిర్ణయించారు. త్వరలో విజయవాడలోని ఏపీ ట్రాన్స్‌కో కార్యాలయంలో తదుపరి సమావేశాన్ని నిర్వహించనున్నారని, దీనికి తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి.
30న ధర్మాధికారి కమిటీ భేటీ..
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ కేఎం ధర్మాధికారి ఏకసభ్య కమిటీ ఈ నెల 30న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఏపీ, తెలంగాణ జెన్‌కో డైరెక్టర్లు అశోక్‌కుమార్, ఆదినారాయణతో ఏర్పాటు చేసిన ఉపకమిటీ ఈ నెల 28న సమావేశమై చర్చించనుందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment