సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు గురువారం రాత్రి ‘ఎక్స్’వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలోనే గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడు, సంస్కరణవాది, అన్నిటికంటే మించి మానవతావాది మన్మోహన్ సింగ్ ఇకలేరు. ధర్మానికి ప్రతీకగా, నిష్కలంకమైన సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మన్మోహన్ నవభారత నిర్మాతల్లో ఒకరు. తన రాజకీయ, ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన భూమి పుత్రుడిని దేశం కోల్పోయింది. మన్మోహన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని ట్వీట్‌లో రేవంత్ పేర్కొన్నారు.
దేశానికి తీరని లోటు: డిప్యూటీ సీఎం భట్టి
మన్మోహన్ సింగ్ మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. దూరదృష్టి గల నాయకుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నా రు. దేశానికి మన్మోహన్ చేసిన కృషి, అభివృద్ధిలో ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు.
ఉద్యమాన్ని అర్థం చేసుకున్నారు: కేసీఆర్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ‘పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ. భారత ప్రధానిగా మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’అని కేసీఆర్ పేర్కొన్నారు.
మన్మోహన్ పాత్రను దేశం మర్చిపోదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ‘ఆర్బీఐ గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూ జీసీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా మన్మోహన్ దేశానికి వన్నెతీసుకొచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ పోషించిన పా త్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన మరణం దేశానికి తీరని లోటు’అని పేర్కొన్నారు.
ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత : కేటీఆర్
‘ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత, దూర దృష్టి గల నేత, మేధావి, అద్భుతమైన మానవతావాది మన్మోహన్ సింగ్. చరిత్ర పుటల్లో వారి కీర్తి ఎల్లప్పుడూ అజరామరంగా నిలిచిపోతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి’
దేశ ప్రగతిలో కీలక భూమిక: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారు. 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
పలువురు నేతల సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment