* ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై కమలనాథన్ కమిటీ నిర్ణయం
* మార్గదర్శకాలకు ప్రధాని ఆమోదం తప్పనిసరి
* వచ్చే నెల 7 తర్వాత మార్గదర్శకాలు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు అనుసరించాల్సిన మార్గదర్శకాల ఖరారు విషయంలో తుది నిర్ణయం తీసుకోలేక కమలనాథన్ కమిటీ సతమతమవుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులు, సమస్యలను కేంద్రానికి వివరించి నిర్ణయాన్ని కేంద్రానికే విడిచిపెట్టాలనే యోచనలో కమిటీ ఉన్నట్లు సమాచారం. మార్గదర్శకాలకు ప్రధానమంత్రి ఆమోదం తప్పనిసరి. కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రధానమంత్రి ఆమోదముద్ర పడిన తర్వాత మార్గదర్శకాలు ఖరారయినట్లుగా పరిగణించాలి. కేంద్రం వాటిని ఖరారు చేసినా.. ఎన్నికలు ముగిసిన తర్వాతే (వచ్చేనెల 7 తర్వాత) అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు ప్రకటన చేస్తే.. ఇతరు ప్రాంతాల్లో ఉద్యోగులు ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కమలనాథన్ ఇప్పటికే మధ్యప్రదేశ్ విభజనలో అనుసరించిన విధానాలను పరిశీలించడానికి భోపాల్ వెళ్లొచ్చారు. బుధవారం పాట్నా వెళ్లారు.
మూడు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, సమస్యలను వివరిస్తూ కేంద్రానికి త్వరలో నివేదిక పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య పోస్టుల విభజన జరిగిన తర్వాత.. తాత్కాలిక ఆప్షన్స్ మేరకు ఉద్యోగులను పంపిణీ జరిగేలా మార్గదర్శకాలు రూపొందించాలని సూచిం చనున్నట్లు సమాచారం. కాగా, ఉద్యోగుల విభజన విషయం లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.
స్థానికత ఆధారంగానే..: టీ-ఉద్యోగ సంఘాల జేఏసీ
‘‘స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. నాలుగు నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు చదివిన దాన్నే స్థానికతకు ఆధారంగా తీసుకుంటున్నారు. ధ్రువీకరించుకోవడానికి అవకాశం ఉన్న రికార్డుల మేరకు.. ఈ అంశం ఆధారంగానే ఉద్యోగుల స్థానికతను నిర్ధారించాలి. తప్పుడు రికార్డులు సమర్పించిన ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. విభజన తర్వాత తెలంగాణలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నా ఆప్షన్స్ పేరిట ఆంధ్ర ఉద్యోగులను ఇక్కడే కొనసాగిస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. తెలంగాణ ఉద్యోగులకు మరోసారి అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమించడానికీ వెనకాడం.’’
తాత్కాలిక ఆప్షన్స్‌తో..: ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ
‘‘రాజధాని తేల్చకుండానే ఉద్యోగులను విభజిస్తున్నారు కాబట్టి.. ప్రస్తుతం ఇచ్చే ఆప్షన్స్‌ను తాత్కాలికమైనవిగా పరిగణించాలి. రెండు రాష్ట్రాల ఆవిర్భావం తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి. రాజధాని విషయంలో తుది నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం కల్పించాలి. అన్ని క్యాడర్ల ఉద్యోగులకు ఆప్షన్ సౌకర్యం ఉండాలి. కనీసం 5 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులకు ఆప్షన్ కల్పించే విషయాన్ని పరిశీలించాలి.’’
కేంద్రానికే విడిచి పెడదాం
Published Thu, Apr 17 2014 4:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
Advertisement
Advertisement