TNGO
-
రైతు సేవలకే మొదటి ప్రాధాన్యం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెటింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని శాఖ అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం డైరీ, కేలండర్‌ను తన కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో పెరిగిన పంటల విస్తీర్ణం, ఉత్పత్తితో మార్కెటింగ్ ఉద్యోగులపై బాధ్యత పెరిగిందని తెలిపారు. పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీ బాయి, అడిషన ల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, టీఎన్జీవోస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఫసియొద్దీన్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కేలండర్ ఆవిష్కరణ వ్యవసాయశాఖ రూపొందించిన నూతన సంవత్సర కేలండర్‌ను మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సోమవారం నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
దశలవారీగా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మంలో సోమవారం రాత్రి జరిగిన టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్‌లు, 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల తీర్మానాలను వెల్లడించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు మూడు డీఏలు మంజూరు చేయాలని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, 317 జీవోతో బదిలీపై వెళ్లిన భార్యాభర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. -
టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి.. మీ ఆస్తులన్నీ బయట పెడతా: బండి సంజయ్
సాక్షి, నల్గొండ: మునుగోడు అభివృద్ధి గురించి కేసీఆర్ మాట్లాడటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మునుగోడులో కేసీఆర్ అంతర్జాతీయ అంశాలు మాట్లాడారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాత్కాలిక ప్రయోజనం కోసం ఆర్టీసీ కార్మికులు బలికావొద్దని సూచించారు. కేసీఆర్ ముందు కొందరు ఉద్యోగులు మోకరిల్లుతున్నారని.. ప్రమోషన్ల కోసం టీఎన్జీవో ఉద్యోగులు సాగిలపడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు నాంపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నలుగురు టీఎన్జీవో నేతలు ఒక్కసారైనా జీతాల గురించి మాట్లాడారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మీకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. లోన్లు కట్టలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు .టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. తాను ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పనని. మీరే చెప్పాలని తెలిపారు. టీఎన్జీవో నేతలను ఇంకా తిడుతూనే ఉంటానని. తమ ఆస్తులను మొత్తం బయట పెడతానని హెచ్చరించారు. ‘కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే. ఆయన హామీలను ప్రజలు నమ్మడం లేదు. మా కార్యకర్తలు ప్రలోభాలకు లొంగలేదు. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోంది. కుల సంఘాలు మరోసారి ఆలోచించాలి. ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నలుగురు ఎమ్మెల్యేలతో సర్కస్ చూపించారు. బెల్ట్ షాప్‌లు పెట్టి గౌడ కులస్తుల పొట్టకొట్టారు. చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి. కౌలు రైతులు, పత్తి రైతులకు ఏం చేశారు.’ అని టీఆర్ఎస్పై బండిసంజయ్ ఫైర్ అయ్యారు. చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్ -
అవసరమైతే సీఎం కాళ్లు మొక్కుతా..
సాక్షి, హన్మకొండ: ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంతో సామరస్యపూర్వక ధోరణితో పోరాడుతామని, అవసరమైతే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడానికి కూడా సిద్ధమేనని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు తెలంగాణ అభివృద్దిలో ప్రతీ ఉద్యోగి ముఖ్యమంత్రి వెంట కండువా లేని టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని తెలిపారు. టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా కౌన్సిల్ సమావేశం, కేంద్ర సంఘం నూతన నాయకులకు అభినందన, పూర్వ అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి వీడ్కోలు సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశిష్ట అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర నూతన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, జేఏసీ ఛైర్మన్ పరిటాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ పరిస్థితులను అర్థం చేసుకోకుండా కొందరు తప్పుడు నాయకులు, తప్పుడు సంఘాల మాటలు విని ఉద్యోగులు వీధిన పడొద్దని హితవు పలికారు. 70ఏళ్ల చరిత్ర కలిగిన టీఎన్జీవోస్ సంఘం అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటూనే సమస్యలు పరిష్కారం చేస్తున్న వైనాన్ని చరిత్ర చెబుతోందన్నారు. ఉద్యోగులకు దసరా లోపు కనీసం రెండు డీఏలను ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారన్నారు. పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయాలి మూడు నెలల కాల పరిమితితో ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ మూడేళ్లుయినా నివేదిక ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని రాజేందర్ అన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు చేయలేని కమిషన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఇప్పటికే 14వ వీఆర్సీ స్థానంలో 11పీఆర్సీ కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. అది కూడా ఇప్పుడు ఇస్తారో తెలియని ఆందోళనలో ఉద్యోగ లోకం ఉందని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్యోగులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం తాజా మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ పోటీకి అవకాశం కల్పించాలని సమావేశంలో నేతలు కోరారు. తద్వారా ఉద్యోగుల గొంతుక అక్కడ వినిపించే అవకాశముంటుందని తెలిపారు. తెలంగాణలో వినతులు... ఆంధ్రాలో జీఓలు తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు సమస్యలపై వినతులు ఇస్తుంటే ఇక్కడ పరిష్కారం కావడం లేదని మామిళ్ల రాజేందర్ అన్నారు. అయితే, ఇదే వినతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని తెలిపారు. ఇక్కడి ఉద్యోగం పోరాటంతో అక్కడి ఉద్యోగ సోదరులకు లాభం జరుగుతోందని చెప్పారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ నుంచి కూడా సమస్యలు పరిష్కారానికి త్వరలో పిలుపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు సంబంధించి 18డిమాండ్లకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక రాష్ట్ర నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో పాటు పూర్వ కారం వీందర్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ సమావేశం ఆద్యంతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనతో కొనసాగగా, కరోనాను పట్టించుకోకుండా నేతల పలకరింపులు, సత్కారాలు, సన్మానాలు సాగాయి. రవన్నకు మంచి హోదా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన కారం రవీందర్రెడ్డిను ముఖ్యమంత్రికి ఒకరు సిఫారసు చేయాల్సి అవసరం లేదని తెలిపారు. ఆయనతో పాటు జిల్లా ఉద్యోగ నాయకుల గురించి సీఎంకు పూర్తిగా తెలుసనని చెప్పారు. ఎమ్మెల్సీ హోదా కావొచ్చు, మరొకటైనా కానీ త్వరలో రవీందర్‌రెడ్డిని మంచి హోదాలో చూస్తామని తెలిపారు. కాగా, కారం రవీందర్‌రెడ్డి తొలుత హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటరు నమోదు దరఖాస్తు అందజేశారు. టీజీవోస్ అధ్యక్షులు జగన్మోహన్రావు, ట్రెసా అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు ఇట్టె కిరణ్‌రెడ్డి, జిలుకర రమేష్, ఎంజీఎం సూపరిటెంటెండెంట్ నాగార్జునరెడ్డి, డీఎంహెచ్ఓ లలితాదేవితో పాటు రామినేని శ్రీనివాస్, చందు, పుల్లూరి వేణుగోపాల్, ఆకుల రాజేందర్, శ్యాంసుందర్, రామునాయక్, షఫీ, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగులందరూ ఓటర్లు నమోదు చేసుకోవాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సూచించారు. హన్మకొండలోని అలంకార్ జంక్షన్ సమీపాన ఉన్న టీఎన్జీఓఎస్ భవన్లో శుక్రవారం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజేందర్ మాట్లాడారు. -
టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవీందర్‌రెడ్డి, రాజేందర్
సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ మరోమారు ఎన్నికయ్యారు. దీంతో మూడోసారి వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 6న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆమోదం మేరకు ఎన్నికల అధికారిని నియమించి నోటిఫికేషన్ జారీచేశారు. ఆరోజు జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ప్రతిపాదనల మేరకు రాష్ట్ర కార్యవర్గానికి చేపట్టిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. నామినేషన్లన్నీ సరిగ్గా ఉండటంతో అంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ కార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగనుంది. ఎన్నికైన రవీందర్ రెడ్డి, రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ నాయకత్వం పట్ల నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీఎన్జీవో సంఘం అనేక సమస్యలను పరిష్కరించిందని, ఇతర సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎంను కలుస్తామని వెల్లడించారు. సంఘం ఎన్నికల్లో వీరితోపాటు సహ అధ్యక్షురాలుగా బి.రేచల్, కోశాధికారిగా రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్, నరసింహస్వామి, నరసింహచారి, ఉమాదేవి, కార్యదర్శులుగా తిరుమల్ రెడ్డి, లక్ష్మణ్ రావు, రాము నాయక్, రవి, దివ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండల్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులుగా కొనిదెన శ్రీనివాస్, రవిందర్, నర్సింహులు, సిద్దిరాములు, మాధవి, శైలజ, సత్యం ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సుబ్బారావు, సహాయ ఎన్నికల అధికారిగా రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు. -
తెలంగాణ : అడ్డదారిలో ఎక్స్టెన్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులంతా రిటైర్మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తుంటే కొందరు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమ అనుకున్న వారి పదవీ విరమణ వయసు పెంపునకే కృషి చేస్తున్నారు. ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఈ తతంగానికి పాల్పడుతున్నారు. గతంలో ప్రజాప్రతినిధుల సిఫారసుతో ప్రభుత్వం చేనేత జౌళి శాఖలో ఇద్దరి పదవీ విరమణ వయసు పొడిగించగా, ఇప్పుడు కొందరు టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతలు తమ వారికి ఇలాగే రిటైర్మెంట్ వయసు పొడిగించుకున్నారు. దీని కోసం తమ సంఘాల సిఫారసులను వాడుకోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం పదవీ విరమణ వయసును పొడిగిస్తుందని వేల మంది ఎదురు చూస్తుండగా, సంఘాల నేతలు మాత్రం తమ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుండటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇటీవల గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో సీనియర్ లెక్చరర్ వెంకటేశ్వర్లు, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, చేనేత జౌళిశాఖలో పిట్టల యాదగిరి, రత్నాకర్, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అగ్రికల్చర్ వర్సిటీలో సుధీర్ కుమార్, పరిటాల సుబ్బారావుల సర్వీస్‌నూ రెండేళ్లు పొడిగించడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణం అవుతోంది. సాధారణ ఉద్యోగులకు అడిగే అవకాశం లేక.. ఉద్యోగ సంఘాల్లో సాధారణ ఉద్యోగులకు ప్రాథమిక సభ్యత్వం ఉన్నా తమ నేతలను అడిగే పరిస్థితిలో వారు లేరు. మెజారిటీ సంఘాలు సర్వసభ్య సమావేశాలను నిర్వహిస్తున్న దాఖలాల్లేవ్. దీంతో సాధారణ ఉద్యోగుల ఆవేదనను పట్టించుకునే వారే లేకుండాపోయారు. కాస్త పరపతి ఉన్నవారు అడిగినా.. సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి మిన్నకుండిపోతున్నారన్న విమర్శలున్నాయి. అయితే తమ ఇంట్లో వ్యక్తులు, బంధువుల కోసం మాత్రం అడ్డదారిలో పైరవీలు చేసుకొని ప్రయోజనాలు పొందుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ.. నిరాశల్లో ఉద్యోగులు.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడం, తర్వాత ఆ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కావడంతో ఉద్యోగులు ఎప్పుడెప్పుడు జీవో వస్తుందా అని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా ఎదురుచూస్తూనే.. అనేక మంది పదవీ విరమణ పొందుతున్నారు. కనీసం ఈసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున రిటైర్మెంట్ వయసును సీఎం పొడిగిస్తారని ఆశతో ఎదురుచూసినా నిరాశ తప్పలేదు. ఇప్పటికే వేల మంది పదవీ విరమణ పొందగా, 2022 వరకు మరో 23,386 మంది పదవీ విరమణ పొందనున్నారు. వీరిలో చాలా మంది రిటైర్మెంట్ వయసు పెంపు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దీని కోసం సంఘాల నేతలను ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయినవారు - 2,708 మంది వచ్చే 7నెలల్లో పదవీ విరమణ పొందనున్న వారు - 5,900 మంది 2022 డిసెంబర్ నాటికి రిటైర్ కానున్న ఉద్యోగులు - 23,386 మంది వ్యక్తిగత ప్రయోజనాలు సరికాదు.. ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించాల్సిన సంఘాల నేతలు వాటిని పక్కనపెట్టేశారు. తమ అవసరాల కోసం ప్రభుత్వం వద్ద ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. పీఆర్సీ, డీఏ, ఐఆర్ వంటి సమస్యలను పట్టించుకోవడం లేదు. తమకు ప్రయోజనం చేకూర్చితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భజనపరులకే ప్రభుత్వ ప్రయోజనం చేకూర్చుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొని ఉద్యోగులందరికి మేలు చేయాలి. – సదానంద్‌గౌడ్, పర్వతరెడ్డి, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యుదర్శులు.. హర్షవర్దన్‌రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు... జంగయ్య, చావరవి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు... నావత్ సురేశ్, టీపీయూఎస్ అధ్యక్షుడు -
'ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదు'
సాక్షి, హైదరాబాద్ : డిసెంబర్ 31వరకు పీఆర్సీ గడువు పెంచిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్‌ను కలిసినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ కమిషన్ అనేది వేతన సవరణ కోసమే ఏర్పాటు చెయ్యలేదని, ఉద్యోగుల అనేక విషయాల కోసం స్టడీ కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్యోగుల ఇతర సమస్యల పై స్టడీ కోసం మాత్రమే గడువు పొడిగించినట్లు సీఎస్ స్పష్టం చేశారన్నారుడుపీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, నెల లోపలే కమిషన్ రిపోర్ట్ అందిస్తుందని సీఎస్ వివరించినట్లు తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని రవీందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు అండగా ఉంటానని మాట ఇచ్చారని, తాను ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉన్నట్లు అనేక సార్లు చెప్పారని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. టీజీఓ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. మంగళవారం పీఆర్సీ గడువు పెంచుతూ జీవో జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందారని తెలిపారు. అయితే ఇదే విషయమై సీఎస్‌ను కలిసిన తర్వాత పీఆర్సీకి ఈ గడువు పెంపుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపనట్లు పేర్కొన్నారు. అయితే గడువు పొడిగింపుతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుంచి పీఆర్సీ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను కోరినట్లు మమత వెల్లడించారు. తమ సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని ఒక్కవేళ పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మమత స్ఫష్టం చేశారు. -
సమ్మెకు సకలజనుల మద్దతు
సాక్షి, ఆదిలాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు రోజురోజుకు సబ్బండ వర్ణాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించగా, తాజాగా ఉద్యోగ జేఏసీ నాయకులు కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాటలతో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. వంటావార్పు, ర్యాలీలు, మానవహారం, సీఎం దిష్టిబొమ్మ దహనం, తదితర కార్యక్రమాలతో జోరు పెంచారు. ఈ నెల 5న ప్రారంభమైన సమ్మె గురువారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలుచేపడుతూ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. మోటార్‌సైకిల్ ర్యాలీలు కార్మికుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదిలాబాద్ పట్టణంలోని పలు వీధుల గుండా మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్ల కార్డులు ప్రదర్శించారు. అనంతరం సుందరయ్య భవన్లో కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు ఒకటేనన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి రూ.2600 కోట్ల బకాయి ఇవ్వాల్సి ఉందన్నారు. డీజిల్‌పై పన్ను విధించడంతో ఆర్టీసీపై భారం పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి రూ.50వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. సమ్మె చేపడుతున్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ పేరిట 48వేల మంది ఉద్యోగులను తొలగించామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగులను తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. యూనియన్లు వద్దంటే పార్టీలు ఎందుకని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమవుతుందని భావించి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్‌కుమార్, మహేందర్, రాష్ట్ర కార్యదర్శి తిరుమల్‌రెడ్డి, గోపి, మోహన్, సుధాకర్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు గంగాధర్, అశోక్‌గౌడ్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సబ్దార్అలీ, వాసిఖ్, అటవీ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, వార్డెన్ సంఘం అధ్యక్షుడు రమేశ్ చందర్‌గౌడ్, వివిధ శాఖల ఉద్యోగులు, మహిళలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవీంద్ర, వృకోధర్, వెంకట్, శ్రీనివాస్, నరేందర్, గిరి, తదితరులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం.. సమ్మెలో భాగంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పట్టణంలోని తెలంగాణచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వంటావార్పు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా సుందరయ్యభవన్ ఎదుట వంటావార్పు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాల కోరని విమర్శించారు. కార్మికులు చనిపోతున్నా స్పందించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకూ వారికి అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. నాయకులు సంజీవ్‌రెడ్డి, యాసం నర్సింగ్, అంబకంటి అశోక్, రూపేశ్‌రెడ్డి, జైపాల్, పొచ్చన్న, సులోచన, సరిత తదితరులు పాల్గొన్నారు. గ్రామీణులకు ఇక్కట్లు మారుమూల గ్రామాలకు బస్సులు వెళ్లకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో 63 ఆర్టీసీ బస్సులు, 33 ప్రైవేట్ అద్దె బస్సులు, 15 సీసీ బస్సులు, 52 మ్యాక్సీ క్యాబ్‌లు, మొత్తం 173 బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కార్మికుల సమ్మెకు టీఎన్జీవో మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపింది. ఆర్టీసీ సమ్మెలో తాము కూడా భాగస్వాములం కానున్నట్టు వెల్లడించింది. కాగా, తాము చేపట్టిన సమ్మెకు మద్దతు తెలుపాలని కొద్ది రోజులుగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యోగ సంఘాలను కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు మంగళవారం టీఎన్జీవో నేతలతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలవాలని జేఏసీ నాయకులు.. టీఎన్జీవో నేతలను కోరారు. భేటీ అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధకరమన్నారు. ఆర్టీసీ సమ్మెలో తాము కూడా భాగస్వాములమవుతామని తెలిపారు. బుధవారం ఉద్యోగ సంఘాల సమావేశం జరగనుందని.. సీఎస్‌ను కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాల్సి వస్తోందని హెచ్చరించారు. రేపు తమ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోలు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. టీఎన్జీవోలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ తిరోగమనంలో పడిందన్నారు. ఆర్టీసీలో కొత్త నియామకాలు లేవని.. రూ. 1400 కోట్ల కార్మికుల పీఎఫ్ సొమ్మును యాజమాన్యం వాడుకుందని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లోనే తాము సమ్మె నోటీసు ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లు తమను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. ప్రస్తుతానికి సమ్మె యథావిథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ఆర్టీసీ కార్మికులు ఒంటరి పోరాటం చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆర్టీసీ సమ్మె చేయాలని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం టీఎన్జీవో నేతలను కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ..‘మమ్మల్ని సంప్రదించకుండా సమ్మెకు వెళ్లారు. సమ్మెకు వెళుతున్నట్లు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. మాపై కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆర్టీసీ సర్వీస్ రూల్స్ వేరు... మా సర్వీస్ రూల్స్ వేరు. ఆర్టీసీ సమస్యలకు ఉద్యోగ సంఘాలకు సంబంధం లేదు. సీఎంను ఉద్యోగ సంఘాలుగా మేం కలిస్తే తప్పేంటి?. 16 అంశాలతో కూడిన నివేదికతో సీఎంను కలిశాం. మాపై ఆరోపణలు చేసే నైతికత వాళ్లకు లేదు. సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేసినవారే ఆర్టీసీ జేఏసీ వెనకున్నారు. టీఎన్జీవోలపై అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా పోరాటం చేయాలి. సమ్మె కొన్ని రాజకీయ శక్తుల చేతిలోకి వెళ్లింది. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి. ఆర్టీసీ జేఏసీ మాతో మాట్లాడితే మేము వాళ్లకు మద్దతుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దు. ఆత్మహత్యకు పాల్పడొద్దు’ అని కోరారు. సీఎంను కలిసిన టీఎన్జీవో నేతలు (ఫైల్ ఫోటో) టీఎన్జీవో కార్యదర్శి మమత మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగాల సంఘాల పై దుష్ప్రచారం జరుగుతుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మేము భేటీ అయ్యాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ని కలిశాం. సీఎం ని కలిస్తే తప్పేంటి? నేరం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం పిలుస్తే ఉద్యోగ సంఘాల నేతలుగా వెళ్లాం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో భాగమే. ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమం అనంతరం ఆర్టీసీ నేతలు మాతో ఎప్పుడూ కలవలేదు. ఉద్యమ జేఏసీలో ఆర్టీసీ నేతలు, నాయకులు సభ్యులుగా లేరు. ఆర్టీసీ కార్మికులు తొందరపాటు చర్యలకు పోకుండా నాయకత్వంపై ఒత్తిడి తేవాలి. రాజకీయ నేతలు ఉద్యోగ సంఘాల ఆరోపణలు చేయడం సరికాదు. ఆర్టీసీ జేఏసీ నేతలు మాతో కలుస్తే సీఎం దృష్టికి తీసుకువెళతాం’ అని అన్నారు. -
ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ సరికొత్త వ్యూహం
సాక్షి, హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఒంటరి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మద్దతు ఆర్టీసీ కార్మికులకు దక్కకుండా పావులు కదిపింది. ఇందులోభాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీవో కార్యాలయానికి వెళ్లకముందే.. ప్రభుత్వ ఉద్యోగులను ప్రగతి భవన్‌కు పిలుపించుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను టీఎన్జీవో నేతలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు అందించారు. ఉద్యోగులకు కరువుభత్యం (డీఏ)ను 3.5శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులను ప్రభుత్వం వైపు తిప్పుకునేందుకే కేసీఆర్ ఇలా వ్యూహరచన చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాయంత్రం 4 గంటలకు భవిష్యత్ కార్యాచరణ మరోవైపు తాము చేస్తున్న పోరాటానికి, సమ్మెకు మద్దతునివ్వాల్సిందిగా కోరుతూ ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీవో కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా తమ సమ్మెకు మద్దతునివ్వాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ జేఏసీ కోరుతోంది. తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్లపై ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. సాయంత్రం 4గంటల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి నష్టమేతప్ప లాభం లేదని పేర్కొంది. పాత పద్ధతిలోనే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని కోరింది. శనివారం ఇక్కడ నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గ భేటీ జరిగింది. సమావేశంలో 18 అంశాల పై తీర్మానాలు చేశారు. తీర్మానాల ప్రతిని ప్రభుత్వానికి సమర్పించి వీటిని మంజూరు చేయించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కె.రవీందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వి.మమత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు 43 శాతం ఐఆర్, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరారు. ఏపీలో పని చేస్తున్న 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించాలని, ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. బడిబాట తర్వాతే హేతుబద్ధీకరణ చేపట్టాలి బడిబాట కార్యక్రమం తర్వాతే పాఠశాలల హేతుబ ద్ధీకరణను చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాలనలో భాగంగా చేపట్టే సంస్కరణలకు ఉద్యోగులు సహకరిస్తున్నారన్నారు. ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని, వెల్నెస్ సెంటర్లను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. 010 పద్దు కింద గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ, వర్సిటీలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి జూన్, జూలైల్లో సాధారణ బదిలీ లకు అనుమతించాలన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 36 లో ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన ఇళ్లస్థలాలను టీఎన్జీవోలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లకే పదోన్నతి కల్పించాలి... పదోన్నతి కోసం ప్రస్తుతమున్న మూడేళ్ల సర్వీసును రెండేళ్లకు కుదించాలని కోరారు. రెవెన్యూ శాఖను విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనంగా 15% పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యమంలో పాల్గొన్నందున వాళ్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, అవు ట్ సోర్సింగ్ ఉద్యోగులకు సెలవు ప్రయోజనాలను కల్పించాలని, కొత్త జిల్లాలకు సరిపడా క్యాడర్‌ను మంజూరు చేయాలన్నారు. వీటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. -
టీఎన్‌జీఓయూ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీఓ) యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నాలుగోసారి కె.లక్ష్మణ్ ఎన్నికయ్యారు. టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ ఎన్నికలు సోమవారం ఎన్నికల అధికారి రామ్మోహన్, సహాయ ఎన్నికల అధికారి వీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సెక్రటరీగా బి.బుచ్చిరెడ్డి ఎన్నియ్యారు. మూడేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సలీంమియా, ఉపాధ్యక్షుడిగా బి.ఆనంద్‌సింగ్, జె.బుచ్చయ్య, ఎస్.ఎంజుల, జాయింట్ సెక్రటరీలుగా జి.శేఖర్ రెడ్డి, బి.మాణిక్యరెడ్డి, సీహెచ్.అమరావతి, కోశాధికారిగా పి.విజయ్‌కుమార్, ఆఫీస్ సెక్రటరీగా కె.చంద్రశేఖర్, స్పోర్ట్స్ సెక్రటరీగా జె.జశ్వాంత్ నా యుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.రాజేశ్వర్ రె డ్డి, పబ్లిసిటీ సెక్రటరీగా ఆర్.రంగయ్య, సభ్యులు గా వి.రాములు, బి,మాధవ్ గౌడ్, ఎం.రవి, ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కలెక్టర్ రఘునందన్‌రావును, జాయింట్ కలెక్టర్ హరీష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి కలెక్టర్, జేసీ అభినందనలు తెలిపారు. -
తెలంగాణ ఉద్యోగ సంఘాల తీరుపై ఉద్యోగుల అసంతృప్తి
-
ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదు
టీఎన్జీవో సంఘం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తప్పు చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు చేపడితే సహకరిస్తామని, అయితే అకారణంగా ఉద్యోగులను వేధిస్తే మాత్రం సహించేది లేదని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర (టీఎన్జీవో) సంఘం పేర్కొంది. బుధవారం ఇక్కడ టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగుల సమస్యలపై సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేందర్ మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావా లని కోరారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌తో కలసి కొత్త కార్యవర్గ సభ్యులు సీఎం కేసీఆర్‌ను, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని, మంత్రి హరీశ్‌రావును కలిశారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
► ఢిల్లీలో నినదించిన 29 రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు ► జంతర్‌మంతర్ వద్ద మహా ధర్నా.. ► పెద్ద సంఖ్యలో హాజరైన టీఎన్జీవో, గెజిటెడ్ ఉద్యోగలు ఫోరం సభ్యులు న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో కదంతొక్కారు. అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు జంతర్‌మంతర్ వేదికగా ‘పెన్షన్ భిక్షకాదు.. ఉద్యోగుల హక్కు’ అంటూ నినదిస్తూ పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి టీఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ ఒకే మాటతో నూతన పెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకొనేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అఖిలభారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు లీలాపత్ డిమాండ్ చేశారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. పెన్షన్ తీసుకోవడం ఉద్యోగుల హక్కు అని, ఈ ప్రయోజనానికి ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఎలాంటి గ్రాట్యుటీ లభించడం లేదన్నారు. దీని వల్ల ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇలా ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిన సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విధానం రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని, దీనిని అభినందిస్తున్నామన్నారు. ఉద్యమ స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను ఏకం చేస్తామని, కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తెస్తామన్నారు. ధర్నాలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్, గెజిటెడ్ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించాలి
సీఎస్ ప్రదీప్ చంద్రకు టీఎన్జీవో నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కేడర్ స్ట్రెన్‌తను నిర్ణయించాలని, ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు టీఎన్జీవో నేతలు విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలో టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి కొత్తగా నియమితులైన సీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ప్రధాన కేం ద్రంలో పనిచేసే వారికి 20 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరారు. పీఆర్సీ అమలుకు ముందు 9 నెలల గ్యాప్ పీరియడ్‌లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ ఇవ్వలేదని, వెంటనే వారికి గ్రాట్యుటీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు చర్యలు చేపట్టాలని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, హెల్త్‌కార్డుల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. వీటిని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. -
పెట్రోల్ డబ్బాలతో కార్యాలయాల్లోకి ఎన్జీవోలు
-
పెట్రోల్ డబ్బాలతో కార్యాలయాల్లోకి ఎన్జీవోలు
హైదరాబాద్: నాంపల్లిలోని టీఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 700 మంది నాన్‌గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ డబ్బాలతో టీఎన్జీవో కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నాం
తిమ్మాపూర్ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీఎన్జీవో కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్ తెలిపారు. ఎల్ఎండీ కాలనీలో అమరవీరుల స్థూపం వద్ద వారితోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం పోరాటం చేసిన టీఎన్జీవోలకు ప్రత్యేకత ఉందని, ఉద్యోగులు ప్రజలకు చేరువై మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాల ఏర్పాటుకు ముందే ఉద్యోగుల హెల్త్‌కార్డులు, బకాయిలు, ప్రభుత్వ హామీలను, సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 74 ప్రకారం అన్నీ రాయితీలు వర్తిస్తున్నాయని తెలిపారు. కొత్త జిల్లాలతోపాటు కొత్త ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జోనల్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా చేయాలన్నారు. ఉద్యోగుల అభిప్రాయం మేరకు, సీనియార్టీ నష్టం కాకుండా కొత్త జిల్లాలకు పంపాలని కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన వారికి 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు జోనల్ వ్యవస్థ రద్దు కాలేదని స్పష్టం చేశారు. కొత్త రూల్స్ తేవాల్సిన అసరముందన్నారు. పీఆర్సీ బకాయిలు రిటైర్డు ఉద్యోగులకు ముందుగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు సుద్దాల రాజయ్య, మహిళా ఉద్యోగుల అధ్యక్షురాలు రేచల్, ఎల్ఎండీ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రమేష్, పోలు కిషన్, టింగో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, అమరేందర్‌రెడ్డి, టీఎన్జీవో నాయకులు జి.శ్రీనివాస్, గంగారపు రమేష్, రాగి సత్యనారాయణ, కిషన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొమురయ్య, రాజయ్య పాల్గొన్నారు. -
డీడీని కలిసిన టీఎన్జీవోస్ నేతలు
హన్మకొండ అర్బన్ : నర్సంపేట ఎస్సీ హాస్టల్ వార్డెన్ మధును సస్పెండ్ చేసిన నేపథ్యంలో టీఎన్జీవోస్ నేతలు సోమవారం దళిత సంక్షేమ శాఖ డీడీ శంకర్‌ను హన్మకొండలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆరోపణలు వచ్చిన నేపద్యంలో ఉద్యోగిపై ముందుగా సమగ్ర విచారణ చేయాలని అలా కాకుండా సస్పెండ్ చేయడంవల్ల వార్డెన్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. అంతేకాకుండా హాస్టళ్లకు సకాలంలో సరుకులు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ మేరకు సస్పెన్షన్ల విషయంలో ఉన్నతాధికారులు ఆలోచించి నిర్ణయిం తీసుకోవాలని కోరారు. డీడీని కలిసిన వారిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, వార్డెన్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కృష్ణ, ఏఎస్‌డబ్ల్యూవోలు భవానీప్రసాద్, గట్టుమల్లు తదితరులు ఉన్నారు. -
‘జోనల్’పై భిన్నాభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జోనల్ వ్యవస్థపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. జోనల్ స్ఫూర్తికి విఘాతం కలుగకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ఎంసీహెచ్ఆర్డీలో ప్రత్యేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారుల సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 30 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా రోజున జిల్లాల ఏర్పాటుకు గడువు విధించిన తరహాలోనే.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దసరాలోగా పరిష్కరించాలని సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, డీఏను చెల్లించాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలని కోరారు. ఎవరేమన్నారంటే.. జోన్ల వ్యవస్థను రద్దు చేసి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో రెండంచెల ఉద్యోగ వ్యవస్థ ఉండాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.మమత, ఏ.సత్యనారాయణ పేర్కొన్నారు. అవసరం లేని విభాగాలు, కార్పొరేషన్లను విలీనం చేసి, జోన్ల వ్యవస్థను రద్దు చేయాలని గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ ప్రతినిధులు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, హనుమంత్ నాయక్, శశికిరణాచారి విజ్ఞప్తి చేశారు. అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా తీసుకోవాలని పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు సరోత్తమ్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ప్రతిపాదించారు. జోనల్ వ్యవస్థను కొనసాగించాలని, ఆరు జోన్లుగా విభజించాలని యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి కోరారు. కొత్త జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల వరకు 20 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని పీఆర్టీయూ-తెలంగాణ ప్రతినిధులు కోరారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని తెలంగాణ టీచర్స్ యూనియన్(టీటీయూ) అధ్యక్ష కార్యదర్శులు మణిపాల్‌రెడ్డి, వేణుగోపాలస్వామి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలను ఆరు జోన్లుగా విభజించాలని, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జిల్లా పోస్టులుగా, ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2 గెజిటెడ్ హెచ్ఎంలను జోనల్ పోస్టులుగా గుర్తించాలని ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానందగౌడ్ విజ్ఞప్తి చేశారు. జోన్ల వ్యవస్థ అశాస్త్రీయం: టీఎన్జీవో ప్రస్తుతం ఉన్న జోన్ల వ్యవస్థ శాస్త్రీయంగా లేదని, అందువల్ల ఇక ఈ వ్యవస్థ అక్కర్లేదని టీఎన్జీవో సంఘం ప్రతినిధులు దేవీ ప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, హమీద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘సూపరింటెండెంట్ కేడర్ వరకు పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా భర్తీ చేయాలి. 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్ కేటగిరీకి కేటాయించాలి. ఆపై స్థాయి పోస్టుల్లో 30 శాతం ఓపెన్ కేటగిరీని మాత్రమే నేరుగా నియామకం చేపట్టాలి. మిగతా 70 శాతం ప్రమోషన్ల ద్వారా అన్ని జిల్లాలకు సమాన అవకాశమివ్వాలి. హెచ్‌వోడీ కార్యాలయాల్లో 30 శాతం డెరైక్ట్ రిక్రూట్మెంట్, 70 శాతం ప్రమోషన్లు పాటించాలి. జిల్లా నుంచి హెచ్‌వోడీకి, సెక్రెటేరియట్‌కు, అక్కణ్నుంచి జిల్లాలకు బదిలీల విధానం ఉండాలి. జనాభాకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెంచాలి. కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో ఇప్పుడున్న పోస్టుల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. ఉన్న పోస్టులనే పంపిణీ చేయడం సరి కాదు’’ అని వారు పేర్కొన్నారు. -
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
-టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ హన్మకొండ(వరంగల్ జిల్లా) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని టీఎన్జీవోస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ కోరారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో టీఎన్జీవోస్ యూనియన్ క్యాలెండర్‌ను సోమవారం అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ముత్తుసుందరం, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచే ఈ పోరాటం ప్రారంభం కానుందన్నారు. దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేయనున్నట్లు వివరించారు. ఈ ధర్నాలో రోజుకు మూడు రాష్ట్రాల చొప్పున ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరి 14, 15 తేదీలలో కేరళలోని తిరుచూరులో ఉద్యోగుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ మహిళా సదస్సులో 12 అంశాలతో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్‌లోని అంశాలను దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి అమలు కోసం ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్‌కుమార్, నగర అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
'కమలనాథన్ కమిటీని తక్షణం రద్దు చేయాలి'
-
సర్కారు నిర్లక్ష్యం వీడకుంటే ఉద్యమిస్తాం
-
కమలనాథన్ కమిటీ ఆంధ్రా పక్షపాతి
టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ ఏపీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని, దీంతో ఉద్యోగుల కేటాయింపుల్లో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరుతూ శనివారం దేవీప్రసాద్ నేతృత్వంలో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్, మరికొంతమంది సచివాలయంలో కమలనాథన్ కమిటీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానికతను పక్కన పెట్టి తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఆప్షన్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను నింపుతున్నారని ఆరోపించారు. స్థానికతపై స్పష్టమైన నిర్ధారణకు రాకుండానే ఉద్యోగుల కేటాయింపును చేపట్టడం శోచనీయమన్నారు. -
టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి
హైదరాబాద్: టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా హమీద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న దేవీప్రసాద్ ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికైనందున ఆయన స్థానంలో నూతన అధ్యక్షుని ఎన్నిక అనివార్యమైంది. -
ఉద్యోగానికి దేవీప్రసాద్ రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్జీవో నేత దేవీప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేవీ ప్రసాద్ మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాగా దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించాల్సివుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్ పోటీచేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ తరపున ఆయన బరిలో దిగనున్నారు. -
ఏపీ - టీ ఎన్జీవోల బాహాబాహీ
-
ఏపీ - టీ ఎన్జీవోల బాహాబాహీ
ఏపీఎన్జీవో కార్యాలయంలో వాటా కోసం ఏపీ ఎన్జీవోలు.. తెలంగాణ ఎన్జీవోల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో తమకూ వాటా ఇవ్వాలంటూ తెలంగాణ ఎన్జీవోలు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. కార్యాలయంపై పూర్తి హక్కులు తమవేనంటూ ఏపీఎన్జీవోలు ఎదురు తిరిగారు. దాంతో ఇరువర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రెండు ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు పరస్పరం తలపడ్డారు. కుర్చీలు విసురుకున్నారు, కొట్టుకున్నారు కూడా. గతంలో కూడా ఈ కార్యాలయంలో హక్కులకు సంబంధించి కొన్నిసార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. -
‘స్వగృహాలు’ కావాలంటే ధర కోట్ చేయండి
టీఎన్జీఓలకు ఈ-వేలం ఆఫర్ సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో నిర్ణయం అవి ఆమోదయోగ్యంగా ఉంటాయో లేవో అప్పుడు చెబుతారట ప్రభుత్వపరంగా ధర నిర్ణయించకుండా దోబూచులాట సాధారణ ప్రజలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లనే వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఓ ప్రాజెక్టుకు మంచి డిమాండ్ ఉన్నప్పుడు వేలం నిర్వహించటం కద్దు. ఓ ప్రభుత్వ భూమి కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నప్పుడు ఎవరెక్కువ ధర చెల్లించేందుకు ముందుకొస్తే వారికి కేటాయించేందుకు ఆక్షన్ నిర్వహించిన దాఖలాలున్నాయి. కానీ కొనేవారు లేక దాదాపు రెండేళ్లుగా తెల్ల ఏనుగుల్లా మూలుగుతున్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లను వేలం ద్వారా అమ్మాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించటం చర్చనీయాంశంగా మారింది. సాధారణ ప్రజలు కొనాలంటే మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న ధరే చెల్లించాలని, టీఎన్జీఓలకు రాయితీ ధరలకు వాటిని అమ్మనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి చె.చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో... వారికి వేలం పద్ధతిలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ ధరలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన రాజీవ్‌స్వగృహ ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. ధర వెల్లడించొద్దు... రాజీవ్ స్వగృహ ఇళ్ల ధరలను కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం తగ్గించింది. ఎస్కలేషన్ పేర కాంట్రాక్టర్లకు గతంలో దాదాపు రూ.100 కోట్లను అదనంగా చెల్లించిన నేపథ్యంలో ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపేందుకు 2013 డిసెంబరులో గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల ధరలను పెంచారు. దీంతో ఇటీవల ధరలను స్వల్పంగా తగ్గించినా కొనుగోలుదారులకు పెద్దగా ప్రయోజనం లేదు. ఇదే సమయంలో టీఎన్జీవోలకు రాయితీధరలకు ఇళ్లను కేటాయించనున్నట్టు సీఎం ప్రకటించడంతో హైలెవల్ కమిటీ సోమవారం భేటీ అయింది. టీఎన్జీవోలు చదరపు అడుగు ధర రూ.1500 వరకు ఉండేలా సవరించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది.అంతతక్కువ ధర నిర్ణయిస్తే ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లనున్నందున అంతకంటే ఎక్కువ ధర ఉండాలని ఇందులో అభిప్రాయపడ్డారు. ఆ ధర ఎంత అనే విషయంపై ముం దుగా ఓ నిర్ణయానికి రావటం కంటే, టీఎన్జీఓలు వాస్తవంగా ఎంత ధర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో పరిశీలించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈ-వేలం ద్వారా ఇళ్లను అమ్మనున్నట్టు ప్రకటన ఇచ్చి, వారిని దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తారు. బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులకు ఈ వెసులుబాటు కల్పించారు. కొనాలనుకునే టీఎన్జీఓ సభ్యులు స్వయంగా ఇళ్లను పరిశీలించి, మార్కె ట్ ధరలను తెలుసుకొని ఆ ఇంటికి ఎంత ధర పెట్టాలనుకుంటున్నారో ఈ-వేలం ద్వారా కోట్ చేసేలా సూచించాలని పేర్కొన్నారు. అలా వచ్చే కొటేషన్లను పరిశీలించి ఆ ధరలు ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో పరిశీ లించి సీఎం ముందుంచనున్నారు. ఈ విధానా న్ని టీఎన్జీఓలకు మాత్రమే వర్తింపజేస్తారు. ఆ ధరలు ఆమోదయోగ్యం కాని పక్షంలో ప్రభుత్వపరంగా స్వగృహకు ‘రాయితీ’లు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బ్యాంకు లోన్లు, వాటికి చెల్లిస్తున్న వడ్డీలు తడిసిమోపెడైన నేపథ్యంలో తక్కువ ధరలను ఖరారు చేస్తే స్వగృహపై భారం పడి తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని అధికారులు సీఎస్ దృష్టికి తెచ్చారు. కేటాయించిన భూములకు గాను ‘స్వగృహ’ నుంచి రుసుము వసూలు చేయరాదని నిర్ణయిస్తే ధరలను తగ్గించేందుకు వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. దానికి సీఎం నుంచి ఆమోదం వస్తేనే ఇళ్లను తక్కువ ధరలకు ఖరారు చేయనున్నారు. ఈ-వేలానికి సంబంధించి పక్షం రోజు ల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సాధారణ ప్రజలు మాత్రం ఇళ్లను కొనాలంటే అధికారులు ఇప్పటికే నిర్ధారించిన ధరలే వర్తిస్తాయని అధికారులు తేల్చారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ స్కెచ్!
పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జేఏసీ నాయకులను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి, టీ జేఏసీకి మధ్య దూరం చాలా పెరిగిందని వినిపించింది. ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన వాళ్లలో శ్రీనివాస గౌడ్ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా, స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌కి మాత్రం ఏ పదవీ దక్కలేదు. మెదక్ లోక్‌సభ టికెట్ ఆశించినా, ఆయనకు భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకే దేవీ ప్రసాద్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరో స్థానానికి అడ్వకేట్ జేఏసీ నేత రాజేందర్ రెడ్డి, మరో జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి. 2009లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా కె.నాగేశ్వర్ ఎన్నికయ్యారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికయ్యారు. వారిద్దరి పదవీ కాలం 2015 మార్చి 29తో ముగియనుంది. ఆయా స్థానాలకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని గులాబి బాస్ స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం. -
ఆదర్శపాలన అందించాలి
ఖమ్మం జడ్పీసెంటర్ : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆదర్శవంత పాలన సాగాలంటే కేంద్రం ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఖమ్మంలోని టీఎన్జీఓ ఫంక్షన్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9, 10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి సంస్థను ఇప్పటి వరకు విభజించలేదన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో అనేక అంశాల్లో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ఉద్యోగుల్లో భయాందోళన నెలకొందన్నారు. డిసెంబర్ 31 వరకు ఉద్యోగుల పంపకాలు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. 80 ప్రభుత్వ ప్రధాన శాఖలు ఉంటే 30 శాఖల్లో మాత్రమే కేడర్ స్ట్రెంట్త్ మాత్రమే విభజన జరిగిందని, హెచ్ఓడీలు శాఖాధిపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. కేడర్ స్ట్రెంట్త్ పంపని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇరు ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రులు మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవసరమైతే సూపర్ న్యూమరి పోస్టులు ఏర్పాటు చేస్తామని చెబుతోందని, కానీ ఆంధ్రలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయ టం లేదని అన్నారు. ప్రజల మధ్య వైరుధ్యాలను తొలగించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కృషిచేయాలన్నారు. 1-7-2013 నుం చి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కాకతీయ మిషన్ ద్వారా చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఒకరోజు శ్రమదానం చేయాలన్నా రు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, రామయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, వల్లోజు శ్రీనివాస్, సాగర్, వెంకటేశ్వర్లు, రమణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తా
ఖమ్మం: ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు అన్నారు. జిల్లా శిశుసంక్షేమశాఖ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జిల్లా ఉద్యోగులు స్పందించిన తీరు మరువలేమన్నారు. ఆరు దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమం విజయం సాధించిందని, ఇప్పుడు ఉద్యోగుల హక్కులను కూడా సాధించుకోవాలని అన్నారు. బంగారు తెలంగాణ రూపొందాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరేలా ఉద్యోగులు ప్రయత్నించాలని కోరారు. ఉద్యోగులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించవద్దని అన్నారు. కార్యక్రమంలో స్త్రీ సంక్షేమశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయరామ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల రవి, అచ్యుత్‌రామ్, నాయకులు రామయ్య, వల్లోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
'కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది'
హైదరాబాద్:ఉద్యోగుల విషయంలో కేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల అంశానికి సంబంధించి విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో కేంద్రం స్పందించకపోతే ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని దేవీ ప్రసాద్ హెచ్చరించారు. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే...
