తెలంగాణకు 110.. సీమాంధ్రకు 148 ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ జిల్లాల నిష్పత్తి మేరకే చేయనున్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో అఖిల భారత సర్వీసు, రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికనో స్పష్టం చేయలేదు. ఆస్తులు, అప్పులు పంపిణీ మాత్రం జనాభా ప్రాతిపదికగా చట్టంలో పేర్కొన్నప్పటికీ ఉద్యోగుల పంపిణీ విషయంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
గతంలో జరిగిన రాష్ట్రాల విభజనలో జిల్లాల నిష్పత్తి ఆధారంగా ఉద్యోగుల పంపిణీ చేసినందున ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీని సీమాంధ్రకు 13 జిల్లాల నిష్పత్తిలోను, తెలంగాణకు పది జిల్లాల నిష్పతిలోను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 258 మంది ఐపీఎస్ పోస్టులుండగా వాటిని జిల్లాల నిష్పత్తి ప్రకారం సీమాంధ్రకు 148 ఐపీఎస్ పోస్టులను, తెలంగాణకు 110 ఐపీఎస్ పోస్టులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల సంఖ్య 56 వేల మందిగా ఇప్పటికే ఆర్థిక శాఖ లెక్క తేల్చింది.