Telangana electricity employees
-
మూకుమ్మడిగా పదోన్నతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్. పలువురు చీఫ్ ఇంజనీర్లు డబుల్ డిమోషన్ పొంది డివిజనల్ ఇంజనీర్/ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా మారిపోయారు. మరికొందరు సూపరింటెండింగ్ ఇంజనీర్లు డబుల్ డిమోషన్‌తో అదనపు డివిజనల్ ఇంజనీర్ స్థాయికి పడిపోయారు. దాదాపు 250 మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు గతంలో పొందిన ఒకటి లేదా రెండు పదోన్నతులను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణ వచ్చాక ఇక్కడి విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని రకాల పదోన్నతులను మంగళవారం తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థల యాజమాన్యాలు మూకుమ్మడిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో భాగంగా రాష్ట్ర విభజనకు ముందు 2014 జూన్ 1 నాటి సీనియారిటీ జాబితాల ఆధారంగా మళ్లీ కొత్తగా పదోన్నతులు కల్పి స్తూ ఆ వెంటనే వేరే ఉత్తర్వులూ జారీ చేశారు. తెలంగాణ ఉద్యోగులతోపాటు ఏపీ నుంచి వచ్చిన దాదాపు 700 మందితో రూపొందించిన సీనియారిటీ జాబితాను ఇందుకు వినియోగించారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక మంది సీనియర్లే ఉండటంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను అమలు చేయడంతో పదోన్నతుల్లో అధిక శాతం ఉన్నతస్థాయి పోస్టులను వారికే కేటాయించినట్టు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో కొందరు ఉద్యోగులకు డబుల్ ప్రమోషన్లు రాగా, తెలంగాణ వారికి డబుల్ డిమోషన్లు లభించినట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొత్త పదోన్నతుల్లో దాదాపు 250 మంది తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్‌జీ విభాగాల అధికారులు, ఉద్యోగులు గతంలో పొందిన పదోన్నతులను నష్టపోయారు. సీఈలు ఎస్ఈలు/డీఈలుగా, ఎస్ఈలు డీఈలు/ఏడీఈలుగా, డీఈలు ఏడీఈలు/ఏఈలుగా రివర్షన్లు పొందినట్టు విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. నలుగురు సీఈలు, 30 మందికి పైగా ఎస్ఈలు, 120 మంది డీఈల పదోన్నతులు రద్దైనట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. దీంతోపాటు కొత్త సీనియారిటీ జాబితాల్లో చాలామంది తీవ్రంగా వెనకబడిపోవడంతో మళ్లీ పదోన్నతులు పొందకుండా రిటైర్ కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని సంఘాల నేతలు తెలిపారు. ‘కరెంట్’ రఘుకి డిమోషన్ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమ కాలంలో చురుకుగా వ్యవహరించిన ‘కరెంట్’ రఘు సైతం ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ (సివిల్) స్థాయి నుంచి రెండు హోదాలు తగ్గి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కొత్త పోస్టింగ్ పొందినట్టు తెలిసింది. నేటి ముట్టడి రద్దు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పదోన్నతు ల రద్దును, కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం విద్యుత్ సౌధను ముట్టడిని ఉపసంహరించుకున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శివాజీ తెలిపారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు న్యాయం చేస్తామని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనలను విరమించుకున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. -
ఏపీ విద్యుత్ ఉద్యోగుల అడ్డగింత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేసిన 71 మంది విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో రిపోర్టు చేయడానికి మంగళవారం విద్యుత్ సౌధకు రాగా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఏపీ ఉద్యోగులు రిపోర్టు చేయకుండానే వెనుతిరిగారు. తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఏపీ విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ చేర్చుకోవడానికి వీల్లేదని తెలంగాణ విద్యుత్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ కేఎం ధర్మాధికా రి కమిటీ తుది నివేదికకు అనుబంధంగా జారీ చేసిన మరో నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని తప్పుబట్టాయి. ధర్మాధికారి కమిటీ విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించలేదని పేర్కొన్నాయి. తెలంగాణ స్టేట్ పవర్ ఎం ప్లాయీస్ యూనియన్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎం ప్లాయీస్ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధలో వేర్వేరుగా నిరసన దీక్షలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకుంటే తీవ్ర ఆర్థిక భారం పడటంతో పా టు తెలంగాణ విద్యుత్ సంస్థల పనితీరుపై ప్రభావం పడనుందని జేఏసీ నేతలు శివాజీ, రత్నాకర్‌రావులు పేర్కొన్నారు. ఏపీ రిలీవ్ చేసిన 655 మంది ఉద్యోగుల్లో 71 మంది మినహా మిగిలిన 584 మంది ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలసి వినతి పత్రం అందజేశారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మెయోచన విరమణ
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో మంత్రి జగదీష్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను విద్యుత్ ఉద్యోగులు విరమించుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ కార్మికులకు పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రమాదానికి గురైతే వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. -
ఏపీ నుంచి టీ విద్యుత్ ఉద్యోగులు వెనక్కి!
రిలీవ్ చేయకున్నా వెనక్కి తీసుకోవాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయించాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ప్రభుత్వశాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులంతా జూన్ 27 నాటికి ఏపీ కొత్త రాజధాని అమరావతికి రావాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించడంతో ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తమను రిలీవ్ చేయాలంటూ నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు అమరావతికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడితే తక్షణమే వారిని వెనక్కి తీసుకొని విధుల్లో చేర్చుకోవాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ రిలీవ్ చేయకపోయినా తెలంగాణ విద్యుత్ సంస్థలు తమ ప్రాంత ఉద్యోగులను వెనక్కి తీసుకుంటే విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. గతేడాది జూన్ 10న తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,252 మంది ఏపీ ప్రాంత ఉద్యోగులను ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవడంతో ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులో వేర్వేరుగా విచారణ జరుగుతోంది. త్వరలో ప్రభుత్వానికి చెబుతాం ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను ఏపీ రిలీవ్ చేసినా చేయకపోయినా వారిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. 280 మంది తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులు ఏపీలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదు. త్వరలో ప్రభుత్వానికి తెలిపి చర్యలు తీసుకుంటాం. - డి. ప్రభాకర్‌రావు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ -
రాజ్‌నాథ్, గోయల్‌తో టీ విద్యుత్ ఉద్యోగుల భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్‌తో ఆదివారం సమావేశమయ్యారు. విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీల విషయంలో ఏర్పడిన వివాదాన్ని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ శాఖలో విభజన చట్టం ప్రకారమే వ్యవహరించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రులకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 1250 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను రిలీవ్ చేయగా, కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఏపీ సర్కార్‌కు ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే వీరిని తీసుకోలేదని టీ విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రులకు తెలిపారు. ఏపీలో ఉన్న 400 మంది తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయడంలో జాప్యం చేస్తున్నారని చెప్పారు.