తెలంగాణ దేవాలయాలకు అన్యాయం
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు: సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని దేవాలయాలు, వాటి విశిష్టతను అప్పటి పాలకులు కనుమరుగు చేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పుష్కరాలకు సైతం ప్రాధాన్యం లేకుండా చేశారని, అప్పుడు జరిగిన అన్యాయాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సరిదిద్దుతోందని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా గొందిమళ్లలో కృష్ణా పుష్కరాలను సీఎం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అలంపూర్‌లోని హరిత అతిథి భవనంలో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైన జోగుళాంబ దేవాలయాన్ని తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. జోగుళాంబ దేవాలయ విస్తరణకు కొన్ని ఆటంకాలు ఉన్నాయని, వాటిపై కేంద్రంతో మాట్లాడి ఆలయాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. జోగుళాంబ తల్లి చల్లని ఆశీస్సులతో ప్రత్యేక తెలంగాణ సుసాధ్యమైందన్నారు. ఏటా 5 వేల నుంచి 10 వేల మంది దేవి ఉపాసకులు ఈ ప్రాంతానికి వస్తారని, అందుకు తగినట్లు వసతి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ్నుంచే పాదయాత్ర ప్రారంభించానని, ఈ ప్రాంత రైతులకు గతంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేందుకు ఆర్‌డీఎస్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. కాగా అలంపూర్‌లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సీఎంను కలసి వినతిపత్రం సమర్పించారు.
అలంపూర్‌పై వరాల జల్లు
అలంపూర్‌కు తక్షణం 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రెండ్రోజుల్లో దీనిపై విధి విధానాలు ఖరారు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కోరగా.. ఆర్టీసీ ఇప్పటికే రూ.200 కోట్ల నష్టంలో ఉందని, కొత్త డిపోపై హామీ ఇవ్వలేనన్నారు. కంట్రోలింగ్ పాయింట్ లేదా మినీ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్‌లో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బాల్‌రాజు, మాజీ ఎంపీ మందా జగన్నాథం, టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ రాములు ఉన్నారు.