ఉద్యోగుల పంపిణీకి ముమ్మర కసరత్తు
* నేడు ఉద్యోగ సంఘాలతో కమలనాథన్ కమిటీ భేటీ
* ఇరు ప్రాంతాలకు చెందిన 16 సంఘాల అభిప్రాయాల సేకరణ
* ఒక్కో సంఘం నుంచి ఇద్దరికే అవకాశం
* 5 నిమిషాల్లో చెప్పాలని నిబంధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలపై కమలనాధన్ కమిటీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రాథమికంగా మార్గదర్శకాలను రూపొందించిన కమలనాధన్ వాటిపై ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇరు ప్రాంతాలకు చెందిన 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈమేరకు ఉద్యోగ సంఘాలకు గురువారం ఆహ్వానాలు అందాయి. ఈ సంఘాల భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి కేంద్ర ఉద్యోగ, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, డెరైక్టర్ కిప్గిన్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. ఒక్కో ఉద్యోగ సంఘానికి ఐదేసి నిమిషాలు సమయాన్ని నిర్ధారించారు. ఆ సమయంలోనే అభిప్రాయాలు చెప్పి, లిఖితపూర్వక పత్రాలను కూడా సమర్పించవచ్చు. ఒక్కో సంఘం నుంచి ఇద్దరు మాత్రమే హాజరు కావాలనే నిబంధనను కూడా విధించారు.
కొరత ఉన్న ప్రాంతానికి డిప్యుటేషన్‌పై ఉద్యోగులు!
కమలనాధన్ కమిటీ రూపొందించే మార్గదర్శక సూత్రాలే రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీలో కీలకం కానున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యోగుల పంపిణీని జనాభా ప్రాతిపదికన చేపట్టాలా లేక జిల్లాల ప్రాతిపదికనా అనే విషయం ఎక్కడా పేర్కొనలేదు. దీంతో కమలనాధన్ కమిటీ ఇంతకుముందు జరిగిన రాష్ట్రాల విభజనలో దేనిని ప్రాతిపదికగా తీసుకున్నారో పరిశీలించనుంది. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానుంది. న్యాయబద్ధంగా, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులకూ అన్యాయం జరగకుండా మార్గదర్శకాలు ఉండాలని కమలనాధన్ నిర్ణయించారు. భార్య, భర్త కేసులు, కొన్ని రకాల రోగాలు, రెండు మూడేళ్లలో పదవీ విరమణ చేసే సీనియర్లు ఇచ్చే ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. మరోపక్క.. కమలనాధన్ శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌తో సమావేశమయ్యారు.
ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. పంపిణీ అనంతరం ఒక రాష్ర్టంలో కొరత ఏర్పడి, మరో రాష్ట్రంలో ఎక్కువ మంది ఉంటే, డిప్యుటేషన్ విధానం అమలు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఎక్కువ ఉద్యోగులున్న రాష్ట్రం నుంచి కొరత ఉన్న రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై ఉద్యోగులను తేవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉద్యోగ సంఘాలు తెలిపే అభిప్రాయాలు కీలకం కానున్నాయి. ఉద్యోగుల పంపిణీకి రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్‌గా కూడా కమలనాధన్‌ను కేంద్రం నియమించనుంది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
టీ-సచివాలయానికి సహాయ కార్యదర్శుల కొరత
పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయంలో తెలంగాణ రాష్ట్రానికి అసిస్టెంట్ కార్యదర్శులు కొరత ఏర్పడుతుందని అధికారులు అంచనావేశారు. ప్రస్తుతం సచివాలయంలో 150 మంది సహాయ కార్యదర్శులున్నారు. వీరిలో 80 శాతం వరకు సీమాంధ్రకు చెందిన వారేనని అధికారవర్గాలు లెక్క కట్టాయి. దీంతో తెలంగాణ సచివాలయంలో సహాయ కార్యదర్శులు తక్కువవుతారు. సీమాంధ్ర నుంచి డిప్యుటేషన్‌పై తేవడం ద్వారా ఈ కొరతను అధిగమించనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ వెసులుబాటు ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సచివాలయంలో 500 మంది ఎస్‌వోలు, 1,200 మంది ఏఎస్‌వోలు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్‌వోలు, ఏఎస్‌వోలు ఇరు రాష్ట్రాలకు సరిపోతారని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగో తరగతి ఉద్యోగులు మాత్రం అత్యధికంగా తెలంగాణకు చెందిన వారే ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి.
ఎపీఎస్‌పీ సిబ్బందిలోనూ తెలంగాణకు కొరత
ఏపీఎస్‌పి బెటాలియన్లలో పోలీసు సిబ్బంది పంపిణీ మార్గదర్శకాలపైనా కమలనాధన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 బెటాలియన్లున్నాయి. వీటిలో 9 తెలంగాణలో, 8 సీమాంధ్రలో ఉన్నాయి. తెలంగాణ బెటాలియన్లలో 30 శాతం సీమాంధ్ర వారే ఉన్నారు. సీమాంధ్ర బెటాలియన్లలో తెలంగాణకు చెందిన వారు 3 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. సీమాంధ్ర నుంచి ఈ 3 శాతం మందిని తెలంగాణ బెటాలియన్లకు తెచ్చినా, ఇంకా దాదాపు 27 శాతం కొరత ఉంటుంది. ఈ కొరతను అధిగమించాలంటే సీమాంధ్రకు చెందిన వారిని తెలంగాణ బెటాలియన్లలో డిప్యుటేషన్‌పై కొనసాగించాలని కమలనాధన్ అభిప్రాయపడుతున్నట్లు అధికారవర్గాల సమాచారం.