
సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ మరోమారు ఎన్నికయ్యారు. దీంతో మూడోసారి వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 6న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆమోదం మేరకు ఎన్నికల అధికారిని నియమించి నోటిఫికేషన్ జారీచేశారు. ఆరోజు జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ప్రతిపాదనల మేరకు రాష్ట్ర కార్యవర్గానికి చేపట్టిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. నామినేషన్లన్నీ సరిగ్గా ఉండటంతో అంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ కార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగనుంది.
ఎన్నికైన రవీందర్ రెడ్డి, రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ నాయకత్వం పట్ల నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీఎన్జీవో సంఘం అనేక సమస్యలను పరిష్కరించిందని, ఇతర సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎంను కలుస్తామని వెల్లడించారు. సంఘం ఎన్నికల్లో వీరితోపాటు సహ అధ్యక్షురాలుగా బి.రేచల్, కోశాధికారిగా రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్, నరసింహస్వామి, నరసింహచారి, ఉమాదేవి, కార్యదర్శులుగా తిరుమల్ రెడ్డి, లక్ష్మణ్ రావు, రాము నాయక్, రవి, దివ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండల్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులుగా కొనిదెన శ్రీనివాస్, రవిందర్, నర్సింహులు, సిద్దిరాములు, మాధవి, శైలజ, సత్యం ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సుబ్బారావు, సహాయ ఎన్నికల అధికారిగా రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment