స్థానికత ఆధారంగానే విభజించాలి | tngo requests kamalnathan committee to divide employess according to regional | Sakshi
Sakshi News home page

స్థానికత ఆధారంగానే విభజించాలి

Published Sat, Mar 29 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

స్థానికత ఆధారంగానే విభజించాలి

స్థానికత ఆధారంగానే విభజించాలి

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల స్థానికత ఆధారంగా విభజన జరగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు కమల్‌నాథన్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి మామిడి నారాయణ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, నేతలు కృష్ణయాదవ్, సలీముద్దీన్ తదితరులు సంఘాల వారీగా.. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ ముందు శుక్రవారం తమ వాదనలు వినిపించారు. ఒక్కో సంఘానికి 10 నిమిషాలే కేటాయించినా..  ఈ కమిటీ టీఎన్జీవోల ప్రతినిధి బృందం వాదనలను 25 నిమిషాలకు పైగా ఆలకించింది. కమిటీ ముందు తెలంగాణ సంఘాలు ఉంచిన అంశాల్లో ముఖ్యమైనవి..
 
 స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలి. సర్వీసు రిజిస్టర్ల ప్రకారం స్థానికతను నిర్ధారించడానికి అవకాశం ఉంది. అయితే సర్వీసు రిజిస్టర్లలో తప్పుడు వివరాలు నమోదు చేసిన వారు చాలా మంది ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వారూ ఉన్నారు. వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అకడమిక్ రికార్డు ఆధారంగా స్థానికతను నిర్ధారించాలి. తెలంగాణ ఉద్యోగులుగా గుర్తించిన వారి జాబితాను బహిరంగపరచాలి. ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి.
 
 తెలంగాణలో స్థానికేతరులు పెద్ద సంఖ్యలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని గిర్‌గ్లాని కమిటీ తేల్చింది. కమిటీ నివేదికను ప్రభుత్వం అంగీకరించింది. ఆ కమిటీ నివేదికను విభజనకు ఆధారంగా తీసుకోవాలి.
 
 విభజన నేపథ్యంలో తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య నిర్ధారణను కేవలం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకే పరిమితం చేయాలి. జిల్లాలు,  క్షేత్రస్థాయి కార్యాలయాల మీద విభజన ప్రభావం ఉండదు కాబట్టి ప్రస్తుతం ఉన్న సంఖ్యనే కొనసాగించాలి.
 
 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. వారిని అక్కడే మిగతా అవసరాల కోసం వినియోగించాలి. తెలంగాణలో చోటు కల్పించకూడదు.  ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి పోస్టులు, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఖాళీలను తెలంగాణ పోస్టులుగా భావించాలి.
 
 సీమాంధ్ర అధికారులను ఇక్కడే కొనసాగిస్తే.. వారికి సేవలు అందించ బోమని తెలంగాణ క్లాస్-4 ఉద్యోగులు కమిటీకి చెప్పారు.
 
 గతంలో ఆప్షన్లు అమలయ్యాయి కదా: కమల్‌నాథన్
 
 గతంలో మూడు రాష్ట్రాల విభజనలో ఆప్షన్ విధానం అమలైన విషయాన్ని కమల్‌నాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా ఆప్షన్ విధానం ఉందన్నారు. మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయకూడదని ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నించారు. ‘మూడు రాష్ట్రాల
 విభజనకు, ఆంధ్రప్రదేశ్ విభజనకు తేడా ఉంది. ఇక్కడ జిల్లా, జోనల్ రిజర్వేషన్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో అమల్లో ఉన్నాయి. గతంలో విభజన జరిగిన మూడు రాష్ట్రాల్లో ఇంత సంక్లిష్టమైన పరిస్థితి లేదు. అందుకే అక్కడ ఆప్షన్ ఇవ్వడం సమంజసం. 60 సంవత్సరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని 6 నిమిషాల్లో వివరించడం సాధ్యం కాదు. తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగకుండా ఉండాలంటే.. మా ఉద్యోగాలు మాకే దక్కాలి’ అని టీ- సంఘాల నేతలు వివరించారు. తెలంగాణకు ఉద్యోగులు తక్కువ అయ్యే పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి? అని ఉద్యోగ సంఘాల నేతలను కమల్‌నాథన్ మరో ప్రశ్నవేశారు. దీనికి నాయకులు స్పందిస్తూ, జిల్లాల నుంచి తెచ్చుకోవడం.., ఇంకా ఖాళీగా ఉంటే కొత్తగా నియామకాలు చేపట్టడంవల్ల పరిష్కరించుకోవచ్చు’ అని సమాధానం ఇచ్చారు.
 
 ఉద్యోగ సంఘాలతో నేడు కమిటీ మళ్లీ భేటీ
 
 ఉద్యోగ సంఘాలతో సమావేశాలను శనివారం కూడా కొనసాగించాలని కమల్‌నాథన్ కమిటీ నిర్ణయించింది. కమిటీని కలవలేకపోయామని, తమ వాదనలను మౌఖికంగా వినిపించలేకపోయామని పలు ఉద్యోగ సంఘాలు చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు డి-బ్లాక్ మూడో ఫ్లోర్‌లో భేటీలు జరుగనున్నాయి. కమిటీతో భేటీ కావాలనుకొనే సంఘాలు ఎస్‌ఆర్ సెల్ ఉప కార్యదర్శి లలితాంబిక (9951531798) వద్ద మధ్యాహ్నం ఒంటి గంట లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ సూచించారు.
 
 ఆప్షన్ సౌకర్యం పరిమితమే..!
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల పంపిణీలో పరిమిత ఆప్షన్లు కల్పిస్తూ కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల రూపకల్పనకు ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిటీ మార్గదర్శకాల రూపురేఖలు ఇలావున్నాయి...
 
 జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు విభజన పరిధిలోకి రారు. ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉంటారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు... అది కూడా పరిమితంగానే ఆప్షన్ సౌకర్యం ఉంటుంది.
 సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్ (సింగిల్ యూనిట్), శాఖాధిపతుల కార్యాలయాల్లో తొలుత స్టాఫ్ ప్యాట్రన్‌ను నిర్థారిస్తారు. ఈమేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగులను పంపిణీ చేస్తారు. రాష్ట్రస్థాయి క్యాడర్ ఉద్యోగులనూ స్థానికత ఆధారంగానే విభజిస్తారు. వీరందరూ కలిపి 56 వేల మంది ఉన్నట్లు ఆర్థికశాఖ లెక్కలు తేల్చింది.
 
 వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు దంపతులైన పక్షంలో ఒకరికి ఆప్షన్ సౌకర్యం కల్పిస్తారు.
 అనారోగ్య కారణాలను చూపిస్తూ ఆప్షన్ అడిగిన రోగపీడితులకు వారి అభీష్టాల మేరకు రాష్ట్రాన్ని కేటాయించనున్నారు. అయితే కేసుల వారీగా అధికారులు పరిశీలించి, చూపించిన అనారోగ్య కారణాల విషయంలో సంతృప్తి చెందితేనే ఆప్షన్ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశమిస్తారు.
 5 సంవత్సరాల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులకు ఆప్షన్ సౌకర్యం కల్పించనున్నారు.
 ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం మొదట ఎస్టీ, ఎస్సీ, వికలాంగ ఉద్యోగులకు ఇవ్వనున్నారు. వారికున్న రిజర్వేషన్ల మేరకు భర్తీ చేసిన తర్వాత మిగతా వర్గాల ఉద్యోగులకు పరిమితంగా ఇచ్చిన ఆప్షన్‌ను అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు.
 
 
 సడలింపు ఉన్న వారికి మినహా మిగతా ఉద్యోగులకు దరఖాస్తులో ఆప్షన్ కాలమ్ ఇచ్చినా.. దాన్ని పరిశీలించే అవకాశాలు దాదాపు ఉండవు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement