మన్మోహన్‌ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి | Telangana Assembly Special Session Live Updates | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి

Published Mon, Dec 30 2024 9:21 AM | Last Updated on Mon, Dec 30 2024 2:10 PM

Telangana Assembly Special Session Live Updates

హైదరాబాద్‌, సాక్షి: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఏడు రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా.. ఇవాళ(డిసెంబర్‌ 30) ప్రత్యేక సెషన్‌ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్‌ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అలాగే మన్మోహన్‌కు దేశఅత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు మన్మోహన్‌కు రుణపడి ఉంటారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ అంటే మన్మోహన్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో​ తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్‌ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరవలేం. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా మన్మోహన్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం.  

ప్రజలకు ఉపయోగపడే సంస్కరణల్లో ఆయన వెనకడుగు వేయలేదు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు లబ్దిపొందారు. మన్మోహన్‌ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి. పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఆయన చలువే. అంబేద్కర్‌ స్పూర్తితో పరిపాలన చేశారు. మన్మోహన్‌ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది. ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నామంటూ ఆయన సంస్కరణలే కారణం అని చెప్పుకొచ్చారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పనే ధ్యాసగా పనిచేశారు. బ్యూరోక్రాట్‌గా వివిధ దశల్లో పనిచేసి మన్మోహన్‌ దేశ ప్రధాని అయ్యారు. నీతి, నిజాయితీతో మన్మోహన్‌తో పోటీ పడేవారు లేరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన పనే లక్ష్యంగా మన్మోహన్‌ ముందుకు సాగారు. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి. 
 

👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్‌.. 
ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందించారు. మన్మోహన్‌ సంస్కరణలతో అనేక కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టాన్ని 2005లో​ తీసుకువచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది. ఆర్థిక మాంద్యం బారినపడకుండా ఉపాధి హామీ పథకం కాపాడింది. దేశ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టాలు చేశారు. 

ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దశాబ్దాలుగా కొట్లాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేశారు. మన్మోహన్‌ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మన్మోహన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. అసామాన్యమైన మహా మనిషి మన్మోహన్‌. దేశం కోసం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు. మన్మోహన్‌ భారత్‌లో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం.

 

👉 కేటీఆర్‌ కామెంట్స్‌..
మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్‌ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్‌ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా భరించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. పీవీ నర్సింహారావు తెలంగాణ బిడ్డ. ఢిల్లీలో మెమోరియల్ లేదు. అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభ తీర్మానం చేయాలి.

రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం అంతా దేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. లాయల్టీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. కేసీఆర్‌కు షిప్పింగ్ పోర్టుపోలియో ఇస్తే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగానే కేసీఆర్ తెలంగాణ కోసం అది త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ డెలిగేషన్ తీసుకొని మన్మోహన్ సింగ్‌ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల డెలిగేషన్ ఢిల్లీ వెళ్లి కలిసింది.

మన్మోహన్ సింగ్‌కు జరిగిన గౌరవ వీడ్కోలు.. మన పీవీ నరసింహారావుకు దక్కలేదు. ఢిల్లీలో అందరి ప్రధాన మంత్రులకు ఘాట్స్ ఉన్నాయి. పీవీకి తప్ప. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేలా సభలో తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. మన్మోహన్ సింగ్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా మేమంతా వస్తాం.

👉మంత్రి శ్రీధర్‌ బాబు కామెంట్స్‌..

దేశాభివృద్ధికి మన్మోహన్‌ సింగ్‌ అనేక గొప్ప విధానాలు తెచ్చారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపిక చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చారు. 

బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..

  • పీవీ నరసింహారావు గురించి సభలో గుర్తు చేస్తున్నారు.
  • పీవీని పదేళ్లు పట్టించుకోకపోతే.. బీజేపీ పీవీకి భారతరత్న ఇచ్చింది.
  • పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీవీకి భారత రత్న ఇవ్వలేదు.
  • మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే..
  • రాహుల్ గాంధీ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్లారట!
  • రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్‌కు సంతాపం ప్రకటించాలి.
  • మన్మోహన్‌కు దక్కిన గౌరవంతో పాటు అవమానం గుర్తు చేస్తున్నాం.
  • సంతాప సభలో రాజకీయాలు ఎందుకు?. 

సభలో బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌..

  • ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.
  • మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..
  • సంతాప తీర్మానం రోజు దాని గురించే మాట్లాడాలి.
  • నిజంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వర్ రెడ్డి లాగా మాట్లాడరు.
  • మధ్యలో వెళ్లిన మహేష్ రెడ్డి చించుకుంటూ మాట్లాడుతున్నారు.
  • రాహుల్ గాంధీ ఎటు వెళ్లారు అన్నది ఇక్కడ చర్చ కాదు.
  • సంతాప తీర్మానం గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుంది

ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌..

  • కాంగ్రెస్ పార్టీ ఎందుకు మధ్యలో కలగజేసుకుంటుంది.
  • దేశం అంతా మన్మోహన్ సింగ్ గురించి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసి జరుపుతుంటే..
  • రాహుల్ గాంధీ వేడుకల కోసం వియత్నం వెళ్లలేదా?
  • కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను అవమానించినట్లు కాదా ?
  • మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. పీవీకి కూడా విగ్రహం పెడితే బాగుండు.

కూనంనేని కామెంట్స్‌..

  • దేశ గతి, గమనాన్ని మన్మోహన్‌ మార్చారు.  
  • మన్మోహన్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదు.
  • సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదు
  • నివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్‌ ఆత్మ క్షోభిస్తుంది
  • నివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలి
  • నిజాయతీ, నిబంద్ధతకు నిలువుటద్దం మన్మోహన్‌ సింగ్‌. 

హరీష్ రావు కౌంటర్‌..

  • కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకు సభ ఏం గౌరవం ఇచ్చింది.
  • సభ సభ లాగా జరగడం లేదు
  • పీఏసీ చైర్మన్‌ మీకు నచ్చినట్లు ఇచ్చుకున్నారు.
  • కేసీఆర్‌ను అడిగి పీఏసీ చైర్మన్‌ ఇచ్చారా?
  • తెలంగాణ కోసం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాటు ఉన్న కేంద్ర పదవిని వదిలేశారు.
  • శాసనసభ్యుల అనర్హత పై మీరు నిర్ణయం తీసుకున్నారా?
  • ఆ లెక్కన వస్తే మేము చాలా మాట్లాడగలుగుతాం.
  • కానీ ఇప్పుడు మన్మోహన్‌కు మాత్రమే పరిమితమవుతున్నాం. 

స్పీకర్‌ కామెంట్స్‌..

  • కేసీఆర్‌ ప్రస్తావన రాగానే కలగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
  • ప్రత్యేక సమావేశాల కోసం కేసీఆర్‌కు స్వయంగా నేనే కాల్ చేశాను.
  • అసెంబ్లీ సమావేశానికి రావాలని కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించాను.
  • కానీ, ఆయన రాలేదు

హరీష్‌ రావు కామెంట్స్‌..

  • మన్మోహన్ సింగ్ పెద్దల సభలో 33 ఏళ్లు ఉన్నారు
  • ఈరోజు శాసనసభతో పాటు పెద్దల సభ, మండలి కూడా సమావేశమై నివాళి అర్పిస్తే బాగుండేది.
  • శాసన మండలిలో మన్మోహన్‌కు నివాళి అర్పిస్తే మరింత గౌరవంగా ఉండేది
  • శాసన మండలి సభ్యులు సైతం సంతాపం తెలిపేందుకు అడుగుతున్నారు.
  • నెక్లెస్‌ రోడ్డుకు పీవీ పేరు పెట్టాం. పీవీ ఘాట్‌ ఏర్పాటు చేశాం.
  • స్కిల్‌ యూనివర్సిటీకి మన్మోహన్‌ పేరు పెట్టాలి.
  • మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి.
  • దేశం ఆర్థికంగా బలోపేతం కావాడానికి మన్మోహన్‌, పీవీ కృషి ఎంతో ఉంది.
  • కేసీఆర్‌ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం.
  • కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది.
  • మన్మోహన్‌ను మౌన ముని అని అంటారు
  • మన్మోహన్‌పై చిన్న అవినీతి మరక కూడా లేదు.
  • ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చెరగని ముద్ర వేశారు.
  • ఏఐసీసీ మీటింగ్‌లో మన్మోహన్‌ కంట తడి పెట్టారు.
  • కాంగ్రెస్‌ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
  • మన్మోహన్‌ తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌ చించేసినా ప్రధానిగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 



 

కేసీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్..
👉నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని సభకు రావాలని కేసీఆర్‌కు తెలిపిన స్పీకర్. మరోవైపు.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి దూరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement