kamal nathan committee
-
సర్కారు నిర్లక్ష్యం వీడకుంటే ఉద్యమిస్తాం
-
కమలనాథన్ కమిటీ ఆంధ్రా పక్షపాతి
టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: కమలనాథన్ కమిటీ ఏపీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని, దీంతో ఉద్యోగుల కేటాయింపుల్లో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరుతూ శనివారం దేవీప్రసాద్ నేతృత్వంలో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హమీద్, మరికొంతమంది సచివాలయంలో కమలనాథన్ కమిటీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానికతను పక్కన పెట్టి తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఆప్షన్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను నింపుతున్నారని ఆరోపించారు. స్థానికతపై స్పష్టమైన నిర్ధారణకు రాకుండానే ఉద్యోగుల కేటాయింపును చేపట్టడం శోచనీయమన్నారు. -
ఏపీ వారికి కీలక స్థానాలివ్వొద్దు
కమలనాథన్ కమిటీకి టీసీటీ జీవోఏ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే వాణిజ్య పన్నుల శాఖలో అధికారుల విభజన జరపాలని, ఆప్షన్ల పేరుతో ఏపీ అధికారులకు తెలంగాణలో అవకాశం కల్పించవద్దని తెలంగాణ వాణిజ్యపన్నుల గెజిటెడ్ అధికారుల సంఘం (టీసీటీ జీవోఏ) కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం కమిటీ చైర్మన్ కమలనాథన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖలోని ఉన్నతస్థాయి పోస్టుల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఏపీ అధికారులు విభజన తరువాత కూడా ఆప్షన్ల పేరుతో తిష్టవేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతస్థాయి పోస్టుల ఖాళీల్లో భర్తీ చేసేందుకు తెలంగాణ వారు లేనందున ఆ స్థానంలో తమను భర్తీ చేయాలని ఆప్షన్లు ఇస్తున్నారని... అయితే నియమించేందుకు అధికారులు లేకపోతే ఆ పోస్టులను ఖాళీగా వదిలేయాల్సిందే తప్ప ఏపీకి చెందిన వారికి అవకాశం కల్పించవద్దని కోరినట్లు చెప్పారు. అలాగే జీవిత భాగస్వామి, వైద్య అవసరాలు, ఎస్సీ, ఎస్టీ అధికారులకు సంబంధించి ఆప్షన్లను సరైనవో కావో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని కోరామన్నారు. తెలంగాణలో ఉన్న ఒక్క ఖాళీ పోస్టును కూడా ఏపీ అధికారులతో భర్తీ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణకు కేటాయించిన ఒక అదనపు కమిషనర్ పోస్టుకు ఏపీకి చెందిన అధికారే ఉన్నారని, ముగ్గురు జేసీలు వారేనని, 17 మంది డీసీల్లో ఇద్దరు మాత్రమే తెలంగాణ వారని చెప్పారు. అలాగే 33 ఏసీ పోస్టుల్లో కేవలం18 పోస్టులు, 82 మంది సీటీవోల్లో 47 పోస్టులు మాత్రమే తెలంగాణకు చెందిన అధికారులతో ఉంటే మిగతా వాటిలో ఏపీ వారే ఉన్నారని పేర్కొన్నారు. -
ఇరు రాష్ట్రాలకు పోస్టుల కేటాయింపు
58:42 నిష్పత్తిలో కేటాయించిన కమలనాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కమలనాథన్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సలహా కమిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సంఖ్యపై అనుమానాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఈ నెల 10వ తేదీలోగా కమిటీకి ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నాటికి ఆయా విభాగాల అధిపతులు ఇచ్చిన సమాచారం మేరకు కమలనాథన్ కమిటీ ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించింది. ఇందులో అటెండర్, టైపిస్ట్ స్థాయి ఉద్యోగి నుంచి మొదలుకొని రాష్ట్ర ఉన్నతస్థాయి పోస్టుల వరకు కేటాయింపు జరిగింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, చివరి గ్రేడ్, ఎయిడెడ్, గ్రూప్-1 తదితర స్థాయి పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ నోటి ఫికేషన్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పోస్టుల సంఖ్య 11,78,398 కాగా.. వీటిలో 2,36,763 ఖాళీలున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో వీటిని ఇరు రాష్ట్రాలకు ఖాళీ పోస్టులతో సహా కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 6,80,516 పోస్టులు దక్కగా.. వాటిలో 1,38,747 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఏపీకి నికరంగా 5,41,769 మంది ఉద్యోగులను కేటాయించినట్లయింది. ఇక తెలంగాణకు 4,97,882 పోస్టులను కేటాయించింది. అందులో 98,016 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. అంటే ఖాళీలు పోను తెలంగాణకు నికరంగా 3,99,866 మంది ఉద్యోగులు వచ్చారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఇరు రాష్ట్రాలు భర్తీ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ ఇటీవలే మార్గదర్శకాలను ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నోటిఫై చేసిన ఉద్యోగుల సంఖ్యపై అభ్యంతరాలను ఆయా శాఖాధిపతులకు తెలియజేయాలని తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది. పూర్తి సమాచారాన్ని ‘ఏపీ రీఆర్గనైజేషన్ పోర్టల్’లో చూడొచ్చు. -
ముగిసిన కమలనాథన్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నతాధికారులతో సచివాలయంలో జరిగిన కమలనాథన్ కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు చేయడానికి కమలనాథన్ కమిటీ గురువారమిక్కడ సమావేశమయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు. -
19న ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు చేయడానికి ఈ నెల 19వ తేదీన కమలనాథన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. స్థానికతకు రాష్ట్రపతి ఉత్తర్వులే ప్రామాణికంగా నిర్ణయించాలని కమిటీ ఇప్పటికే అభిప్రాయానికి వచ్చింది. అలాగే త్వరలో పదవీ విరమణ చేసేవారికి, భార్య-భర్తల కేసులు, కొన్ని వ్యాధులకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఈ వివరాలన్నింటితో ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు. -
ఆప్షన్స్ పై కొనసాగుతున్న రగడ
-
స్థానికత ఆధారంగానే విభజించాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల స్థానికత ఆధారంగా విభజన జరగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు కమల్‌నాథన్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి మామిడి నారాయణ, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, నేతలు కృష్ణయాదవ్, సలీముద్దీన్ తదితరులు సంఘాల వారీగా.. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ ముందు శుక్రవారం తమ వాదనలు వినిపించారు. ఒక్కో సంఘానికి 10 నిమిషాలే కేటాయించినా.. ఈ కమిటీ టీఎన్జీవోల ప్రతినిధి బృందం వాదనలను 25 నిమిషాలకు పైగా ఆలకించింది. కమిటీ ముందు తెలంగాణ సంఘాలు ఉంచిన అంశాల్లో ముఖ్యమైనవి.. స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలి. సర్వీసు రిజిస్టర్ల ప్రకారం స్థానికతను నిర్ధారించడానికి అవకాశం ఉంది. అయితే సర్వీసు రిజిస్టర్లలో తప్పుడు వివరాలు నమోదు చేసిన వారు చాలా మంది ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వారూ ఉన్నారు. వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అకడమిక్ రికార్డు ఆధారంగా స్థానికతను నిర్ధారించాలి. తెలంగాణ ఉద్యోగులుగా గుర్తించిన వారి జాబితాను బహిరంగపరచాలి. ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. తెలంగాణలో స్థానికేతరులు పెద్ద సంఖ్యలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని గిర్గ్లాని కమిటీ తేల్చింది. కమిటీ నివేదికను ప్రభుత్వం అంగీకరించింది. ఆ కమిటీ నివేదికను విభజనకు ఆధారంగా తీసుకోవాలి. విభజన నేపథ్యంలో తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య నిర్ధారణను కేవలం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకే పరిమితం చేయాలి. జిల్లాలు, క్షేత్రస్థాయి కార్యాలయాల మీద విభజన ప్రభావం ఉండదు కాబట్టి ప్రస్తుతం ఉన్న సంఖ్యనే కొనసాగించాలి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. వారిని అక్కడే మిగతా అవసరాల కోసం వినియోగించాలి. తెలంగాణలో చోటు కల్పించకూడదు. ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి పోస్టులు, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఖాళీలను తెలంగాణ పోస్టులుగా భావించాలి. సీమాంధ్ర అధికారులను ఇక్కడే కొనసాగిస్తే.. వారికి సేవలు అందించ బోమని తెలంగాణ క్లాస్-4 ఉద్యోగులు కమిటీకి చెప్పారు. గతంలో ఆప్షన్లు అమలయ్యాయి కదా: కమల్‌నాథన్ గతంలో మూడు రాష్ట్రాల విభజనలో ఆప్షన్ విధానం అమలైన విషయాన్ని కమల్‌నాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా ఆప్షన్ విధానం ఉందన్నారు. మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయకూడదని ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నించారు. ‘మూడు రాష్ట్రాల విభజనకు, ఆంధ్రప్రదేశ్ విభజనకు తేడా ఉంది. ఇక్కడ జిల్లా, జోనల్ రిజర్వేషన్లు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో అమల్లో ఉన్నాయి. గతంలో విభజన జరిగిన మూడు రాష్ట్రాల్లో ఇంత సంక్లిష్టమైన పరిస్థితి లేదు. అందుకే అక్కడ ఆప్షన్ ఇవ్వడం సమంజసం. 60 సంవత్సరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని 6 నిమిషాల్లో వివరించడం సాధ్యం కాదు. తెలంగాణకు మళ్లీ అన్యాయం జరగకుండా ఉండాలంటే.. మా ఉద్యోగాలు మాకే దక్కాలి’ అని టీ- సంఘాల నేతలు వివరించారు. తెలంగాణకు ఉద్యోగులు తక్కువ అయ్యే పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి? అని ఉద్యోగ సంఘాల నేతలను కమల్‌నాథన్ మరో ప్రశ్నవేశారు. దీనికి నాయకులు స్పందిస్తూ, జిల్లాల నుంచి తెచ్చుకోవడం.., ఇంకా ఖాళీగా ఉంటే కొత్తగా నియామకాలు చేపట్టడంవల్ల పరిష్కరించుకోవచ్చు’ అని సమాధానం ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో నేడు కమిటీ మళ్లీ భేటీ ఉద్యోగ సంఘాలతో సమావేశాలను శనివారం కూడా కొనసాగించాలని కమల్‌నాథన్ కమిటీ నిర్ణయించింది. కమిటీని కలవలేకపోయామని, తమ వాదనలను మౌఖికంగా వినిపించలేకపోయామని పలు ఉద్యోగ సంఘాలు చెప్పిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు డి-బ్లాక్ మూడో ఫ్లోర్లో భేటీలు జరుగనున్నాయి. కమిటీతో భేటీ కావాలనుకొనే సంఘాలు ఎస్ఆర్ సెల్ ఉప కార్యదర్శి లలితాంబిక (9951531798) వద్ద మధ్యాహ్నం ఒంటి గంట లోపు పేర్లు నమోదు చేసుకోవాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ సూచించారు. ఆప్షన్ సౌకర్యం పరిమితమే..! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల పంపిణీలో పరిమిత ఆప్షన్లు కల్పిస్తూ కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల రూపకల్పనకు ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిటీ మార్గదర్శకాల రూపురేఖలు ఇలావున్నాయి... జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు విభజన పరిధిలోకి రారు. ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే ఉంటారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు... అది కూడా పరిమితంగానే ఆప్షన్ సౌకర్యం ఉంటుంది. సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్ (సింగిల్ యూనిట్), శాఖాధిపతుల కార్యాలయాల్లో తొలుత స్టాఫ్ ప్యాట్రన్‌ను నిర్థారిస్తారు. ఈమేరకు స్థానికత ఆధారంగా ఉద్యోగులను పంపిణీ చేస్తారు. రాష్ట్రస్థాయి క్యాడర్ ఉద్యోగులనూ స్థానికత ఆధారంగానే విభజిస్తారు. వీరందరూ కలిపి 56 వేల మంది ఉన్నట్లు ఆర్థికశాఖ లెక్కలు తేల్చింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు దంపతులైన పక్షంలో ఒకరికి ఆప్షన్ సౌకర్యం కల్పిస్తారు. అనారోగ్య కారణాలను చూపిస్తూ ఆప్షన్ అడిగిన రోగపీడితులకు వారి అభీష్టాల మేరకు రాష్ట్రాన్ని కేటాయించనున్నారు. అయితే కేసుల వారీగా అధికారులు పరిశీలించి, చూపించిన అనారోగ్య కారణాల విషయంలో సంతృప్తి చెందితేనే ఆప్షన్ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశమిస్తారు. 5 సంవత్సరాల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులకు ఆప్షన్ సౌకర్యం కల్పించనున్నారు. ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకునే అవకాశం మొదట ఎస్టీ, ఎస్సీ, వికలాంగ ఉద్యోగులకు ఇవ్వనున్నారు. వారికున్న రిజర్వేషన్ల మేరకు భర్తీ చేసిన తర్వాత మిగతా వర్గాల ఉద్యోగులకు పరిమితంగా ఇచ్చిన ఆప్షన్‌ను అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. సడలింపు ఉన్న వారికి మినహా మిగతా ఉద్యోగులకు దరఖాస్తులో ఆప్షన్ కాలమ్ ఇచ్చినా.. దాన్ని పరిశీలించే అవకాశాలు దాదాపు ఉండవు.