హైదరాబాద్: నాన్ గెజిటెడ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) ప్రతినిధులు కమలనాథన్‌ను కలిశారు. ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా జోనల్ పోస్టుల్లో 40 వేలకు పైగా ప్రాంతీయేతర ఉద్యోగుల్ని గుర్తించి వారి వివరాలు కమిటీకి సమర్పించామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. విభజన సమస్యలపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశేనని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని 18(ఎఫ్) నిబంధన తొలగించాలని అంతకుముందు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రకు చెందిన ఉద్యోగులకు ఆప్షన్స్ వర్తింప చేయరాదని అన్నారు. -
అధికారుల విభజనపై స్పష్టత ఇవ్వండి?
-
ఉద్యోగులంతా సర్వే చేసి తీరాల్సిందే!
-
ఏపీ ఉద్యోగుల అవసరం లేదు: టీఎన్జీవో
హైదరాబాద్: తెలంగాణలో నిరహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల అవసరంలేదని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సర్వేను పూర్తి చేసే శక్తి తెలంగాణ ఉద్యోగులకు ఉందని ఆయన తెలిపారు. ఈనెల 19న సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, ఇంటింటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిబ్బందికి విధులు అప్పగించడమేమిటని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. తమ ఉద్యోగులకు డ్యూటీ వేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది. -
కమలనాధన్ కమిటీని కీలుబొమ్మలా ఆడిస్తోంది
హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. కమలనాధన్ కమిటీపై ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ పెత్తనం చేస్తోందని దేవీ ప్రసాద్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదని దేవీ ప్రసాద్ హెచ్చరించారు. 18 (ఎఫ్ ) నిబంధన వల్ల తెలంగాణ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ జీవోను తొలగించాల్సిందేనని టీఎన్జీ వో నేత విఠల్ అన్నారు. కమలనాధన్ కమిటీని కేంద్రం కీలుబొమ్మలా చేసి ఆడిస్తోందని, జోనల్, జిల్లా పోస్టుల విభజన కూడా జరగాల్సిందన్నారు. ఏపీ ప్రభుత్వం వెకిలి చేష్టలు మానకపోతే తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాసగౌడ్ వ్యాఖ్యలు చేశారు. -
'ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పనిచేయం'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లో తమ ఉద్యోగులు ఏవరూ పనిచేయరని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు. ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది. -
18(ఎఫ్) తొలగింపునకు మళ్లీ ఉద్యమిస్తాం
సచివాలయ నాన్ గెజిటెడ్ టీ ఉద్యోగుల సంఘం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని 18(ఎఫ్) నిబంధన తొలగించకుంటే గతంలో 14 (ఎఫ్) తొలగింపునకు పోరాడినట్లే మళ్లీ ఉద్యమిస్తామని సచివాలయ నాన్ గెజిటెడ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. సోమవారం సంఘం సభ్యులు సచివాలయంలో కమలనాథన్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని సంఘం అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీలకు ఆప్షన్లు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ఉద్యోగులు ఇక్కడకు వస్తే తెలంగాణలోని ఎస్సీ/ఎస్టీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దంపతులు ఇద్దరు ఉద్యోగులు అయితే వారు ఎక్కడ కోరితే అక్కడకు పంపించే నిర్ణయంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు ఆంధ్రకు చెందిన ఉద్యోగులైతే ఆప్షన్స్ వర్తింప చేయకుండా వారిని ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు సుభద్ర మాట్లాడుతూ... ఈ మార్గదర్శకాలు తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. దీనిపై కమలనాథన్ కమిటీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. -
ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలి
టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ సంగారెడ్డి: ఉద్యోగులకు ఆప్షన్లు తొలగించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఆదివారం జరిగిన జిల్లా టీఎన్జీవో సంఘం కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణలోని ఖాళీల్లోకి ఆంధ్రా ఉద్యోగుల్ని పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో ఉన్న 18ఎఫ్ క్లాస్‌ను వెంటనే తొలగించాలని, స్థానికత ఆధారంగా విభజన జరగాలని డిమాండ్ చేశారు. తద్వారా ఏర్పడే ఖాళీలను తెలంగాణ ఉద్యోగుల పదోన్నతులతో నింపాలన్నారు. జిల్లాల్లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులందరినీ పంపించాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసే సీబీసీఐడీ విచారణ కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా బాధ్యులైన ప్రజా ప్రతినిధులను కూడా విచారించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. -
మాకు ప్రత్యేక గదులు కేటాయించాలి
అశోక్‌బాబును నిలదీసిన టీఎన్జీవోలు హైదరాబాద్ : ఏపీఎన్జీవోస్ హోంలో టీఎన్జీవోస్ అసోసియేషన్‌కు ప్రత్యేకంగా గదులు కేటాయించాలంటూ అసోసియేషన్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. గదుల కేటాయింపుపై ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుకు వినతి పత్రం ఇవ్వడానికి శనివారం గన్‌ఫౌండ్రిలోని ఏపీఎన్జీవోస్ హోంకు టీఎన్జీవోలు వెళ్లారు. వినతి పత్రాన్ని తీసుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఏపిఎన్జీఓస్ హోం నుంచి తమ అసోసియేషన్ కార్యకలాపాలను కొనసాగిస్తామని, ఏపిఎన్జీఓస్ అసోసియేషన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా వారికి అండగా ఉంటామని తెలిపారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులపై నెలాఖరులోగా నిర్ణయం
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు హైదరాబాద్: సమైక్యాంధ్ర పాలనలో విచ్చలవిడిగా చేపట్టిన ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఈ నెలాఖరులోగా పరిష్కారమవుతుందని, ఈ విషయంలో ఉద్యోగులు భయాందోళనకు గురికావద్దని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రిమండలి త్వరలో సబ్ కమిటీని వేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆదివారం ఇక్కడి టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దేవీప్రసాద్ పాల్గొన్నారు. -
మరో పోరాటానికి సిద్ధం: దేవీప్రసాద్
హైదరాబాద్ : ఉద్యోగుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శనివారం నాంపల్లిలోని గగన్‌విహార్ భవన్లో తెలంగాణ వాణిజ్య పన్నుల నాన్గె జిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర ్యంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, సంఘం నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా ఐఏఎస్ అధికారులకు తప్పుడు సమాచారంతోనే కేంద్రం ఉద్యోగుల విభజనకు సంబంధించి చేసిన మార్గదర్శకాలు సక్రమంగా లేవన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు కేటాయింపులు జరుగుతున్నాయే తప్ప బదిలీలు కావనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తిరిగి ఈ ప్రాంతానికి తీసుకువచ్చేలా కృషి చే స్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ చైర్మన్ వివేక్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించండి
టీఆర్ఎస్ వార్‌రూం, టీఎన్జీవో గ్రీవెన్స్‌సెల్‌కు సమాచారం ఇవ్వండి: దేవీప్రసాద్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలి స్థానికత ఆధారంగా విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపు కరీంనగర్ : తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్ఎస్ వార్‌రూంకు, టీఎన్జీవో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు వెంటనే సమాచారం అందించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సచివాలయంలో ఈ ప్రాంత ఉద్యోగులు మాత్రమే పనిచేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగులం సీమాంధ్రలో పనిచేయమని, అదేవిధంగా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేయొద్దని అన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో ఉన్న మూడు వేల మంది తెలంగాణ ఉద్యోగులు జన్మభూమిపై మమకారంతో ఇక్కడే పనిచేసేందుకు వాంటరీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారని తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు సీమాంధ్ర ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంపొందించవద్దని కోరారు. ఆంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవని కేసీఆర్ చెప్పిన మాటను తప్పుపట్టవద్దన్నారు. అది ఒక్క కేసీఆర్ మాటే కాదని, నాలుగున్నర లక్షల తెలంగాణ ఉద్యోగుల మాటతో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. ఆయా హెడ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదని చెప్పారు. జాబితాను బహిరంగంగా వెల్లడిస్తే తప్పుడు సమాచారమిచ్చిన ఉద్యోగుల వివరాలు బయటపడి అపాయింటెడ్ డే, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలోపు పరిశీలించే అవకాశం ఉండేదన్నారు. స్థానికత ఆధారంగా విభజన జరిగేంత వరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని దేవీప్రసాద్ సూచించారు. ఇప్పటివరకు 23 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన సచివాలయంలో తెలంగాణ జిల్లాల వారిని పట్టించుకోలేదన్నారు. అందుకే సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలన్నారు. 58ః42 ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియలో మంజూరీ పోస్టులను కాకుండా వర్కింగ్ పోస్టులను విభజించడం సరికాదన్నారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన తెలంగాణలోని నాలుగు వందల పోస్టులను వెంటనే పునరుద్ధరించాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. -
స్థానికత ఆధారంగానే విభజన: దేవీప్రసాద్
కరీంనగర్: స్థానికత ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల విభజన జరుగుతోందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఆయన స్వాగతించారు. 204 శాఖల్లో 50వేల మంది ఉద్యోగులు వివరాలను వెల్లడించాలని దేవీప్రసాద్ శనివారమిక్కడ అన్నారు. సకల జనుల సమ్మె రోజులను ప్రత్యేక సెలవులుగా ప్రకటించి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేవీప్రసాద్ కోరారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన పోస్టులను పునరుద్ధరించాలన్నారు. -
'స్వామిగౌడ్ కు మంత్రి పదవి ఇవ్వవద్దు'
హైదరాబాద్: మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ స్వామి గౌడ్ కు చుక్కెదురైంది. స్వామిగౌడ్ కు మంత్రిపదవి ఇవ్వవద్దని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు టీఆర్ఎస్ అధినేత మంత్రి పదవి ఇవ్వనున్నట్టు మీడియాలో వచ్చిన ప్రచారంపై తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నకాలంలలో స్వామిగౌడ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయనపై భూవివాదాలు, కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు ఆరోపించారు. అవినీతి అరోపణలు ఉన్న నేతలను మంత్రులుగా నియమించడం తగదని టీఆర్ఎస్ పార్టీకి, అధినేత కేసీఆర్ కు సూచించారు. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాల చేసినట్టు స్వామిగౌడ్ పై ఆరోపణలున్నాయని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మీడియాకు వెల్లడించింది. -
అదనంగా 2గంటలు పనిచేస్తాం
