ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా.. | TNGO President Karam Ravinder Reddy Retirement | Sakshi
Sakshi News home page

టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు ‘కారం’ ఉద్యోగ విరమణ

Published Mon, Aug 31 2020 11:14 AM | Last Updated on Mon, Aug 31 2020 11:14 AM

TNGO President Karam Ravinder Reddy Retirement - Sakshi

కారం రవీందర్‌రెడ్డి

సాక్షి, హన్మకొండ: చిరుద్యోగిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఓరుగల్లు బిడ్డ కారం రవీందర్‌రెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. సుమారు ఎని మిదేళ్ల పాటు టీన్జీవోస్‌ కేంద్ర సంఘంలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా, అఖిలభారత రాష్ట్ర ప్రభభుత్వ ఉద్యోగుల కేంద్ర సంఘం ఉపాధ్యక్షులుగా ఉద్యోగ లోకానికి ఆయన సేవలందించారు. ప్రసుత్తం డిప్యూటీ తహసీల్దార్‌ హోదాలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యమకాలం నుంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నా అది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, పీఆర్‌సీ సాధనకు ఉపయోగపడలేదని కొంత అసంతృప్తి వెలిబుచ్చేవారు. దీనికితోడు మరికొంత కాలం ఆయన సర్వీస్‌ పొడిగిస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం సాగినా, అది జరగలేదు.

టైపిస్టు నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు..
కారం రవీందర్‌రెడ్డి స్వస్థలం ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న వేలేరు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉండగా, రవీందర్‌రెడ్డి ఉద్యోగ ప్రస్థానం ఉమ్మడి జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్‌ ఏపీ రేయాన్స్‌లో టైపిస్ట్‌గా 1984లో ప్రారంభభమైంది. ఆ తర్వాత 1985 నుంచి వరంగల్‌ కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1987 మే నెలలో డీఎస్సీ ద్వారా రెవెన్యూశాఖకు ఎంపికయ్యారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతగా ఉన్న సురేందర్‌రెడ్డి స్ఫూర్తితో ఈయన కూడా చురుగ్గా పనిచేస్తూ కలెక్టరేట్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి నాయకత్వం వహించారు. 2007లో టీఎన్జీవోస్‌ జిల్లా అ«ధ్యక్షుడుగా ఎన్నికైన ఆయన రెండో సారి కూడా ఎన్నికయ్యాక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది.

తెలంగాణ ఉద్యమ చుక్కాని
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో జిల్లాలోని ఉద్యోగులను సంఘటితం చేసిన వారిలో రవీందర్‌రెడ్డి ముందు వరుసలో ఉంటారు.  18రోజుల పాటు పెన్‌డౌన్, 55రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మె, లక్ష గొంతులు... లక్ష గళాలు తదితర కార్యక్రమాల్లో జిల్లా ఉద్యోగులు చురుగ్గా పాల్గొనేలా ఆయన కృషి చేశారు. కాగా టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘానికి కారం రవీందర్‌రెడ్డి మూడు సార్లు వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి ఈయనే.

డీటీ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా...
టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో రవీందర్‌రెడ్డి డిప్యూటీ తహసీల్దార్‌ హోదాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో కూడా అదే హోదా ఉంది. ప్రభుత్వం డీటీలను గెజి టెడ్‌ అధికారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన వరంగల్‌ ఆర్డీఓ కార్యాలయంలో సీని యర్‌ అసిస్టెంట్‌గా పోస్టింగ్‌ పొందారు. అయితే, చివరి నిమిషంలో ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు ఆది వారం జిల్లాకు వచ్చిన ఆయన వరంగల్‌ అర్బన్‌ కలెక్టరే ట్‌లో డీటీగా పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు.

అంతృప్తితోనే..
ఉద్యోగ విరమణ వయస్సు పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు భావించారు. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పడినా సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన సహకారం అందలేదని అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఉన్న సమయంలో కనీసం ఒక్క పీఆర్‌సీ అయినా సాధించాలనుకున్నా సాధ్యం కాలేదు. ఉద్యోగుల మిగతా కీలక సమస్యల సాధన విషయంలో రవీందర్‌రెడ్డి కొంత నిరాశతో ఉన్నట్లు సమాచారం. అయినా, రవీందర్‌రెడ్డి ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం కొంత విమర్శలకు దారితీసింది. 

ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా..
సుమారు 33ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో నా వెన్నంటి నిలిచిన ప్రతీ ఉద్యోగికి రుణపడి ఉంటా. అందరి సహకారంతోనే ఈ స్థాయికి ఎదిగా. ఉద్యోగం, ఉద్యమం జీవితంలో ప్రతీ అంకం ఎంతో కీలకమైనదే. ఇక ముందు కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తూనే ఉంటా.
– కారం రవీందర్‌రెడ్డి టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement