* అన్ని జాబితాలు రూపొందించిన ఆర్థిక శాఖ
* కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి అందించే ఏర్పాట్లు
* అక్కడే ఇరు రాష్ట్రాలకూ తాత్కాలిక కేటాయింపులు
* ప్రభుత్వాలు ఏర్పడ్డాక శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల బదిలీలు
* స్థానికత ఆధారంగానే సింగిల్ కేడర్ పోస్టుల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం శుక్రవారం సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి అందనుంది. ఉద్యోగుల వివరాలను పూర్తిగా నమోదు చేసినట్లు అన్ని శాఖలు, విభాగాధిపతుల నుంచి ఆర్థిక శాఖ గురువారం సాయంత్రమే లిఖితపూర్వక ఆమోదం తీసుకుంది. ఈ మేరకు అందిన ఉద్యోగుల వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శికి పంపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జనాభా నిష్పత్తి ఆధారంగా సీమాంధ్రకు 58.32శాతం, తెలంగాణకు 41.68 శాతం ఉద్యోగులను కేంద్రం కేటాయిస్తుంది. అయితే సింగిల్ కేడర్ పోస్టులను మాత్రం ప్రసుతం ఆ పదవిలో ఉన్న అధికారి స్థానికత ఆధారంగా సంబంధిత రాష్ట్రానికే కేటాయించనున్నట్లు తెలిసింది. అయితే ఈ తాత్కాలిక కేటాయింపుల విషయంలో ఉద్యోగులు అనవసరంగా ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం ఇంకా ఎలాంటి కేటాయింపులు చే యలేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వ నిర్వహణకు ఇబ్బంది రాకుండా చూడాలన్న నిబంధన మేరకు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల శాశ్వత బదిలీలు జరుగుతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాక ఉద్యోగుల ఆప్షన్లనూ పరిగణనలోకి తీసుకుని శాశ్వత కేటాయింపులు ఉంటాయన్నారు. ఈ నెల 26 నుంచి రెండు రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా వేర్వేరుగా పాలన చే పట్టాలని భావించినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన, భవనాల కేటాయింపు కూడా పూర్తవలేదని పేర్కొన్నారు. ఈ నెల 29 లేదా 30 నుంచి వేర్వేరు పాలన చేపట్టే అవకాశముందన్నారు. తాత్కాలిక కేటాయింపు విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దగ్గరే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు.
నేడు కేంద్రానికి ఉద్యోగుల సమాచారం
Published Fri, May 23 2014 3:01 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement