58:42 నిష్పత్తిలో కేటాయించిన కమలనాథన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కమలనాథన్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సలహా కమిటీ సభ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సంఖ్యపై అనుమానాలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఈ నెల 10వ తేదీలోగా కమిటీకి ఇవ్వాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నాటికి ఆయా విభాగాల అధిపతులు ఇచ్చిన సమాచారం మేరకు కమలనాథన్ కమిటీ ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించింది. ఇందులో అటెండర్, టైపిస్ట్ స్థాయి ఉద్యోగి నుంచి మొదలుకొని రాష్ట్ర ఉన్నతస్థాయి పోస్టుల వరకు కేటాయింపు జరిగింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, చివరి గ్రేడ్, ఎయిడెడ్, గ్రూప్-1 తదితర స్థాయి పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ నోటి ఫికేషన్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పోస్టుల సంఖ్య 11,78,398 కాగా.. వీటిలో 2,36,763 ఖాళీలున్నాయి.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తిలో వీటిని ఇరు రాష్ట్రాలకు ఖాళీ పోస్టులతో సహా కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌కు 6,80,516 పోస్టులు దక్కగా.. వాటిలో 1,38,747 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఏపీకి నికరంగా 5,41,769 మంది ఉద్యోగులను కేటాయించినట్లయింది. ఇక తెలంగాణకు 4,97,882 పోస్టులను కేటాయించింది. అందులో 98,016 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. అంటే ఖాళీలు పోను తెలంగాణకు నికరంగా 3,99,866 మంది ఉద్యోగులు వచ్చారు. ఖాళీగా ఉన్న పోస్టులను ఇరు రాష్ట్రాలు భర్తీ చేసుకోవడానికి వీలు ఉంటుంది.
ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ ఇటీవలే మార్గదర్శకాలను ఖరారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నోటిఫై చేసిన ఉద్యోగుల సంఖ్యపై అభ్యంతరాలను ఆయా శాఖాధిపతులకు తెలియజేయాలని తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది. పూర్తి సమాచారాన్ని ‘ఏపీ రీఆర్గనైజేషన్ పోర్టల్’లో చూడొచ్చు.
ఇరు రాష్ట్రాలకు పోస్టుల కేటాయింపు
Published Tue, Sep 2 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM
Advertisement
Advertisement