ఘనంగా స్వాగతం.. సాదరంగా వీడ్కోలు
విమానాశ్రయానికి తరలివచ్చిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, మేయర్ రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆ పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి,నాగం జనార్దన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కృష్ణంరాజు ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్... అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండ లి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు జి.సాయన్న, తీగల కృష్ణారెడ్డి, మాగంటి గోపీనాథ్, వివేక్ తదితరులను ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం గవర్నర్, కేసీఆర్, వెంకయ్యనాయుడు, కె.లక్ష్మణ్‌తో కలిసి గజ్వేల్‌కు వెళ్లేం దుకు రక్షణ శాఖ హెలికాప్టర్ వరకు వె ళ్లారు. గజ్వేల్‌లో మిషన్ భగీరథ కార్యక్రమంతోపాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అక్కడ్నుంచి ఎల్బీ స్టేడియంలో బీజేపీ మహా సమ్మేళనం కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులతో కలిసి వెళ్లారు.
బీజేపీ మహా సమ్మేళనం అనంతరం రాష్ట్ర పర్యటనను ముగించుకొని రాత్రి 7.45 గంటల ప్రాంతంలో వాయుసేన విమానంలో ప్రధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తోపాటు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, మధుసూదనాచారి, నేతి విద్యాసాగర్, బొంతు రామ్మోహన్ తదితరులు ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికారు.