'పూర్తిస్థాయి కేటాయింపులకు మరికొంత సమయం'
హైదరాబాద్: త్వరలో కొత్తగా ఏర్పడబోవు ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగుల కేటాయింపులు ప్రస్తుతానికి తాత్కాలిక ప్రతిపదికనే జరుగుతున్నట్లు సీఎస్ మహంతి స్పష్టం చేశారు. ఈ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయిన అనంతంర ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికనే ఉద్యోగుల కేటాయింపు జరిగిందని.. మూడునెలలపాటు ఈ కేటాయింపుల ప్రకారమే పనిచేయాలని తెలిపారు. ఇది శాశ్వత కేటాయింపు కాదని, పూర్తిస్థాయి కేటాయింపుకు కొంత సమయం పడుతుందన్నారు. వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి 9 వరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫైళ్లు, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ జరుగుతుందన్నారు
.జూన్1 వ తేదీ రాత్రి ఉద్యోగుల విభజన లిస్ట్ వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. ఉద్యోగుల విభజన నాలుగు దశల్లో జరుగుతుందని..మొదటి దశలో ఐఏఎస్ ల కేటాయింపు, రెండో దశలో సచివాలయ, శాఖాధిపతుల పోస్టుల కేటాయింపు జరుగుతుందని మహంతి తెలిపారు.మూడో దశలో స్టేట్ కేడర్ పోస్టుల విభజన, నాలుగో దశలో జోనల్ పోస్టుల విభజన జరుగుతుందన్నారు. రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాక..ఆ ప్రభుత్వాల అవగాహన మేరకు ఉద్యోగుల సర్ధుబాటు జరుగుతుందన్నారు.