ఆ ఒక్కటీ వదిలేసి మార్గదర్శకాలు!
రేపు విడుదలయ్యే అవకాశం
ఉద్యోగుల పంపిణీలో పదవీ విరమణ చేసే వారికి ఆప్షన్ అంశం
వారి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దంటున్న ఏపీ సర్కారు
రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కమలనాథన్ సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీలో కీలకంగా మారిన.. ‘త్వరలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల విషయం’పై స్పష్టతనివ్వకుండానే ముసాయిదా మార్గదర్శకాల విడుదలకు కమలనాథన్ కమిటీ సిద్ధమవుతోంది. రెండేళ్లలోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవడాన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ముసాయిదా మార్గదర్శకాల్లో ఈ విషయమై ఎటువంటి నిబంధన ఉంచాలనే అంశంపై తమ అభిప్రాయం తర్వాత చెబుతామని పేర్కొంది. అందువల్ల ఆ అంశాన్ని పక్కన ఉంచి మిగతా అంశాలతో ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేయాల్సిందిగా శనివారం కమలనాథన్ కమిటీని కోరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కమలనాథన్ ఆదివారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రభుత్వం పేర్కొన్నట్లుగా పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్ అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలతో ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమ్మతమేనా? అనే అంశంపై తెలంగాణ సీఎస్‌తో కమల నాథన్ చర్చించినట్లు సమాచారం. దీంతో రాజీవ్ శర్మ తమ సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో చర్చించిన తరువాత తెలియజేస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. అరుుతే కేసీఆర్, సీఎస్ లు సోమవారం జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉండ నున్నందున మంగళవారం గానీ మార్గదర్శకాలు జారీకి వీలుపడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.