మీట్ ది మీడియా కార్యక్రమంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైతే అదృంగా రెండు గంటలు పనిచేస్తామని టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడి పించేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, వచ్చే ఐదేళ్లు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో టీఎన్జీవో వాచ్‌డాగ్‌లా పనిచేస్తుందన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం, అందుకు పూనుకున్న పాలకులే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ, ఆత్మగౌరవపోరాటం చేశామని, ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్టేట్ సర్కారీ ములాజిం యూనియన్ (ప్రస్తుత టీఎన్జీవోస్) తెలంగాణకు చెందిన అన్ని రంగాల ఉద్యోగులను కలుపుకొని పోరాటం చేసిందని, 1952లోనే మొదటిసారి ఫజల్అలీ కమిషన్ ముందు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిందన్నారు. రాజకీయ పార్టీలు కలసి రాకపోయినా, ఉద్యోగులతోపాటు అప్పటి నుంచే విద్యార్థులు కలసి వచ్చారని, 1969 ఉద్యమం విద్యార్థుల పాత్ర మరువలేదన్నారు. 369 మంది విద్యార్థుల బలిదానాలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో వారి కుటుంబాలకు స్వాతంత్య్ర సమరయోధుల కు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తాము ఒకరోజు వేతనం ఇస్తామని, కోదండరాం నేతృత్వంలో ట్రస్టు ఏర్పాటు చేసి, ఆ కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిన వివి ధ అంశాలు, విధానాలపై 21 అంశాలతో నివేదిక రూపొం దించామని, దాని అమలుకు కృషి చేస్తామని సంఘం ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తెలిపారు. విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు దేవీప్రసాద్ ఇచ్చిన సమాధానాలు పునర్నిర్మాణమంటే.. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే. ఆత్మగౌరవంతో బతికేలా చేయడమే. మొత్తం మంజూరైన పోస్టులను తీసుకొని 58 శాతం పోస్టులను సీమాంధ్రకు కేటాయించాలి. వాటిల్లోకి ప్రస్తుతం ఉన్న సీమాంధ్రులను పంపించాలి. ఆ తరువాతే తెలంగాణకు ఉద్యోగులకు కేటాయించాలి. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. 60వేల వరకు ఖాళీలు వస్తాయి. వాటిల్లో తిష్టవేసిన వారిని ఆంధ్రాకు పంపించాలి. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల్లో డీఎస్సీల ద్వారా భర్తీ చేస్తుంది. తద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయి. విభజనలో గిర్గ్లానీ కమిటీ సిఫారసులను అమలు చేయాలి. మేం రాజకీయాల్లోకి ఇప్పుడే రాము. మా ముందున్న లక్ష్యం రాష్ట్ర పునర్నిర్మాణమే. -
స్థానికత ఆధారంగానే విభజించాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల స్థానికత ఆధారంగా విభజన జరగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు కమల్‌నాథన్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి మామిడి నారాయణ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, నేతలు కృష్ణయాదవ్, సలీముద్దీన్ తదితరులు సంఘాల వారీగా.. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ ముందు శుక్రవారం తమ వాదనలు వినిపించారు. ఒక్కో సంఘానికి 10 నిమిషాలే కేటాయించినా.. ఈ కమిటీ టీఎన్జీవోల ప్రతినిధి బృందం వాదనలను 25 నిమిషాలకు పైగా ఆలకించింది. కమిటీ ముందు తెలంగాణ సంఘాలు ఉంచిన అంశాల్లో ముఖ్యమైనవి.. స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలి. సర్వీసు రిజిస్టర్ల ప్రకారం స్థానికతను నిర్ధారించడానికి అవకాశం ఉంది. అయితే సర్వీసు రిజిస్టర్లలో తప్పుడు వివరాలు నమోదు చేసిన వారు చాలా మంది ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వారూ ఉన్నారు. వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అకడమిక్ రికార్డు ఆధారంగా స్థానికతను నిర్ధారించాలి. తెలంగాణ ఉద్యోగులుగా గుర్తించిన వారి జాబితాను బహిరంగపరచాలి. ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. తెలంగాణలో స్థానికేతరులు పెద్ద సంఖ్యలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని గిర్గ్లాని కమిటీ తేల్చింది. కమిటీ నివేదికను ప్రభుత్వం అంగీకరించింది. ఆ కమిటీ నివేదికను విభజనకు ఆధారంగా తీసుకోవాలి. విభజన నేపథ్యంలో తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య నిర్ధారణను కేవలం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకే పరిమితం చేయాలి. జిల్లాలు, క్షేత్రస్థాయి కార్యాలయాల మీద విభజన ప్రభావం ఉండదు కాబట్టి ప్రస్తుతం ఉన్న సంఖ్యనే కొనసాగించాలి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. వారిని అక్కడే మిగతా అవసరాల కోసం వినియోగించాలి. తెలంగాణలో చోటు కల్పించకూడదు. ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి పోస్టులు, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఖాళీలను తెలంగాణ పోస్టులుగా భావించాలి. సీమాంధ్ర అధికారులను ఇక్కడే కొనసాగిస్తే.. వారికి సేవలు అందించ బోమని తెలంగాణ క్లాస్-4 ఉద్యోగులు కమిటీకి చెప్పారు. గతంలో ఆప్షన్లు అమలయ్యాయి కదా: కమల్‌నాథన్ గతంలో మూడు రాష్ట్రాల విభజనలో ఆప్షన్ విధానం అమలైన విషయాన్ని కమల్‌నాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా ఆప్షన్ విధానం ఉందన్నారు. మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయకూడదని ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నించారు. ‘మూడు రాష్ట్రాల విభజనకు, ఆంధ్రప్రదేశ్ విభజనకు తేడా ఉంది. ఇక్కడ జిల్లా, జోనల్ రిజర్వేషన్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో అమల్లో ఉన్నాయి. గతంలో విభజన జరిగిన మూడు రాష్ట్రాల్లో ఇంత సంక్లిష్టమైన పరిస్థితి లేదు. అందుకే అక్కడ ఆప్షన్ ఇవ్వడం సమంజసం. 60 సంవత్సరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని 6 నిమిషాల్లో వివరించడం సాధ్యం కాదు. తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగకుండా ఉండాలంటే.. మా ఉద్యోగాలు మాకే దక్కాలి’ అని టీ- సంఘాల నేతలు వివరించారు. తెలంగాణకు ఉద్యోగులు తక్కువ అయ్యే పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి? అని ఉద్యోగ సంఘాల నేతలను కమల్‌నాథన్ మరో ప్రశ్నవేశారు. దీనికి నాయకులు స్పందిస్తూ, జిల్లాల నుంచి తెచ్చుకోవడం.., ఇంకా ఖాళీగా ఉంటే కొత్తగా నియామకాలు చేపట్టడంవల్ల పరిష్కరించుకోవచ్చు’ అని సమాధానం ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో నేడు కమిటీ మళ్లీ భేటీ ఉద్యోగ సంఘాలతో సమావేశాలను శనివారం కూడా కొనసాగించాలని కమల్‌నాథన్ కమిటీ నిర్ణయించింది. కమిటీని కలవలేకపోయామని, తమ వాదనలను మౌఖికంగా వినిపించలేకపోయామని పలు ఉద్యోగ సంఘాలు చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు డి-బ్లాక్ మూడో ఫ్లోర్లో భేటీలు జరుగనున్నాయి. కమిటీతో భేటీ కావాలనుకొనే సంఘాలు ఎస్ఆర్ సెల్ ఉప కార్యదర్శి లలితాంబిక (9951531798) వద్ద మధ్యాహ్నం ఒంటి గంట లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ సూచించారు. ఆప్షన్ సౌకర్యం పరిమితమే..! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల పంపిణీలో పరిమిత ఆప్షన్లు కల్పిస్తూ కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల రూపకల్పనకు ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిటీ మార్గదర్శకాల రూపురేఖలు ఇలావున్నాయి... జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు విభజన పరిధిలోకి రారు. ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉంటారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు... అది కూడా పరిమితంగానే ఆప్షన్ సౌకర్యం ఉంటుంది. సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్ (సింగిల్ యూనిట్), శాఖాధిపతుల కార్యాలయాల్లో తొలుత స్టాఫ్ ప్యాట్రన్‌ను నిర్థారిస్తారు. ఈమేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగులను పంపిణీ చేస్తారు. రాష్ట్రస్థాయి క్యాడర్ ఉద్యోగులనూ స్థానికత ఆధారంగానే విభజిస్తారు. వీరందరూ కలిపి 56 వేల మంది ఉన్నట్లు ఆర్థికశాఖ లెక్కలు తేల్చింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు దంపతులైన పక్షంలో ఒకరికి ఆప్షన్ సౌకర్యం కల్పిస్తారు. అనారోగ్య కారణాలను చూపిస్తూ ఆప్షన్ అడిగిన రోగపీడితులకు వారి అభీష్టాల మేరకు రాష్ట్రాన్ని కేటాయించనున్నారు. అయితే కేసుల వారీగా అధికారులు పరిశీలించి, చూపించిన అనారోగ్య కారణాల విషయంలో సంతృప్తి చెందితేనే ఆప్షన్ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశమిస్తారు. 5 సంవత్సరాల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులకు ఆప్షన్ సౌకర్యం కల్పించనున్నారు. ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం మొదట ఎస్టీ, ఎస్సీ, వికలాంగ ఉద్యోగులకు ఇవ్వనున్నారు. వారికున్న రిజర్వేషన్ల మేరకు భర్తీ చేసిన తర్వాత మిగతా వర్గాల ఉద్యోగులకు పరిమితంగా ఇచ్చిన ఆప్షన్‌ను అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. సడలింపు ఉన్న వారికి మినహా మిగతా ఉద్యోగులకు దరఖాస్తులో ఆప్షన్ కాలమ్ ఇచ్చినా.. దాన్ని పరిశీలించే అవకాశాలు దాదాపు ఉండవు. -
సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే: దేవీప్రసాద్
హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, అధికారులు తమ ప్రాంతానికి వెళ్లి పోవాల్సిందేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆ అధికారులు, ఉద్యోగులు వెళ్లకపోతే మరోసారి సకల జనుల సమ్మెను చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారమిక్కడి ప్రభుత్వ ఛాతీ వైద్యశాలలో జరిగిన టీఎన్జీవో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన వెంటనే సీమాంధ్ర ఉద్యోగులు, అధికారులు తమ ప్రాంతానికి వెళ్లిపోవాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి ఆప్షన్లు ఉండవని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోల ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు డి.రేచల్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఏర్పాటు
ఖలీల్‌వాడీ,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సం ఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఏపీ అంబేద్కర్ సంఘం నుంచి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘంగా మారుస్తూ తీర్మానించారని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ఉపాధ్యక్షు డు చెన్నయ్య తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రం లోని టీఎన్జీవోస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త కార్యవర్గంలో తెలంగాణ అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లా నుంచి మర్రి కిరణ్‌కుమార్ ఎన్నికైనట్లు తెలిపారు. చిన్న రాష్ట్రాలతో దేశం అబివృద్ధి చెందుతుందని చెప్పిన అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన యూపీఏ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు రాకేష్,రాహుల్,అరవింద్ పాల్గొన్నారు. -
రాష్ట్రం ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలి
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను అమోదించి న క్రమంలో శుక్రవారం హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి, ఏక శిల పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద సుబ్బారా వు మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల పోరాటం, త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని తన్నుకు పోవడానికి సీమాంధ్ర గద్దలు సిద్ధంగా ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముం దన్నారు. సమైక్యవాదులు సంయమనం పాటించి రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్, రెవెన్యూ, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘాల జిల్లా అధ్యక్షు లు కోల రాజేశ్‌కుమార్, రత్న వీరాచారి, కుమారస్వామి, దాస్య నాయక్, నాగపురి ప్రభాకర్, టీఎన్జీవోస్ నాయకులు ఈగ వెంకటేశ్వర్లు, రత్నాకర్‌రెడ్డి, ధరంసింగ్, డి.శ్రీనివాస్, సోమ య్య తదితరులు పాల్గొన్నారు. -
విభజన హక్కు.. సమైక్యం భావనే : కోదండరాం
సాక్షి, హైదరాబాద్: విభజన అనేది హక్కు అయితే సమైక్యం అనేది భావన మాత్రమేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ భవన్లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభం అయినట్టేనని చెప్పారు. కేబినెట్ ఆమోదంపై సంతోషంగా ఉన్నామన్నారు. నోట్‌ను స్టీరింగ్ కమిటీ భేటీలో సంపూర్ణంగా అధ్యయనం చేశామని, అది పూర్తి సంతృప్తికరంగా ఉందని అన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, పార్లమెంటులో బిల్లు నెగ్గుతుందని అన్నారు. రాష్ట్ర విభజన తథ్యం అని ఆంధ్రా ప్రజలు అర్థం చేసుకోవాలని కోదండరాం సూచించారు. తెలంగాణ ప్రజల పోరాటం హక్కుల కోసమని, అయితే తెలంగాణ ప్రజలపై హక్కుల కోసం సీమాంధ్రులు పోరాడుతున్నారని వివరించారు. జేఏసీ నేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, దేవీ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు ఖాయమైపోయిన ఈ తరుణంలో ఇంకా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం ఎవరికీ మంచిదికాదని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న ఏపీఎన్జీఓలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెకు దూరంగా ఉంటున్న ఉద్యోగులను కొందరు ఏపీఎన్జీఓ నేతలు బెదిరిస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. జేఏసీ నేతలు రాజేశ్వర్‌రావు(బీజేపీ), డాక్టర్ దాసోజు శ్రవణ్(టీఆర్ఎస్), పి.సూర్యం(న్యూ డెమొక్రసీ), కె.గోవర్ధన్(న్యూ డెమొక్రసీ-చంద్రన్న) మాట్లాడుతూ తెలంగాణపై నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ తరుణంలో ఇంకా ఇరుప్రాంతాల మధ్య విద్వేష పూరిత వాతావరణం పెరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే తెలంగాణ బిల్లును పెట్టి, ఆమోదించాలని వారు కేంద్రాన్ని కోరారు. ఇదిలా ఉండగా తెలంగాణ నోట్‌ను కేంద్రం ఆమోదించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి త్వరలో ఢిల్లీకి వెళ్లాలని జేఏసీ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. దేవీ ప్రసాద్‌ను నిలదీసిన రఘు ఇప్పటిదాకా తెలంగాణకోసం పోరాడుతూ, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న తెలంగాణ ఉద్యోగుల్లో విభజను తెస్తారా అంటూ టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కంచర్ల రఘు నిలదీశారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలైన 1104, 327 ఇప్పటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాయని రఘు వివరించారు. అలాంటి సమైక్య సంఘాలు పెట్టుకునే సభలకు టీఎన్జీఓ అధ్యక్షునిగా దేవీ ప్రసాద్ వెళ్తే తెలంగాణకోసం ఇప్పటిదాకా కష్టపడిన వారికి ఎలాంటి సంకేతాలను ఇవ్వాలనుకుంటున్నారని రఘు నిలదీసినట్టుగా సమాచారం. ఈ విజయం అమర వీరులకు అంకితం: కోదండరాం తెలంగాణ అమరవీరుల త్యాగం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సాధ్యమైందని కోదండరాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద శుక్రవారం ఆయన నివాళులర్పించారు. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు. -
ఏపీఎన్జీవోల సమ్మెలో స్పష్టత లేదు
హైదరాబాద్ :సీమాంధ్రలో గత రెండు మాసాలనుంచి సమ్మెతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న ఏపీఎన్జీవోల పై టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ మండిపడ్డారు. అక్కడ చేస్తున్న సమ్మెలో స్పష్టత కనిపించడం లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో నిజాంకళాశాలలో నిర్వహిస్తున్న సకలజన భేరీ సభలో దేవీ ప్రసాద్ మాట్లాడారు. ఏపీఎన్జీవోలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. హైద్రాబాద్ నిజాం కళాశాలలో నిర్వహిస్తున్న సకల జన భేరి సభకు మండలంలోని జగదేవ్‌పూర్, మునిగడప, ఎరవ్రల్లి, గొల్లపల్లి, తిగుల్, చాట్లపల్లి , పిర్లపల్లి తదితర గ్రామాల నుండి తెలంగాణ వాదులు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల జేఏసీ ఆధ్వర్యంలో బస్‌లు, సుమోలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ,విద్యుత్ రంగ కార్మికులు ,విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలను భారీగా తరలించారు. ఈ సభకు వెళ్లిన వారిలో జేఎసీ నాయకులు తుమ్మ కృష్ణ, విద్యుత్ రంగ కార్మికులు మల్లారెడ్డి, మధు, కృష్ణ, తెలంగాణ వాదులు భిక్షపతి, డి. కృష్ణ, బింగి బాస్కర్, అప్పల ప్రవీణ్ తదితరులు బయిల్దేరి వెళ్లారు. -
హైదరాబాద్ సిర్ఫ్ హమారా
సంగారెడ్డి/హైదరాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తేలేదని టీఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి కలెక్టరేట్, హైదరాబాద్‌లోని టీఎన్జీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం కొనసాగేందుకు కేంద్రం నాన్చుడు ధోరణే కారణమన్నారు. ఏపీఎన్జీవోల నేత ‘అబద్ధాల అశోక్‌బాబు’ అని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను కూడా ఉద్యమంలో పాల్గొంటున్నట్టుగా ప్రభుత్వం అధిష్టానానికి నివేదిక అందిస్తోందని ఆయన ఆరోపించారు. సకల జనుల సమ్మెలో ప్రభుత్వం అనుసరించే విధానాన్నే సీమాంధ్ర ఉద్యమానికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ అనే నినాదాన్ని సభ విజయవంతం ద్వారా సీమాంధ్రులకు తెలియజేయాలన్నారు. 29న నిర్వహించే సకలజన భేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న వరంగల్, 27న నల్లగొండలో భారీ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సకల జనభేరి పోస్టర్‌ను దేవీప్రసాద్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అశోక్ బాబూ.. జాగ్రత్త : శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమంపై.. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడి అవమానపరిస్తే సహించేదిలేదని తెలంగాణ జేఏసీ రాష్ట్ర కో-చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లోని టీఎన్జీవో భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎన్జీవోలది ముమ్మాటికీ ప్రభుత్వం చేయిస్తున్న ఉద్యమమే అని పేర్కొన్నారు. సీమాంధ్రుల గురించి మాట్లాడితే తమ గౌరవాన్ని కించపరుచుకున్న వారమవుతామని చెప్పారు. తెలంగాణ ప్రకటించి 53 రోజులు అవుతున్నా.. ఇంతవరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ మరోసారి మోసం చేసే అవకాశాలున్నందున, కాంగ్రెస్ నేతలు మేల్కొని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. -
హైదరాబాద్ లేకుంటే ఉద్యమమే వృథా : దేవీప్రసాద్
హైదరాబాద్/నిజామాబాద్,న్యూస్‌లైన్: హైదరాబాద్ మొద టి నుంచి తెలంగాణలో అంతర్భాగమేనని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. సోమవారం హైదారబాద్‌లోని జేఎన్టీయూహెచ్ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ కార్యక్రమంలో, నిజామాబాద్‌లో జరిగిన టీఎన్జీవోల రణభేరిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే ఇన్నేళ్ల ఉద్యమానికి అర్థంలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను వదులుకునే ప్రసక్తేలేదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టకుండా కాలయాపన చేయడం వెనుక పాలక, ప్రతిపక్షాల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి 50రోజులు గడుస్తున్నా ఒక అడుగుకూడా కేంద్రం ముందుకు పోలేదన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కేంద్రం ఏ మాత్రం వెనుకడుగు వేసినా, హైదరాబాద్‌ను యూటీ అన్నా యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈనెల 29న హైదరాబాద్‌లో జరుపతల పెట్టిన సకల జనుల భేరీని విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఒక్కటేనన్నారు. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్ట్‌ను ఆశోక్‌బాబు అమలు పరుస్తారని విమర్శించారు. ఏపీఎన్జీవోల సభలకు సర్కారే కొమ్ము కాస్తోందని, నిర్వహణ ఖర్చు భరిస్తోందని, సీమాంధ్ర ఉద్యోగులకు బిర్యానీ, మినరల్‌వాటర్ ప్యాకెట్లు పంచి పెడుతోందనీ ఆరోపించారు. -
కుట్రలను ఎండగడతాం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమో దం పొందే వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, కార్మికులు పోరాడాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం టీఎన్జీవో ఫంక్షన్‌హాలులో సంఘం జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు అధ్యక్షతన జరిగిన టీఎన్జీవో భేరి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తెలంగాణను అడ్డుకోవాలని చూసేవారి కుట్రలను ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అనేకసార్లు కమిటీల ముందు ఉంచినా ఎప్పుడు మా ట్లాడని వారు ఇప్పుడు ఎందుకు తెలంగాణను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె చేస్తూ మరోవైపు తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటడానికే దాడులను భరిస్తున్నామని దేవిప్రసాద్ అన్నారు. సకల జనుల సమ్మె 42 రోజులు విజయవంతంగా నిర్వహించినప్పటికీ తెలంగాణ ఉద్యమం లేదని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రస్తుతం ఏపీఎన్జీవోలు చేస్తున్న సమ్మె మాత్రం నూటికి నూరు శాతం విజయవంతమైందని మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులపై క్రిమినల్ కేసులు, రాజద్రోహం వంటి కేసులు పెట్టారని, ఆంధ్రా ఉద్యోగులపై ఏ ఒక్క కేసు పెట్టకుండా సమైక్యాంధ్ర వస్తే సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని మంత్రులే చెబుతున్నారన్నారు. ప్రభుత్వం ఆంధ్రా ఉద్యోగులపై, తెలంగాణ ఉద్యోగులపై భిన్న వైఖరి ప్రదర్శించడం వివక్షకు పరాకాష్టగా నిలిచిందన్నారు. ఏపీ ఏన్జీవోల సభలో తెలంగాణ ఉద్యోగులపై జరిగిన దాడులను సైతం భరిస్తూ సంయమనం పాటించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి 50 రోజులు గడుస్తున్నప్పటికీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందని, వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు తెలంగాణ కోసం కలిసి రాకుంటే చరిత్రలో దోషులుగా మిగులుతారని అన్నారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని,వేరే ప్రత్యామ్నాయం ఒప్పుకోమని తేల్చిచెప్పారు. సమైక్యపాలనను పారదోలేందుకు ఉద్యోగులందరూ ఏకంకావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో అనైక్యత సృష్టించడం ఎవరితరం కాదన్నారు. ఉద్యమంలో ఖమ్మం ప్రముఖపాత్ర... తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రముఖపాత్ర వహించిందని దేవీ ప్రసాద్ అన్నారు. 1969లో పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, రెండో దశ ఉద్యమంలో కూడా ఈ జిల్లా అగ్రభాగాన నిలిచిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9, 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేందుకు ఖమ్మంజిల్లానే మూలకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సమయంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారని, ఆసమయం లో ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి తెలంగాణ వాదాన్ని చాటారని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకూ పోరాడాలన్నారు. కాంగ్రెస్ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టనందుకు నిరసనగాను, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఈనెల 29న సకలజనుల భేరి నిర్వహిస్తున్నట్లు దేవిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, ఉద్యోగులు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓల వైఖరివల్లే పీఆర్సీ జాప్యం... పే రివిజన్ కమిషన్ ఫలితాలు అందకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని, ఏపీ ఎన్జీవోల వైఖరి వల్లనే పీఆర్సీ అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. 2008 నుంచి 2013 వరకు 125 శాతం ధరలు పెరిగాయన్నారు. ఉద్యోగులకు దసరాలోపు 45 శాతం ఇన్టరమ్ చెల్లించాలని, లేనిపక్షంలో టీజేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్‌లో మహా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇవ్వడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగులకు రూపాయి ఇచ్చి పది రూపాయలు ధరల రూపంలో కొల్లగొడుతోందన్నారు. లైబ్రరీ ఉద్యోగులకు 010 అమలు చేయాలని, అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనుమానం ఉద్యోగుల్లో కూడా కలుగుతోందన్నారు. సీమాంధ్ర ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యా యం జరగదు.: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏలూరి తెలంగాణ ప్రజలకు,ఉద్యోగులకు సీమాంధ్ర ప్రభుత్వంలో న్యాయం జరగదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. అనేక ఎళ్ళుగా వివక్షకు గురవుతునే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమం ఆగదని ఖమ్మం జిల్లా ఉద్యమాల ఖిల్లా అన్నారు. 29న సమర భేరికి ఉద్యోగులు కదలాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులను అణిచివేయాలని చూస్తే తిరగబడతారని,సీమాంధ్రులకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే వెళ్లాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మనమే భాగస్వాములమని, ఉద్యోగులకు ఏలాంటి అన్యాయం జరిగినా సహించేదిలేదన్నారు. టీఎన్జీవో కేంద్రసంఘం ప్రధానకార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య ఉద్యమంతో ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ ఆగిపోయిందన్నారు. టీఎన్జీవో కేంద్రసంఘం మహిళా అధ్యక్షురాలు రేచల్, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, టీజేఏసీ చైర్మన్ కనకాచారి, టీటీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, లాయర్ల జేఏసీ ఆధ్యక్షుడు తిరుమలరావు తదితరులు మాట్లాడుతూ తెలంగాణ సాధించేవరకు ఉద్యమం ఆగేదిలేదని స్పష్టం చేశారు. సభలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్, రామారావు, సోమయ్య,లక్ష్మనారాయణ, వల్లోజు శ్రీనివాస్ ,సాగర్,రమణయాదవ్,తుమ్మలపల్లి రామారావు ప్రసాద్, నాగేశ్వరరావు, మల్లెలరవీంద్రపసాద్,రాజేష్, కొర్లపాటి వెంకటేశ్వర్లు, దుర్గప్రసాద్,తదితరులు పాల్గొన్నారు. సభలో కళాకారులు తెలంగాణ ఆటపాట లతో అలరించారు. -
శాంతా, సమరమా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యంగంపై గౌరవమున్న వారిగా, ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేవారిగా శాంతికైనా, స్నేహానికైనా మేం సిద్ధం. ఇవేవీ కాకుండా యుద్ధానికి వచ్చినా సిద్ధమే. శాంతి, స్నేహం కావాలో, యుద్ధమే కావాలో సీమాంధ్రులే తేల్చుకోవాలి. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం నడుపుతున్న ప్రజాప్రతినిధులకు, పెట్టుబడిదారులకు ఇది నా సవాల్’’ అని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ యూటీ ప్రతిప్రాదనకు నిరసనగా ఆరె కటిక పోరాట సమితి, అమ్మల సంఘం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సోమవారం చేసిన దీక్షలో, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో టీఎన్జీవో భేటీలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతమంటే మరో సకల జనుల సమ్మెకు టీఎన్జీవోలంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఏకం కావాలన్నారు. ‘‘సీమాంధ్రులు శాడిస్ట్ ప్రేమికుల్లా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వారికి దక్కదని తెలిసి, తెలంగాణకు కూడా దక్కకుండా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పావులు కదుపుతున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ఇకపై సహించేది లేదు. ఈ యూటీ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలి. తెలంగాణ కోసం వేలాదిమంది ఆత్మ బలిదానం చేసుకుంటే స్పందించని లోక్‌సత్తా అధినేత జేపీ ఇప్పుడు తెలుగుతేజం పేరుతో యాత్రలు చేపట్టడం సిగ్గుచేటు. తెలంగాణ పై ప్రధాన ప్రతిపక్షాలు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నాయి’’ అని ఎద్దేవా చేశారు. అశోక్‌బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మెకు చట్టబద్ధత లేదని, అటువంటి సమ్మెకు నాయకత్వం వహిస్తున్న ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు సోమవారం డిమాండ్ చేశారు. -
30న TNGOల మహాసభ
-
దద్దరిల్లిన కార్యాలయాలు
పంజగుట్ట/సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కార్యాలయాలు హోరెత్తాయి. పోటాపోటీ నినాదాలతో మార్మోగాయి. ప్రత్యేక, సమైక్య ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలతో పలు ప్రభుత్వ కార్యాలయాలు హోరెత్తాయి. టీఎన్జీవోలు, ఏపీఎన్జీవోల ధర్నాలతో దద్దరిల్లాయి. సచివాలయం, విద్యుత్ సౌధలలో నిరసనలు మిన్నంటాయి. ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీ నిరసనలు చేపట్టారు. సీమాంధ్ర ఉద్యోగులు ఉదయం నుంచి కార్యాలయ ఆవరణలో బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఒంటికాలిపై నిల్చొని, సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అటు తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఎంఈ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్, డెరైక్టర్ ఆఫ్‌హెల్త్, ఎపిసాక్, వైద్యవిధాన పరిషత్ తదితర కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీని నిర్వహించారు. అనంతరం వంటావార్పు కార్యక్రమం చేపట్టి సహపంక్తి భోజనాలు చేశారు.తెలంగాణ ఉద్యోగులు సైతం డీఎంహెచ్ఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్‌లోని ఏపీజీఎల్‌ఐసీ, డీటీవో, ఆయూష్, పీఏవో తదితర విభాగాల సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించారు. బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టిఎన్జీవోలు ధర్నా నిర్వహించారు. సీమాంధ్ర ఉద్యోగులు నోటికి నల్లగుడ్డలుకట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. టీఎన్జీవోలు భోజన విరామ సమయంలో కాకుండా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో ఏపీఎన్జీవోలు పోటా పోటీ నినాదాలు చేశారు. -
నోటిసిచ్చే హక్కు అశోక్‌బాబుకు లేదు: టీఎన్జీవో
సెప్టెంబర్ రెండో తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ఏపీ ఎన్జీవోలు నోటీసు ఇవ్వడంపై టీఎన్జీవోలు మండిపడుతున్నారు. అసలు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు సమ్మె నోటీసు ఇచ్చే హక్కు లేదని చెబుతున్నారు. అశోక్‌బాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను సర్వీస్ నుంచి బర్తరఫ్ చేయాలని టీఎన్జీవో సెంట్రల్ అసోసియేషన్ డిమాండు చేసింది. ఈ మేరకు టీఎన్జీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీఎన్జీవో సమ్మె నోటీసుపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. మరోవైపు, సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడిని సచివాలయ తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నరేందర్ ఖండించారు. అసలు రెండు ప్రాంతాలు కలిసుంటే తెలంగాణకు లాభమేంటని ఆయన ప్రశ్నించారు. -
సీమాంధ్రుల ఉద్యోగుల సమ్మె అధర్మం:దేవీప్రసాద్
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మె అదర్మమని టీఎన్జీవో చైర్మన్ దేవీప్రసాద్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులు సమ్మెను ఉధృతం చేస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రులు చేపట్టిన సమ్మె అధర్మమంగా, అనైతికంగా ఆయన అభివర్ణించారు. గతంలోతెలంగాణ ఉద్యోగులు చేపట్టిన సమ్మె చేసినపుడు ఎస్మా ప్రయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేపటి సమ్మెలో పాల్గొన్న వారంతా ఆంధ్రా ఉద్యోగులేనని ఆయన అన్నారు. అలాంటి వారికి తెలంగాణలో ఉండే స్థానం లేదని తెలిపారు. ఆంధ్రా ఉద్యోగులు సమ్మె చేసినా తాము ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. -
జలసౌధ, విద్యుత్ సౌధ ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు
విభజన ప్రకటన నేపథ్యంలో రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మొన్నటికి మొన్న అబిడ్స్‌లోని బీమా భవన్లో ఇరు ప్రాంతాల ఉద్యోగుల మోహరింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, మంగళవారం జలసౌధ, విద్యుత్సౌధలతో అదే దృశ్యం పునరావృతమైంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయింది. టీఎన్జీఓ ఉద్యోగులకు, ఏపీఎన్జీవో ఉద్యోగులకు మధ్య తోపులాట తీవ్ర వాగ్వాదానికి చోటుచేసుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను జరుపుకునేందుకు టీఎన్జీఓలు భోజన విరామ సమయంలో సన్నద్ధమయ్యారు. మరోవైపు అదేసమయంలో ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఎన్జీవోలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టివేసుకునేవరకు పరిస్థితి రావడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించేందుకు యత్నించారు. వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, అడీషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీలు వెంకటనర్సయ్య, వినోద్‌కుమార్, ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ప్రభాకర్ తదితరులు వచ్చి పరిస్థితిని చక్కబెట్టారు. ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ సిటీ ప్రెసిడెంట్ పీవీవీ సత్యనారాయణను అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మరో పది సంవత్సరాలు తమతో కలిసి ఉండాల్సిన ఉద్యోగులు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులను అక్కడకు పిలిపించుకొని కవ్వింపు చర్యలకు పాల్పడడం తగదని విమర్శించారు. 42రోజులు సకలజనుల సమ్మె సమయంలో కూడా ఏ ఉద్యోగికి ఎటువంటి ఇబ్బందులు కల్గించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి జరిగే సమ్మె గురించి చర్చించుకునేందుకు తాము సమావేశమైతే ‘సీమాంధ్ర గోబ్యాక్’ అంటూ టీఎన్జీవో నాయకులు రెచ్చగొట్టారని ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పయ్యావుల రాకతో విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాక తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విద్యుత్‌సౌధకు వచ్చి ఇక్కడి సీమాంధ్ర ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఇంతలో అక్కడకు చేరుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఉద్యోగులను, పయ్యావుల కేశవ్‌ను చుట్టుముట్టారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకే వచ్చావా? మా కార్యాలయంలో నీకేం పని? అంటూ కేశవ్‌ను నిలదీశారు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాల వారిని సముదాయించి కేశవ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో ఉద్యోగులు కూడా ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు. -
‘హైదరాబాద్‌లో అందరం కలిసి ఉందాం’
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని తేలినా, సీమాంధ్రులు అడ్డుపడుతున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో అంతా కలిసి ఉందామని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీమంధ్రాలో ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు ప్రాంతాల వారీగా విడిపోయి, అన్న దమ్ముల వలే కలిసుందామన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఎటువంటి ఉద్రేకాలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15న హైదరాబాద్ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్‌కు తాకిన సమైక్యాంధ్ర సెగ