సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు చేయడానికి ఈ నెల 19వ తేదీన కమలనాథన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. స్థానికతకు రాష్ట్రపతి ఉత్తర్వులే ప్రామాణికంగా నిర్ణయించాలని కమిటీ ఇప్పటికే అభిప్రాయానికి వచ్చింది. అలాగే త్వరలో పదవీ విరమణ చేసేవారికి, భార్య-భర్తల కేసులు, కొన్ని వ్యాధులకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు.
ఈ వివరాలన్నింటితో ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు.