కేసీఆర్‌ది హిట్లర్ పాలసీ: జైరాం రమేష్
తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే: జైరాం రమేష్
చంద్రబాబుది చిన్న గడ్డం.. మోడీది పెద్ద గడ్డం
తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో.. సీమాంధ్రకు పోలవరం అలాంటిది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘‘కేసీఆర్‌ది హిట్లర్ పాలసీ.. ఓ నియంత.. ఆయన చేసే రాజకీయం అబద్దాలతో కూడుకున్నది. బెదిరింపు రాజకీయం. ఆయన గాలిలో విషాన్ని వ్యాపింపజేస్తున్నాడు’’ అని కేంద్రమంత్రి జైరాం రమేష్ నిప్పులు చెరిగారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పంపిణీ ఎలా చేయాలన్నది రాజ్యాంగంలో ఉన్నట్లుగానే ముందుకెళుతున్నామని చెప్పారు. దొరల తెలంగాణ కాదని, సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ ఏర్పాటు కావాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. ‘తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు.. ఇప్పుడు నలుగురున్నారు.
తర్వాత ఎంతమంది అవుతారో? ఆయన కుటుంబం కోసం తెలంగాణ ఏర్పడలేదు.’ అని జైరాం పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం అయిన పార్టీ అని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరం అయిన 60 స్థానాలు ఆ పార్టీకి రావని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 60 స్థానాలకు పైగా సీట్లు గెలిచే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య ఎలాంటి తేడా లేదని, చంద్రబాబును చూస్తే తనకు మోడీనే కనిపిస్తాడని చెప్పారు. కాకపోతే బాబుకు చిన్నగడ్డం ఉంటుందని, మోడీకి మొహం నిండా పెద్ద గడ్డం ఉంటుందని ఎద్దేవాచేశారు. అవి రెండుపార్టీలు కావని, ఒకటే పార్టీ అని, బాబుకు ఓటేస్తే మోడీకి వేసినట్టేనని అన్నారు. టీడీపీ నిజమైన రూపమే బీజేపీ అన్న జైరాం.. అవకాశం వస్తే కేసీఆర్ కూడా బీజేపీతో కలసి పోతాడని అన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దానికి కాంగ్రెస్ పార్టీనే నేతృత్వం వహిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రెండు ప్రాంతాలకు ఉపయోగం కలుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు సీమాంధ్రుల రక్షణ కూడా తమకు ముఖ్యమని ఆయన అన్నారు.
తెలంగాణకు హైదరాబాద్ ఎలాంటిదో, సీమాం ధ్రకు పోలవరం ప్రాజెక్టు అలాంటిదని వ్యాఖ్యానించారు. నిర్వాసితులకు అన్యాయం జరగనీయబోమని హామీ ఇచ్చారు. ‘ఇక్కడ టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఆయన స్థాపించిన ‘మధుకాన్’ కంపెనీలో మధు లేదు.. కాన్ మాత్రమే ఉంది.. కాన్ అంటే మోసం.. మధుకాన్ అంటేనే మోసం.’ అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. అస్సాం, జార్ఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో నామాప్రాజెక్టులు కట్టకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పదిజిల్లాలను 20 జిల్లాలుగా చేస్తామన్నారు. కాంగ్రెస్, సీపీఐల పొత్తు విషయంలో అసంతృప్తి ఉన్నా.. సమష్టిగా పనిచేస్తామన్నారు. రెండు పార్టీల నడుమ రేణుకాచౌదరి వారధిగా ఉన్నారని జైరాం అన్నారు.