బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా (నో ఫ్లై లిస్టు)లో చేర్చనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 19 జాతీయ, అంతర్జాతీయ విమానా లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను దారిమళ్లించి దగ్గర్లోని విమానాశ్రయాల్లో దింపి తనఖీలు పూర్తి చేశారు. ఇవన్నీ ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని తేలింది.
సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నిఘా సంస్థలు, పోలీసుల సహకారంతో బాంబు బెదిరింపులకు దిగుతున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, చట్టసంస్థలు ప్రతికేసులోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు.
మరో ఏడు విమానాలకు బెదిరింపులు
బుధవారం మరో ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉత్తవేనని తేలింది. నాలుగు ఇండిగో విమానాలు, రెండు స్పైస్‌జెట్ విమానాలు, ఒక ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. రియాద్–ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని దారి మళ్లించి మస్కట్ (ఒమన్)లో దింపారు. చెన్నై– లక్నో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దింపి.. విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసు కెళ్లారు. అలాగే ఢిల్లీ– బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు రావడంతో దాన్ని తిరిగి దేశ రాజధానికి మళ్లించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇలాగే ముంబై– ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు.
మైనర్ అరెస్టు: ముంబై: మూడు విమానాలను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో బాంబు బెదిరింపులు పంపిన చత్తీస్‌గఢ్‌లోని ఒక 17 ఏళ్ల మైనర్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment