తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ తుది దశకు చేరుకుంది.
ఆంధ్రాకు 24,163 మంది, తెలంగాణకు 19,376 మంది
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ తుది దశకు చేరుకుంది. 153 యూనిట్లకు చెందిన మొత్తం 59,723 మంది రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులను పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కమలనాథన్ 147 యూనిట్లకు చెందిన 43,539 మంది ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీకి పూర్తి చేసింది.
ఇక ఆరు యూనిట్లకు చెందిన 16,184 మంది ఉద్యోగులను మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. ఆరు యూనిట్లకు చెందిన ఉద్యోగుల పంపిణీని సంబంధించి వచ్చే నెల 2, 3 తేదీల్లో కమలనాథన్ కమిటీ భేటీలను నిర్వహించనుంది. డెరైక్టర్ ఆరోగ్యం, డెరైక్టర్ మెడికల్ విద్య, డీజీపీ, ఆయుష్, ఎస్‌పీఎఫ్, ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్‌లకు చెందిన ఉద్యోగుల పంపిణీని పూర్తి చేస్తే ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర కేడర్ ఉద్యోగుల పంపిణీ పూర్తి అవుతుంది.
ఇప్పటివరకూ ఏపీకు 24,163 మందిని, తెలంగాణకు 19,376 మందిని పంపిణీ చేశారు. ఆప్షన్లు, పోస్టుల లభ్యత ఆధారంగా ఆంధ్రా స్థానికతకు చెందిన 1,781 మంది తెలంగాణకు పంపిణీ అయ్యారు. అలాగే తెలంగాణ స్థానికతకు చెందిన 1,809 మంది ఏపీకి పంపిణీ అయ్యారు.