
స్థానికతపై తకరారు
ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
ఉద్యోగులకు పుట్టిన ప్రాంతమే అంటున్న తెలంగాణ సర్కారు
రాష్ట్రపతి ఉత్తర్వులే ఆధారంగా తీసుకోవాలంటున్న ఆంధ్రా సర్కారు
సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీలో కీలకమైన ‘స్థానికత’ను నిర్ధారించడానికి ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరూ పుట్టిన ప్రాంతమే ప్రాతిపదికగా స్థానికత నిర్ధారణ జరగాలని కమలనాథన్ కమిటీని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాతిపదికనే స్థానికత నిర్ధారణ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికతకు ఏ ప్రాతిపదికను ఎంపిక చేసుకోవాలో కమలనాథన్ కమిటీ నిర్ధారించాల్సి ఉంది. కమలనాథన్ కమిటీ నిర్ధారించిన ప్రాతిపదికను ఎవరూ అంగీకరించకపోయినా తుది నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని, దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించక తప్పదని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
గురువారం జరిగిన కమలనాథన్ కమిటీ సమావేశంలో స్థానికతకు ఏ ప్రాతిపదిక తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఉద్యోగుల సర్వీసు రిజస్టర్‌లో వారు ఏ జిల్లాకు చెందిన వారో ఉంటుందని, దాన్ని ప్రాతిపదికగా తీసుకోవచ్చా అనే అంశంపైన చర్చించారు. అయితే ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. ఉద్యోగుల పంపిణీలో ఇరు రాష్ట్రాల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించడమే మార్గమని కమలనాథన్ కమిటీ అభిప్రాయపడింది.
తక్కువగా ఉంటేభర్తీ చేసుకుంటామంటున్న కేసీఆర్
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించాలని, తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నా భర్తీ చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానంగా సచివాలయంలో తెలంగాణకు చెందిన నాలుగోతరగతి ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. వీరిని జనాభా నిష్పత్తిలో పంపిణీ
చేస్తే ఆంధ్రాకు కొంత మంది వెళ్లాల్సి ఉంటుంది. అయితే దీన్ని నివారించడానికి తెలంగాణలో ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను ఎక్కువగా ఉన్న నాల్గో తరగతి ఉద్యోగులతో భర్తీ చేయాలనే ఆలోచనలో కూడా తెలంగాణ సర్కారు ఉందని, దీంతో సమస్య ఉండదని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
ఏపీలో సూపర్ న్యూమరరీ అయితే మేలు!
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఉన్న ఉద్యోగులకు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడానికి సమ్మతిస్తే చాలా వరకు కమలనాథన్ కమిటీకి ఎటువంటి చిక్కులూ లేకుండా మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కమలనాథన్ కమిటీ గురువారం సమావేశంలో ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఆధారంగా ఈ నెల 27న జరిగే సమావేశంలో కమలనాథన్ కమిటీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయనుంది.