ఉమ్మడి చట్టాల స్వీకరణ గడువు జూన్ 2
లేదంటే చెల్లుబాటు కావు : సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలను అన్వయించుకునేందుకు గడువు ముంచుకొస్తుంది. పునర్విభజన చట్టం ప్రకారం ఈ ఏడాది జూన్ రెండో తేదీలోగా అప్పటి చట్టాలను తెలంగాణ ప్రభుత్వం దత్తత తీసుకోవాలి. లేని పక్షంలో వాటన్నింటినీ బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి కొత్తగా చట్టాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు.
ఇప్పటివరకు ఏయే చట్టాలను యథాతథంగా అన్వయించుకున్నారు.. వేటి స్థానంలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి.. ఇంకా ఎన్ని చట్టాలను దత్తత తీసుకోవాల్సి ఉందో.. పూర్తి వివరాలు సిద్ధం చేసుకోవాలని అన్ని శాఖలకు సూచించారు. అన్ని శాఖలు వీటిని పరిశీలించి సమగ్రంగా ప్రతిపాదనలన్నీ ఒకే ఫైలుగా పంపించాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్వయించుకోవాల్సిన మిగిలిన చట్టాల ప్రతిపాదనలన్నింటినీ మే 31లోగా సమగ్రంగా పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. పునర్విభజన చట్టంలోని 101 సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను నిర్దేశించిన గడువులోగా చట్టసభల అనుమతి, ఆమోదం లేకుండానే కొత్త రాష్ట్రం యథాతథంగా, లేదా స్వల్ప మార్పులతో దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. లేకుంటే వీటన్నింటినీ చట్టసభల అనుమతితో కొత్త చట్టాలుగా రూపొందించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.