ఈవ్‌టీజింగ్ చేస్తే కటకటాలపాలే..
రాయవరం : బయటికెళ్తే చాలు.. పలుచోట్ల బాలికలను, యువతులను, మహిళలను ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు అనేకం కనిపిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో బాలికలు, యువతులే కాదు.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో అనేకమంది మహిళలు కూడా ఈవ్‌టీజింగ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినవారికి కఠిన శిక్షలు అమలయ్యేలా ఇటీవల చట్టాలను సవరించారు. వీటి ప్రకారం ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినవారు కటకటాలపాలు కాక తప్పదు.
వేధింపులకు గురయ్యే మహిళలు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేస్తామంటున్నారు రాయవరం ఎస్సై సురేష్ చావా. బాధితులకు చట్టం అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇస్తున్నారు.
ఈవ్‌టీజింగ్ అంటే..
యువతి లేదా మహిళను మాటలు, చేతల ద్వారా కానీ, చేష్టలు, సైగల ద్వారా కానీ, స్త్రీత్వానికి అవమానకర రీతిలో ప్రవర్తించడం ఈవ్‌టీజింగ్ కిందకు వస్తుంది. మాటలతో వేధించడం, వెంటపడడం, లైంగికంగా వేధించడం, స్త్రీ వ్యక్తిగత వ్యవహారాల్లో ఆమె ఇష్టం లేకుండా కల్పించుకుని వేధించడం, బలప్రయోగం చేయడం, అసభ్యకర సైగలవంటివి కూడా ఈవ్‌టీజింగ్ నేరాల కిందకు వస్తాయి.
ఇవీ సెక్షన్లు..
మహిళలపై వేధింపులకు సంబంధించిన చట్టంలో భారత ప్రభుత్వం 2013లో మార్పులు, చేర్పులు చేసింది. ఐపీసీ 354 సెక్షన్‌ను విస్తరించి 354ఎ, 354బి, 354సి, 354డిగా వర్గీకరించింది.
సెక్షన్ 354ఎ
స్త్రీని లైంగికంగా వేధిస్తే సెక్షన్ 354ఎ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితునికి ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు.
సెక్షన్ 354బి
వేధింపుల సమయంలో బలప్రయోగం చేస్తే సెక్షన్ 354బి ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది.
సెక్షన్ 354సి
స్త్రీ వ్యక్తిగత వ్యవహారాల్లో కల్పించుకుని, ఆమెను వేధింపులకు గురి చేస్తే సెక్షన్ 354సి ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితునికి మూడు నుంచి ఏడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది.
సెక్షన్ 354డి
వెంటపడి వేధిస్తే సెక్షన్ 354డి ప్రకారం కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే ఏడాదికి తక్కువ కాకుండా, గరిష్టంగా మూడేళ్లపాటు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. ఒక్కో సందర్భంలో జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు.
జరిమానా మొత్తం బాధితురాలికి..
ఈవ్‌టీజింగ్ నేరాల్లో నిందితునికి విధించే జరిమానా మొత్తాన్ని సెక్షన్ 357 ప్రకారం బాధితురాలికి చెల్లిస్తారు. ఆమెకు ఈ హక్కు కల్పిస్తూ చట్టంలో ఇటీవల మార్పు చేశారు.