
స్థానికత ఆధారంగానే పంపిణీ!
అభిప్రాయం చెప్పాలని 2 రాష్ట్రాల సీఎస్‌లను కోరిన కమలనాథన్
27న మరోసారి ఉద్యోగుల విభజన కమిటీ భేటీకి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీకి వీలుగా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించే విషయంలో ఇరు రాష్ర్ట ప్రభుత్వాల అభిప్రాయం చెప్పాలని కమలనాథన్ కమిటీ కోరింది. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా స్థానికత ఆధారంగానే పంపిణీ జరగాలన్న ఉద్యోగుల అభిప్రాయంపై చర్చ జరిగింది. అలా చేస్తే మిగులు ఉద్యోగులున్న చోట సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటు, తక్కువ మంది ఉన్న చోట పదోన్నతులు కల్పించి ఆయా పోస్టుల భర్తీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సిద్ధం కావాల్సి ఉంటుందని కమిటీ చైర్మన్ కమలనాథన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకుని ఈ నెల 27న జరిగే భేటీలో స్పష్టతనివ్వాలని ఉన్నతాధికారులకు కమిటీ సూచించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించే పక్షంలో ఆ మేరకే కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు పంపేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కమలనాథన్ చెప్పారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు కేంద్ర సిబ్బంది, శిక్షణా శాఖ కార్యదర్శి, అలాగే కమిటీ సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు నాగిరెడ్డి, డాక్టర్ పీవీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పంపిణీపై గురువారమే పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఖరారవుతాయని భావించినప్పటికీ... కమిటీ సభ్యులు పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారి ఈ కమిటీ భేటీకి వచ్చినందున ఉద్యోగుల పంపిణీ విధానాన్ని ఈ సందర్భంగా వారికి వివరించారు. ఇరువురు ప్రధాన కార్యదర్శులు సమన్వయంతో ఏకాభిప్రాయానికి రావడానికి కొంత గడువు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. దీంతో ఈ నెల 27న జరిగే సమావేశంలోనే మార్గదర్శకాల తుది నివేదిక సిద్ధంకానుంది. ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ పోర్టల్స్‌లో ఆ మార్గదర్శకాలను అందుబాటులో పెట్టనున్నారు.
అందిన సలహాలు, సూచనలపై సలహా కమిటీ మరోసారి సమావేశమై తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది. వాటినే కేంద్రం ఆమోదానికి పంపించనుంది. ఆ తర్వాతే ఉద్యోగుల శాశ్వత పంపిణీ జరుగుతుంది. ప్రస్తుతం దాదాపు తొమ్మిది వేలమందికిపైగా ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా, తాము రూపొందించే మార్గదర్శకాలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని కమిటీ సభ్యుడొకరు వివరించారు. రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు, భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర అనారోగ్యం ఉన్నవారు, ఎస్సీ, ఎస్టీలు ఇచ్చే ఆప్షన్ల ప్రకారమే వారి పంపిణీ చేయాలనే కోణంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇక రాష్ట్ర కేడర్‌లో పంపిణీ అయ్యే అధికారులు, ఉద్యోగుల సంఖ్య దాదాపు 65 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. వీరిచ్చే ఆప్షన్లలో అన్నింటినీ ఆమోదించాలా.. లేదా? అన్న విషయాన్ని తర్వాతే నిర్ణయించనున్నారు.
స్థానికతే ఆధారం కావాలి: టీజీవో సంఘం వినతి
సర్వీసు రిజిస్టర్‌లో పేర్కొన్న స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ఉండాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కమలనాథన్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. కొందరు అధికారుల గందరగోళ నిర్ణయాల వల్ల తెలంగాణ సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌లో, ఆంధ్రా ప్రాంత సిబ్బంది తెలంగాణలో పనిచేసే పరిస్థితి నెలకొంద ని, ఇలా కాకుండా ఎక్కడివారక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. గురువారం కమలనాథన్ కమిటీతో భేటీ అయిన అనంతరం టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రతినిధులు మమత, రాజ్‌కుమార్ గుప్తా తదితరులు మీడియాతో మాట్లాడారు. సమస్య జటిలం కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు వారు వెల్లడించారు.