జలసౌధ, విద్యుత్ సౌధ ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు
జలసౌధ, విద్యుత్ సౌధ ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు
Published Wed, Aug 7 2013 1:46 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
విభజన ప్రకటన నేపథ్యంలో రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మొన్నటికి మొన్న అబిడ్స్‌లోని బీమా భవన్‌లో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, మంగళవారం జలసౌధ, విద్యుత్‌సౌధలతో అదే దృశ్యం పునరావృతమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయింది. టీఎన్‌జీఓ ఉద్యోగులకు, ఏపీఎన్జీవో ఉద్యోగులకు మధ్య తోపులాట తీవ్ర వాగ్వాదానికి చోటుచేసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జరుపుకునేందుకు టీఎన్‌జీఓలు భోజన విరామ సమయంలో సన్నద్ధమయ్యారు. మరోవైపు అదేసమయంలో ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఎన్‌జీవోలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టివేసుకునేవరకు పరిస్థితి రావడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించేందుకు యత్నించారు.
వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, అడీషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీలు వెంకటనర్సయ్య, వినోద్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ తిరుపతిరావు, ప్రభాకర్ తదితరులు వచ్చి పరిస్థితిని చక్కబెట్టారు. ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మరో పది సంవత్సరాలు తమతో కలిసి ఉండాల్సిన ఉద్యోగులు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడకు పిలిపించుకొని కవ్వింపు చర్యలకు పాల్పడడం తగదని విమర్శించారు. 42రోజులు సకలజనుల సమ్మె సమయంలో కూడా ఏ ఉద్యోగికి ఎటువంటి ఇబ్బందులు కల్గించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి జరిగే సమ్మె గురించి చర్చించుకునేందుకు తాము సమావేశమైతే ‘సీమాంధ్ర గోబ్యాక్’ అంటూ టీఎన్జీవో నాయకులు రెచ్చగొట్టారని ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
పయ్యావుల రాకతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత
విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విద్యుత్‌సౌధకు వచ్చి ఇక్కడి సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇంతలో అక్కడకు చేరుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఉద్యోగులను, పయ్యావుల కేశవ్‌ను చుట్టుముట్టారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చావా? మా కార్యాలయంలో నీకేం పని? అంటూ కేశవ్‌ను నిలదీశారు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాల వారిని సముదాయించి కేశవ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఉద్యోగులు కూడా ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.
Advertisement
Advertisement