
కొత్త సుంకాలతో మామిడి ఎగుమతులు భారం
తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు కొత్త కష్టాలు
0–5 శాతం నుంచి 26 శాతానికి పెరిగిన సుంకాలు
తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 15 వేల టన్నులు ఎగుమతి
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ రాజ ఫలం మామిడి వెలవెలబోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ ఇటీవల 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అందులో మన మామిడి పండ్లు కూడా ఉన్నాయి. దీంతో ఈసారి మామిడి ఎగుమతులపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దేశంలో తెలుగు రాష్ట్రాలు మామిడి ఉత్పత్తిలో ముందున్నాయి.
ఇక్కడ సుమారు 7,64,500 ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఏటా 24,45,900 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మనదేశం నుంచి అమెరికాకు ఏటా 45,000 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే 10 వేల నుంచి 15 వేల టన్నులు వెళ్తున్నాయి. మన బంగినపల్లి, తోతాపురి, కేసర్ వంటి రకా లను అమెరికన్లు ఎంతగానో ఇష్టపడుతారు. ఈ ఎగుమతుల విలువ రూ.150 కోట్ల నుంచి రూ.230 కోట్లు ఉంటోంది. ఇప్పు డు సుంకాల పెంపుతో ధరల పెరుగుదల అదనంగా మరో రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే అమెరికా ప్రజలకు మన మామిడి చాలా ప్రియం అవుతుంది. దీంతో డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది.
అసాధారణ సుంకాలు..
గతంలో అమెరికాకు మామిడి ఎగుమతిపై సుంకాలు 0 నుంచి 5 శాతం మధ్య ఉండేవి. ఇది వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలమైన వాణిజ్య ఒప్పందాల వల్ల సాధ్యమైంది. తాజాగా ఈ పన్నులను 22 శాతం నుంచి 26 శాతం వరకు పెంచారు. ఈ సుంకాలు ఎగుమతి ధరలను గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల అమెరికా ప్రజలకు భారత మామిడి ఖరీదైనదిగా మారి, ఇతర ప్రాంతాల మామిడితో పోటీ పడలేకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్‌ల వల్ల ఎగుమతి ధరలు పెరిగినా, ఈ లాభం రైతులకు చేరే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
ఎగుమతిదారులు సుంకాల భారాన్ని రైతులపై వేసే అవకాశం ఉంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా మార్కెట్‌లో డిమాండ్ తగ్గితే ఎగుమతి పరిమాణం కూడా తగ్గుతుంది. ఈక్వెడార్, ఇండోనేషియా వంటి దేశాలు తక్కువ ధరకు మామిడిని సరఫరా చేస్తే, భారత రైతులు మార్కెట్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ‘ఎగుమతులు తగ్గితే మా ఆదాయం తగ్గుతుంది. దేశీయ మార్కెట్‌లో ఇప్పటికే తక్కువ ధరలు వస్తున్నాయి’అని జగిత్యాల జిల్లాకు చెందిన రైతు రాజేందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి..
అమెరికా కొత్త సుంకాల వల్ల ఏర్పడే సంక్షోభం నుంచి తమను భారత ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు, ఎగుమతిదారులు కోరుతున్నారు. తగిన శిక్షణ, రాయితీలు ఇస్తేనే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలమని చెబుతున్నారు. అమెరికా మార్కెట్‌లో పోటీ పడాలంటే కాయల నాణ్యత మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ సహకారం అవసరమని హైదరాబాద్‌కు చెందిన ఎగుమతిదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో మామిడి ఉత్పత్తి గణనీయంగా తగ్గగా, తాజాగా టారిఫ్‌ల పిడుగు మరింత కుంగదీస్తోంది.