karam ravinder reddy
-
అవసరమైతే సీఎం కాళ్లు మొక్కుతా..
సాక్షి, హన్మకొండ: ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంతో సామరస్యపూర్వక ధోరణితో పోరాడుతామని, అవసరమైతే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడానికి కూడా సిద్ధమేనని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు తెలంగాణ అభివృద్దిలో ప్రతీ ఉద్యోగి ముఖ్యమంత్రి వెంట కండువా లేని టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని తెలిపారు. టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా కౌన్సిల్ సమావేశం, కేంద్ర సంఘం నూతన నాయకులకు అభినందన, పూర్వ అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి వీడ్కోలు సమావేశం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం జరిగింది. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశిష్ట అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర నూతన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, జేఏసీ ఛైర్మన్ పరిటాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ పరిస్థితులను అర్థం చేసుకోకుండా కొందరు తప్పుడు నాయకులు, తప్పుడు సంఘాల మాటలు విని ఉద్యోగులు వీధిన పడొద్దని హితవు పలికారు. 70ఏళ్ల చరిత్ర కలిగిన టీఎన్జీవోస్ సంఘం అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటూనే సమస్యలు పరిష్కారం చేస్తున్న వైనాన్ని చరిత్ర చెబుతోందన్నారు. ఉద్యోగులకు దసరా లోపు కనీసం రెండు డీఏలను ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారన్నారు. పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయాలి మూడు నెలల కాల పరిమితితో ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిషన్ మూడేళ్లుయినా నివేదిక ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని రాజేందర్ అన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు చేయలేని కమిషన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఇప్పటికే 14వ వీఆర్సీ స్థానంలో 11పీఆర్సీ కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. అది కూడా ఇప్పుడు ఇస్తారో తెలియని ఆందోళనలో ఉద్యోగ లోకం ఉందని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్యోగులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం తాజా మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ పోటీకి అవకాశం కల్పించాలని సమావేశంలో నేతలు కోరారు. తద్వారా ఉద్యోగుల గొంతుక అక్కడ వినిపించే అవకాశముంటుందని తెలిపారు. తెలంగాణలో వినతులు... ఆంధ్రాలో జీఓలు తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు సమస్యలపై వినతులు ఇస్తుంటే ఇక్కడ పరిష్కారం కావడం లేదని మామిళ్ల రాజేందర్ అన్నారు. అయితే, ఇదే వినతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని తెలిపారు. ఇక్కడి ఉద్యోగం పోరాటంతో అక్కడి ఉద్యోగ సోదరులకు లాభం జరుగుతోందని చెప్పారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ నుంచి కూడా సమస్యలు పరిష్కారానికి త్వరలో పిలుపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు సంబంధించి 18డిమాండ్లకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక రాష్ట్ర నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌తో పాటు పూర్వ కారం వీందర్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈ సమావేశం ఆద్యంతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనతో కొనసాగగా, కరోనాను పట్టించుకోకుండా నేతల పలకరింపులు, సత్కారాలు, సన్మానాలు సాగాయి. రవన్నకు మంచి హోదా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన కారం రవీందర్రెడ్డిను ముఖ్యమంత్రికి ఒకరు సిఫారసు చేయాల్సి అవసరం లేదని తెలిపారు. ఆయనతో పాటు జిల్లా ఉద్యోగ నాయకుల గురించి సీఎంకు పూర్తిగా తెలుసనని చెప్పారు. ఎమ్మెల్సీ హోదా కావొచ్చు, మరొకటైనా కానీ త్వరలో రవీందర్‌రెడ్డిని మంచి హోదాలో చూస్తామని తెలిపారు. కాగా, కారం రవీందర్‌రెడ్డి తొలుత హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటరు నమోదు దరఖాస్తు అందజేశారు. టీజీవోస్ అధ్యక్షులు జగన్మోహన్రావు, ట్రెసా అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు ఇట్టె కిరణ్‌రెడ్డి, జిలుకర రమేష్, ఎంజీఎం సూపరిటెంటెండెంట్ నాగార్జునరెడ్డి, డీఎంహెచ్ఓ లలితాదేవితో పాటు రామినేని శ్రీనివాస్, చందు, పుల్లూరి వేణుగోపాల్, ఆకుల రాజేందర్, శ్యాంసుందర్, రామునాయక్, షఫీ, నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డిగ్రీ అర్హత ఉన్న ఉద్యోగులందరూ ఓటర్లు నమోదు చేసుకోవాలని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ సూచించారు. హన్మకొండలోని అలంకార్ జంక్షన్ సమీపాన ఉన్న టీఎన్జీఓఎస్ భవన్లో శుక్రవారం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజేందర్ మాట్లాడారు. -
ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా..
సాక్షి, హన్మకొండ: చిరుద్యోగిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఓరుగల్లు బిడ్డ కారం రవీందర్‌రెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. సుమారు ఎని మిదేళ్ల పాటు టీన్జీవోస్ కేంద్ర సంఘంలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా, అఖిలభారత రాష్ట్ర ప్రభభుత్వ ఉద్యోగుల కేంద్ర సంఘం ఉపాధ్యక్షులుగా ఉద్యోగ లోకానికి ఆయన సేవలందించారు. ప్రసుత్తం డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యమకాలం నుంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నా అది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, పీఆర్సీ సాధనకు ఉపయోగపడలేదని కొంత అసంతృప్తి వెలిబుచ్చేవారు. దీనికితోడు మరికొంత కాలం ఆయన సర్వీస్ పొడిగిస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం సాగినా, అది జరగలేదు. టైపిస్టు నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు.. కారం రవీందర్‌రెడ్డి స్వస్థలం ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న వేలేరు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉండగా, రవీందర్‌రెడ్డి ఉద్యోగ ప్రస్థానం ఉమ్మడి జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్ ఏపీ రేయాన్స్‌లో టైపిస్ట్‌గా 1984లో ప్రారంభభమైంది. ఆ తర్వాత 1985 నుంచి వరంగల్ కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1987 మే నెలలో డీఎస్సీ ద్వారా రెవెన్యూశాఖకు ఎంపికయ్యారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతగా ఉన్న సురేందర్‌రెడ్డి స్ఫూర్తితో ఈయన కూడా చురుగ్గా పనిచేస్తూ కలెక్టరేట్ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహించారు. 2007లో టీఎన్జీవోస్ జిల్లా అ«ధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన రెండో సారి కూడా ఎన్నికయ్యాక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ చుక్కాని తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జిల్లాలోని ఉద్యోగులను సంఘటితం చేసిన వారిలో రవీందర్‌రెడ్డి ముందు వరుసలో ఉంటారు. 18రోజుల పాటు పెన్‌డౌన్, 55రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మె, లక్ష గొంతులు... లక్ష గళాలు తదితర కార్యక్రమాల్లో జిల్లా ఉద్యోగులు చురుగ్గా పాల్గొనేలా ఆయన కృషి చేశారు. కాగా టీఎన్జీవోస్ కేంద్ర సంఘానికి కారం రవీందర్‌రెడ్డి మూడు సార్లు వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఈయనే. డీటీ నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా... టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో రవీందర్‌రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ హోదాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో కూడా అదే హోదా ఉంది. ప్రభుత్వం డీటీలను గెజి టెడ్ అధికారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన వరంగల్ ఆర్డీఓ కార్యాలయంలో సీని యర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ పొందారు. అయితే, చివరి నిమిషంలో ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు ఆది వారం జిల్లాకు వచ్చిన ఆయన వరంగల్ అర్బన్ కలెక్టరే ట్లో డీటీగా పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. అంతృప్తితోనే.. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు భావించారు. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పడినా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన సహకారం అందలేదని అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలో కనీసం ఒక్క పీఆర్సీ అయినా సాధించాలనుకున్నా సాధ్యం కాలేదు. ఉద్యోగుల మిగతా కీలక సమస్యల సాధన విషయంలో రవీందర్‌రెడ్డి కొంత నిరాశతో ఉన్నట్లు సమాచారం. అయినా, రవీందర్‌రెడ్డి ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం కొంత విమర్శలకు దారితీసింది. ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా.. సుమారు 33ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో నా వెన్నంటి నిలిచిన ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా. అందరి సహకారంతోనే ఈ స్థాయికి ఎదిగా. ఉద్యోగం, ఉద్యమం జీవితంలో ప్రతీ అంకం ఎంతో కీలకమైనదే. ఇక ముందు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తూనే ఉంటా. – కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు -
టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవీందర్‌రెడ్డి, రాజేందర్
సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్ మరోమారు ఎన్నికయ్యారు. దీంతో మూడోసారి వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 6న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఆమోదం మేరకు ఎన్నికల అధికారిని నియమించి నోటిఫికేషన్ జారీచేశారు. ఆరోజు జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ప్రతిపాదనల మేరకు రాష్ట్ర కార్యవర్గానికి చేపట్టిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. నామినేషన్లన్నీ సరిగ్గా ఉండటంతో అంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ కార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగనుంది. ఎన్నికైన రవీందర్ రెడ్డి, రాజేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ నాయకత్వం పట్ల నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. టీఎన్జీవో సంఘం అనేక సమస్యలను పరిష్కరించిందని, ఇతర సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎంను కలుస్తామని వెల్లడించారు. సంఘం ఎన్నికల్లో వీరితోపాటు సహ అధ్యక్షురాలుగా బి.రేచల్, కోశాధికారిగా రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్, నరసింహస్వామి, నరసింహచారి, ఉమాదేవి, కార్యదర్శులుగా తిరుమల్ రెడ్డి, లక్ష్మణ్ రావు, రాము నాయక్, రవి, దివ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండల్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులుగా కొనిదెన శ్రీనివాస్, రవిందర్, నర్సింహులు, సిద్దిరాములు, మాధవి, శైలజ, సత్యం ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సుబ్బారావు, సహాయ ఎన్నికల అధికారిగా రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు. -
'ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదు'
సాక్షి, హైదరాబాద్ : డిసెంబర్ 31వరకు పీఆర్సీ గడువు పెంచిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల పక్షాన టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్‌ను కలిసినట్లు రవీందర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ కమిషన్ అనేది వేతన సవరణ కోసమే ఏర్పాటు చెయ్యలేదని, ఉద్యోగుల అనేక విషయాల కోసం స్టడీ కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని సీఎస్ పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్యోగుల ఇతర సమస్యల పై స్టడీ కోసం మాత్రమే గడువు పొడిగించినట్లు సీఎస్ స్పష్టం చేశారన్నారుడుపీఆర్సీ నివేదిక సిద్ధంగా ఉందని, నెల లోపలే కమిషన్ రిపోర్ట్ అందిస్తుందని సీఎస్ వివరించినట్లు తెలిపారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని రవీందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు అండగా ఉంటానని మాట ఇచ్చారని, తాను ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉన్నట్లు అనేక సార్లు చెప్పారని రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. టీజీఓ అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. మంగళవారం పీఆర్సీ గడువు పెంచుతూ జీవో జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందారని తెలిపారు. అయితే ఇదే విషయమై సీఎస్‌ను కలిసిన తర్వాత పీఆర్సీకి ఈ గడువు పెంపుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపనట్లు పేర్కొన్నారు. అయితే గడువు పొడిగింపుతో సంబంధం లేకుండా ఏప్రిల్ నుంచి పీఆర్సీ ఇవ్వాల్సిందిగా సీఎస్‌ను కోరినట్లు మమత వెల్లడించారు. తమ సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని ఒక్కవేళ పీఆర్సీ ప్రకటించపోతే పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మమత స్ఫష్టం చేశారు. -
‘రెవెన్యూ విలీనంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’
సాక్షి, సంగారెడ్డి: రెవెన్యూ శాఖ విలీనంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఉద్యోగులు పత్రికల్లో వస్తోన్న వదంతులను నమ్మొద్దని టీఎన్జీవో సంగం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కోరారు. జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.20లక్షల మంది ఉద్యోగులు ఉన్నరన్నారు. ప్రతి ఉద్యోగి 10 మొక్కలు నాటాలని నిర్ణయించామని.. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టామని తెలిపారు. గతంలో కమల్‌నాథ్ కమిటీ చర్యల వలన ఉద్యోగ విభజనలో తెలంగాణ ఉద్యుగులే అధికంగా నష్టపోయారని తెలిపారు. దాదాపు 1200 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లారని.. వారందరిని తిరిగి తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడి.. విభజన సమస్యల్లో కదలిక వచ్చిందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు సంఖ్య తగ్గి పని భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరలో కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి వారికి 20 శాతం హెచ్ఆర్ కేటాయించాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎన్నికల విధులకు పారితోషికం పెంచండి: టీఎన్జీవో
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పారితోషికం పెంచాలని టీఎన్జీవో నేతలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయలో ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ నేతృత్వంలోని బృందం కలసి ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. -
సీపీఎస్‌ను రద్దు చేసే వారికే మద్దతు
సంగారెడ్డి జోన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన వారికే తమ మద్దతు ఉంటుందని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో అనేక సమస్యలతోపాటు పీఆర్సీపై ఏళ్ల తరబడి పోరాటం చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. స్వరాష్ట్రంలో ఒక్క రోజులో 43 శాతం పీఆర్సీని, 9 నెలల బకాయిలని సాధించుకోగలిగామన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో నవంబ ర్ 6 వరకు మాత్రమే ఓటర్ నమోదుకు గడువు విధించారని, దానిని మరో పక్షం రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరామన్నారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న క్రమంలో గతంలో అనేక పర్యాయాలు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్క నియోజకవర్గంలో వందకు మించి అవకాశం కల్పించాలేదన్నారు. ఈ సారి ఆన్లైన్లో ఓటు హక్కును వినియోగించుకునేలా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వారం ముందుగానే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొండల్‌రెడ్డి, కార్యదర్శి రవి పాల్గొన్నారు. -
‘ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ అన్నారు. బుధవారం టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని, స్థానికత విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, స్థానికులకు మాత్రమే ఖాళీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని కోరారు. -
తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు వెళ్లనివ్వం
నాంపల్లి: ఏపీకి చెందిన హెచ్ఓడీలను విజయవాడకు తరలించడాన్ని టీఎన్జీఓ కేంద్ర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్ , అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు విలేకరులతో మాట్లాడారు. తరలింపు వల్ల ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు తీసుకుని పోతామంటే అడ్డుకుంటామని అన్నారు. చంద్రబాబుకు, అశోక్‌బాబుకు ఉద్యోగుల పట్ల ప్రేమ ఉంటే ఆంధ్రా ఉద్యోగులను ఆంధ్రాకు, తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. మే 28న టీఎన్జీఓ కేంద్ర వర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేశారు.