పుష్కరాగమనం | Twelve-day Krishna Pushkaram river festival commences on Friday | Sakshi
Sakshi News home page

పుష్కరాగమనం

Published Fri, Aug 12 2016 3:25 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

పుష్కరాగమనం - Sakshi

పుష్కరాగమనం

* కృష్ణా పుష్కరాల సంబరం.. భక్తి పారవశ్యంలో తీరప్రాంతాలు..
* నదీ తీరంలో 81 ఘాట్ల వద్ద పుష్కర ఏర్పాట్లు
* గొందిమళ్లలో ఉదయం 5.58కి సీఎం కేసీఆర్ దంపతుల పుష్కర స్నానం

సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ పుష్కర శోభను సంతరించుకుంది. అటు వేద ఘోష, ఇటు భక్తజనుల జయజయధ్వానాలతో కృష్ణా నదీ తీర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి తొలి పుష్కరాలు శుక్రవారం మొదలయ్యాయి. వేకువజాము నుంచే నదిలో భక్తుల పవిత్ర స్నానాలు ప్రారంభమయ్యాయి. తీరం వెంబడి దేవాలయాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి.

చాలా ఘాట్ల వద్దకు గురువారం రాత్రి నుంచే భక్తుల రాకమొదలైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం 5.58 నిమిషాలకు అలంపూర్ మండలం గొందిమళ్లలో కృష్ణా పుష్కరాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. పుణ్యస్నానమాచరించేందుకు గురువారం సాయంత్రమే ఆయన సతీసమేతంగా అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. రాత్రి స్థానిక పర్యాటక శాఖ హ రిత అతిథి గృహంలో బస చేశారు. సీఎం వెంట దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, నేతలు వెళ్లారు. గోదావరి పుష్కరాల తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం తెలిసిందే. శుక్రవారం కృష్ణా పుష్కరాల తొలి రోజు అంతకంటే ఎక్కువ మందే స్నానాలు చేస్తారని అంచనా.
 
నేటినుంచి నాలుగు రోజులు సెలవులే...
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. తర్వాత వరుసగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం పంద్రాగస్టు నేపథ్యంలో ఆ నాలుగు రోజులూ భక్తులు పుష్కరాలకు భారీగా పోటెత్తే అవకాశముంది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. మరోవైపు అటు శ్రీశైలం, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు వరద ఎక్కువగా ఉండటంతో నదిలోకి క్రమేపీ నీటి ప్రవాహం పెరుగుతోంది. దాంతో ఘాట్ల వద్ద భక్తులకు ప్రమాదాలు జరగకుండా యంత్రాంగం అప్రమత్తమైంది.

మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 81 పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసన కంచె దాటి భక్తులు ముందుకు వెళ్లొద్దని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే 655 ట్రిప్పుల ప్రత్యేక రైలు సర్వీసులు, ఆర్టీసీ 1,365 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాయి.
 
సాంస్కృతిక కార్యక్రమాలు
పుష్కర భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగేలా పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఘాట్లయిన బీచ్‌పల్లి, రంగాపూర్, సోమశిల, కృష్ణా, పసుపుల, అలంపూర్, వాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్ వద్ద ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి భక్తి రసాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 12 వేల మంది కళాకారులకు బాధ్యతలు అప్పగించినట్టు మంత్రి చందూలాల్ వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలోనూ అన్ని ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిందు యక్షగానం, ఒగ్గు కథ, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, పద్య పౌరాణిక నాటకాలు, హరికథలు, భజనలు, ధార్మిక ప్రవచనాలుంటాయని అధికారులు పేర్కొన్నారు.
 
కొనసా...గుతున్న పనులు
చాలా ఘాట్ల వద్ద గురువారం రాత్రి వరకు పుష్కర పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో రాత్రి దాకా హడావుడిగా పనులు కొనసాగించారు. మహిళలు వస్త్రాలు మార్చుకునే తాత్కాలిక గదులు, మరుగుదొడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. రెండు జిల్లాల పరిధిలో మంత్రులు పర్యటించి ప్రత్యేకంగా ఆదేశించినా సగం ఘాట్ల వద్ద పనులు పూర్తి కాలేదు.
 
ఇవీ ఏర్పాట్లు...
వైద్య ఆరోగ్య శాఖ అన్ని పుష్కర ఘాట్ల వ ద్ద అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. 277 మంది వైద్యులు, 1,193 మంది పారా మెడికల్ సిబ్బంది, 139 వాహనాలు, 89 ప్రత్యేక క్యాంపులను సిద్ధం చేసింది. వాటిల్లో మూడు షిఫ్టుల్లో సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక చికిత్స కిట్లను పోలీసు వాహనాల్లోనూ అందుబాటులో ఉంచారు.
 
సీఎం మూడు స్నానాలు
శుక్రవారం ఉదయం సీఎం కేసీఆర్ మూడు పుష్కర స్నానాలు చేస్తారు. పీఠాధిపతులతో కలసి ఆయన గొందిమళ్ల ఘాట్ చేరుకుంటారు. వారికి మంగళవాయిద్యాలు, పూర్ణకుంభ స్వాగతం ఉంటాయి. కేసీఆర్ ముందుగా కుటుంబ సభ్యులతో కల సి కృష్ణా నదిలో దేవతామూర్తులతో మొదటి స్నానం, పీఠాధిపతులతో రెండో స్నానం, మంత్రులతో మూడో స్నానం చేయించనున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నదీ హారతి తీసుకుని వేద పండితుల ఆశీర్వాదం అందుకుంటారు. అలా గొందిమళ్లలో పుష్కరాలను ప్రారంభించిన అనంతరం అలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement