employees distribution
-
నేటి త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో సోమవారం జరగాల్సిన రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. పునర్విభజనకు సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే మూడు విడతలుగా జరిగిన సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల పంపిణీ, ఉద్యోగుల పరస్పర అంగీకార బదిలీలు, సచివాలయంలో ఏపీ భవనాల అప్పగింతలపై చర్చించారు. -
43,539 మంది ఉద్యోగుల పంపిణీ పూర్తి
ఆంధ్రాకు 24,163 మంది, తెలంగాణకు 19,376 మంది సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ తుది దశకు చేరుకుంది. 153 యూనిట్లకు చెందిన మొత్తం 59,723 మంది రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కమలనాథన్ 147 యూనిట్లకు చెందిన 43,539 మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీకి పూర్తి చేసింది. ఇక ఆరు యూనిట్లకు చెందిన 16,184 మంది ఉద్యోగులను మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. ఆరు యూనిట్లకు చెందిన ఉద్యోగుల పంపిణీని సంబంధించి వచ్చే నెల 2, 3 తేదీల్లో కమలనాథన్ కమిటీ భేటీలను నిర్వహించనుంది. డెరైక్టర్ ఆరోగ్యం, డెరైక్టర్ మెడికల్ విద్య, డీజీపీ, ఆయుష్, ఎస్పీఎఫ్, ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్‌లకు చెందిన ఉద్యోగుల పంపిణీని పూర్తి చేస్తే ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీ పూర్తి అవుతుంది. ఇప్పటివరకూ ఏపీకు 24,163 మందిని, తెలంగాణకు 19,376 మందిని పంపిణీ చేశారు. ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా ఆంధ్రా స్థానికతకు చెందిన 1,781 మంది తెలంగాణకు పంపిణీ అయ్యారు. అలాగే తెలంగాణ స్థానికతకు చెందిన 1,809 మంది ఏపీకి పంపిణీ అయ్యారు. -
‘మే 15లోగా ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగవంతమైంది. సమాచార, పౌరసంబంధాలు, ఉద్యాన, మత్య్స, కుటుంబ, వైద్య, ఆరోగ్య శాఖలకు సంబంధించిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు నమోదు చేసేందుకు సంబంధించిన నోటిఫికేషన్లు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ శాఖల కార్యాలయాలకు, సంబంధిత ఉద్యోగుల మొబైల్ నెంబర్లకు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఎస్ఎంఎస్ చేశారు. 15లోగా ఈ శాఖల్లోని ఉద్యోగులు తమ ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఎస్ఎంఎస్ రాకపోతే తమ శాఖాధిపతుల కార్యాలయాల్లో సంప్రదించాలని ఏపీ ప్రభుత్వ కార్యదర్శి, రీఆర్గనైజేషన్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ సెక్రటరీ ఎల్.ప్రేమచంద్రారెడ్డి కోరారు. పది శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ జాబితాలు విడుదల పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 86 శాఖాధిపతుల కార్యాలయాలకు సం బంధించి నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. -
11 శాఖల్లో ఉద్యోగుల పంపిణీ పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ 11 శాఖల్లో పూర్తి చేసింది. 11 శాఖల్లోని ఉద్యోగుల్లో ఏ ఉద్యోగిని ఏ రాష్ట్రానికి పంపిణీ చేశారో వివరిస్తూ ఆదివారం లేదా సోమవారం ఆదేశాలు జారీ చేయనున్నారు. పంపిణీ పూర్తి చేసిన ఉద్యోగులకు అభ్యంతరాలు తెలియజేయడానికి రెండు వారాల గడువు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. -
ఉద్యోగుల పంపిణీలో జాప్యం అనర్థదాయకం!
సురేష్ కాలేరు రాష్ట్ర విభజన జరిగి దాదాపు పది నెలలు కావస్తోంది. రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన అనేక ముఖ్య సమస్యల్లో ఉద్యోగుల విభజన సమస్య ఒకటి. అసలు రాష్ట్ర విభజనకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముఖ్య కారణం నీళ్లు, నిధులు, నియామకాలలో జరి గిన అన్యాయాలే అన్నది నిర్వివాదాంశం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలలో నీళ్లు, నిధు ల పంపిణీలకూ ఇతర పంచాయతీలకూ నిర్ది ష్టమైన నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి కాబట్టి అతి త్వర లోనే అన్నీ సర్దుకోవచ్చు. కానీ నియామకాల్లో జరిగిన అన్యాయాల్లో, ఉద్యోగుల పంపిణీలో జరుగుతున్న ఆలస్యం మాత్రం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది సత్వరమే పరిష్కరించాల్సిన సమస్య. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు కమలనాథన్ కమిటీని, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లాంటి సంస్థల ఉద్యోగుల పంపిణీకి.. వాటి ఆస్తులు, అప్పుల పంపకాలకు షిలాబిడే కమిటీని నియమించారు. జూన్ 2వ తేదీ ‘అప్పాయింటెడ్ డే’ నుంచి ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ చేస్తూ వర్క్ టూ ఆర్డర్ సర్వే పేరిట 58:42 శాతం నిష్పత్తిలో ‘డీఓపీటీ’. ఉద్యోగుల జాబితాను కమిటీ ప్రకటించింది. దీంతో గందరగోళం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఉద్యోగులు ఆంధ్రలోనూ, సమైక్యాం ధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యోగులు తెలంగాణలోనూ పని చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగుల పంపిణీలో స్థానికతను ఆధా రంగా తీసుకోవాలని, ఉద్యోగుల పంపిణీ వేగవంతం చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. ఈ విషయంలో ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. కమలనాథన్ కమిటీ సమావేశమైన ప్రతిసారీ కొత్త నిబం ధనలు, ప్రకటనలు చేస్తూ సమస్యను జఠిలం చేస్తోంది. అత్యంత సులువుగా జరగాల్సిన అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పంపిణీ విషయంలో ‘ప్రతూష్ సిన్హా కమిటీ’ అనేకసార్లు సమావేశమై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనకు ఆదేశాలు జారీచేసినా, ఇంకా తుదిరూపానికి రాలేదు. దాదాపు వేయిలోపు మాత్రమే ఉన్న అఖిల సర్వీసుల అధికారుల పంపిణీలోనే ఇన్ని సమీక్షలు అభ్యంతరాలు, పిటి షన్లు ఉంటే లక్షలాది ఉద్యోగుల, ఉపాధ్యాయుల, అధికారుల, కార్మి కుల పంపిణీలో ఇంకా ఎన్నిసార్లు తర్జనభర్జన జరగాలో అనే అనుమా నాలు వస్తున్నాయి. 58:42 ప్రకారం స్థానికత ఆధారంగా పంపిణీ జరిగితే ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉద్యోగుల విభ జన సాధ్యమవుతుందా? అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఉద్యోగుల పంపి ణీ పద్ధతి ప్రకారం, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతిశాఖలో పై నుంచి కిందిస్థాయి వరకు క్యాడర్లలో నిష్పత్తి ప్రకారం విభజన జర గాలి. ఆంధ్రకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణకు కేటాయించిన ఆంధ్ర ఉద్యోగులు ఏ ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా పని చేయలేకపోతున్నారు. తమ ఉద్యోగాన్ని ఇష్టపడి నిర్వహించని ఉద్యో గులు ఇరు రాష్ట్రాలకు ఇబ్బందే! ఉద్యోగుల పంపిణీ విషయంలో కమ లనాథన్ కమిటీ, షిలాబిడే కమిటీ పనులను వేగవంతం చేయాలి. కేం ద్ర కమిటీలకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, అన్నిస్థాయి అధికారులు, ఉద్యోగులు సహకరించాలి. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే ఆప్షన్లు ఇవ్వాలి తప్ప చదువులు, సర్టిఫికెట్ల పేరిట ప్రాంతం కాని ప్రాంతంలో ఆప్షన్లు ఇవ్వడం సరికాదు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలందరూ సమస్య సత్వర పరిష్కారానికి మార్గం చూపాలి. (వ్యాసకర్త, రాష్ట్ర సహాధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం) మొబైల్: 9866174474 -
ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేయాలి: అక్బరుద్దీన్ ఒవైసీ
* బడ్జెట్ ప్రసంగంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ * రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.29 వేల రుణభారం ఉంది * ఆ అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారో చెప్పలేదు * మైనార్టీలకు ప్రత్యేక ఉపప్రణాళిక అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి కన్నా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఎంఐఎం సభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై ఒవైసీ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.29 వేల రుణభారం ఉందని, అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారన్న లెక్కలను బడ్జెట్లో చూపించలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పంపిణీలో కమలనాథన్, ప్రత్యూష్‌సిన్హా కమిటీలు విఫలమయ్యాయని ఆరోపించారు. తెలంగాణకు ప్రత్యేక హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరిస్తామన్నారు. బీసీ, మైనారిటీలకు వేర్వేరుగా ఉప ప్రణాళికలను ఏర్పాటు చేయాలన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే మైనారిటీలే తీవ్ర వెనుకబాటుకు గురయ్యారన్న విషయం అనేక కమిటీ నివేదికల ద్వారా స్పష్టమైంది. అందువల్ల మైనారిటీలకు కూడా ప్రత్యేకంగా ఉప ప్రణాళికను ఏర్పాటు చేయాలి. ఉర్దూ టీచర్ల నియామకాలకు ప్రత్యేక డీఎస్సీ వేయాలి. రెండో అధికార భాషగా ఉర్దూ అమలుకు ప్రత్యేక కమిషన్ నియమించాలి. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలి. స్కాలర్‌షిప్‌లకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగా మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలి. నూతనంగా ఉర్దూ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలను తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ప్రతీ జిల్లా కేంద్రంలో మైనారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్లను నియమించాలి. మైనారిటీ శాఖలో కేవలం వంద మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. వారి సంఖ్యను మరింతగా పెంచాలి’’ అని అక్బరుద్దీన్ కోరారు. ఐఎస్బీ, మైక్రోసాఫ్ట్ వంటి జాతీయ, బహుళజాతి సంస్థలకు గత ప్రభుత్వాలు వక్ఫ్ భూములను ధారాదత్తం చేశాయని, నిర్మాణాలు పోను ఖాళీగా ఉన్న స్థలాలను వెనక్కు తీసుకొని వక్ఫ్‌కు అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మక్కాలో సౌదీ అరేబియా ప్రభుత్వం చేస్తున్న విస్తరణ కార్యక్రమాల్లో.. నాడు నిజాం ప్రభువులు రుబాత్ (రాష్ట్రం నుంచి మక్కాకు వెళ్లే యాత్రికుల కోసం నిర్మించిన సత్రాలు)లు కూల్చివేతలకు గురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కోల్పోయిన ఆస్తులకు నష ్టపరిహారాన్ని పొందాలని, ఆ మొత్తంతో మరోచోట రుబాత్లను నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆకట్టుకున్న ‘అక్బర్’ కథ.... రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రస్తుత బడ్జెట్ లెక్కలను ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ చెప్పిన ఒక చిన్న కథ సభలో నవ్వులు పూయించింది. ఆయన చెప్పిన కథేంటంటే... ‘‘ఓ గాయకుడు బాద్షా వద్దకు వచ్చి తన గాన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తాడు. దానికి మెచ్చిన బాద్షా అతనికి బహుమతి ప్రకటిస్తాడు. దీంతో మరింత మంచి గానాన్ని ఆలపించడంతో పరవశుడైన బాద్షా మరిన్ని బహుమానాలు ప్రకటిస్తాడు. దీంతో గాయకుడు రెట్టించిన ఉత్సాహంతో పాడటం మొదలుపెడతాడు. ఆనందంతో తేలియాడుతున్న బాద్షా అతనికి బంగారం, భూమి, వజ్రాలు, కానుకలు ప్రకటిస్తూ పోయాడు. సంతోషంతో గాయకుడు తన ఇంటికి వె ళ్లి భార్యతో విషయం అంతా చెబుతాడు. అయితే రెండు, మూడు, నాలుగు రోజులైనా రాజు కురిపించిన వరాలేవీ గాయకుడి దగ్గరకు చేరలేదు. గాయకుడు మళ్లీ బాద్షా వద్దకు వస్తాడు. ‘రాజా.. నాకు మీరు ఇస్తానన్న బంగారం, భూమి, వజ్రాలు ఏవీ నాకివ్వలేదు. ఎప్పుడిస్తారు’ అని ప్రశ్నిస్తాడు. అందుకు బాద్షా స్పందిస్తూ, ‘ఎక్కడి భూమి, ఎక్కడి బంగారం, ఎక్కడి వజ్రాలు.. మీరు గానంతో నా చెవిని సంతోషపెట్టారు. నేను నా వరాలతో నీ చెవిని సంతోషపెట్టాను. అంతే’ అని బదులిస్తాడు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సైతం అలాగే ఉందనీ... వరాలు ఉన్నాయి కానీ అవి ప్రజలకు చేరుతాయా? లేదా? అన్నది సందేహమే’’ అని అక్బరుద్దీన్ అనడంతో స్పీకర్ సహా సభలో ఉన్న వారంతా గొల్లుమంటూ నవ్వారు. -
ఆ ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్లు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఎట్టకేలకు సందిగ్ధం తొలగింది. ఉద్యోగుల పంపిణీపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఒకటి, రెండు రోజుల్లో విధివిధానాలను వెబ్సైట్లో పొందుపరచనున్నారు. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు ఉద్యోగులకు కమిటీ పది రోజుల గడువు ఇచ్చింది. ఇక భార్యాభర్తలకు, వివాహం కానివారికి, వితంతువులకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారికి ఆప్షన్ అవకాశం ఇవ్వలేదు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత పంపకాలు చేయనున్నారు. ఉద్యోగుల పంపీణిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు శుక్రవారం కమలనాథన్ కమిటీతో భేటీ అయ్యారు. -
నార్త్ బ్లాక్‌లో కమలనాథన్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ : ఉద్యోగుల విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ శుక్రవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, వైవీఆర్ కృష్ణారావు హాజరు అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై ఈ భేటీలో చర్చ జరుపుతున్నారు. ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు. -
ఉద్యోగుల పంపిణీపై 23న వీడనున్న సందిగ్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలపై ఏర్పడిన సందిగ్ధం ఈ నెల 23న తొలగనుంది. ఆ రోజు ఢిల్లీల్లో కమలనాథన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కేంద్ర సిబ్బంది-శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనావర్మతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్. కృష్ణారావు, రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు పీవీ రమేశ్, నాగిరెడ్డి పాల్గొంటారు. రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారికి ఆప్షన్లు ఇవ్వటంపై అభిప్రాయాన్ని తరువాత చెబుతామని ఏపీ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముసాయిదా మార్గదర్శకాల్లోనే స్పష్టత ఇవ్వాలని కోరుతోంది. -
ఆ ఒక్కటీ వదిలేసి మార్గదర్శకాలు!
రేపు విడుదలయ్యే అవకాశం ఉద్యోగుల పంపిణీలో పదవీ విరమణ చేసే వారికి ఆప్షన్ అంశం వారి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దంటున్న ఏపీ సర్కారు రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కమలనాథన్ సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీలో కీలకంగా మారిన.. ‘త్వరలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల విషయం’పై స్పష్టతనివ్వకుండానే ముసాయిదా మార్గదర్శకాల విడుదలకు కమలనాథన్ కమిటీ సిద్ధమవుతోంది. రెండేళ్లలోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ముసాయిదా మార్గదర్శకాల్లో ఈ విషయమై ఎటువంటి నిబంధన ఉంచాలనే అంశంపై తమ అభిప్రాయం తర్వాత చెబుతామని పేర్కొంది. అందువల్ల ఆ అంశాన్ని పక్కన ఉంచి మిగతా అంశాలతో ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేయాల్సిందిగా శనివారం కమలనాథన్ కమిటీని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలనాథన్ ఆదివారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రభుత్వం పేర్కొన్నట్లుగా పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్ అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలతో ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమ్మతమేనా? అనే అంశంపై తెలంగాణ సీఎస్‌తో కమల నాథన్ చర్చించినట్లు సమాచారం. దీంతో రాజీవ్ శర్మ తమ సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో చర్చించిన తరువాత తెలియజేస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. అరుుతే కేసీఆర్, సీఎస్ లు సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉండ నున్నందున మంగళవారం గానీ మార్గదర్శకాలు జారీకి వీలుపడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
స్థానికతపై తకరారు
ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం ఉద్యోగులకు పుట్టిన ప్రాంతమే అంటున్న తెలంగాణ సర్కారు రాష్ట్రపతి ఉత్తర్వులే ఆధారంగా తీసుకోవాలంటున్న ఆంధ్రా సర్కారు సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీలో కీలకమైన ‘స్థానికత’ను నిర్ధారించడానికి ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరూ పుట్టిన ప్రాంతమే ప్రాతిపదికగా స్థానికత నిర్ధారణ జరగాలని కమలనాథన్ కమిటీని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాతిపదికనే స్థానికత నిర్ధారణ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికతకు ఏ ప్రాతిపదికను ఎంపిక చేసుకోవాలో కమలనాథన్ కమిటీ నిర్ధారించాల్సి ఉంది. కమలనాథన్ కమిటీ నిర్ధారించిన ప్రాతిపదికను ఎవరూ అంగీకరించకపోయినా తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించక తప్పదని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. గురువారం జరిగిన కమలనాథన్ కమిటీ సమావేశంలో స్థానికతకు ఏ ప్రాతిపదిక తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఉద్యోగుల సర్వీసు రిజస్టర్‌లో వారు ఏ జిల్లాకు చెందిన వారో ఉంటుందని, దాన్ని ప్రాతిపదికగా తీసుకోవచ్చా అనే అంశంపైన చర్చించారు. అయితే ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. ఉద్యోగుల పంపిణీలో ఇరు రాష్ట్రాల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించడమే మార్గమని కమలనాథన్ కమిటీ అభిప్రాయపడింది. తక్కువగా ఉంటేభర్తీ చేసుకుంటామంటున్న కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించాలని, తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నా భర్తీ చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానంగా సచివాలయంలో తెలంగాణకు చెందిన నాలుగోతరగతి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వీరిని జనాభా నిష్పత్తిలో పంపిణీ చేస్తే ఆంధ్రాకు కొంత మంది వెళ్లాల్సి ఉంటుంది. అయితే దీన్ని నివారించడానికి తెలంగాణలో ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను ఎక్కువగా ఉన్న నాల్గో తరగతి ఉద్యోగులతో భర్తీ చేయాలనే ఆలోచనలో కూడా తెలంగాణ సర్కారు ఉందని, దీంతో సమస్య ఉండదని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో సూపర్ న్యూమరరీ అయితే మేలు! ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఉన్న ఉద్యోగులకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడానికి సమ్మతిస్తే చాలా వరకు కమలనాథన్ కమిటీకి ఎటువంటి చిక్కులూ లేకుండా మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కమలనాథన్ కమిటీ గురువారం సమావేశంలో ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఆధారంగా ఈ నెల 27న జరిగే సమావేశంలో కమలనాథన్ కమిటీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. -
స్థానికత ఆధారంగానే పంపిణీ!
అభిప్రాయం చెప్పాలని 2 రాష్ట్రాల సీఎస్‌లను కోరిన కమలనాథన్ 27న మరోసారి ఉద్యోగుల విభజన కమిటీ భేటీకి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీకి వీలుగా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించే విషయంలో ఇరు రాష్ర్ట ప్రభుత్వాల అభిప్రాయం చెప్పాలని కమలనాథన్ కమిటీ కోరింది. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా స్థానికత ఆధారంగానే పంపిణీ జరగాలన్న ఉద్యోగుల అభిప్రాయంపై చర్చ జరిగింది. అలా చేస్తే మిగులు ఉద్యోగులున్న చోట సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటు, తక్కువ మంది ఉన్న చోట పదోన్నతులు కల్పించి ఆయా పోస్టుల భర్తీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సిద్ధం కావాల్సి ఉంటుందని కమిటీ చైర్మన్ కమలనాథన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకుని ఈ నెల 27న జరిగే భేటీలో స్పష్టతనివ్వాలని ఉన్నతాధికారులకు కమిటీ సూచించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించే పక్షంలో ఆ మేరకే కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు పంపేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కమలనాథన్ చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు కేంద్ర సిబ్బంది, శిక్షణా శాఖ కార్యదర్శి, అలాగే కమిటీ సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, డాక్టర్ పీవీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పంపిణీపై గురువారమే పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఖరారవుతాయని భావించినప్పటికీ... కమిటీ సభ్యులు పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారి ఈ కమిటీ భేటీకి వచ్చినందున ఉద్యోగుల పంపిణీ విధానాన్ని ఈ సందర్భంగా వారికి వివరించారు. ఇరువురు ప్రధాన కార్యదర్శులు సమన్వయంతో ఏకాభిప్రాయానికి రావడానికి కొంత గడువు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. దీంతో ఈ నెల 27న జరిగే సమావేశంలోనే మార్గదర్శకాల తుది నివేదిక సిద్ధంకానుంది. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పోర్టల్స్‌లో ఆ మార్గదర్శకాలను అందుబాటులో పెట్టనున్నారు. అందిన సలహాలు, సూచనలపై సలహా కమిటీ మరోసారి సమావేశమై తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది. వాటినే కేంద్రం ఆమోదానికి పంపించనుంది. ఆ తర్వాతే ఉద్యోగుల శాశ్వత పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం దాదాపు తొమ్మిది వేలమందికిపైగా ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా, తాము రూపొందించే మార్గదర్శకాలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని కమిటీ సభ్యుడొకరు వివరించారు. రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్యం ఉన్నవారు, ఎస్సీ, ఎస్టీలు ఇచ్చే ఆప్షన్ల ప్రకారమే వారి పంపిణీ చేయాలనే కోణంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇక రాష్ట్ర కేడర్‌లో పంపిణీ అయ్యే అధికారులు, ఉద్యోగుల సంఖ్య దాదాపు 65 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. వీరిచ్చే ఆప్షన్లలో అన్నింటినీ ఆమోదించాలా.. లేదా? అన్న విషయాన్ని తర్వాతే నిర్ణయించనున్నారు. స్థానికతే ఆధారం కావాలి: టీజీవో సంఘం వినతి సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ఉండాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. కొందరు అధికారుల గందరగోళ నిర్ణయాల వల్ల తెలంగాణ సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రా ప్రాంత సిబ్బంది తెలంగాణలో పనిచేసే పరిస్థితి నెలకొంద ని, ఇలా కాకుండా ఎక్కడివారక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. గురువారం కమలనాథన్ కమిటీతో భేటీ అయిన అనంతరం టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రతినిధులు మమత, రాజ్‌కుమార్ గుప్తా తదితరులు మీడియాతో మాట్లాడారు. సమస్య జటిలం కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు వారు వెల్లడించారు. -
ముగిసిన కమలనాథన్ కమిటీ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నతాధికారులతో సచివాలయంలో జరిగిన కమలనాథన్ కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు చేయడానికి కమలనాథన్ కమిటీ గురువారమిక్కడ సమావేశమయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు. -
19న ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు చేయడానికి ఈ నెల 19వ తేదీన కమలనాథన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. స్థానికతకు రాష్ట్రపతి ఉత్తర్వులే ప్రామాణికంగా నిర్ణయించాలని కమిటీ ఇప్పటికే అభిప్రాయానికి వచ్చింది. అలాగే త్వరలో పదవీ విరమణ చేసేవారికి, భార్య-భర్తల కేసులు, కొన్ని వ్యాధులకు సంబంధించి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఈ వివరాలన్నింటితో ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసిన తరువాత వాటిని అభిప్రాయాల కోసం బహిరంగపరుస్తారు. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది మార్గదర్శకాలను ప్రధానమంత్రి ఆమోదంతో ప్రకటించనున్నారు. అనంతరం ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను చేపడతారు. -
ఉద్యోగుల పంపిణీపై వారంలో ముసాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల తుది పంపిణీకి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనపై కమలనాథన్ కమిటీ దృష్టి సారిం చింది. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై కమలనాథన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సలహా కమిటీని కేంద్ర ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన కమిటీ సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనవర్మ ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశం లో ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసి ప్రజల ముందు ఉంచుతారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను కమిటీ పరిగణనలోకి తీసుకుని తుది మార్గదర్శకాలను రూపొందించి ప్రధాని ఆమోదానికి పంపనుంది. ఆయన ఆమోదం అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియను కమిటీ చేపట్టనుంది. రెండు రాష్ట్రాల్లో కేటగిరి వారీగా కేడర్ సంఖ్య ఎంత ఉండాలనేది కమలనాథన్ కమిటీ నిర్ధారిస్తుంది. అనంతరం ఉద్యోగుల నుంచి నిర్ధారించిన కేటగిరిల్లో అప్షన్లను స్వీకరించనున్నారు. ప్రధానంగా దంపతులు, త్వరలో పదవీ విరమణ చేయనున్న వారు, ఎస్సీ, ఎస్టీలు, కొన్ని రకాల రోగాలతో బాధపడుతున్న వారి నుంచి ఆప్షన్లను స్వీకరించనున్నారు. ఉద్యోగుల పంపిణీపై అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు కొంత సమయం ఇస్తారు. అనంతరం ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే కొత్త ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకు కమిటీ ముందుకు సాగాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమించడానికి వీలుండదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
'కేసీఆర్ భయపెట్టే సంస్కృతి విడనాడాలి'
హైదరాబాద్ : సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుంటే సహించేది లేదన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులను భయపెట్టే సంస్కృతిని కేసీఆర్ విడనాడాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్ హితవు పలికారు. కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో ఉంచితే సహించేది లేదని కేసీఆర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కాదని కయ్యానికి కాలు దువ్వితే, కిరికిరి పెడితే తాము కూడా కొట్లాటకు సిద్ధంగా ఉన్నమని ఆయన నిన్న హెచ్చరించారు. -
నేడు కేంద్రానికి ఉద్యోగుల సమాచారం
-
నేడు కేంద్రానికి ఉద్యోగుల సమాచారం
* అన్ని జాబితాలు రూపొందించిన ఆర్థిక శాఖ * కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి అందించే ఏర్పాట్లు * అక్కడే ఇరు రాష్ట్రాలకూ తాత్కాలిక కేటాయింపులు * ప్రభుత్వాలు ఏర్పడ్డాక శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల బదిలీలు * స్థానికత ఆధారంగానే సింగిల్ కేడర్ పోస్టుల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం శుక్రవారం సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి అందనుంది. ఉద్యోగుల వివరాలను పూర్తిగా నమోదు చేసినట్లు అన్ని శాఖలు, విభాగాధిపతుల నుంచి ఆర్థిక శాఖ గురువారం సాయంత్రమే లిఖితపూర్వక ఆమోదం తీసుకుంది. ఈ మేరకు అందిన ఉద్యోగుల వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జనాభా నిష్పత్తి ఆధారంగా సీమాంధ్రకు 58.32శాతం, తెలంగాణకు 41.68 శాతం ఉద్యోగులను కేంద్రం కేటాయిస్తుంది. అయితే సింగిల్ కేడర్ పోస్టులను మాత్రం ప్రసుతం ఆ పదవిలో ఉన్న అధికారి స్థానికత ఆధారంగా సంబంధిత రాష్ట్రానికే కేటాయించనున్నట్లు తెలిసింది. అయితే ఈ తాత్కాలిక కేటాయింపుల విషయంలో ఉద్యోగులు అనవసరంగా ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం ఇంకా ఎలాంటి కేటాయింపులు చే యలేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ నిర్వహణకు ఇబ్బంది రాకుండా చూడాలన్న నిబంధన మేరకు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల శాశ్వత బదిలీలు జరుగుతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాక ఉద్యోగుల ఆప్షన్లనూ పరిగణనలోకి తీసుకుని శాశ్వత కేటాయింపులు ఉంటాయన్నారు. ఈ నెల 26 నుంచి రెండు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా వేర్వేరుగా పాలన చే పట్టాలని భావించినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన, భవనాల కేటాయింపు కూడా పూర్తవలేదని పేర్కొన్నారు. ఈ నెల 29 లేదా 30 నుంచి వేర్వేరు పాలన చేపట్టే అవకాశముందన్నారు. తాత్కాలిక కేటాయింపు విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దగ్గరే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. -
చంద్రబాబును కలిసిన సీఎస్ మహంతి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం భేటీ అయ్యారు. మహంతితో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, సచివాలయంలో ఉద్యోగుల విభజనపై వారు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. -
కేసీఆర్‌ది హిట్లర్ పాలసీ: జైరాం రమేష్
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే: జైరాం రమేష్ చంద్రబాబుది చిన్న గడ్డం.. మోడీది పెద్ద గడ్డం తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో.. సీమాంధ్రకు పోలవరం అలాంటిది సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘కేసీఆర్‌ది హిట్లర్ పాలసీ.. ఓ నియంత.. ఆయన చేసే రాజకీయం అబద్దాలతో కూడుకున్నది. బెదిరింపు రాజకీయం. ఆయన గాలిలో విషాన్ని వ్యాపింపజేస్తున్నాడు’’ అని కేంద్రమంత్రి జైరాం రమేష్ నిప్పులు చెరిగారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పంపిణీ ఎలా చేయాలన్నది రాజ్యాంగంలో ఉన్నట్లుగానే ముందుకెళుతున్నామని చెప్పారు. దొరల తెలంగాణ కాదని, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ ఏర్పాటు కావాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. ‘తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు.. ఇప్పుడు నలుగురున్నారు. తర్వాత ఎంతమంది అవుతారో? ఆయన కుటుంబం కోసం తెలంగాణ ఏర్పడలేదు.’ అని జైరాం పేర్కొన్నారు. టీఆర్ఎస్ కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం అయిన పార్టీ అని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరం అయిన 60 స్థానాలు ఆ పార్టీకి రావని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 60 స్థానాలకు పైగా సీట్లు గెలిచే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య ఎలాంటి తేడా లేదని, చంద్రబాబును చూస్తే తనకు మోడీనే కనిపిస్తాడని చెప్పారు. కాకపోతే బాబుకు చిన్నగడ్డం ఉంటుందని, మోడీకి మొహం నిండా పెద్ద గడ్డం ఉంటుందని ఎద్దేవాచేశారు. అవి రెండుపార్టీలు కావని, ఒకటే పార్టీ అని, బాబుకు ఓటేస్తే మోడీకి వేసినట్టేనని అన్నారు. టీడీపీ నిజమైన రూపమే బీజేపీ అన్న జైరాం.. అవకాశం వస్తే కేసీఆర్ కూడా బీజేపీతో కలసి పోతాడని అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దానికి కాంగ్రెస్ పార్టీనే నేతృత్వం వహిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రెండు ప్రాంతాలకు ఉపయోగం కలుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు సీమాంధ్రుల రక్షణ కూడా తమకు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణకు హైదరాబాద్ ఎలాంటిదో, సీమాం ధ్రకు పోలవరం ప్రాజెక్టు అలాంటిదని వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు అన్యాయం జరగనీయబోమని హామీ ఇచ్చారు. ‘ఇక్కడ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘మధుకాన్’ కంపెనీలో మధు లేదు.. కాన్ మాత్రమే ఉంది.. కాన్ అంటే మోసం.. మధుకాన్ అంటేనే మోసం.’ అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. అస్సాం, జార్ఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో నామాప్రాజెక్టులు కట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పదిజిల్లాలను 20 జిల్లాలుగా చేస్తామన్నారు. కాంగ్రెస్, సీపీఐల పొత్తు విషయంలో అసంతృప్తి ఉన్నా.. సమష్టిగా పనిచేస్తామన్నారు. రెండు పార్టీల నడుమ రేణుకాచౌదరి వారధిగా ఉన్నారని జైరాం అన్నారు. -
కేంద్రానికే విడిచి పెడదాం
* ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై కమలనాథన్ కమిటీ నిర్ణయం * మార్గదర్శకాలకు ప్రధాని ఆమోదం తప్పనిసరి * వచ్చే నెల 7 తర్వాత మార్గదర్శకాలు ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు అనుసరించాల్సిన మార్గదర్శకాల ఖరారు విషయంలో తుది నిర్ణయం తీసుకోలేక కమలనాథన్ కమిటీ సతమతమవుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులు, సమస్యలను కేంద్రానికి వివరించి నిర్ణయాన్ని కేంద్రానికే విడిచిపెట్టాలనే యోచనలో కమిటీ ఉన్నట్లు సమాచారం. మార్గదర్శకాలకు ప్రధానమంత్రి ఆమోదం తప్పనిసరి. కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రధానమంత్రి ఆమోదముద్ర పడిన తర్వాత మార్గదర్శకాలు ఖరారయినట్లుగా పరిగణించాలి. కేంద్రం వాటిని ఖరారు చేసినా.. ఎన్నికలు ముగిసిన తర్వాతే (వచ్చేనెల 7 తర్వాత) అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు ప్రకటన చేస్తే.. ఇతరు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కమలనాథన్ ఇప్పటికే మధ్యప్రదేశ్ విభజనలో అనుసరించిన విధానాలను పరిశీలించడానికి భోపాల్ వెళ్లొచ్చారు. బుధవారం పాట్నా వెళ్లారు. మూడు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, సమస్యలను వివరిస్తూ కేంద్రానికి త్వరలో నివేదిక పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య పోస్టుల విభజన జరిగిన తర్వాత.. తాత్కాలిక ఆప్షన్స్ మేరకు ఉద్యోగులను పంపిణీ జరిగేలా మార్గదర్శకాలు రూపొందించాలని సూచిం చనున్నట్లు సమాచారం. కాగా, ఉద్యోగుల విభజన విషయం లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. స్థానికత ఆధారంగానే..: టీ-ఉద్యోగ సంఘాల జేఏసీ ‘‘స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. నాలుగు నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు చదివిన దాన్నే స్థానికతకు ఆధారంగా తీసుకుంటున్నారు. ధ్రువీకరించుకోవడానికి అవకాశం ఉన్న రికార్డుల మేరకు.. ఈ అంశం ఆధారంగానే ఉద్యోగుల స్థానికతను నిర్ధారించాలి. తప్పుడు రికార్డులు సమర్పించిన ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. విభజన తర్వాత తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నా ఆప్షన్స్ పేరిట ఆంధ్ర ఉద్యోగులను ఇక్కడే కొనసాగిస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. తెలంగాణ ఉద్యోగులకు మరోసారి అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమించడానికీ వెనకాడం.’’ తాత్కాలిక ఆప్షన్స్‌తో..: ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ‘‘రాజధాని తేల్చకుండానే ఉద్యోగులను విభజిస్తున్నారు కాబట్టి.. ప్రస్తుతం ఇచ్చే ఆప్షన్స్‌ను తాత్కాలికమైనవిగా పరిగణించాలి. రెండు రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి. రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం కల్పించాలి. అన్ని క్యాడర్ల ఉద్యోగులకు ఆప్షన్ సౌకర్యం ఉండాలి. కనీసం 5 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులకు ఆప్షన్ కల్పించే విషయాన్ని పరిశీలించాలి.’’ -
‘సచివాలయ’ పంపిణీ ఇలా..
* అత్యధికంగా సీమాంధ్ర వారే సహాయ, ఉప కార్యదర్శులు * డిప్యుటేషన్‌పై ఇరు రాష్ట్రాలకు సర్దుబాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో సహాయ నుంచి అదనపు కార్యదర్శులు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కసరత్తును పూర్తి చేసింది. ఉద్యోగుల పంపిణీ జిల్లాల నిష్పత్తి ప్రకారం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రస్తుతం పనిచేస్తున్న సహాయ నుంచి అదనపు కార్యదర్శుల పోస్టుల్లో ఏ ప్రాంతం వారు ఎంత మంది ఉన్నారు, కేడర్ సంఖ్య ఎంత అనే వివరాలను అధికారులు సేకరించారు. ప్రాంతాల వారీగా చూస్తే ప్రధానంగా సహాయ, ఉప కార్యదర్శుల్లో అత్యధికంగా సీమాంధ్ర జిల్లాలకు చెందినవారే ఉన్నారు. ప్రాంతాల వారీగా పంపిణీ చేస్తే పైన పేర్కొన్న పోస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు తొలుత మంజూరైన పోస్టులను జిల్లాల నిష్పత్తి మేరకు రెండు రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఆ తరువాత కొరత ఉన్న రాష్ట్రానికి పక్క రాష్ట్రం నుంచి డిప్యుటేషన్‌పై నియమించనున్నారు. సచివాలయంలో మంజూరైన సహాయ కార్యదర్శులు పోస్టుల సంఖ్య 161 కాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 108 మంది ఉండగా తెలంగాణకు చెందిన వారు 41 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వీరిని జిల్లాల నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తే సహాయ కార్యదర్శుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84 మంది, తెలంగాణకు 64 మంది రానున్నారు. ఉప కార్యదర్శుల పోస్టుల సంఖ్య 60 కాగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 45 మంది, తెలంగాణకు చెందినవారు 15 మంది పనిచేస్తున్నారు. వీరు 20 మంది ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు 16 మంది రానున్నారు. సంయుక్త కార్యదర్శుల పోస్టు సంఖ్య 20 కాగా అందులో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు తెలంగాణకు చెందిన వారు పనిచేస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు పది, తెలంగాణకు ఏడు పోస్టులు రానున్నాయి. అదనపు కార్యదర్శుల పోస్టుల సంఖ్య ఏడు కాగా అందులో ముగ్గురేసి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందినవారు పనిచేస్తున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇద్దరేసి చొప్పున రానున్నారు. ఇందుకు సంబంధించి పంపిణీ ప్రతిపాదనలను త్వరలోనే గవర్నర్ నర్సింహన్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. -
ఏపీభవన్ ఉద్యోగులకు నో ఆప్షన్స్?
ఒకే పోస్టు ఉంటే తెలంగాణకే రెండు పోస్టులుంటే సీనియర్లు తెలంగాణకు, మిగతావారు ఆంధ్రకు..! సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొన్నేళ్లపాటు ఉమ్మడిగా ఉండనున్న ఏపీభవన్‌లో ఉద్యోగుల విభజన అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వకుండా కేవలం పోస్టులు, సీనియారిటీ ఆధారంగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. సింగిల్ పోస్టుల (ఒక్కపోస్టు మాత్రమే) స్థానంలో ఉన్న ఉద్యోగులను తెలంగాణకు, డబుల్ పోస్టులు (రెండేసి పోస్టులు) ఉన్న స్థానంలో సీనియర్ని తెలంగాణకు, జూనియర్ని ఆంధ్రప్రదేశ్ కేటాయించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనధికార సమాచారాన్ని ఏపీభవన్ ఉద్యోగులకు చేరవేసింది. ఇరు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులనే ఇరురాష్ట్రాలకు 42:58 నిష్పత్తిని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏపీభవన్‌లో ఉన్న 90మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది సీమాం ధ్రులే ఉన్నారు. స్థానికత, సీనియారిటీ ఆధారంగా లేక ఆప్షన్ల ద్వారాఉద్యోగుల విభజన చేపట్టినా తెలంగాణకు దక్కే ఉద్యోగులసంఖ్య తక్కువగా ఉంటుంది. ఏపీభవన్ అధఙకారులకు అందిన సమాచారం మేరకు విభజన పంపిణీ ఇలా ఉంది.. - ఏపీభవన్‌లోని న్యాయవిభాగంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు ఇద్దరూ ఆంధ్రావారే కావడం తో సర్వీస్‌లో సీనియర్‌ను తెలంగాణకు, జూనియర్ని ఆంధ్రాకు కేటాయించారు. ఇక ఇదే విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులో ఒక్కరే ఉండటంతో ఆయన్ను తెలంగాణకు కేటాయిం చారు. మిగతా పోస్టుల్లోనూ ఇదేరీతిన విభజన చేపట్టారు. - గెస్ట్‌హౌస్ నిర్వహణకు సంబంధించి డిప్యూటీ కమిషనర్, ప్రోటోకాల్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, హౌస్ కీపర్ పోస్టుల్లో ఒక్కరే ఉద్యోగి ఉండటంతో వారందరినీ తెలంగాణకే కేటాయించారు. - అసిస్టెంట్ కమిషనర్, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత కార్యదర్శి, లైజనింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్ పోస్టుల్లో ఇద్దరేసి ఉండటంతో ఇక్కడ సీనియర్‌ను తెలంగాణకు, జూనియర్ని ఆంధ్రాకు కేటాయించారు. మిగతా పోస్టుల్లోనూ ఇదే రీతిన విభజన చేపట్టారని తెలుస్తోంది. - సింగిల్ పోస్టులన్నీ తెలంగాణకే కేటాయించనున్న నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతం వారికోసం కొత్త పోస్టులు సృష్టించక తప్పని పరిస్థితి. దానికి సంబంధించి కసరత్తు శరవేగంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. -
జిల్లాల నిష్పత్తి మేరకే ఉద్యోగుల పంపిణీ
తెలంగాణకు 110.. సీమాంధ్రకు 148 ఐపీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ జిల్లాల నిష్పత్తి మేరకే చేయనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో అఖిల భారత సర్వీసు, రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికనో స్పష్టం చేయలేదు. ఆస్తులు, అప్పులు పంపిణీ మాత్రం జనాభా ప్రాతిపదికగా చట్టంలో పేర్కొన్నప్పటికీ ఉద్యోగుల పంపిణీ విషయంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. గతంలో జరిగిన రాష్ట్రాల విభజనలో జిల్లాల నిష్పత్తి ఆధారంగా ఉద్యోగుల పంపిణీ చేసినందున ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీని సీమాంధ్రకు 13 జిల్లాల నిష్పత్తిలోను, తెలంగాణకు పది జిల్లాల నిష్పతిలోను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 258 మంది ఐపీఎస్ పోస్టులుండగా వాటిని జిల్లాల నిష్పత్తి ప్రకారం సీమాంధ్రకు 148 ఐపీఎస్ పోస్టులను, తెలంగాణకు 110 ఐపీఎస్ పోస్టులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల సంఖ్య 56 వేల మందిగా ఇప్పటికే ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. -
ఉద్యోగుల పంపిణీకి ముమ్మర కసరత్తు
* నేడు ఉద్యోగ సంఘాలతో కమలనాథన్ కమిటీ భేటీ * ఇరు ప్రాంతాలకు చెందిన 16 సంఘాల అభిప్రాయాల సేకరణ * ఒక్కో సంఘం నుంచి ఇద్దరికే అవకాశం * 5 నిమిషాల్లో చెప్పాలని నిబంధన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలపై కమలనాధన్ కమిటీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రాథమికంగా మార్గదర్శకాలను రూపొందించిన కమలనాధన్ వాటిపై ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇరు ప్రాంతాలకు చెందిన 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈమేరకు ఉద్యోగ సంఘాలకు గురువారం ఆహ్వానాలు అందాయి. ఈ సంఘాల భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి కేంద్ర ఉద్యోగ, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, డెరైక్టర్ కిప్గిన్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. ఒక్కో ఉద్యోగ సంఘానికి ఐదేసి నిమిషాలు సమయాన్ని నిర్ధారించారు. ఆ సమయంలోనే అభిప్రాయాలు చెప్పి, లిఖితపూర్వక పత్రాలను కూడా సమర్పించవచ్చు. ఒక్కో సంఘం నుంచి ఇద్దరు మాత్రమే హాజరు కావాలనే నిబంధనను కూడా విధించారు. కొరత ఉన్న ప్రాంతానికి డిప్యుటేషన్‌పై ఉద్యోగులు! కమలనాధన్ కమిటీ రూపొందించే మార్గదర్శక సూత్రాలే రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీలో కీలకం కానున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యోగుల పంపిణీని జనాభా ప్రాతిపదికన చేపట్టాలా లేక జిల్లాల ప్రాతిపదికనా అనే విషయం ఎక్కడా పేర్కొనలేదు. దీంతో కమలనాధన్ కమిటీ ఇంతకుముందు జరిగిన రాష్ట్రాల విభజనలో దేనిని ప్రాతిపదికగా తీసుకున్నారో పరిశీలించనుంది. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానుంది. న్యాయబద్ధంగా, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులకూ అన్యాయం జరగకుండా మార్గదర్శకాలు ఉండాలని కమలనాధన్ నిర్ణయించారు. భార్య, భర్త కేసులు, కొన్ని రకాల రోగాలు, రెండు మూడేళ్లలో పదవీ విరమణ చేసే సీనియర్లు ఇచ్చే ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. మరోపక్క.. కమలనాధన్ శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. పంపిణీ అనంతరం ఒక రాష్ర్టంలో కొరత ఏర్పడి, మరో రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంటే, డిప్యుటేషన్ విధానం అమలు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఎక్కువ ఉద్యోగులున్న రాష్ట్రం నుంచి కొరత ఉన్న రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై ఉద్యోగులను తేవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉద్యోగ సంఘాలు తెలిపే అభిప్రాయాలు కీలకం కానున్నాయి. ఉద్యోగుల పంపిణీకి రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్‌గా కూడా కమలనాధన్ను కేంద్రం నియమించనుంది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. టీ-సచివాలయానికి సహాయ కార్యదర్శుల కొరత పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో తెలంగాణ రాష్ట్రానికి అసిస్టెంట్ కార్యదర్శులు కొరత ఏర్పడుతుందని అధికారులు అంచనావేశారు. ప్రస్తుతం సచివాలయంలో 150 మంది సహాయ కార్యదర్శులున్నారు. వీరిలో 80 శాతం వరకు సీమాంధ్రకు చెందిన వారేనని అధికారవర్గాలు లెక్క కట్టాయి. దీంతో తెలంగాణ సచివాలయంలో సహాయ కార్యదర్శులు తక్కువవుతారు. సీమాంధ్ర నుంచి డిప్యుటేషన్‌పై తేవడం ద్వారా ఈ కొరతను అధిగమించనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ వెసులుబాటు ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయంలో 500 మంది ఎస్వోలు, 1,200 మంది ఏఎస్‌వోలు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్వోలు, ఏఎస్‌వోలు ఇరు రాష్ట్రాలకు సరిపోతారని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అత్యధికంగా తెలంగాణకు చెందిన వారే ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఎపీఎస్పీ సిబ్బందిలోనూ తెలంగాణకు కొరత ఏపీఎస్పి బెటాలియన్లలో పోలీసు సిబ్బంది పంపిణీ మార్గదర్శకాలపైనా కమలనాధన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 బెటాలియన్లున్నాయి. వీటిలో 9 తెలంగాణలో, 8 సీమాంధ్రలో ఉన్నాయి. తెలంగాణ బెటాలియన్లలో 30 శాతం సీమాంధ్ర వారే ఉన్నారు. సీమాంధ్ర బెటాలియన్లలో తెలంగాణకు చెందిన వారు 3 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సీమాంధ్ర నుంచి ఈ 3 శాతం మందిని తెలంగాణ బెటాలియన్లకు తెచ్చినా, ఇంకా దాదాపు 27 శాతం కొరత ఉంటుంది. ఈ కొరతను అధిగమించాలంటే సీమాంధ్రకు చెందిన వారిని తెలంగాణ బెటాలియన్లలో డిప్యుటేషన్‌పై కొనసాగించాలని కమలనాధన్ అభిప్రాయపడుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. -
రేపు కమలనాథన్ కమిటీ తొలి భేటీ
సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ గురువారం తొలిసారిగా భేటీ కానుంది. కమలనాథన్‌తో పాటు ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉన్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాలకు ఈ భేటీలో రూపకల్పన చేయనున్నారు. మరోవైపు అన్ని శాఖల్లో విభజన పని పురోగతిపై సమీక్షించేందుకు రాష్ట్ర సీఎస్ బుధవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెలాఖరుకల్లా ఫైళ్లు, ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనను ఒక కొలిక్కి తీసుకురావాలని సీఎస్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎస్ మంగళవారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఇరు రాష్ట్రాల్లో చేపట్టాల్సిన పరిపాలనా సంస్కరణలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలలు, ఆస్పత్ల్రు ఉన్నాయి, వాటికి అదనంగా ఏ రాష్ట్రంలోనైనా ఏర్పాటు చేయాల్సిన అవసరముందా? అనే అంశాలను పరిశీలించనున్నారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని.. దానికి అవసరమైన మౌలిక వసతులు ఎలా ఉన్నాయో కూడా సీఎస్ సమీక్షించనున్నారు.