పంజగుట్ట/సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కార్యాలయాలు హోరెత్తాయి. పోటాపోటీ నినాదాలతో మార్మోగాయి. ప్రత్యేక, సమైక్య ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలతో పలు ప్రభుత్వ కార్యాలయాలు హోరెత్తాయి. టీఎన్జీవోలు, ఏపీఎన్జీవోల ధర్నాలతో దద్దరిల్లాయి. సచివాలయం, విద్యుత్ సౌధలలో నిరసనలు మిన్నంటాయి. ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీ నిరసనలు చేపట్టారు. సీమాంధ్ర ఉద్యోగులు ఉదయం నుంచి కార్యాలయ ఆవరణలో బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఒంటికాలిపై నిల్చొని, సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అటు తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
డీఎంఈ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్, డెరైక్టర్ ఆఫ్‌హెల్త్, ఎపిసాక్, వైద్యవిధాన పరిషత్ తదితర కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీని నిర్వహించారు. అనంతరం వంటావార్పు కార్యక్రమం చేపట్టి సహపంక్తి భోజనాలు చేశారు.తెలంగాణ ఉద్యోగులు సైతం డీఎంహెచ్‌ఎస్ వద్ద ధర్నా నిర్వహించారు.
అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్‌లోని ఏపీజీఎల్‌ఐసీ, డీటీవో, ఆయూష్, పీఏవో తదితర విభాగాల సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించారు.
బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టిఎన్జీవోలు ధర్నా నిర్వహించారు. సీమాంధ్ర ఉద్యోగులు నోటికి నల్లగుడ్డలుకట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. టీఎన్జీవోలు భోజన విరామ సమయంలో కాకుండా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో ఏపీఎన్జీవోలు పోటా పోటీ నినాదాలు చేశారు.
దద్దరిల్లిన కార్యాలయాలు
Published Wed, Sep 4 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement