ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల అడ్డగింత | Telangana Electricity Employees Union Stopped AP Electricity Employees | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల అడ్డగింత

Published Wed, Mar 18 2020 1:29 AM | Last Updated on Wed, Mar 18 2020 1:29 AM

Telangana Electricity Employees Union Stopped AP Electricity Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రిలీవ్‌ చేసిన 71 మంది విద్యుత్‌ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో రిపోర్టు చేయడానికి మంగళవారం విద్యుత్‌ సౌధకు రాగా, తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల సంఘాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఏపీ ఉద్యోగులు రిపోర్టు చేయకుండానే వెనుతిరిగారు. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఏపీ విద్యుత్‌ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్‌ చేసిన విద్యుత్‌ ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ చేర్చుకోవడానికి వీల్లేదని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ కేఎం ధర్మాధికా రి కమిటీ తుది నివేదికకు అనుబంధంగా జారీ చేసిన మరో నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని తప్పుబట్టాయి.

ధర్మాధికారి కమిటీ విద్యుత్‌ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నాయి. తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎం ప్లాయీస్‌ యూనియన్‌ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎం ప్లాయీస్‌ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు విద్యుత్‌ సౌధలో వేర్వేరుగా నిరసన దీక్షలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ రిలీవ్‌ చేసిన విద్యుత్‌ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలు చేర్చుకుంటే తీవ్ర ఆర్థిక భారం పడటంతో పా టు తెలంగాణ విద్యుత్‌ సంస్థల పనితీరుపై ప్రభావం పడనుందని జేఏసీ నేతలు శివాజీ, రత్నాకర్‌రావులు పేర్కొన్నారు. ఏపీ రిలీవ్‌ చేసిన 655 మంది ఉద్యోగుల్లో 71 మంది మినహా మిగిలిన 584 మంది ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలసి వినతి పత్రం అందజేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement