స్థానికత ఆధారంగానే..
* ఉద్యోగుల విభజన జరగాలి: టీ.ఉద్యోగ సంఘాల జేఏసీ విన్నపం
సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభ జన చేపట్టాలని, గిర్‌గ్లానీ కమిటీ సిఫారసుల మేరకు సర్వీస్ బుక్‌లో నమోదు చేసిన వివరాలనే స్థానికతకు గీటురాయిగా తీసుకోవాలని కమలనాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ విన్నవించింది. సర్వీస్ బుక్‌లో స్థానికతను నమోదు చేయని వారిని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరింది. సోమవారం సచివాలయంలో కమలనాథన్‌ను జేఏసీ ప్రతినిధులు కలిశారు.
విభజనకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. పనిచేస్తున్న వారి సంఖ్య ఆధారంగా చేసిన విభ జనను రద్దు చేయాలని, మంజూరైన పోస్టుల ఆధారంగా విభజన చేపట్టాలని సూచించారు. నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్లను మంజూరైన పోస్టుల ఆధారంగా కాకుండా వారి స్థానికత ఆధారంగా విభజించాలని, ఒకవేళ పోస్టులకన్నా ఉద్యోగులు ఎక్కువగా ఉంటే ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని విన్నవించారు. జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ పోస్టుల్లోని వారి విభ జనను కూడా ఇదే పద్ధతిలో చేపట్టాలని, ఈ మొత్తం ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణలో ఉండాలనుకునే ఆంధ్రా ఉద్యోగులకు మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
కొన్ని డీఎస్సీలలో 30 శాతం నాన్ లోకల్ కోటాలో, మరికొన్ని డీఎస్సీల్లో 20 శాతం కోటాలో నియమితులై న వారు ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నారని, వారిని ఏపీకి పంపించాలని కూడా కమలనాథన్ దృష్టికి తెచ్చారు. అలాగే ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోరిక మేరకు వారిని బదిలీ చేయాలని సూచించారు. ఉద్యోగుల జాబితాను ముందుగా వెబ్‌సైట్‌లో పెట్టి.. వారి స్థానికతపై ఫిర్యాదులు వస్తే పరిశీలించిన తర్వాతే తుది కేటాయింపులు చేయాలని కోరారు.
కమలనాథన్‌ను కలిసిన వారిలో టీఎన్జీవో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, పీఆర్‌టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, పీఆర్‌టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, రేచల్, నారాయణ, జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.