ఆకతాయిలకు కౌన్సెలింగ్ చేస్తున్న ఏసీపీ ఈశ్వర్‌రావు
-
కౌన్సెలింగ్ చేసిన ఏసీపీ ఈశ్వర్‌రావు
వరంగల్ : హన్మకొండ కిషన్‌పుర ప్రాంతంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్న 12 మంది యువకులను శుక్రవారం రాత్రి షీ టీమ్ అదుపులోకి తీసుకున్నట్లు విభాగం ఇన్‌చార్జీ ఏసీపీ ఈశ్వర్‌రావు తెలిపారు. గత కొద్దిరోజులుగా కిషన్‌పుర వాగ్దేవి కాలేజీ పరిసర ప్రాంతాల్లోని వసతి గృహాల వద్ద ఆకతాయి యువకులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, కాలేజీకి వస్తున్న యువతులను అడ్డగిస్తున్నారన్న సమాచారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ (94910 89257)కు ఎస్‌ఎంఎస్‌గా వచ్చాయన్నారు.
వీటిని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు షీ టీమ్ విభాగానికి సమాచారమిచ్చారు. దీంతో శుక్రవారం రాత్రి రంగంలోకి దిగిన షీ టీమ్ 12 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిలో వంగాల వినయ్‌రెడ్డి, భూక్యా క్రాంతి, దాసరి హరికృష్ణ, ఐలా రాహుల్, కుంభం మహేష్, మల్లా పుర్ణాకర్, ఎండి.ఆసిఫ్ ఉన్నట్లు తెలిపారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు వెల్లడించారు. అరెస్టయిన అకతాయిలకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఏసీపీ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని, వారిపై నిర్భయలాంటి కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. కౌన్సెలింగ్ కార్యక్రమంలో షీ టీం ఇన్‌స్పెక్టర్ శ్రీలక్ష్మీతోపాటు శ్రీనివాస్, రమణ, వనజ పాల్గొన్నారు.