Brats harassment
-
వారిక ‘నో ఫ్లై లిస్టు’లో
న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా (నో ఫ్లై లిస్టు)లో చేర్చనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 19 జాతీయ, అంతర్జాతీయ విమానా లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను దారిమళ్లించి దగ్గర్లోని విమానాశ్రయాల్లో దింపి తనఖీలు పూర్తి చేశారు. ఇవన్నీ ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని తేలింది. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నిఘా సంస్థలు, పోలీసుల సహకారంతో బాంబు బెదిరింపులకు దిగుతున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, చట్టసంస్థలు ప్రతికేసులోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు. మరో ఏడు విమానాలకు బెదిరింపులుబుధవారం మరో ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉత్తవేనని తేలింది. నాలుగు ఇండిగో విమానాలు, రెండు స్పైస్‌జెట్ విమానాలు, ఒక ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. రియాద్–ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని దారి మళ్లించి మస్కట్ (ఒమన్)లో దింపారు. చెన్నై– లక్నో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దింపి.. విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసు కెళ్లారు. అలాగే ఢిల్లీ– బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు రావడంతో దాన్ని తిరిగి దేశ రాజధానికి మళ్లించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇలాగే ముంబై– ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. మైనర్ అరెస్టు: ముంబై: మూడు విమానాలను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో బాంబు బెదిరింపులు పంపిన చత్తీస్‌గఢ్‌లోని ఒక 17 ఏళ్ల మైనర్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. -
ఐటీ జోన్లో ఆకతాయిల వీరంగం
సాక్షి, సిటీబ్యూరో: సోమవారం అర్ధరాత్రి ఐటీ జోన్లో బైక్‌పై ‘స్వైర విహారం’ చేసిన ఇద్దరు యువకులు వరుస దాడులకు పాల్పడ్డారు. ఓ హోటల్ సిబ్బందిపై చేయి చేసుకోవడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరో రెండు ప్రాంతాల్లో నలుగురిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..సోమవారం రాత్రి దుర్గం చెరువు సమీపంలోని ‘సంప్రదాయ రుచులు’ రెస్టారెంట్‌ను మూసివేసిన అనంతరం సిబ్బంది రెస్టారెంట్‌ను శుభ్రం చేసే పనిలో ఉన్నారు. 11.40 గంటల ప్రాంతంలో మాదాపూర్ ఠాణా వైపు నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లోపలకు దూసుకువచ్చిన వారు ఫర్నిచర్, కంప్యూటర్ మానిటర్‌ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేశారు. రెస్టారెంట్ బయట ఉన్న ఓ వాహనాన్ని కిందకు తోశారు. దీనిపై సమాచారం అందడంతో రెస్టారెంట్ యజమాని ఈశ్వర్ మాదాపూర్ ఠాణాకు వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన గస్తీ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నాయి. ఈ లోగా ముందుకు వెళ్లిన ఆ ఇద్దరూ ఇనార్బిట్ మాల్ సమీపంలో భార్యభర్తలపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పై దాడి చేశారు. ఈ నలుగురు బాధితుల గస్తీ బృందాలకు సమాచారం ఇచ్చినా లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదు. ఈశ్వర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు రెస్టారెంట్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. వాహనం నెంబర్ గుర్తించి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ ఇద్దరూ మద్యం మత్తులోనో, డ్రగ్స్ ప్రభావంతోనో అలా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
షీటీంలకు చిక్కిన 38మంది ఆకతాయిలు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): యువతులు, మహిళలను వేధించే ఆకతాయిలను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ కార్తికేయ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల రోజుల వ్యవధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృందం 38 మందిని పట్టుకున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ప్రసుత్తం ఆరు షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, ఈ టీంలకు ఇన్‌చార్జీగా ఒక సీఐని నియమించామన్నారు. ప్రతి షీ టీం బృందంలో ఎస్సై స్థాయి అధికారి, ఇద్దరు మహిళా పోలీసులు, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో ఒక టీం పనిచేస్తోందన్నారు.ఈ టీం ప్రధానంగా స్త్రీలను వేధింపులు అధికంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని అక్కడ సాధరణ ప్రజలలో కలిసి పోయి, వీరివద్ద ఉండే నిఘా కెమెరాల ద్వారా ఆకతాయిల వేధింపులు రికార్డు చేసుకుంటారని, నేరస్వభావాన్ని బట్టి నేరస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించటం లేదా, వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గతనెల మార్చి 1 నుంచి 31 వరకు షీ బృందాలు 38 మందిని పట్టుకుని ఆయా పోలీస్స్టేషన్లలో అప్పగించారని సీపీ తెలిపారు. మహిళలూ సమాచారమివ్వండి.. మహిళలు ఎవరైనా ఆకతాయిల వేధింపులు నుంచి రక్షణ కోసం వాట్సప్ నం. 9490618029 లేదా, మేసేజ్ డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
12 మంది ఆకతాయిల అరెస్ట్
కౌన్సెలింగ్ చేసిన ఏసీపీ ఈశ్వర్రావు వరంగల్ : హన్మకొండ కిషన్‌పుర ప్రాంతంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్న 12 మంది యువకులను శుక్రవారం రాత్రి షీ టీమ్ అదుపులోకి తీసుకున్నట్లు విభాగం ఇన్చార్జీ ఏసీపీ ఈశ్వర్రావు తెలిపారు. గత కొద్దిరోజులుగా కిషన్‌పుర వాగ్దేవి కాలేజీ పరిసర ప్రాంతాల్లోని వసతి గృహాల వద్ద ఆకతాయి యువకులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, కాలేజీకి వస్తున్న యువతులను అడ్డగిస్తున్నారన్న సమాచారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ (94910 89257)కు ఎస్ఎంఎస్గా వచ్చాయన్నారు. వీటిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు షీ టీమ్ విభాగానికి సమాచారమిచ్చారు. దీంతో శుక్రవారం రాత్రి రంగంలోకి దిగిన షీ టీమ్ 12 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిలో వంగాల వినయ్‌రెడ్డి, భూక్యా క్రాంతి, దాసరి హరికృష్ణ, ఐలా రాహుల్, కుంభం మహేష్, మల్లా పుర్ణాకర్, ఎండి.ఆసిఫ్ ఉన్నట్లు తెలిపారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు వెల్లడించారు. అరెస్టయిన అకతాయిలకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఏసీపీ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని, వారిపై నిర్భయలాంటి కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌన్సెలింగ్ కార్యక్రమంలో షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మీతోపాటు శ్రీనివాస్, రమణ, వనజ పాల్గొన్నారు. -
ఈవ్‌టీజింగ్ చేస్తే కటకటాలపాలే..
రాయవరం : బయటికెళ్తే చాలు.. పలుచోట్ల బాలికలను, యువతులను, మహిళలను ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో బాలికలు, యువతులే కాదు.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో అనేకమంది మహిళలు కూడా ఈవ్‌టీజింగ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినవారికి కఠిన శిక్షలు అమలయ్యేలా ఇటీవల చట్టాలను సవరించారు. వీటి ప్రకారం ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినవారు కటకటాలపాలు కాక తప్పదు. వేధింపులకు గురయ్యే మహిళలు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేస్తామంటున్నారు రాయవరం ఎస్సై సురేష్ చావా. బాధితులకు చట్టం అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇస్తున్నారు. ఈవ్‌టీజింగ్ అంటే.. యువతి లేదా మహిళను మాటలు, చేతల ద్వారా కానీ, చేష్టలు, సైగల ద్వారా కానీ, స్త్రీత్వానికి అవమానకర రీతిలో ప్రవర్తించడం ఈవ్‌టీజింగ్ కిందకు వస్తుంది. మాటలతో వేధించడం, వెంటపడడం, లైంగికంగా వేధించడం, స్త్రీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఆమె ఇష్టం లేకుండా కల్పించుకుని వేధించడం, బలప్రయోగం చేయడం, అసభ్యకర సైగలవంటివి కూడా ఈవ్‌టీజింగ్ నేరాల కిందకు వస్తాయి. ఇవీ సెక్షన్లు.. మహిళలపై వేధింపులకు సంబంధించిన చట్టంలో భారత ప్రభుత్వం 2013లో మార్పులు, చేర్పులు చేసింది. ఐపీసీ 354 సెక్షన్‌ను విస్తరించి 354ఎ, 354బి, 354సి, 354డిగా వర్గీకరించింది. సెక్షన్ 354ఎ స్త్రీని లైంగికంగా వేధిస్తే సెక్షన్ 354ఎ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితునికి ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు. సెక్షన్ 354బి వేధింపుల సమయంలో బలప్రయోగం చేస్తే సెక్షన్ 354బి ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. సెక్షన్ 354సి స్త్రీ వ్యక్తిగత వ్యవహారాల్లో కల్పించుకుని, ఆమెను వేధింపులకు గురి చేస్తే సెక్షన్ 354సి ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితునికి మూడు నుంచి ఏడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది. సెక్షన్ 354డి వెంటపడి వేధిస్తే సెక్షన్ 354డి ప్రకారం కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే ఏడాదికి తక్కువ కాకుండా, గరిష్టంగా మూడేళ్లపాటు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. ఒక్కో సందర్భంలో జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు. జరిమానా మొత్తం బాధితురాలికి.. ఈవ్‌టీజింగ్ నేరాల్లో నిందితునికి విధించే జరిమానా మొత్తాన్ని సెక్షన్ 357 ప్రకారం బాధితురాలికి చెల్లిస్తారు. ఆమెకు ఈ హక్కు కల్పిస్తూ చట్టంలో ఇటీవల మార్పు చేశారు.